బీజేపీ దుర్మార్గ పార్టీ! యుద్ధం ప్రకటించిన కేసీఆర్
posted on Nov 18, 2020 @ 4:54PM
బీజేపీపై హైదరాబాద్ నుంచే యుద్ధం ప్రకటిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో బీజేపీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలతో టీఆర్‌ఎస్ భవన్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. బీజేపీపై తెలంగాణ భవన్ వేదికగానే సీఎం కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. డిసెంబర్ రెండో మాసంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాద్‌లోనే సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమావేశానికి సీఎం మమతా బెనర్జీ, మాజీ సీఎంలు కుమార స్వామి, అఖిలేశ్ యాదవ్, మాయావతితో పాటు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు.
గ్రేటర్ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు కేసీఆర్. ఎవరికి ఏ డివిజన్‌లో బాధ్యతలు అప్పగిస్తే.. ఆ డివిజన్‌లో ఆయా బాధ్యులు గట్టిగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వంపై, పార్టీపై బీజేపీ చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్‌ను అసలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎల్‌ఐసీ, రైల్వే లాంటి సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులను కలుపుకొని వెళ్లాలని నేతలకు మార్గనిర్దేశనం చేశారు. జీహెచ్‌ఎంసీ సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, 110 డివిజన్ లో టీఆర్‌ఎస్‌దే గెలుపని ఆ సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో వరద సాయం నిలిపివేతపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. వరద సాయం ఆపేయించింది బీజేపీనే అని మండి పడ్డారు. ఈసీకీ బీజేపీ ఫిర్యాదు చేయడం వల్లే సాయం ఆగిపోయిందని అన్నారు. వరద సాయం కోసం ఇప్పటికే రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఇంకా ఇప్పటికి వేల మందికి వరద సాయం అందాల్సి ఉందని వెల్లడించారు.
పార్టీ నేతలతో జరిగిన సమావేశంలోనే పార్టీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు కేసీఆర్. 16 పేజీలతో కూడిన మేనిఫెస్టో ఆయన విడుదల చేశారు. 19 వందల కోట్ల రూపాయలతో మరో 280 కిలోమీటర్ల మేర మిషన్ భగీరథ పైప్‌లైన్ వేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. కొత్తగా 4 ఆడిటోరియాల నిర్మాణం, జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని గ్రంథాలయాల ఆధునీకరణకు హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో ఆధునిక స్టేడియాలు, క్రీడా వసతుల ఏర్పాటుచేస్తామని తెలిపారు. రూ.130 కోట్లతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్లు నిర్మిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది టీఆర్ఎస్. త్వరలో నగరమంతా ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. మూసీ పునరుద్దరణ, సుందరీకరణ.. హుస్సెన్‌సాగర్ శుద్ధికి ప్రణాళికలు అమలు చేస్తామని అధికార పార్టీ గ్రేటర్ ప్రజలకు హామీ ఇచ్చింది.