బీజేపీలోకి 10 మంది టీఆర్ఎస్ నేతలు!
posted on Nov 18, 2020 @ 3:48PM
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నామినేషన్లు ప్రారంభమయ్యాయి. నామినేషన్లతో పాటు నేతల జంపింగులు జోరందుకున్నాయి. తమ కేడర్ ను కాపాడుకుంటూనే ఇతర పార్టీల్లోకి బలమైన నేతలకు గాలం వేస్తున్నాయి ప్రధాన పార్టీలు. మాజీ కార్పొరేటర్లు, టికెట్ ఆశిస్తున్న నాయకులతో పాటు నియోజకవర్గ ఇంచార్జ్ లు సైతం వలస బాట పట్టారు. అయితే అన్ని పార్టీల కంటే బీజేపీలోకి చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కమలం తీర్థం పుచ్చుకున్నారు. గ్రేటర్ పై ఫోకస్ చేసిన బీజేపీ ముఖ్య నేతలు.. చేరికలపైనే ఎక్కువ దృష్టి సారించారని చెబుతున్నారు.
వలసలపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 10 మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ పది మంది నేతలు తనతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు సోయం బాపూరావు. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహారశైలి పట్ల టీఆర్ఎస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మేయర్ అభ్యర్థిని ప్రకటించడానికి కూడా టీఆర్ఎస్ భయపడుతోందన్నారు సోయం. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత... బీజేపీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వంద స్థానాలను గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. భయంతోనే అధికార పార్టీ రాయితీలు ప్రకటిస్తోందని సోయం బాపురావు విమర్శించారు. అయితే బీజేపీలో చేరబోతున్న 10 మంది టీఆర్ఎస్ నేతలు ఎవరో మాత్రం బీజేపీ ఎంపీ వెల్లడించలేదు.