ప్రాణం తీసిన వరద సాయం! ఓట్ల కోసమేనా ఈ పాపం ?
posted on Nov 18, 2020 @ 3:13PM
గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయం ఓ ప్రాణం తీసింది. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం గంటల పాటు నిల్చోవడంతో ఓ మహిళ చనిపోయింది. ఈ ఘటన గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ-సేవ కేంద్రం వద్ద జరిగింది. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం మీసేవా కేంద్రంలో అప్లయ్ చేసుకోవడానికి 50 ఏళ్ల మున్నవర్ ఉనిస అనే మహిళ వచ్చింది. సుమారు 3 గంటల పాటు ఆమె లైన్‌లో నిలబడింది. మండుటెండల్లో నిలబడిన ఆమె ఒక్కసారిగా క్యూలైన్ లోనే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మున్నవర్‌ను పరిశీలించిన డాక్టర్లు ఆమె చనిపోయిందని తెలిపారు. మృతురాలిని హకీంపేట్ కుంట వాసిగా పోలీసులు నిర్థారించారు.
ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు హైదరాబాద్ వరద బాధితులు, తెల్లవారక ముందే మీ సేవ సెంటర్ల ముందు క్యూ కడుతున్నారు బాధితులు. దరఖాస్తులు పట్టుకొని గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. మహిళలతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు కూడా గంటలకొద్దీ లైన్లలో నిలబడుతున్నారు. గరంలోని అన్ని మీ-సేవ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నారు. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర క్యూలైన్లే కనిపిస్తున్నాయి. ఒకేసారి పదుల సంఖ్యలో జనం గుమిగూడటంతో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. లైన్లలో కొందరు సొమ్ముసిల్లి పడిపోతున్నారు. జనాలను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
కొన్ని ఏరియాల్లో సర్వర్ ప్రాబ్లమ్ జనాన్ని మరింత ఇబ్బంది పెడుతోంది. దీంతో గంటల తరబడి మీ సేవ సెంటర్ల దగ్గరే ఉండాల్సి వస్తోంది. సర్వర్ ప్రాబ్లమ్ తో కిలీమీటర్ల మేర క్యూలైన్లు పెరిగి భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. కిలోమీటర్ల మేర జనాలు బారులు తీరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గుంపుగుంపులుగా జనాలు నిలబడి ఉంటుండటంతో కరోనా విస్తరించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కిలోమీటర్ మేర క్యూ లైన్ ఉన్న ఎవరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరద బాధితులు. క్యూ లైన్లో ఎవరికైనా కరోనా ఉంటే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. కరోనా టైంలో డబ్బులు ఎకౌంట్లో వేసినట్లు బాధితులకు కూడా డబ్బులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ఓట్ల కోసమే గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం వరద సాయం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మండుటెండల్లో పసిపిల్లలతో మహిళలు అవస్థలు పడుతున్నారని, వద్దులు క్యూలైన్లలో నిల్చుని నరకయాతన పడుతున్నారని మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమస్య వచ్చిందంటున్నారు. ఇక వరంగల్ లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా వరద బాధితులు ఆందోళన చేస్తున్నారు. వరంగల్ లో ఎలక్షన్లు లేకపోవడం వల్లే ఇక్కడ ఇళ్లు మునిగిన వాళ్లకు పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు అక్కడి ఓరు గల్లు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ తరహాలో వరంగల్ వరద బాధితులకు ఇంటికి 10 వేల రూపాయల సాయం చేయాలని కేయు క్రాస్ వద్ద బిజెపి ఆందోళన చేసింది.