అళగిరికి బీజేపీ ఆహ్వానం! తమిళనాట కమల వ్యూహం
posted on Nov 18, 2020 @ 1:23PM
తమిళనాడులో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసిన బీజేపీ.. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. రజనీకాంత్ ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసినా.. ఆరోగ్య కారణాలతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇక ఇప్పుడు డీఎంకే అధినేత స్టాలిన్ కుటుంబ సభ్యులకే గాలం వేస్తున్నారు కమలనాధులు. ఆరేళ్ల క్రితం డీఎంకే నుంచి డిస్మిస్ అయి, ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన కరుణానిధి కుమారుడు ఆళగిరిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు.
తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం కొత్త పార్టీ పెట్టేందుకు అళగిరి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే సొంత పార్టీ కాకుండా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తే అళగిరిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ వ్యాఖ్యానించారు. కొత్త రాజకీయ పార్టీపై అళగిరి ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ రాజకీయ పార్టీని ప్రారంభించకుంటే మాత్రం బీజేపీకి ఆహ్వానిస్తామని ఆయన అన్నారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అళగిరిని ఆహ్వానిస్తూ చేసిన ప్రకటనపై చర్చ జరుగుతుండగానే.. ఈనెల 20న మద్దతుదారులతో జరపాల్సిన సమావేశాన్ని అళగిరి వాయిదా వేసుకోవడం మరింత ఆసక్తిగా మారింది. దీంతో అళగిరి జేపీలోకి వెళ్లవచ్చన్న ప్రచారం జోరందుకుంది. తమిళనాడులో జరుగుతున్న ప్రచారం, బీజేపీ చీఫ్ కామెంట్లపై స్పందించిన అళగిరి మాత్రం తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. మురుగన్ తన సొంత అభిప్రాయాన్ని చెప్పి వుండవచ్చని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై జనవరిలోగా నిర్ణయం తీసుకుంటానని, ఆపై దాన్ని బహిరంగంగానే చెబుతానని స్పష్టం చేశారు అళగిరి.
బీజేపీలో చేరబోనని అళగిరి చెప్పినా... కమలం నేతలు మాత్రం అళగిరిపై ఆశలు పెంచుకుంటున్నారని తెలుస్తోంది. స్టాలిన్ కన్నా అళగిరి రాజకీయ అనుభవం అధికంగా కలిగివున్న నేతని బీజేపీ కార్యదర్శి శ్రీనివాసన్ పొగడ్తల వర్షం కురిపించారు. అపర చాణక్యుని వంటి అళగిరి బీజేపీలో చేరితే, రాష్ట్రంలో బీజేపీదే అధికారమని అన్నారు. 21న చెన్నైకి రానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ జిల్లా కార్యదర్శలను కలిసి మాట్లాడనున్నారని, ఆ తరువాత రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారిపోతాయని, బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు శ్రీనివాసన్.