పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లు కూలిన రెండు గంటల్లో దారుస్సలాం ను కూల్చేస్తాం... అక్బరుద్దీన్ కు సంజయ్ స్?

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ లపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈరోజు అక్బరుద్దీన్ మాట్లాడుతూ హుస్సేన్ సాగర్ పై ఉన్న ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ, "హుస్సేన్ సాగర్‌పై ఉన్న పీవీ సమాధిని, ఎన్టీఆర్ సమాధిని కూల్చే దమ్ము నీకుందా? అవి నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా. పీవీ, ఎన్టీఆర్ ల సమాధులను కూల్చిన రెండుగంటల్లోనే నీ దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారు" అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి ఓట్లు పొందాలని టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు చూస్తున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు చేవచచ్చి ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం నాయకులు చేసే సవాల్‌ను స్వీకరించలేని దౌర్భాగ్య పరిస్థితిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని సంజయ్ అన్నారు. హిందువులు అందరూ ఓటు బ్యాంకుగా మారితేనే హైదరాబాద్‌లో బీజేపీ గెలుస్తుందన్నారు.

ఎన్నికల ప్రచారంలో గుంపులు గుంపులు? కరోనా ముప్పు తప్పదా ?

కరోనా సెకండ్ వేవ్ భయపెడుతోంది. మహమ్మారి విజృంభణతో ఇప్పటికే పలు దేశాలు మరోసారి లాక్ డౌన్ అయ్యాయి. మన దేశంలోనూ కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. కేరళ, కర్ణాటక, గుజరాత్ లోనూ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అహ్మదాబాద్, గాంధీనగర్ లో నైట్ కర్ప్యూ అమలు చేస్తున్నారు. తాజాగా పంజాబ్ సర్కార్ కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తామని ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంటుందని, మరో మూడు నెలల వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని WHOతో పాటు దేశంలోని ఐసీఎమ్మార్ కూడా హెచ్చరించింది.  దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ ఉంటే తెలంగాణలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి సంగతే మర్చిపోయారు జనాలు. హైదరాబాద్ లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుండటంతో.. ప్రచారం హడావుడిలో కరోనా జాగ్రతలు మర్చిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా జనాలే కనిపిస్తున్నారు. వారిలో ఎవరికి మాస్క్ ఉండటం లేదు. భౌతిక దూరం అసలే పాటించడం లేదు. ఎన్నికల ర్యాలీలు, సభల్లోనూ వందలాది మంది పాల్గొంటున్నారు. మాస్కులు లేకుండానే, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండానే గుంపులుగా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రచారం చేసుకోవాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఇచ్చింది. కాని వాటిని పట్టించుకునే వారే లేరు. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. రాజకీయ నేతలు కూడా  కోవిడ్ రూల్స్ పాటించడం లేదు. మాస్కులు లేకుండానే వందలాది మందిని తీసుకుని  విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. గ్రేటర్ లో రోడ్ షోలు నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి  సంజయ్ .. ఇలా అందరూ అందరే. ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్కరూ కోవిడ్ రూల్స్ పాటించడం లేదు. లీడర్లు మాస్కులు పెట్టుకోకపోవడంతో.. వారి బాటలోనే పార్టీ ద్వితియ శ్రేణి నేతలు,  కార్యకర్తలు కూడా మాస్కులు పక్కన పెట్టేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. తమ ముఖం ఓటరుకు కనిపించాలన్న ఉద్దేశంతో అభ్యర్థులు మాస్కుల్ని ధరించడం లేదు. దీంతో తమకెక్కడ వైరస్‌ సోకుతుందోనని ఓటర్లు వణికిపోతున్నారు. ఓట్ల కోసం తమ ఇంటికి వస్తున్న అభ్యర్థులు, నేతలను కొందరు ప్రజలు మాస్కులే లేవని గట్టిగానే మందలిస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి.  గ్రేటర్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అన్ని డివిజన్లకు ఇన్‌చార్జిలుగా తమ అగ్రనేతలను మోహరించాయి. దీంతో ఆయా నాయకులు తమ జిల్లాల నుంచి  భారీగా కార్యకర్తల్ని వెంటబెట్టుకుని నగరానికి చేరుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్కో డివిజన్‌లో ప్రచారం నిర్వహిస్తున్న వందలమంది స్థానిక కార్యకర్తలు, పొరుగు జిల్లాల నుంచి వచ్చిన పార్టీ జనాలతో    నగర వీధులు జనసంద్రాలుగా మారాయి. ప్రచారంలో వందలాది మంది కూలీలు పాల్గొంటున్నారు. ప్రచారంలో ఎవరూ కనీస కరోనా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇదే ఆందోళనకు కారణమవుతోంది. ఆ జనంలో ఎవరిలో కరోనా ఉందో, ఎవరికి లేదో తెలియని పరిస్థితి. ఎన్నికల సంగతి దేవుడెరుగు.. ఇదెక్కడ తమ ప్రాణాల మీదకు వస్తుందోనని నగర ప్రజలు హడలిపోతున్నారు.  ముందున్నది చలికాలం కావడం, ఎన్నికల ప్రచారంలో జనం భారీగా ఇంటింటికీ తిరుగుతుండటంతో.. డిసెంబరులో కేసులు తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల హడావుడిలో పడి కరోనా జాగ్రత్తలు తీసుకోకపోతే దారుణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా ప్రచారంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని, తమ నేతలకు కూడా దీనిపై అలర్ట్ చేయాలని డాక్టర్లు , ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి.

పివి, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చండి.. అక్బరుద్దీన్ సెన్సేషనల్ కామెంట్స్

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీలు, నేతల మధ్య ఇంతకూ ముందు ఎపుడు లేనంతగా మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో 4,700 ఎకరాల హుస్సేన్‌సాగర్ ప్రస్తుతం 700 ఎకరాలు కూడా లేదన్నారు. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటోందని.. దీనిలో భాగంగా హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని అయన కామెంట్ చేసారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని... మళ్లీ ఈ ఎన్నికల్లో మాయ మాటలు చెబుతున్నారని ప్రభుత్వంపై అక్బరుద్దీన్ మండిపడ్డారు. ఎంఐఎంతో పొత్తు లేదని మంత్రి కేటీఆర్ అంటున్నారని... తమకు ఎవరి కింద బతకాల్సిన దుస్థితి లేదని అయన అన్నారు. తాము అడుగేస్తే దుమ్ము లేస్తుందని.. అసెంబ్లీలో తోకను తొక్కి టీఆర్ఎస్ ను ఎలా నిలబెట్టాలో, ఎలా కూర్చోబెట్టాలో కూడా తమకు తెలుసని అన్నారు. తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కనుసన్నల్లోనే ఓల్డ్ సిటీ నడుస్తుందని అక్బరుద్దీన్ ఓవైసి పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మేయర్ బొంతు రామ్మోహన్ భార్యకు చేదు అనుభవం

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్న పలు పార్టీల ముఖ్య నాయకులు, అభ్యర్థులకు గత కొద్ది రోజులుగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాము కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని వారు ఓట్ల కోసం మాత్రం తమ గల్లీల్లోకి వస్తున్నారంటూ నేతలు, అభ్యర్థులపై బస్తీల వారు మండిపడుతూ.. వారిని వెనక్కి తిప్పి పంపుతున్నారు. తమ కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేవని, నాయకులు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి వెళ్తున్నారు కానీ వాటిని అమలు చేయడం లేదని పలు కాలనీ వాసులు నాయకులను మొహం మీదే అడిగేస్తున్నారు. దీంతో ప్రజలకు నేతలు నచ్చచెప్పలేక సతమతమౌతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి చర్లపల్లి డివిజన్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ రోజు ఆమె కుషాయిగూడలోని పలు కాలనీల్లో పర్యటిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. అయితే, వరద సాయంపై స్థానిక మహిళలు ఆమెను అక్కడే నిలదీశారు. దీంతో అందరికీ వరద సాయం అందేలా చూస్తామని చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు.

గ్రేటర్‌లో భూపేంద్ర మార్క్! ఉక్కిరిబిక్కిరవుతున్న టీఆర్ఎస్

దుబ్బాకలో గెలిచేశాం.. జీహెచ్ఎంసీపై  జెండా పాతేద్దాం.. మూడేళ్ల తర్వాత అధికారాన్ని కైవసం చేసుకుందాం.. ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నినాదం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా గ్రేటర్ ఎన్నికను సవాల్ గా తీసుకుంది బీజేపీ హైకమాండ్. ఎట్టి పరిస్థిత్తుల్లోనూ బల్దియా పీఠాన్ని చేజిక్కించుకునేందుకు పకడ్బంధి ప్రణాళికలు రచిస్తోంది. జాతీయ స్థాయిలో పార్టీకి ట్రబుల్ షూటర్ గా ఉన్న భూపేంద్రయాదవ్ ను ఇంచార్జ్ గా నియమించింది. హైకమాండ్ ఆదేశాలతో హైదరాబాద్ లోనే మకాం వేసిన భూపేంద్ర యాదవ్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన మార్క్ చూపిస్తున్నారు. ఎవరికి అంతుపట్టని అలోచనలు, సరికొత్త ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తున్నారు. గ్రేటర్ ప్రచారంలో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి ఈజీగా వెళుతుండటంతో ప్రత్యర్థి పార్టీలు కలవరపడుతున్నాయని తెలుస్తోంది. భూపేంద్ర యాదవ్ ప్రచార వ్యూహాలతో అధికార గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోందని చెబుతున్నారు.     గ్రేటర్ లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టింది బీజేపీ. గ్రేటర్ ప్రజలు మార్పు  కోరుకుంటున్నారని చెబుతున్న బీజేపీ.. చేంజ్ హైదరాబాద్ పేరుతో  సభలు నిర్వహిస్తోంది. గ్రేటర్ నగరాన్ని మారుస్తామని, భాగ్యనగరంగా తీర్చిదిద్దుతామని చేంజ్ హైదరాబాద్ అంటూ యాప్ ను కూడా ప్రారంభించింది. ముఖ్యంగా యువతను, అకట్టుకునేందుకు ‘చేంజ్ హైదరాబాద్’ కార్యక్రమం కోసం  బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, యువ ఎంపీ తేజస్వి సూర్యను  ప్రచారంలోకి దింపింది బీజేపీ. హైదరాబాద్ ప్రచారంలో దూకుడు ప్రదర్శించారు సూర్య. తెలంగాణ సెంటుమెంటును కూడా తమవైపు తిప్పుకునేందుకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. తెలంగాణ  ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి వెళ్లి చరిత్రాత్మక ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉత్తేజపూరిత ప్రసంగం చేస్తూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు తేజస్వి సూర్య.   క్లీన్ పాలిటిక్స్ పేరుతో గ్రేటర్ లో మరో వినూత్న ఆలోచన చేసింది బీజేపీ. కార్పోరేటర్ గా పోటీచేస్తున్న అభ్యర్థితో ప్రజల సమక్షంలోనే ప్రమాణం చేయిస్తోంది. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి చేతన హరీష్ ప్రజల సమక్షంలో ప్రమాణ పత్రం చదివారు. తాను స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని, ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడబోనని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ప్రజల సమక్షంలో  కార్పొరేటర్ అభ్యర్థిని దైవ సాక్షిగా ప్రమాణం చేసింది. ఓటర్లలో నమ్మకం కలిగించేందుకు అభ్యర్థిచేత ప్రజా క్షేత్రంలోనే ప్రమాణం చేయిస్తున్నామని .. ఇది ఓటర్లను బాగా ఆకర్శిస్తుందని చెబుతున్నారు కమలం నేతలు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి బాగా ఉపయోగపడిన నేతల బస్తినిద్ర కార్యక్రమాన్ని గ్రేటర్ లోనూ అమలు చేస్తోంది బీజేపీ. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం రాత్రి వరకు సాగించిన  అనంతరం ప్రచారం ముగిసిన ప్రాంతంలోనే ఆ రాత్రి ఆ బస్తీలోనే నాయకులు నిద్రిస్తున్నారు. దీని ద్వారా స్థానికుల్లో బీజేపీ ప్రజల పార్టీయని, ప్రజల్లోనే ఉంటుందన, ప్రజాభివృద్దిని కోరుకుంటుందనే సంకేతాలను బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.  చేంజ్ హైదరాబాద్, బస్తి నిద్ర, క్లీన్ పాలిటిక్స్ తరహాలోనే మరిన్ని  ప్రయోగాలు భూపేంద్ర యాదవ్ అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఎంఐఎం పార్టీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ హిందువుల ఐక్యతను బలంగా వినిపిస్తోంది కమలదళం. రోడ్ షోలు కొనసాగిస్తూనే..  టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోపై , సీఎం పనితీరుపై, కేటీఆర్ ప్రకటనలపై, నగర పరిస్థితులపై బీజేపీ అరోపణలు సంధిస్తోంది. భూపేంద్ర యాదవ్ వ్యూహాలతో ప్రచారంలో బీజేపీ దూకుడు పెరిగిందని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీలకు ప్రచారం కోసం ఎక్కువ సమయం ఉండవద్దనే ఉద్దేశంతో గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ను హడావుడిగా ఇచ్చినా.. భూపేంద్ర ఎత్తులతో అధికార పార్టీ పాచికలు పారడం లేదంటున్నారు. ప్రచారం ముగిసేలోగా భూపేంద్ర ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతారోనన్న ఆసక్తి గ్రేటర్ బీజేపీ నేతలతో పాటు నగర ప్రజల్లోనూ కనిపిస్తుందని చెబుతున్నారు.

కాకినాడలో దారుణం.. నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్ళి అత్యాచారం... 

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఆగంతకుడు ఇంట్లో నిద్రిస్తున్న అయిదేళ్ల బాలికను తెల్లవారుజామున ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో మంచంపై పాప కనిపించకపోవడంతో.. ఆ బాలిక తండ్రి, నాయనమ్మ వెతకడం మొదలు పెట్టగా చివరకు బాలిక ఊరి చివర దేవాలయం వద్ద కనిపించింది. అయితే ఆ బాలిక ఒంటిపై దుస్తులు లేకపోవడంతో పాటు శరీరంపై గాయాలు కనిపించాయి. వెంటనే ఆ బాలికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులకు చెప్పకుండా చికిత్స అందించడానికి డాక్టర్లు నిరాకరించారు. దీంతో డాక్టర్ల పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

'సర్జికల్ స్ట్రయిక్' అంటే ఎందుకింత ఆగమాగం! ఎవరినైనా దాచిపెట్టారా?: విజయశాంతి ట్వీట్ 

హైదరాబాదు పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్ నిర్వహిస్తామన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలతో గ్రేటర్ రాజకీయం మరింత వేడెక్కింది. సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ కూడా బండికి కౌంటరిస్తోంది. అయితే బండి సంజయ్ 'సర్జికల్ స్ట్రయిక్' కామెంట్లను సమర్దించారు మాజీ ఎంపీ విజయశాంతి. 'సర్జికల్ స్ట్రయిక్' అంటే  టీఆర్ఎస్, ఎంఐఎం ఎందుకంత ఆగమాగం అవుతున్నాయని ఆమె  ప్రశ్నించారు. హైదరాబాద్ పాతబస్తీలోని రోహింగ్యాలు, పాకిస్థానీల గురించి ఆ రెండు పార్టీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయని విజయశాంతి నిలదీశారు.  టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంటింటి సర్వే నిర్వహించిందని, పాతబస్తీలో ఎవరూ ఆ విధంగా లేరని సీఎం గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారపూర్వక నివేదిక ఇవ్వొచ్చు కదా అని విజయశాంతి ట్వీట్ చేశారు. లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే టీఆర్ఎస్ భయాందోళనలకు గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముందని వ్యాఖ్యానించారు. బీజేపీ చీఫ్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ విజయశాంతి ట్వీట్ చేయడంతో ఆమె కమలం గూటికి చేరడం ఖాయమని తేలిపోయింది. అయితే ముహుర్తం మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ను కబళించిన కరోనా... సోనియా, రాహుల్ దిగ్భ్రాంతి

కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఈరోజు తెల్లవారు ఝామున 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. అహ్మద్ పటేల్‌కు నెల రోజులు క్రితం కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే . అయితే గత కొద్ది రోజులుగా ఆయన శరీరంలోని పలు అవయవాలు సరిగా పనిచేయకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 15 నుంచి అహ్మద్ పటేల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వారు పేర్కొన్నారు.   కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తనకు నమ్మిన బంటులా ఉంటూ.. పార్టీ కష్టాల్లో పడిన వేళ తన చతురతతో సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించే అహ్మద్ పటేల్ మరణ వార్త తనను ఎంతో కలచి వేసిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘అహ్మద్ పటేల్ లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు. అత్యంత నమ్మకమైన స్నేహితుడు. ఆయన జీవితం మొత్తాన్ని కాంగ్రెస్‌కే ధార పోశారు. పార్టీపట్ల అంకితభావం, విశ్వసనీయతతో ఉండటం, సహాయం చేయడానికి అందరికంటే ముందుండటం, కర్తవ్యం పట్ల ఆయనకున్న నిబద్ధత, ఔదార్యం... ఇవన్నీ ఆయనలో ప్రత్యేక లక్షణాలు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ట్వీట్ చేశారు.   అహ్మద్ పటేల్ కరోనాతో మరణించడం పట్ల రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ఇది నిజంగా విషాదకర దినం అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అహ్మద్ పటేల్ ఓ మూలస్తంభం లాంటివారని" కొనియాడారు. "ఆయన శ్వాస, ఆశ అన్నీ కాంగ్రెస్ పార్టీయేనని కీర్తించారు. అనేక సంక్షోభ సమయాల్లో పార్టీకి వెన్నంటి నిలిచారని.. తమకు ఆయన ఓ ఆస్తిలాంటివారని" రాహుల్ అభివర్ణించారు.

గ్రేటర్ కు బీజేపీ బడా నేతలు! కారు ఖేల్ ఖతమేనా? 

కారు పార్టీకి కౌంట్ డౌన్  మొదలైనట్టేనా? గ్రేటర్ ఎన్నికతో గులాబీ బాస్ కు చెక్ పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో బడా నేతలను రంగంలోకి దింపుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలదళం..  మరో మూడేళ్లలో జరగనున్న అసెంబ్లీ సమరానికి..జీహెచ్ఎంసీ ఎన్నికను సెమీఫైనల్ గా భావిస్తోంది. గ్రేటర్ లో పాగాతో తమ లక్ష్యానికి చేరుకునేలా కార్యాచరణ రెడీ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ ప్రచారానికి పార్టీ అగ్రనేతలను  రంగంలోకి దింపుతోంది.    జీహెచ్ఎంసీ ఎన్నికను బీజేపీ హైకమాండ్ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తుందంటే వాళ్లు ఎంత సీరియస్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎ‍న్డీయేను విజయతీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్‌ ను గ్రేటర్ ఎన్నికల ఇంచార్జ్ గా నియమించింది. కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసి రాష్ట్ర నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు భూపేంద్ర యాదవ్‌. లోకల్ బాడీ ఎన్నికకు జాతీయ స్థాయిలో ట్రబుల్ షూటర్ గా పేరున్న భూపేంద్రను ఇంచార్జ్ గా పంపించిన హైకమాండ్.. అంతటితో ఆగడం లేదు. కేంద్రమంత్రులను హైదరాబాద్ ప్రచారానికి పంపిస్తోంది. రెండు రోజుల క్రితమే గ్రేటర్ లో ప్రచారం చేసి వెళ్లారు ప్రకాశ్ జవదేకర్. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై ఆయన చార్జీషీట్ విడుదల చేశారు. కేసీఆర్ పాలనపై, టీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు ప్రకాశ్ జవదేకర్.    బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య కూడా రెండు రోజులుగా నగరంలో పర్యటిస్తున్నారు. ఛేంజ్‌ హైదరాబాద్‌’ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో మీటింగ్ పెట్టి కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు తేజస్వి సూర్య. గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇస్తే భాగ్యనగరం రూపురేఖలు మారుస్తామని, పాతబస్తీలో అరాచక శక్తులను తరిమికొడతామని  తేజస్వి సూర్య అన్నారు. తాను భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్తే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారని, తనను రెచ్చగొడితే భాగ్యలక్ష్మి దేవాలయాన్ని అడ్డాగా చేసుకుంటానని సవాల్‌ విసిరారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలన్నారు సూర్య. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుధవారం గ్రేటర్ లో ప్రచారం చేయబోతున్నారు. స్మృతికి తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉండటంతో ఆమెకు ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు.    కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ పాటు మరికొంతమంది నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. గ్రేటర్ లో పాగా వేస్తే దక్షిణాదిలో పార్టీకి ఫుల్ జోష్ వస్తుందని బీజేపీ ప్లాన్ చేసిందని చెబుతున్నారు. గౌతమ్ గంభీర్, సైనా నెహ్వాల్, కుష్భు లు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్నారు తెలుస్తోంది. అవసరమైతే మరికొందరు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలను హైదరాబాద్ పంపించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తుందట.  బీజేపీ వ్యూహాలతో అధికార టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే స్థానిక ఎన్నికలను పెద్దగా పట్టించుకోని సీఎం కేసీఆరే స్వయంగా జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారని, గ్రేటర్ ప్రజలకు వరాలు కురిపించారని చెబుతున్నారు. వరాలు ఇవ్వడమే కాదు బీజేపీ గెలిస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయంటూ ఓటర్లను భయాందోళన కల్గించే ప్రయత్నం చేశారు కేసీఆర్. బీజేపీ దూకుడుతో గులాబీ నేతల్లో గుబులు పెరిగిపోతుందని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.    దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బీజేపీకి జోష్ వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి గ్రేటర్‌ పోటీలో బీజేపీ రేసులోకి వచ్చింది. ఇప్పుడు గ్రేటర్‌ లోనూ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తోంది బీజేపీ రాష్ట్ర నేతలందరినీ మోహరించి భాగ్యనగర్‌ బస్తీల్లో జోరు పెంచుతోంది.  బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్‌రావుతో సహా రాష్ట్ర స్థాయి నేతలంతా హైదరాబాద్‌లోనే ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

చైనాకు భారత్ మరో పెద్ద షాక్.. మరో 43 యాప్‌ల నిషేధం

భారత్ చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో గత జూన్ లో పలు చైనా యాప్‌లను నిషేధిస్తూ చర్యలు తీసుకున్నకేంద్ర ప్రభుత్వం.. తాజాగా చైనాకు మరో ఝలక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన 43 యాప్‌లను బ్యాన్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మనదేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ, భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొంటూ ఈ 43 మొబైల్ అప్లికేషన్లను నిషేధిస్తూ సమాచార, సాంకేతిక శాఖ ఈరోజు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుబంధ ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా బ్యాన్ చేసిన ఈ యాప్స్‌లో చైనా వ్యాపార దిగ్గజ సంస్థ అలీ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. దానితో పాటు అలీబాబా వర్క్ బెంచ్, హీరోస్ ఎవాల్వ్‌డ్, డింగ్ టాక్ వంటి ఇతర అప్లికేషన్లున్నాయి.    ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది జూన్ 29న ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69 ఏ కింద 59 మొబైల్ యాప్స్‌ను.. అలాగే సెప్టెంబర్ 2న మరో 118 యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిలో ఎక్కువగా చైనీస్ యాప్‌లే. కాగా టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, వీ చాట్, లూడో వంటి యాప్‌లు భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లేలా చేస్తున్నాయంటూ గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి.

మాస్క్ తీసేసి.. శానిటైజర్ లో కాలేసిన మంత్రి కేటీఆర్

మాట తప్పే వ్యక్తిని ఏమంటారు? అంటే రాజకీయ నాయకుడు అని చెప్పుకొనే రోజుల్లో బతుకుతున్నాం. ఏదో నూటికో కోటికో ఒకరిద్దరు తప్ప దాదాపు రాజకీయ నాయకులంతా అదే కోవకి చెందిన వాళ్లనేది బహిరంగ రహస్యం. చిన్నదో పెద్దదో ఏదొక విషయంలో, ఏదొక సందర్భంలో మాట మార్చడమో, మాట తప్పడమో చేస్తూనే ఉంటారు. దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అతీతులు కాదు. తాజాగా ఆయన మాస్క్ గురించి ఉపన్యాసం ఇచ్చిన 24 గంటల్లోనే శానిటైజర్ లో కాలేశారు.   యాంకర్ సుమ తాజాగా మంత్రి కేటీఆర్ ని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో హైదరాబాద్ అభివృద్ధి అంశంతో పాటు పలు విషయాలను పంచుకున్నారు. అదంతా బాగానే ఉంది కానీ, ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో కేటీఆర్ చెప్పిన దానికి, ఇంటర్వ్యూ ముగిసిన కొద్ది గంటలకు ఆయన చేసిన దానికి అసలు పొంతనే లేదు. కేటీఆర్ మాస్క్ లేకుండా ఇంటర్వ్యూలో పాల్గొనడంతో.. మిమ్మల్ని మాస్క్ లేకుండా చూసి ఎన్ని రోజులైంది అని సుమ ప్రశ్నించింది. దీంతో పొంగిపోయిన కేటీఆర్ మాస్క్ గురించి చిన్నపాటి ఉపన్యాసమే ఇచ్చారు. మనిషికి ముక్కు ఎంత ముఖ్యమో ప్రస్తుతం పరిస్థితుల్లో మాస్క్ కూడా అంతే ముఖ్యం అన్నట్టుగా చెప్పారు. ఆరేడు నెలల నుంచి తాను ఎక్కడికెళ్లినా మాస్క్ ధరించే వెళ్తున్నానని.. లాక్ డౌన్ సమయంలో కంటైన్మెంట్ జోన్లలో తిరిగాను, కరోనా పేషెంట్స్ ని కలిసాను.. అయినా తనకి కరోనా సోకలేదని, ఎప్పుడూ మాస్క్ ధరిస్తూ ఉండటమే దానికి కారణమని చెప్పుకొచ్చారు. అంతేకాదు, కొందరుంటారు పేరుకి మాస్క్ పెట్టుకుంటారు, మాట్లాడేటప్పుడు మాస్క్ తీసేసి మాట్లాడతారు అంటూ సెటైర్స్ కూడా వేశారు.   అబ్బబ్బా మాస్క్ గురించి మంత్రి కేటీఆర్ ఎంత గొప్పగా సెలవిచ్చారో కదా. ఆగండి ఆగండి కంగారుపడి పొగిడేసి మనం కూడా ఆయనలాగా శానిటైజర్ లో కాలేస్తే ఎలా?. మాస్క్ గురించి ఉపన్యాసం ఇచ్చిన 24  గంటల్లోనే కేటీఆర్ మాస్క్ గొప్పతనాన్ని మరిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన.. నిన్న ప్రచారంలో మాస్క్ ని ముక్కుకి పెట్టుకోవడమే మరిచారు. మాస్క్ లేకుండా పబ్లిక్ లోకి రానని చెప్పిన ఆయన, కొందరు మాట్లాడేటప్పుడు మాస్క్ తీసేస్తున్నారని సెటైర్స్ వేసిన ఆయన.. చెప్పిన 24 గంటల్లోనే తప్పులో కాలేశారు. ఏదో ఫార్మాలిటీకి మెడలో మాస్క్ తగిలించుకొని ప్రచారంలో పాల్గొన్నారు. ఇలా అయితే ఎలా మంత్రి గారు. అసలే మిమ్మల్ని ప్రజలు మాస్క్ కి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారు. మీరు మాస్క్ మరిచి మా మనోభావాలు హర్ట్ చేయకండి. దయచేసి వాక్సిన్ వచ్చేవరకు మాస్క్ తోనే కనిపించండి.

పవన్ కళ్యాణ్ కు బీజేపీ బిగ్ షాక్.. తిరుపతి నుండి మేమే పోటీ చేస్తాం

జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీతో అవగాహనకు వచ్చిన జనసేన చివరి నిమిషంలో బరి నుండి తప్పుకుంది. బీజేపీ అగ్రనేతల రాయబారం తర్వాత ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు పవన్ కల్యాణ్ అంగీకరించారు. అయితే త్వరలో ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండడంతో.. ఆ సీట్‌‌ను జనసేన కోరుకుంటోంది. బీజేపీ కోసం జిహెచ్ఎంసి ఎన్నికల నుండి తప్పుకున్నామని, దీనికి ప్రతిగా తిరుపతి సీటును తమకు ఇవ్వాలని కోరడానికి జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ చేరుకున్నారు. అయితే నిన్న సోమవారం నుంచి ఇప్పటివరకు వారికి బీజేపీ అగ్రనేతల అపాయింట్ మెంట్ ఇంకా దొరకలేదు. దీంతో బీజేపీ అగ్రనేతలను కలవడం కోసం పవన్, మనోహర్ ఎదురు చూస్తున్నారు.   ఇది ఇలా ఉండగా తిరుపతి లోకసభ సీటును జనసేనకు ఇవ్వబోమని, తామే అక్కడ నుండి పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం చేసారు. తమ పార్టీ గతంలో కూడా తిరుపతి లోక్ సభ స్థానం నుండి గెలిచిందని ఆయన గుర్తు చేశారు. మరోపక్క తిరుపతిలో పోటీ చేస్తామని ముందే ప్రకటించిన ఎపి బీజేపీ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ కూడా జనసేనకు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో పోటీ చేసి.. పవన్ కల్యాణ్ మద్దతుతో వైసీపీని ఓడించొచ్చని.. దీంతో ఏపీలో తమ పరపతి పెరుగుతుందని.. పైగా సీఎం జగన్ కూడా తమ కంట్రోల్ లో ఉంటాడని బిజెపి స్కెచ్ వేసింది. ఇంతకూ బీజేపీకి గ్రేటర్ ఎన్నికలలో చేసిన సాయానికి బదులుగా మిత్రపక్షం జనసేనకు తిరుపతి సీటు ఇస్తారా.. లేక అక్కడ కూడా బీజేపీ నే పోటీ చేస్తుందా వేచి చూడాలి.

బీజేపీ దేశాన్ని అమ్మేస్తోంది! 50 ప్రశ్నలు సంధించిన కేటీఆర్‌

బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను కూడా అమ్మేస్తారని విమర్శించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇప్పటికే మోడీ సర్కార్ భారతదేశాన్ని అమ్మేస్తోందని ఆరోపించారు. అన్నింటినీ ప్రైవేట్‌పరం చేయడమే బీజేపీ పాలసీ అన్నారు కేటీఆర్. రైల్వే రంగాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని హామీలంటూ బీజేపీ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చాడు. బీజేపీ నేతలు గోబెల్స్‌ కజిన్స్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం మంత్రులు సైతం అస్యతాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను తీర్చినందుకా టీఆర్‌ఎస్‌ ప్రభత్వుంపై చార్జ్‌షీట్‌ విడుదల చేశారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతుబంధు అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడలేని విదంగా 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయే అన్నారు. తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రమని కేంద్రమంత్రులు చెప్పారని గుర్తుచేశారు.    బీజేపీకి 50 ప్రశ్నలు సంధించారు కేటీఆర్. లోయర్‌ సీలేరును తీసుకెళ్లి ఏపీలో కలిపింది బీజేపీ కాదా?అని ప్రశ్నించారు. పేకాట క్లబ్‌లు మూసివేయించినందుకా మాపై ఛార్జిషీట్‌? లక్షల మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టారు.. వారు భాజపాపై ఛార్జిషీట్‌ వేయాలి. కరోనా సమయంలో చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు ఛార్జిషీట్‌ వేయాలి అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నందుకు బీజేపీపై రైతులు ఛార్జిషీట్‌ వేయాలన్నారు. పెట్టు బడుల ఉపసంహరణ దేశ భవిష్యత్‌ కోసమా.. గుజరాత్‌ పెద్దల కోసమా? అని ప్రశ్నించారు.  ఐటీఐఆర్‌ రద్దు చేసింది ఎవరు? ఆరేళ్ల లో హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పగలరా? అని బీజేపీ నేతలను నిలదీశారు. ఇంటింటికి మంచి నీళ్లు, వేలాది గురుకులాలు పెట్టి పేద విద్యార్థులను చదివిస్తున్నందుకే  టీఆర్‌ఎస్‌పై చార్జ్‌షీట్‌ విడుదల చేశారా? అని బిజేపీ నేతలను ప్రశ్నించారు కేటీఆర్.

జీహెచ్ఎంసీకి కేంద్ర నిధులు ఇవ్వలేమన్న కిషన్! పార్టీకి భారమంటూ కేడర్ ఫైర్ 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం దూకుడుగా పోరాడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతలే బ్రేకులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నగరం నుంచే లోక్ సభకు ప్రాతినిధ్య వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తీరుతో కమలం పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం హోరాహారీగా జరుగుతున్న సమయంలో కేడర్ లో జోష్ నింపాల్సిన కిషన్ రెడ్డి.. పార్టీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడుతున్నారన్న చర్చ బీజేపీలోనే జరుగుతోంది. ముఖ్యంగా వరద సాయం, కేంద్ర నిధులపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా, నగర ఎంపీగా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని పరుగులు పెట్టాంచాల్సిన కిషన్ రెడ్డే.. పార్టీ భారంగా మారారనే చర్చ బీజేపీ నుంచే వినిపిస్తోంది.    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరద సాయం అంశం కీలకంగా మారింది. ప్రభుత్వం చేసిన 10 వేల రూపాయల ఆర్థిక సాయం కొందరికి మాత్రమే అందింది. దీంతో సాయం అందని వారంతా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీని గెలిపిస్తే వరద బాధితులకు సాయంగా 25 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు బండి సంజయ్. ఇది జనంలోకి బాగా వెళ్లింది. ఇది గ్రహించిన  అధికార పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. వరద సాయం చేసేది జీహెచ్ఎంసీ కాదని, రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని.. టీఆర్ఎస్సే ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి... సాయం చేయడం తమతోనే సాధ్యమని ఎన్నికల ర్యాలీలలో చెబుతూ వస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చి వరద బాధితులకు సాయం చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటిస్తే బీజేపీకి ఎంతో బూస్ట్ వచ్చేది. అయితే అలాంటి ప్రకటన చేయని కిషన్ రెడ్డి.. సంజయ్ హామీనే తప్పనే అర్దం వచ్చేలా మాట్లాడారు. స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు ఇవ్వదని, అలా ఇవ్వడానికి చట్టాలు ఒప్పుకోవని చెప్పారు కిషన్ రెడ్డి.    కిషన్ రెడ్డి ప్రకటనతో కమలం నేతలు అవాక్కయ్యారట. సంజయ్ ఇచ్చిన వరద సాయం హామీ వల్ల వచ్చిన మైలేజీ అంతా కిషన్ రెడ్డి ప్రకటనతో పోయిందని గ్రేటర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. వరద సాయం, కేంద్ర నిధులపై  కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకుంది టీఆర్ఎస్. కిషన్ రెడ్డి కామెంట్లను నిమిషాల్లో వైరల్ చేసింది. కేంద్రం నిధులు ఇవ్వదని కేంద్రమంత్రి చెబుతుంటే.. ఇంటికి 25 వేల రూపాయలు సాయం చేస్తామంటూ ప్రజలను బండి సంజయ్ మోసం చేస్తున్నారంటూ.. ఇద్దరు మాట్లాడిన వీడియోలను జనంలోకి వదిలారు కారు పార్టీ నేతలు. ఆ వీడియోలు చూసిన జనాలకు కూడా.. బీజేపీ ఎక్కడి నుంచి తెచ్చి వరద సాయం చేస్తుందనే అనుమానాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారాల్లోనూ మంత్రి కేటీఆర్ పంచ్ డైలాగులతో విరుచుకుపడుతుంటే కిషన్ రెడ్డి మాత్రం సొల్లు ప్రసంగాలు చేస్తున్నారని.. ఇలా అయితే టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కష్టమనే అభిప్రాయం కమలం కేడర్ లో వస్తోంది అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలోనూ కిషన్ రెడ్డి నామమాత్రంగా వ్యవహరించారని బీజేపీ నేతలు చెబుతున్నారు.     అంతేకాదు కిషన్ రెడ్డి ఎంఐఎం నేతలతో సన్నిహితంగా ఉంటారనే ప్రచారం ఉంది.  ఎంఐఎం సహకారం వల్లే అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా  ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారని కూడా చెబుతారు. ఇప్పుడు ఇది కూడా గ్రేటర్ ప్రచారంలో బీజేపీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. గతంలో అసద్ తో కిషన్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోలు, వారిద్దరు వేదికలపై నవ్వుతూ మాట్లాడుతూ కూర్చున్న వీడియోలను కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న కమలం నేతలకు ఇది మైనస్ గా మారిందని బీజేపీ నేతలే చెబుతున్నారు. గ్రేటర్ టికెట్ల  విషయంలోనూ కిషన్ రెడ్డి వ్యవహారం వల్లే కొన్ని చోట్ల కార్యకర్తలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.

తిరుపతి కోసం గ్రేటర్ ఫిక్సింగ్? పవన్ పై రోజా పంచ్ 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. గ్రేటర్ ఎన్నికల్లో  బీజేపీ కోసం జనసేన తప్పుకుందని చెప్పారు. తిరుపతిలో సీటు కావాలని అన్నాడు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని భావించాలా?.. గ్రేటర్ లో వదులుకున్నాం కాబట్టి తిరుపతిలో సీటు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారా?" అని పవన్ ను టార్గెట్ చేస్తూ రోజా ప్రశ్నించారు. బీజేపీకి కొన్ని ఓట్లు పడాలి, టీఆర్ఎస్ ఓడాలి అంటూ ఎన్నికల నుంచి పవన్ వైదొలిగారు.. ఇప్పుడు తిరుపతికొచ్చి పోటీచేస్తున్నారని రోజా అన్నారు. గతంలో తన సొంత నియోజకవర్గంలో, తన సొంతవాళ్ల మధ్యే గెలవలేని వ్యక్తి ఇప్పుడు తిరుపతి వచ్చి ఏం చేస్తాడని ఆమె ప్రశ్నించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతిలో గెలిచేది వైసీపీనే అని స్పష్టం చేశారు.    జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు రోజా. జనసేన పార్టీయా లేక కేటీఆర్ అన్నట్టు మోడీ భజనసేన పార్టీయా అనేది అర్థం కావడంలేదని రోజా ఎద్దేవా చేశారు. పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికలకు పోకుండా టీడీపీ, బీజేపీలకు  ప్రచారం చేసి వాళ్లకు ఓట్లు వేయాలని ప్రజలకు చెప్పారని ఆమె విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు ఇవ్వకపోయినా పవన్ ఏమీ మాట్లాడలేదని రోజా విమర్శించారు.

రోహింగ్యాలు ఉంటే అమిత్ షా ఏం చేస్తున్నారు? బీజేపీకి అసద్ కౌంటర్ 

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతలు హాట్ కామెంట్స్ తో గ్రేటర్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎంఐఎం టార్గెట్ గా బీజేపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఎంఐఎంకు ఓటు వేస్తే టీఆర్‌ఎస్ లబ్ధి పొందుతుందన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో 30 నుంచి 40 వేల మంది రోహింగ్యాలు ఉన్నారన్న బీజేపీ ఆరోపణలు చేస్తోందని చెప్పిన అసద్.. రోహింగ్యాల పేర్లు ఓటర్ల జాబితాలో ఉంటే మరి దేశానికి హోం మంత్రిగా ఉన్న అమిత్‌షా ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. అమిత్ షా నిద్రపోతున్నారా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అంత మంది రోహింగ్యాలు ఓటర్ల జాబితాలోకి ఎలా వచ్చారని అమిత్ షా ఎందుకు విచారణ జరపించట్లేదని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆ రోహింగ్యాలు ఎవరో బీజేపీ వెల్లడించాలని అన్నారు. విద్వేషం సృష్టించడమే బీజేపీ నేత ఉద్దేశమని అసద్ ఆరోపించారు.

రాజాసింగ్ వెనక ఎవరున్నారు? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?

మూడు గ్రూపులు.. ఆరు అలకలు.. పన్నెండు గొడవలు. ఇదీ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో దక్కిన విజయం బీజేపీకి బూస్ట్ ఇచ్చింది. దుబ్బాక  జోష్ తో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కమలం వికసిస్తుందని, బల్దియాపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు. తీరా ఎన్నికలు వచ్చాకా మాత్రం ఆ పార్టీలో నిరుత్సాహం కనిపిస్తోందని చెబుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటే.. వర్గ పోరుతో కమలనాధులు వెనకబడ్డారనే చర్చ జరుగుతోంది. నగర పరిధిలోని నేతలు రెండు వర్గాలుగా విడిపోవడంతో కేడర్ లోనూ గందగోళం నెలకొందని చెబుతున్నారు.                  నగరంలో బీజేపీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన తీరుతో గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీకి ఇబ్బందులు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజాసింగ్ తీరు బీజేపీలో మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. హిందూ అనుకూల, ఎంఐఎం వ్యతిరేక ప్రకటనలు చేస్తూ కేడర్ లో జోష్ నింపుతుంటారు రాజాసింగ్. అయితే పార్టీ వ్యవహారాల్లో మాత్రం ఆయన ఎప్పుడూ కాంట్రవర్సీనే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్గీయుడిగా ముద్రపడిన రాజాసింగ్.. కావాలనే బండి సంజయ్ కి సహకరించడం లేదనే చర్చ జరుగుతోంది. బీజేపీలో తీవ్ర కలకలం రేపిన రాజాసింగ్ ఆడియో వెనక కిషన్ రెడ్డి పాత్ర ఉందని తెలుస్తోంది.  గ్రేటర్ ఎన్నికల్లో తానే చక్రం తిప్పాలని కిషన్ రెడ్డి భావించారట. అయితే బండి సంజయ్ సిటీపై ఫోకస్ చేస్తూ సభలు, సమావేశాలు పెట్టారు. సంజయ్ దూకుడుతో ఆయనకు నగరంలో బలమైన వర్గం తయారైందట. గ్రేటర్ టికెట్ల ఎంపికలోనూ కిషన్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించాలని చూసినా.. సంజయ్ టీమ్ వ్యతిరేకించిందని తెలుస్తోంది. సిటీలో సంజయ్ టీమ్ పెరగడాన్ని కిషన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని చెబుతున్నారు. అందుకే సంజయ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే రాజాసింగ్ తో కిషన్ రెడ్డి డ్రామా ఆడిస్తున్నారని బీజేపీ కార్యకర్తల్లోనే చర్చలు జరుగుతున్నాయి.   కిషన్ రెడ్డి మనిషిగా ముద్రపడిన రాజాసింగ్.. ఆయన చెప్పినట్లే చేస్తారని చెబుతుంటారు. కిషన్ రెడ్డి పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు రాజాసింగ్ పార్టీ కార్యాలయంలో యాక్టివ్ గా ఉండేవారట. ఎప్పుడు అక్కడే ఉండేవారంటున్నారు. లక్ష్మణ్ కు పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయం రావడం మానేశారట. పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదంటున్నారు. కిషన్ రెడ్డి బాటలోనే రాజాసింగ్ కూడా లక్మణ్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నన్ని రోజులు.. పార్టీ కార్యాలయం వైపు వెళ్లలేదని చెబుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా రాజా సింగ్ తీరు మారలేదంటున్నారు. కిషన్ రెడ్డితో సంజయ్ కు విభేదాలు ఉన్నందునే.. సంజయ్ కి వ్యతిరేకంగా రాజా సింగ్ రాజకీయం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.   గోషామహాల్ నియోజకవర్గం పరిధిలో జరిగిన టికెట్ల గొడవ, పార్టీ కార్యాలయం దగ్గర ధర్నాలు, బీఫామ్ తీసుకునేందుకు వచ్చిన దళిత అభ్యర్థిపై దాడి చేసి బట్టలు చించేయడం వంటి ఘటనలు పార్టీ పరువు తీశాయనే చర్చ బీజేపీలో జరుగుతోంది. బండి సంజయ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ వైరల్ కావడం కమలంలో కల్లోలం రేపింది. అయితే రాజాసింగ్ పేరుతో ఫేక్ ట్వీట్ వైరల్ అవుతోందని కమలనాధులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగానే.. రాజా సింగ్ ఆడియో బయటికి వచ్చింది. బండి సంజయ్ తీరుపై రాజా సింగ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. గ్రేటర్ నామినేషన్ల సమయంలోనే జరిగిన ఈ రెండు ఘటనలు  పార్టీకి నష్టం కల్గించాయనే అభిప్రాయం తెలంగాణ బీజేపీ నేతల నుంచి వస్తోంది. సిటీలో ఉన్న ఒక్క ఎమ్మెల్యేనే కలిసి రాకపోతే.. జీహెచ్ఎంసీని ఎలా ముందుకు తీసుకెళతారనే చర్చ కొన్ని వర్గాల ఓటర్లలో వచ్చిందని చెబుతున్నారు. ఇది పార్టీకి చాలా మైనస్ అయిందని, కేడర్ లోనూ జోష్ తగ్గిందని చెబుతున్నారు.    తెలంగాణ బీజేపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెబుతున్నారు. లక్ష్మణ్ పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఆయనకు సపోర్ట్ చేయలేదని టాక్ ఉంది. ఇప్పుడు మాత్రం ఇద్దరూ కలిసి తీరుగుతున్నారు. తెలంగాణ బీజేపీకి ఇప్పటివరకు నగరం నేతే అధ్యక్ష బాథ్యతలు చేపట్టారు. మొదటిసారి సిటీయేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టారు. దీంతో గుర్రుగా ఉన్న నగర నేతలంతా ఏకమై.. సంజయ్ ని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. అందుకే సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టగానే... గతంలో ఉప్పు నిప్పులా ఉన్న  కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కలిసిపోయారని చెబుతున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో పొత్తుపై మాట్లాడేందుకు కూడా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు సంజయ్ హైదరాబాద్ లోనే ఉన్నా ఆయనను తీసుకువెళ్లలేదు. దీంతో బండికి చెక్ పెట్టేందుకే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కలిసిపోయారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. మొత్తంగా పార్టీ నేతల వర్గపోరుతో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళన కమలం  కేడర్ లో వ్యక్తమవుతోంది. దుబ్బాక ఇచ్చిన బూస్ట్త్ తో గ్రేటర్ లో మరింత స్పీడుగా వెళ్లాల్సిన పార్టీ.. ముఖ్య నేతల తీరుతో మూల్సం చెల్లించుకోవాల్సిన పరిస్థితికి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారట.  

కాంగ్రెస్ మేనిఫెస్టో.. అంతకు మించి.. వరద బాధితులకు రూ.50 వేలు

జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు మాణికం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి‌, భట్టి విక్రమార్క మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో అధికార పార్టీ టీఆర్ఎస్ ని మించి ఉచిత హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. వరద బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల సాయం అందజేస్తామని వెల్లడించింది. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2.5 లక్షలు, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 లక్షలు ఇస్తామని తెలిపింది. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించింది.   ఎంఎంటీఎస్‌, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని వెల్లడించింది. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని తెలిపింది. 80 గజాలలోపు స్థలంలో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు అని ప్రకటించింది. క్షురకులు, రజకులు, వడ్రంగులకు చెందిన దుకాణాలకు ఆస్తిపన్నుతో పాటు విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తామని తెలిపింది. ధరణి పోర్టల్ రద్దుకు కృషి చేస్తామని తెలిపింది. ప్రతి కుటుంబానికి 30 వేల లీటర్ల ఉచిత మంచినీరు అందజేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది.

ముగ్గురు ఫైర్ బ్రాండ్లకు సవాల్! మల్కాజ్ గిరిలో ఆర్ఆర్ఆర్ వార్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గ్రేటర్ పోరులో మల్కాజిగిరి నియోజకవర్గం కీలకంగా మారింది. మల్కాజ్ గిరి నియోజకవర్గానికి మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు పైర్ బ్రాండ్ నేతలు ఇంచార్జులుగా ఉన్నారు. వారందరూ పేరు విచిత్రంగా ఆర్ అక్షరంతోనే ప్రారంభం అవుతోంది. దీంతో మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో ట్రిబుల్ ఆర్.. ఆర్ఆర్ఆర్ ఫైట్ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.  మల్కాజ్ గిరి ఇంచార్జ్ గా మంత్రి ఈటెల రాజేందర్ ను నియమించింది అధికార పార్టీ. ఆయన ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. కార్యకర్తల సమావేశాలు ముగించుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు రాజేందర్. బీజేపీ ఇంచార్జుగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్.. తెలంగాణలో కాక రేపిన దుబ్బాక ఉప ఎన్నిక విజేత రఘునందన్ రావు ఉన్నారు. రఘునందన్ కూడా తన మార్క్ ప్రచారం స్టార్ చేశారు. తన సొంత నియోజకవర్గం కావడంతో మల్కాజ్ గిరిని సవాల్ గా తీసుకున్నారు తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి. ఆయన కూడా కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మల్కాజ్ గిరిలో ముగ్గురు ఫైర్ బ్రాండ్ లీడర్లు మకాం వేయడంతో రాజకీయం హీటెక్కిస్తోంది. మల్కాజ్ గిరి లోకల్ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు కూడా ఫ్రైర్ బ్రాండే. గ్రేటర్ ఎన్నికల్లో ఆయన మరింత దూకుడుగా  వెళుతున్నారు. దీంతో మల్కాజ్ గిరిలో ముగ్గురు ఫైర్ బ్రాండ్ల మధ్య ప్రతిష్టాత్మక  సమరం సాగుతోందనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.       మల్కాజ్ గిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో తొమ్మిది డివిజన్లు ఉన్నాయి. 2016 గ్రేటర్ ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది డివిజన్లు గెలిచి క్లీన్ స్వీప్ కొట్టింది అధికార టీఆర్ఎస్. మరోసారి అది రిపీట్ చేయాలనే టార్గెట్ తో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు ఎత్తులు వేస్తున్నారు. నియోజకవర్గంలో కొందరు సిట్టింగులను మార్చింది గులాబీ పార్టీ. మంత్రి పదవిపై చాలా రోజులుగా ఆశలు పెట్టుకున్నారు మైనంపల్లి. ఈసారి అవకాశం వస్తుందని భావించినా.. ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే మల్కాజ్ గిరి  పరిధిలోని అన్ని డివిజన్లలో గెలిచి కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని మైనంపల్లి భావిస్తున్నారట. నియజకవర్గం పరిధిలో  గత అరేండ్లలో జరిగిన అభివృద్ది, ఇటీవల చేసిన వరద సాయం తమకు కలిసి వస్తుందని కారు పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అయితే వరద సాయం కొంత మందికే అందడంతో మిగిలివారంతా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. వరదల సమయంలో ప్రభుత్వం, స్థానిక కార్పొరేటర్లు, బల్దియా అధికారులు తమను పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.  దీంతో గులాబీ నేతల్లో కొంత ఆందోళన కనిపిస్తుందని చెబుతున్నారు. అందుకే బీజేపీ వల్లే వరద సాయం ఆగిపోయిందనే ప్రచారం ఎక్కువ చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.   తెలంగాణ పీసీసీ రేసులో ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి.. గ్రేటర్ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. తన లోక్ సభ పరిధిలోకి వచ్చే మల్కాజ్ గిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎక్కువ డివిజన్లు గెలిచి పీసీసీకి లైన్‌ క్లియర్ చేసేకునేందుకు తన వ్యూహాలతో దూసుకెళ్తున్నాడు. మల్కాజిగిరి పరిధిలో తక్కువ సీట్లు సాధిస్తే పీసీసీ చీఫ్ పదవికి ఎఫెక్ట్‌ పడుతుందని భావిస్తున్న రేవంత్.. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో గెలుపును సెమీ ఫైనల్‌గా భావించి తన శక్తిని మొత్తం ప్రచారంలో దారపోస్తున్నారు.  ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లించేలా గ్రౌండ్‌ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్కువ డివిజన్లు గెలిస్తే.. పీసీసీ చీఫ్ విషయంలో వ్యతిరేకుల నోళ్లు మూయించొచ్చని భావిస్తున్నట్లుగా పార్టీలోని రేవంత్ రెడ్డి అనుచరుల్లో చర్చ నడుస్తోంది. వరద సాయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన పోరాటానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రేవంత్ పోరాటం వల్లే మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించిందని కాంగ్రెస్ చెబుతోంది. ఇదే విషయాన్ని జనాల్లోకి తీసుకెళుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు హస్తం లీడర్లు.    దుబ్బాక వేవ్ గ్రేటర్‌లోనూ కొనసాగించి టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని నిరూపించేందుకు రఘునందన్‌ రావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దుబ్బాక విజయం వన్‌ టైమ్‌ వండరే అని టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కామెంట్ చేయడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న రఘునందన్ రావు.. మల్కాజ్ గిరిలో  ఎక్కువ డివిజన్లు సాధించి మరోసారి హైకమాండ్‌ దృష్టిలో తనపేరు మారు మోగేలా చేసుకోవాలని ‌ప్లాన్ చేస్తున్నాడు. రఘునందన్ ను ఇంచార్జ్ గా నియమించడంతో మల్కాజ్ గిరి బీజేపీ కేడర్ లోనూ జోష్ పెరిగిందని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, వరద సాయంలో జరిగిన అవినీతే ప్రధాన ప్రచారస్త్ర్రంగా చేసుకుంటున్నారు రఘునందన్ రావు.     మొత్తంగా తన నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు, టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం ఎదురుచూస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి రేవంత్‌రెడ్డి.. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో ఊపుమీదున్న ఎమ్మెల్యే రఘునందన్ రావులు ఎవరికివారు తమ సత్తా నిరూపించుకునేందుకు ట్రై చేస్తున్నారు. ముగ్గురు ముఖ్య నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గ్రేటర్ పోరు మల్కాజ్ గిరి నియోజకవర్గంలో కాక పుట్టిస్తోంది. ముగ్గురు మాటకారులే కావడం, ఫైర్‌ బ్రాండ్‌గా పేరుండటంతో గ్రేటర్ సమరంలో మల్కాజిగిరిలో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.