ఫిబ్రవరిలోనే స్థానిక సమరం! జగన్ సర్కార్ పై నిమ్మగడ్డదే విజయం?
posted on Nov 18, 2020 @ 3:36PM
జగన్ ప్రభుత్వంతో జరుగుతున్న పోరాటంలో ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమారే గెలవబోతున్నారా? సర్కార్ ఎన్ని అడ్డంకులు వేయాలని చూసినా ఆయన హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. ఏపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయంటున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఏపీ ఎన్నికలు జరగడం ఖాయమని విశ్లేషకులు కూడా తేల్చి చెబుతున్నారు. ఎన్నికల విషయంలో నిమ్మగడ్డను నిలువరించడం జగన్ సర్కార్ కు సాధ్యం కాదని న్యాయ నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు.
అంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చ్ 31 తో పదవీ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఈలోగానే ఆయన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపి తీరతారని చాలామంది అంచనా వేశారు. ఆయన నిర్వహించే పదవికి, పదవి బాధ్యతల నుంచి వైదొలగేలోగా ఆయన చేపట్టనున్న ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు కూడా రాజ్యాంగ రక్షణ ఉండడం ఆయనకు కలిసి వస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణలో ఎన్నికైన ప్రభుత్వంపై ఆయనదే పై చేయి అవుతుందని చెబుతున్నారు. అందరూ అనుకుంటున్నట్లే స్థానిక ఎన్నికల కసరత్తు ప్రారంభించారు నిమ్మగడ్డ. రాజకీయ పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ముహుర్తం కూడా పెట్టేశారు ఎస్ఈసీ. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగంతోనూ సమీక్షలకు సిద్ధమవుతున్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.
నిమ్మగడ్డ హయాంలో స్థానిక ఎన్నికలు జరగకుండా చూడడానికి జగన్ సర్కార్ చేసిన ప్రయత్నాలేవి ఫలించడం లేదు. ఆయనపై చేసిన న్యాయ పోరాటం వీగిపోయింది. నిమ్మగడ్డ పదవీ కాలం కుదింపు అయ్యేలా జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు చెల్లకుండా పోయింది. నిమ్మగడ్డ స్థానంలో నియమితమైన జస్టిస్ కనగరాజ్ నియామకం చెల్లలేదు. రమేష్ కుమార్ పదవిలో ఉండగా ఎన్నికల నిర్వహణను నిలువరించడానికి వైసీపీ సర్కార్ చేసిన కసరత్తు ఏదీ అక్కరకు రాలేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పట్ల కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు ఫిబ్రవరి లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించారు. స్థానిక ఎన్నికలకు న్యాయపరమైన అడ్డంకులు ఏమీ లేవని కూడా స్పష్టం చేశారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.
నిమ్మగడ్డ తాజా ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత వచ్చింది. ఫిబ్రవరి లో ఎన్నికలు ఖాయమని తేలిపోయింది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు నాలుగు వారాల ముందే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని కూడా రమేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం అంటే మొత్తం ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ నియంత్రణలోకి వెళ్లిపోవడమే. అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి రాష్ట్ర డీజీపీ వరకు మొత్తం యంత్రాగమంతా ఎన్నికల కమిషన్ కనుసన్నలలో పని చేయాల్సి ఉంటుంది. లేకపోతే రాజ్యాంగం ఊరుకోదు.
గతంలో ప్రారంభించిన ఎన్నికల ప్రక్రియ రద్దు కాలేదని, వాయిదా మాత్రమే పడిందని సుప్రీంకోర్టు లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాదించినందున గతంలో జరిగిన ఏకగ్రీవాలు రద్దు కాక పోవచ్చు.
ఏకగ్రీవ స్థానాలు వదిలేసి మిగిలిన స్థానాలకు ఎన్నికలను నిర్వహించే విషయంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ అంటే ఏమిటో చూపించే అవకాశం నిమ్మగడ్డకు ఉందని కొందరు పరిశీలకులు అంటున్నారు.అంటే కలెక్టర్, ఎస్పీ లతో సహా ఎవరిని బదిలీ చేయమంటే వారిని చేయాల్సివుంటుంది. ఎవరిని సస్పెండ్ చేయమంటే వారిని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎవరి మీద కేసు నమోదు చేయమంటే వారి మీద కేసు నమోదు చేయాలి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి, రాజ్యాంగం ప్రకారం అధికారంలో ఉన్న ఎన్నికల కమిషన్ మధ్య ఘర్షణ అనేది లేకుండా విధుల నిర్వహణ బాధ్యత ఈ రెండు వ్యవస్థల మీద ఉందని రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంపై తమకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికల విషయం పై గవర్నర్ తో సమావేశమైన నిమ్మగడ్డ.. తాను పలు రాజకీయ పార్టీలతో చర్చించిన సమావేశ వివరాలను ఆయన వివరించారు. హైకోర్టు ఆదేశాలను సీఎస్ నీలం సహానీ ఉల్లంఘిస్తున్నారని ఒక లేఖ ద్వారా అధికారికంగా నిమ్మగడ్డ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఒకపక్క పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా రాష్ట్రంలో మాత్రం కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకొనేందుకు
ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది. స్వయం ప్రతిపత్తి గల ఎస్ఈసీ సంస్థను చిన్నబుచ్చే విధంగా ప్రభుత్వం అధికారులను ప్రోత్సహిస్తోందని కూడా గవర్నర్ కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారని సమాచారం. నిమ్మగడ్డ సమర్పించిన లేఖపై గవర్నర్ స్పందించకపోయినా లేక ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించకపోయినా అయన మరోసారి హైకోర్టుకెళ్లే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించకపోతే ఏపీలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.