వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్.. భారత్ లో రెండు వారాల్లో అనుమతి..! 

కరోనాతో సతమతమవుతున్న దేశ ప్రజలకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ ఫైజర్, సీరం ఇండియా, భారత్ బయోటెక్ ఇప్పటికే డిసిజిఐ కి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో దీనిపై రెండు వారాల్లోగా అనుకూల నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాల ద్వారా తెల్సుస్తోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల అభ్యర్థనలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ రేపు బుధవారం వ్యాక్సిన్ పనితీరు, పంపిణి పైన కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. ఈ కమిటీ తన రిపోర్ట్ అందించిన తరువాత డిసిజిఐ రెండు వారాల్లోగా అత్యవసర అనుమతి మంజూరు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈనెల 4 న జరిగిన అఖిలపక్ష సమావేశంలో మరికొద్ది వారాల్లో వ్యాక్సిన్ సిద్ధమవుతుందని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ వార్తలు మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.   అయితే అత్యవసర అనుమతి ఇచ్చే ముందు వ్యాక్సిన్ ప్రభావం, భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అన్నిటికంటే ముఖ్యం కనుక దీనిపై పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ మూడు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల పర్యటన, ఆ వెంటనే ఉత్పత్తి సంస్థలు వ్యాక్సిన్ అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేయడం గమనిస్తే.. బహుశా త్వరలోనే వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి లభించే అవకాశం ఉంది.

స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వలేం! ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. గతంలో కరోణా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందు కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని జగన్ సర్కార్ చెబుతోంది. దీని కోసమే హైకోర్టుకు వెళ్లింది. ఫిబ్రవరిలో జరపతలపెట్టిన స్థానిక ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ సర్కార్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఎన్నికలపై స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.

గ్రామ వాలంటీర్లకు జగన్ సర్కార్ షాక్

ఏపీ సీఎం జగన్ అధికారం చేపట్టగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నవరత్నాల పథకాల అమలులో భాగంగా సంక్షేమ లబ్ధిని ఇంటింటికీ అందించే లక్ష్యంతో ఈ వాలంటీర్ వ్యవస్థను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే 35 ఏళ్ల వయసు నిండిన వారిని ఉద్యోగం నుంచి తొలగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలతో వాలంటీర్లకు పెద్ద షాక్ తగిలింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారితోపాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వలంటీరు సచివాలయం, వార్డు వలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ జీఎస్‌.నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో వాలంటీర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడిగా వాలంటీర్ల పోస్టులను భర్తీ చేశారు. 50 ఇళ్లకు ఒక వాలంటీరు లెక్కన రాష్ట్రంలో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. వీరిలో ఎక్కువ మంది అధికార వైసీపీ గ్రామ, మండలస్థాయి నాయకులతో పాటు ఎమ్మెల్యేల సిఫారసులతో నియమితులైన వారే.   ఇప్పటికే 35 ఏళ్లు నిండి వాలంటీరుగా పనిచేస్తున్న వాలంటీర్లకు సీఎఫ్‌ఎంఎస్‌ సిస్టమ్‌ ద్వారా అందించే జీతాలు రావడంలేదు. గత కొంతకాలం నుంచి ఈ అంశం చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా అప్పట్లో వాలంటీర్ల నియామకాలు జోరుగా సాగాయి. అయితే 35 ఏళ్లు నిండిన వారెవరైనా ఉంటే వారిని వెంటనే ఆ విధుల నుంచి తొలగించాల్సిందిగా కమిషనర్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. వారిని విధుల నుంచి తొలగించి.. ఆ ఖాళీల భర్తీకి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశాలు అందాయి. ఈ ఉత్తర్వులు ఖచ్చితంగా అమలైతే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 35 సంవత్సరాల వయస్సు దాటిన వారి సంఖ్య కొన్ని వేలలో ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది. నిబంధనలు అనుసరించి 35 సంవత్సరాలు దాటి ఒక్కరోజు ఉన్నా సరే సదరు వాలంటీరును ఉద్యోగం నుంచి తొలగిస్తారు.

రైతుల పోరాటానికి భారీ మద్దతు! ప్రశాంతంగా భారత్ బంద్ 

రైతు సంఘాల పిలుపుతో దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రైతుల బంద్ కు వివిధ కార్మిక సంఘాలు విపక్షాలు మద్ధతు ప్రకటించడంతో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. రైతులు రోడ్లు, రైలుపట్టాలపై బైఠాయించడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. యూపీలోని ప్రయాగరాజ్ నగరంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు. బనారస్ నుంచి గ్వాలియర్ వెళ్లాల్సిన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ రైలును  ఆపివేశారు. భువనేశ్వర్ రైల్వే స్టేషనులో రైళ్లను రైతులు నిలిపివేశారు. రవాణ సంఘాలు బంద్ కు మద్ధతు ప్రకటించడంతో సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపించింది. పూణే మార్కెటును తెరిచినా రైతుల బంద్ కు మద్ధతు వ్యాపారులు దుకాణాలు తెరవలేదు. జైపూర్ లో రైతులు, ఎన్ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.   బంద్ సందర్భంగా  నిలిచిపోయిన ప్రయాణికులకు మంచినీరు, పండ్లను ఇస్తున్నారు నిరసనకారులు. ఢిల్లీ సరిహద్దుల్లో 13వ రోజు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు చలిని సైతం లెక్క చేయకుండా రోడ్లపై భైఠాయించారు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు రైతులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.  రైతుల ఆందోళనతో సింఘు, టిక్రి, జారోదా, ఘజిపూర్, చల్లా, నోయిడా లింక్ రోడ్డు, జటిక్రా సరిహద్దు రహదారులను పోలీసులు మూసివేశారు. హరియనా, నోయిడా నుంచి ఢిల్లీ వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాల మోహరించాయి. ఇప్పటికే ఐదు సార్లు చర్చలు జరిపినా రైతులు పట్టువీడలేదు. బుధవారం మరోసారి రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు జరపనుంది.

పరకాల సత్యాన్వేషణ.. అమరావతి విషాదం!

ఒక రాష్ట్రం కళ్లు తెరిచి ఆరున్నరేళ్లవుతోంది. అర్థరాత్రి పార్లమెంటు తలుపులు మూసి.. తెలుగు ప్రజ తలపులు పట్టించుకోకుండా.. విభజిత రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసిన విభజనకూ అంతే వయస్సు. ఇంతవరకూ దానికంటూ ఒక రాజధాని నగరం లేని దౌర్భాగ్యం. ఆ విషాదాన్ని  సొంతం చేసుకున్న ఆంధప్రదేశ్ ప్రజల దురదృష్టానికి కారణాలు.. ఇకపై ఏం చేయాలో  ఆలోచించాలనే ‘స్పృహ లాంటి చైతన్యం’ కలిగించేందుకు తొలిసారిగా ఓ ప్రయత్నం.  ఈ దుస్థితి నాకే ఎందుకన్న ఆలోచన, సగటు ఆంధ్రుడిలో జనింపచేసే ఓ పెను సంకల్పం. కలసి వెరసి..  ప్రభుత్వ మాజీ సలహాదారయిన డాక్టర్ పరకాల ప్రభాకర్  ఆవేదనాభరిత హృదయం నుంచి ఆవిష్కృతమయినదే ‘అమరావతి విషాదం’.   అమరావతి రాజధాని పూర్వ- ప్రస్తుత స్థితిగతులు, ప్రజాభిప్రాయం-నేతల అంతరంగాలను గుదిగుచ్చి,  ఓ గంటసేపు రూపొందించిన డాక్యుమెంటరీ  చూసిన వారికెవరికయినా.. ‘అమరావతి అంత విషాదంలో ఉందా’ అనిపించక మానదు. అందుకే దానికి పరకాల ‘అమరావతి విషాదం’ అని పేరు పెట్టారేమో?! నిజానికి ఆ డాక్యుమెంటరీ చూపిన వాస్తవ దృశ్యాలు కూడా,  ఆ పేరుకు తగిన ట్లుగానే ఉంది. దానిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారాయన. మంచిదే. విషాదం-సంతోషం దాచిపెట్టుకోకూడదు. అవి పదుగురితో పంచుకోవలసినవి కదా!   అసలు అమరావతిలో ఏం జరిగింది? ఇప్పుడేం జరుగుతోంది? ఇకపై  ఏం జరగబోతోంది? ప్రజల మానసిక పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా భూములిచ్చి గాయపడిన రైతుల మనోభావాలు ఎలా ఉన్నాయి? రాజకీయ-రైతుసంఘాల నాయకుల మనసులో మాటేమిటన్న ప్రశ్నలను, పరకాల తనతో అమరావతి వరకూ  కారులో వెంటపెట్టుకుని వెళ్లినట్లు కనిపించింది. అది ఒక సత్యాన్వేషి  ప్రయత్నంగానే అనిపించింది.   ప్రధాని మోదీ దేశంలోని అన్ని ముఖ్య ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టి-నీటిని హోమంలో వేసిన ప్రాంత పరిసరాలను చూపిన ప్రభాకర్.. మళ్లీ అలనాటి అమరావతి నగర భూమిపూజ హడావిడి దృశ్యాలను జ్ఞప్తికి తెచ్చారు. అప్పటి ఆ సంరంభంలో ఆయన కూడా ఒక భాగస్వామి కాగా.. మాలాంటి జర్నలిస్టులంతా సాక్షులం. పరకాల ‘అమరావతి విషాదం’ చూడగానే, తొలుత స్ఫురణకు వచ్చినవి ఆ దృశ్యాలే.   పార్లమెంటులో నాటి కాంగ్రెస్ దర్శకత్వంలో, బీజేపీ సహ నిర్మాణంలో జరిగిన రాష్ట్ర విభజన నుంచి.. నేటి మూడు రాజధానుల అగమ్యగోచర పరిస్థితులను, పరకాల చాలా సహనంతో దృశ్యంగా మార్చడం అభినందనీయమే. హైదరాబాద్ టు అమరావతి వరకూ సాగిన పరకాల ‘అమరావతి విషాద ’ యాత్రలో.. ఉండవల్లి అరుణ్‌కుమార్, అంబటి రాంబాబు, ఐవైఆర్ కృష్ణారావు, వర్ల రామయ్య, ఇంకా రైతులు, సామాజికవేత్తల మనోగతాన్నీ ప్రజల ముందు ఆవిష్కరించారు. ఆ మధ్యలోనే నాటి అధికార టీడీపీ- నేటి వైసీపీ ప్రభుత్వ విధానాలు, ఆ పార్టీ అగ్రనేతలిద్దరి వైఖరినీ ప్రజల ముందుంచారు. అసలు ప్రభుత్వాలు మారినా,  అమరావతి తలరాత మారకపోవడానికి కారణమేమిటన్న ప్రశ్నలు సంధించిన పరకాల.. వాటికి పరిష్కారాలు కూడా సూచిస్తే, ఆయన ప్రయత్నానికి సంపూర్ణత్వం చేకూరేది. ప్రజల ఆవేదన, రైతుల ఆందోళన, ప్రధానంగా మూడుపంటలు పండే భూములిచ్చిన తాము.. ‘పెయిడ్ ఆర్టిస్టులనే బిరుదు’ పొందుతున్న విషాదం.. రాజకీయ నేతల అనుకూల-వ్యతిరేక వాదనలు, ప్రస్తుత శిధిలావస్థలో ఉన్న అమరావతి కట్టడాలు, వాటి భవిష్యత్తు.. వీటికి మించి... ఎంతో ఆసక్తితో, ‘జగన్ ప్రవచిత దక్షిణాప్రికా రాజధానుల’ కథేమిటో తెలుసుకోవాలన్న సంకల్పం..  అక్కడి ప్రముఖులతో చేసిన ఇంటర్వ్యూ.. ఇవన్నీ విజజిత ఆంధ్రప్రదేశ్ విషాదంపై పరకాలకు ఉన్న సానుభూతిని బహిర్గతం చేశాయి.   రాజధాని కోసం రైతులు-ప్రజలు పడుతున్న ఆవేదనలో పాలుపంచుకుని, వాటిని ప్రపంచానికి చాటిన పరకాల ప్రయత్నం స్వాగతించదగ్గదే. ఎందుకంటే అసలు ఇలాంటి ప్రయత్నం, ఆలోచన ఇంతవరకూ ఎవరూ చేయలేదు కాబట్టి! అయితే.. ఇప్పటి అమరావతి విషాదానికి, పరిష్కారం కూడా సూచిస్తే ఇంకా బాగుండేది. పైగా.. అలనాటి అమరావతి రాజధాని ప్రయత్నంలో,  పరకాల ప్రభుత్వపరంగా ఓ భాగస్వామి కూడా. అందుకే ఆయన మస్తిష్కం నుంచి జాలువారిన ఈ ప్రయత్నంపై సహజంగా ఎక్కువ ఆ, అంచనాలుంటాయి. కాబట్టి.. నాటి తెరవెనుక కథలు, గాథలు కూడా ఆవిష్కరిస్తే బాగుండేదనిపించింది.   ‘అమరావతి విషాదం’ ప్రశ్నలు.. ఆవేదన.. వాదన.. విమర్శ.. చరిత్రకే పరిమితం అయిందనిపించింది. చివరకు ఉండవల్లి వంటి నేతలు, ఐవైఆర్ కృష్ణారావు లాంటి మేధావులు కూడా,  అమరావతిని విషాదం నుంచి తప్పించేందుకు ఏం చేయాలో చెప్పలేకపోవడం కనిపించింది. ఇక పరకాల గళం.. అందులోని తెలుగుతనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ లేదు. అమరావతి విషాదం గురించి అరటిపండు వలిచినట్లు దృశ్యకావ్యం ఇచ్చారు. నిష్ణాతులయిన సాంకేతిక నిపుణులను ఎంచుకోవడంలో.. ఈ డాక్యుమెంటరీకి నిండుతనం వచ్చింది. అంతా బాగుంది. కానీ అమరావతి విషాదాన్ని ఎంతో శ్రమించి, దృశ్యంగా అందించిన పరకాల.. దానిని హైదరాబాద్‌లో కాకుండా, అదే అమరావతి ప్రాంతంలోనే ప్రివ్యూ వేసి ఉంటే,  మరింత సహజత్వం  ఉండేదన్న మాటలు అక్కడ వినిపించాయి.     ఏదేమైనా,  ఒక ప్రశ్న.. మరొక అవమానం..  ఆంధ్రుడి ఇంకొక సిగ్గుమాలిన తనం..ప్రజల చేతకాని చేవలేనితనాన్ని ‘అమరావతి విషాదం’ ధైర్యంగా ఆవిష్కరించింది. ఇందుకు తొలిసారి గజ్జె కట్టిన పరకాల ప్రభాకర్ అభినందనీయులు. సహజంగానే పరకాల దగ్గర కూర్చుంటే బోలెడన్ని విషయాలు దొరుకుతాయి. అప్పటి అనేక  అనుభవాలు గుర్తుకొస్తాయి.  ఫోన్‌లోనయినా అంతే. అయితే కావలసిందల్లా అంశమే!  అంశం బాగుందనుకుంటే అవి దొంతరలా వచ్చేస్తుంటాయి. విషయ పరిజ్ఞానానికి కొదువ లేని మేధావి అయిన పరకాల.. ఇన్నాళ్లూ అమరావతికి దూరంగా ఉంటూ కూడా, అదే ‘అమరావతి విషాదం’ గురించి ఆలోచించడం..  జన్మభూమిపై ఆయనకున్న మక్కువకు నిలువెత్తు నిదర్శనం. 

ఏలూరు వింత రోగానికి కారణం ఇదే.. నిపుణుల అంచనా..! 

ఏలూరులో భయాందోళనకు గురిచేస్తున్న వింత రోగంపై ఏపీలో తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వింత రోగానికి సంబంధించిన కారణాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. ఈ వింత రోగంపై వివిధ సంస్థలు, అలాగే ప్రభుత్వ సంస్థలు నివేదికలు సిద్ధం చేశాయి. తాజాగా బాధితుల శరీరంలో లెడ్, నికెల్ వంటి హెవీ మెటల్ పదార్ధాలు ఉన్నట్లు ఎయిమ్స్ నిపుణుల బృందం గుర్తించింది. ఇవి తాగునీరు లేదా పాల ద్వారా శరీరంలో చేరి ఉండవచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల తాజా నివేదిక అధికారికంగా ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అయితే దీనికోసం తొమ్మిది డెయిరీల నుంచి పాల నమూనాలు తీసుకుని ల్యాబ్ కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కల్చర్‌ రిపోర్టు, ఈ-కోలీ పరీక్ష ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.    న్యూరో టాక్సిన్స్ కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తినే ఆహారం లేదా తాగునీరు లేదా పాల ద్వారా ఈ వింత రోగం వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. రోగుల నాడీ వ్యవస్థపై న్యూరో టాక్జిన్స్ ప్రభావం చూపించడం తో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. బాధితుల్లో కంటి నల్లగుడ్డు స్పందన తగ్గిన లక్షణాన్ని వైద్యులు తాజాగా గుర్తించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సోమవారం పరిశీలించిన రోగుల్లో 70 నుంచి 80 శాతం మందికి ఈ సమస్య ఉందని గుర్తించారు. వైద్య పరిభాషలో "ప్యూపిల్ డైలటేషన్‌" గా దీనిని వైద్యులు పేర్కొంటున్నారు. ఇది మయో క్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చని గుంటూరు వైద్య నిపుణుల బృందం చెబుతోంది. 

ఉపరాష్ట్రపతి చొరవతో.. అంతుపట్టని వ్యాధి పై రంగంలోకి కేంద్ర ప్రత్యేక బృందం 

ఏపీలోని ఏలూరు పట్టణంలో అంతుచిక్కని వ్యాధి కలకలం సృష్టిస్తున్న సంగతి తెల్సిందే. నాలుగు రోజులుగా పలువురు కళ్లుతిరగడం, నోటి నుండి నురగ, మూర్ఛ వంటి లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో చేరుతూ చికిత్స తీసుకుని.. రెండ్రోజుల్లో కోలుకొని ఇంటికి వెళ్లిపోతున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా కేసుల తీవ్రత పెరగడంతోపాటు ఇందులో చిన్నారులు, మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే. లక్షణాలను బట్టి ఇది సంక్రమణ వ్యాధి లాగా అనిపించడం లేదని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నా.. దీనికి అసలు కారణాలేంటనేది మాత్రం అంతుచిక్కడం లేదు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని విజయవాడ, విశాఖపట్టణం పంపి చికిత్సనందిస్తున్నారు.   తాజాగా ఈ విపత్తు పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. దీని గురించి తెలియగానే అయన కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి అక్కడి పర్సిస్థితుల గురించి తెలుసుకున్నారు. దీనిపై స్థానిక వైద్యులతోపాటు మంగళగిరి నుండి వచ్చిన ఎయిమ్స్ వైద్య బృందం కూడా పరిశీలించిందని.. అయితే ఇప్పటివరకు జరిపిన వైద్యపరీక్షల్లో దీనికి కారణమేంటనేది మాత్రం తెలియడం లేదని ఉపరాష్ట్రపతికి అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడారు. ఈ అంతుచిక్కని వ్యాధి బాధితులకు ఉన్నతస్థాయి వైద్యం అందించడంతోపాటు.. అసలు దీనికి గల కారణాన్ని గుర్తించి.. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.   ఉపరాష్ట్రపతి సూచనతో కేంద్రమంత్రి ఏయిమ్స్ అత్యవసర వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్, పుణే ఎన్ఐవీ వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ దేవష్టవర్, ఎన్డీసీసీ డిప్యూటీ డైరెక్టర్, డాక్టర్ సంకేత్ కులకర్ణిలతో కూడిన ముగ్గురు వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందం ఏలూరు లోని వైద్యుల నుండి ఇక్కడి పరిస్థితిని ఇప్పటికే అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ బృందం ఏలూరుకు వచ్చి, ల్యాబ్ నివేదికలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందజేస్తారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కేంద్ర మంత్రి తెలియజేశారు.

బీజేపీలో చేరిన రాములమ్మ.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కొద్దిసేపటి క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.   1998లో బీజేపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని విజయశాంతి చెప్పారు. తెలంగాణ కోసం చాలా కష్ట పడ్డానని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పట్లో బీజేపీ నుంచి బయటకు వచ్చి, ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు. అయితే, తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయమని కేసీఆర్ ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపారు. ఏ పార్టీ ఉండకూడదన్న దురుద్దేశ్యంతో కేసీఆర్ వ్యవహరించారని అన్నారు. కేసీఆర్ కంటే ముందు నుంచే తాను తెలంగాణ కోసం పోరాడుతూ వచ్చానని తెలిపారు. టీఆర్ఎస్ నుంచి తాను, కేసీఆర్ ఇద్దరం ఎంపీలుగా గెలిచామని గుర్తు చేసిన ఆమె.. 2013 జూలైలో తనను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారని చెప్పారు. ముందు నుంచే కేసీఆర్ తనపై కుట్ర పూరితంగా వ్యవహరించారని, టీఆర్ఎస్ నుంచి తానే బయటకు వెళ్లానని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.   తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియాగాంధీకి చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడే నాయకులు ఎవరూ ఉండకూడదన్న ఆలోచనతో ఇతర పార్టీల నేతలందరినీ టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారని మండిపడ్డారు. కానీ, ప్రస్తుతం తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగిందని చెప్పారు. తెలంగాణలో పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతోందని, కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయటపెడతానని అన్నారు.  కేసీఆర్‌ను గద్దె దించుతాం, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని విజయశాంతి తెలిపారు.

వరంగల్ మెడికల్ కాలేజీలో సినీ ఫక్కీలో ఎలక్ట్రానిక్ మాస్ కాపీయింగ్

చదువుకొని టెక్నాలజీని డెవలప్ చేసేవాళ్ళు కొందరైతే.. చదవలేక టెక్నాలజీని ఉపయోగించి పరీక్షల్లో కాపీ కొట్టేవాళ్ళు కొందరు. అలాంటి ఆణిముత్యం తాజాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో దొరికింది. ఎన్నో సినిమాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో కాపీ కొట్టడం చూస్తుంటాం. ఇప్పుడు ఆ ఘనకార్యం వరంగల్ లో వెలుగులోకి వచ్చింది.   వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. అతడు చెవిలో మైక్రోఫోన్ పెట్టుకోగా, బయట కళాశాల ఆవరణలో కారులో కూర్చుని ఓ డాక్టర్ ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో సమాధానాలు అందించాడు. ఇది గమనించిన కళాశాల సిబ్బంది విద్యార్ధిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సదరు విద్యార్థి నవంబరు 26,28, డిసెంబరు 3వ తేదీల్లో జరిగిన పరీక్షల్లో ఈ విధంగా కాపీయింగ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు, నిందితులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. పరీక్షలు రాయడం కోసం వైద్య విద్యార్థి ఓ డాక్టర్ సాయం తీసుకొని కాపీ కొట్టాడు. భవిష్యత్ లో పొరపాటున డాక్టర్ అయితే.. ఎవరైనా పేషెంట్ కి ఆపరేషన్ చేయాల్సి వస్తే.. ఇలాగే చెవిలో మైక్రోఫోన్ పెట్టుకోని మరో డాక్టర్ సాయంతో ఆపరేషన్ చేస్తాడా?.. వామ్మో ఇలాంటి వారిని వదిలేస్తే అంతే సంగతులు!!

అప్పుడు బేడీలు.. ఇప్పుడు ధర్నాలా! తెలంగాణ సీఎంపై నెటిజన్ల సెటైర్లు 

నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం మరింత తీవ్రమైంది. రైతు సంఘాలు పిలుపిచ్చిన భారత్ బంద్ కు  దేశంలోని పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా  రైతుల సమరానికి సపోర్ట్ చేశారు. భారత్ బంద్ లో టీఆర్ఎస్ కార్యకర్తలంతా భారీగా పాల్గొనాలని కేసీఆర్ పిలుపిచ్చారు.  కేంద్రం తెచ్చిన కొత్త బిల్లులు, ఢిల్లీ సరిహద్దులో రైతులకు అడ్డుకోవడంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు మద్దతుగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తెలంగాణలో నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేస్తూ.. ఇప్పుడుఢిల్లీ సరిహద్దులో  రైతులను అడ్డుకోవడాన్ని తప్పుపట్టడంపై నెటిజన్లు ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. ఢిల్లీ సరిహద్దుతో అన్నదాతలు చేస్తున్న పోరాటానికే మద్దతు ఇస్తూనే.. గతంలో రైతుల పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరును ఎండగడుతున్నారు.   2017 ఏప్రిలో లో  ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర పంటను కొనుగోలు చేయాలంటూ ధర్నాకు దిగిన మిర్చి రైతులకు బేడీలు వేసి.. 12 రోజుల  పాటు  జైలుకు పంపిన విషయం తెలంగాణ ముఖ్యమంత్రి మర్చిపోయినట్లు ఉన్నారని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. అప్పుడు రిమాండ్‌లో ఉన్న రైతులకు  బేడీలు వేసి పోలీసులు  కోర్టుకు తీసుకువచ్చారు. రైతులను కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లతో తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2017 ఖమ్మం ఘటనపై సీఎం కేసీఆర్ ముందు రైతులకు క్షమాపణ చెప్పాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.  మక్కజొన్నలు కొనాలంటూ ఉత్తర తెలంగాణ రైతులు.. సన్నాలకు మద్దతు ధర ఇవ్వాలంటూ దక్షిణ తెలంగాణ రైతులు ఆందోళనలు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదని కేసీఆర్ ను సోషల్ మీడియా వేదికగా  నిలదీస్తున్నారు. రైతుల ఉద్యమాలకు తెలంగాణలో ఒక న్యాయం. ఢిల్లీలో మరో న్యాయం ఉంటుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.    2017 ఏప్రిల్  28న ఖమ్మం మార్కెట్‌కు సుమారు 2 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. ఇదే అదనుగా వ్యాపారులు, ఏజెంట్లు కుమ్మక్కై మిర్చిధరను ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులంతా ఆందోళనకు దిగారు.  ఆగ్రహంతో మార్కెట్‌ కార్యాలయం, చైర్మన్‌ చాంబర్, ఈనామ్‌ కార్యాలయాల్లో ఫర్నీచర్, కంప్యూటర్లను, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో  అప్పుడు  టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న  సండ్ర వెంకటవీరయ్యతో  పాటు పదిమంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రిమాండ్‌లో ఉన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం తీవ్ర దుమారం రేపింది. దేశ వ్యాప్తంగా రచ్చగా మారడంతో  పోలీసు ఉన్నతా ధికారులు స్పందించి.. రైతులకు బేడీలు వేసి తీసుకువచ్చిన ఇద్దరు ఏఆర్‌ ఎస్సైలను సస్పెండ్‌ చేశారు. 12 రోజుల తర్వాత  బెయిల్ రావడంతో  పది మంది రైతులు.. 2017 మే 12న విడుదలయ్యారు. 2017లో ఖమ్మంలో జరిగిన ఘటనలు ఉదహరిస్తూ .. ఇప్పుడు కేసీఆర్ ను కడిగి పారేస్తున్నారు సోషల్ మీడియా వారియర్లు .    గత యాసంగిలో నియంత్రిత సాగు విధానం అమల్లోకి తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులతో సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. నియంత్రిత సాగు విధానం ప్రకారం తాము చెప్పినట్లు సాగు చేస్తేనే... ఆ పంటను కొంటామని ప్రకటించింది. యాసంగిలో మొక్కజొన్న వేయవద్దని సూచించింది.  కొందరు రైతులు మాత్రం స్థానిక పరిస్థితులు. భూమి రకం ఆధారంగా మొక్కజొన్న సాగు చేశారు. అయితే వాళ్ల పంటను కొనుగోలు చేయడానికి అధికారులు నిరాకరించారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినా మక్కలను కొనుగోలు చేయడానికి నిరాకరించింది టీఆర్ఎస్ సర్కార్. అన్నదాతలు ఎంతగా ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. అంతలోనే దుబ్బాక ఉప ఎన్నిక రావడంతో.. తమకు ఎక్కడ ఇబ్బంది అవుతుందోమోనన్న భయంతో దిగొచ్చి మక్కల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. సన్నాలకు మద్దతు ధర కోసం కొన్ని రోజులుగా రైతులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించ లేదు. దీంతో తాము పండించిన పంటతో తమకు గిట్టుబాటు కావడం లేదంటూ కొందరు రైతులు తం పంటలకు నిప్పు కూడా పెట్టుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తమ పోస్టులకు జత చేస్తూ కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు.    తెలంగాణలో కొంత కాలంగా ఎలాంటి ఆందోళనలు, నిరసనలకు అనుమతి ఇవ్వడం లేదు. హైదారాబాద్ లో దశాబ్దాలుగా ధర్నా పాయింట్ గా ఉన్న ఇందిరా చౌక్ ను ఎత్తివేసింది కేసీఆర్ ప్రభుత్వం. దీనిపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించినా కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగానే వ్యవహరించింది. ధర్నా చౌక్ తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కోరడం వల్లే ధర్నా చౌక్ ను ఎత్తివేశామని కవరింగ్ చేసుకుంది. అయితే ప్రజా సంఘాలు కోర్టుకు వెళ్లి ఇందిరా చౌక్ లో ధర్నా పాయింట్ ను పునరుద్దరించుకున్నాయి. ఇలా  ఇంతగా తెలంగాణలో నిరసనలపై నిర్భంధాలు పెడుతున్న కేసీఆర్ పార్టీ.. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా హడావుడి చేయడం రాజకీయ దివాళుకోరుతనానికి నిదర్శనమని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.  

వరద సాయం కోసం ఆందోళనలు! గ్రేటర్ లో పోలీసులకు తిప్పలు

గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయం పంపిణి అంశం మళ్లీ ఉద్రిక్తతలు స్పష్టిస్తోంది. వరద సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వరద బాధితులు మీ సేవా సెంటర్ల దగ్గర ఉదయం నుంచే క్యూలు కట్టారు. జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకునే ఆప్షన్ తీసివేశారని మీ సేవా నిర్వాహకులు చెబుతున్నా జనాలు పట్టించుకోవడం లేదు. పలు కేంద్రాల దగ్గర తోపులాటలు జరుగుతున్నాయి. జనాలను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.    వరద సహాయం కోసం కొందరు బాధితులు సీఎం క్యాంప్ ఆఫీస్‌కు సమీపంలోని మీ సేవ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. లాక్‌డౌన్‌లో ఏ విధంగా అయితే పరిహారం ఇచ్చారో అదే విధంగా 10 వేలు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. సెకెండ్ ఫ్లోర్ ఉన్న వారికి వరద సహాయం చేశారు కానీ నిజమైన బాధితులకు అన్యాయం చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ స్టేట్‌మెంట్‌కు వ్యతిరేకంగా క్యాంపు ఆఫీస్ వద్ద నినాదాలు చేశారు.    ఎన్నికలకు ముందు వరద బాధితులకు కుటుంబానికి పది వేల ఆర్థిక సాయం చేసింది ప్రభుత్వం. గ్రేటర్ ఎన్నికల కోడ్ తో అది ఆగిపోయింది. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే.. డిసెంబర్ 7 నుంచి సాయం అందని వరద బాధితులకు 10 వేల రూపాయలు ఇస్తామని గ్రేటర్ ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో  సోమవారం తెల్లవారు జామున మూడు గంటల నుంచి మీసేవ సెంటర్లకు వచ్చారు వరద బాధితులు.

ఏలూరును వణికిస్తున్న వింత వ్యాధి.. బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుపట్టని వ్యాధి వణికిస్తోంది. మూర్ఛ, నోటి వెంట నురగ వంటి లక్షణాలతో అనేకమంది ఆస్పత్రిపాలవుతున్నారు. అంతుచిక్కని వ్యాధితో అనారోగ్యం పాలైన వాళ్ల సంఖ్య ఇప్పటికే 350 దాటింది. అలాగే, రెండు మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.    ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ ఇవాళ ఉదయం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న సీఎం.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. సీఎం జగన్‌ వెంట మంత్రి పేర్నినాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. బాధితుల పరామర్శ అనంతరం అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష జరుపుతున్నారు. వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.   మరోవైపు, మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యుల బృందం ఏలూరులో పర్యటించింది. 8 మంది సభ్యుల బృందం రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించింది. రక్త నమూనాలు సేకరించి ఢిల్లీ ఎయిమ్స్‌ కు పంపించామని, రిపోర్టుల ఆధారంగా వ్యాధిని నిర్థారిస్తామని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు.

తన ఇంటి దగ్గర పవన్ కల్యాణ్ దీక్ష! రైతులను ఆదుకోవాలని డిమాండ్

నివర్ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. అమరావతిలోని తన నివాసం దగ్గరే ఆయన దీక్షలో కూర్చున్నారు. వరద బాధితులకు నష్ట పరిహారంగా రూ. 35 వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ. 10,000 ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన నివర్ తుపానుతో ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు ప్రాంతాల్లో పర్యటించి, రైతులను పరామర్శించారు.  వారికి జరిగిన నష్ట వివరాలను పవన్ తెలుసుకున్నారు. ప్రజలను ఆదుకునే విషయంలో వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే దీక్ష చేపడతానని ఇప్పటికే ప్రకటించారు.చెప్పినట్లే తన నివాసం దగ్గర దీక్షకు దిగారు జనసేనాని.    పవన్ కల్యాణ్ పిలుపుతో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లా కేంద్రాల్లో జనసేన నేతలు, కార్యకర్యలు నిరనసలకు దిగారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తున్నారు. వరద బాధితులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని  డిమాండ్ చేశారు.

ఎన్నిక ముగిసింది.. సాయం ఆగింది! కేసీఆర్ సర్కార్ పై బాధితుల పైర్ 

రాజకీయ పార్టీల నైజం మరోసారి బయటపడింది. ఓట్ల కోసమే పార్టీలు ఎంత చిల్లర వేషాలు వేస్తాయో మరోసారి అర్ధమైంది. ప్రభుత్వాల ఓట్ల నాటకాలు ప్రజలకు తెలిసొచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అత్యంత కీలంగా మారిన వరద సాయం పంపిణిపై అధికార పార్టీ యూ టర్న్ తీసుకుంది. డిసెంబర్ 7 నుంచి వరద బాధితులకు సాయం అందిస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు మాట మార్చింది. వరద బాధితులు సాయం కోసం మీ సేవా సెంటర్లలో అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ అన్నారు. అర్హులను తామే గుర్తించి వరద సాయం అందిస్తామని చెప్పారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాయని తెలిపారు. వరద సాయం అందని వారి వివరాలు సేకరించి బాధితుల అకౌంట్లలోకి వరద సాయం జమ చేస్తామని తెలిపారు బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్.    కేసీఆర్ సర్కార్ యూ టర్న్ తో  గ్రేటర్ హైదరాబాద్ లో వరద బాధితులకు సాయం అందడం ఇక కష్టమేనన్న చర్చ జరుగుతోంది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.10వేలు వరద సాయం గతంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయింది. వరద సాయాన్ని డిసెంబర్ 7 నుంచి పున: ప్రారంభిస్తామని కేసీఆర్ ఎల్బీ స్టేడియం ఎన్నికల సభలో ప్రకటించారు. దీంతో ప్రజలు నగరంలోని  మీ సేవా కేంద్రాల వద్ద  ఉదయం నుంచి బారులు తీరారు. జనాల రద్దీ పెరగడం, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో మీ సెంటర్ నిర్వహకులు తమ కార్యాలయాలు తెరవలేదు. అయినా జనాల రద్దీ గంట గంటకు పెరగడంతో పలు సెంటర్ల దగ్గర తోపులాటలు జరుగుతున్నాయి. జనాల క్యూలపై మీడియాలో వార్తలు రావడంతో స్పందించిన.. జీహెచ్ఎంసీ కమిషనర్ వరద బాధితులుకు మీ సేవా సెంటర్లకు రావొద్దని సూచించారు.    గత అక్డోబర్ లో కురిసిన కుండపోత వర్షాలకు హైదరాబాద్ లో వరదలు వచ్చాయి. వందలాది కాలనీలు నీట మునిగాయి. వేలాది ఇండ్లు రెండు,మూడు రోజుల పాటు నీళ్లలోనే ఉండిపోయాయి. వరద ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద బాధిత కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. కొన్ని ప్రాంతాల్లో సాయం పంపిణి చేశారు. ఆరున్నర లక్షల కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు పంపిణి చేశామని సర్కార్ ప్రకటించుకుంది. అయితే అందులో ఎక్కువ మొత్తం డబ్బంతా అధికార టీఆర్ఎస్ నేతలే కాజేశారనే ఆరోపణలు వచ్చాయి. తమకు సాయం అందలేదని నిజమైన వరద బాధితులు ఆందోళనలు చేయడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో మీ సేవా సెంటర్ల ద్వారా దరఖాస్తులు తీసుకుంది ప్రభుత్వం. అప్పుడు కూడా నాలుగు రోజుల పాటు మీ సేవా సెంటర్లన్ని జనాలతో నిండిపోయాయి.    గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వరద సాయాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకున్నాయి  పార్టీలు. తమను గెలిపిస్తే ప్రతి కుటుంబానికి  25 వేల రూపాయల సాయం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అయితే తాము కుటుంబానికి 50 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కాని నిధులు ఎక్కడి నుంచి తెస్తారో మాత్రం చెప్పలేదు. విపక్షాల హామీలతో తామేని తక్కువ కాదన్నట్లుగా.. ఎన్నిక ముగియగానే మిగిలిన వరద బాధితులకు 10 వేల సాయం పంపిణి చేస్తామని అధికార ప్రకటించింది. సీఎం కేసీఆరే స్వయంగా హామీ ఇచ్చారు. దీంతో వరద బాధితులు కూడా గ్రేటర్ ఎన్నిక ముగియగానే సాయం అందుతుందని ఆశించారు. కాని ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ మాట మార్చడంతో వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల ముందు ప్రకటించి ఇప్పుడు మాట మార్చడమేంటనీ మండిపడుతున్నారు.

రైతుల పోరాటం ఉధృతం! ఢిల్లీ సరిహద్దులకు సీఎం కేజ్రీవాల్ 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం ఉధృతమైంది. అన్నదాతలు 10 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో ఉన్నారు. కేంద్రం బిల్లులు ఉపసంహరించుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు. రైతుల పోరాటనికి మద్దతు కూడా పెరుగుతోంది. ఢిల్లీ సమీపంలోని రాష్ట్రాల నుంచి వేలాదిగా రైతులు తరలివస్తున్నారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ ప్రాంతాల్లో వేలాదిగా చేరిన రైతులు, తమను ఢిల్లీలోకి అనుమతించాలని నిరసనలు కొనసాగిస్తున్నారు. సింఘుతో పాటు టిక్రీ, ఘాజీపూర్ ‌లో సైతం రైతుల ఆందోళన కొనసాగుతోంది.మంగళవారం రైతులు చేపట్టనున్న భారత్ బంద్ కు అన్ని వర్గాల నుంచి సపోర్ట్ లభిస్తోంది. రైతుల బంద్ పిలుపుతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ సరహిద్దులో భారీగా అదనపు బలగాలను మోహరిస్తోంది.     దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసనలు తెలియజేస్తున్న రైతులకు సంఘీభావం తెలపాలని నిర్ణయించుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. తన సహచర మంత్రులతో కలిసి ఆయన హర్యానా - ఢిల్లీ బార్డర్ కు వెళ్లనున్నారు. రైతులకు అక్కడ కల్పిస్తున్న ఏర్పాట్లను కేజ్రీవాల్ స్వయంగా సమీక్షించనున్నారు. రైతుల నిరసనలు 10వ రోజుకు చేరుకోగా, వారిని పరామర్శించేందుకు వెళుతున్న తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలవనున్నారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దులో రైతుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సౌకర్యాలను కల్పించిందని వ్యాఖ్యానించిన కేజ్రీవాల్, "8న జరిగే భారత్ బంద్ కు ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా మద్దతిస్తోంది తెలిపారు. రైతులు తెలియజేస్తున్న నిరసనలకు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరుతున్నాను" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

2021 అత్యంత చెత్త సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తుంది

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఎంతో భారంగా నడుస్తూ, ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ ఏడాది ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కనీసం నూతన సంవత్సరమైనా సంతోషంగా ఉంటామని భావిస్తున్నారు. అయితే వచ్చే ఏడాదిలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్పీ) హెచ్చరించింది. విపత్తులకు ప్రజలు తమను తాము సిద్ధం చేసుకోవాలని డబ్ల్యూఎఫ్సీ చీఫ్ డేవిడ్ బీస్లీ కోరారు. 2021 ఒక శతాబ్దంలో ప్రజలు చూసిన అత్యంత చెత్త సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా వేశారు. వచ్చే సంవత్సరం తీవ్రమైన ఆకలి, కరువు తాండవిస్తాయని.. ముఖ్యంగా పేద దేశాల్లో ఈ ప్రభావం చాలా అధికంగా ఉంటుందని తెలిపారు.   కరోనా మహమ్మారి, ప్రపంచంపై దాని ప్రభావాల గురించి చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో డేవిడ్ బీస్లీ ఈ హెచ్చరికలు జారీ చేశారు. డబ్ల్యూఎఫ్‌పీ ప్రకారం ప్రపంచంలోని 27 కోట్ల మంది ఆకలి వైపు పయనిస్తున్నారని, రానున్న ఏడాది తీవ్రమైన కరువు ఉండబోతుందని తెలిపారు. ప్రస్తుతం మహమ్మారి విజృంభణ వల్ల తలెత్తిన సంక్షోభం వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది అన్నారు. ఈ ఏడాది కరోనా నివారణకు 19 ట్రిలియన్ డాలర్ల వరకూ ఖర్చయిందని పేర్కొన్నారు. అయితే దీని ఫలితం వచ్చే ఏడాది దక్కే అవకాశాలు లేవని అన్నారు. ప్రపంచ వ్యవస్థ మరో మెట్టు దిగజారనుందని బీస్లీ హెచ్చరించారు.  

విజయశాంతి.. రెండోస్సారి!

అడవిఅక్క అద్భుతాలు సృష్టిస్తుందా?   ‘మళ్లీ పుట్టింటికి తిరిగి వచ్చినట్లుంది’.. ఇలాంటి పడికట్టు, రొటీన్ ప్రకటనలు పార్టీలు మార్చిన ప్రతివారూ ఇచ్చేదే. అందుకు మాజీ హీరోయిన్ విజయశాంతి మినహాయింపేమీ కాదు. ఒకప్పుడు బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి, తర్వాత కాంగ్రెస్‌లో తీర్థం తీసుకుని, మళ్లీ ఇప్పుడు కాషాయ కండువా కప్పేసుకున్న విజయశాంతి నుంచి.. బీజేపీ నాయకత్వం ఏం అద్భుతాలు ఆశిస్తుందన్నదే కమలనాధుల ఆశ్చర్యం.   ఆమె గతంలో కేసీఆర్ పదో చెల్లెలుగా.. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్‌గా.. తెలంగాణ భవన్‌లో ఒక సెపరేటు గది కూడా కేటాయించుకున్న మాజీ తెరాస నాయకురాలు. అప్పట్లో కేసీఆర్‌తో పొసగక, ఆయన పొడ గిట్టక పార్టీ నుంచి బయటొకొచ్చిన వీరనారి. అప్పటికే భాజపా నుంచి వచ్చిన ఆమె.. మచ్చుటగా తన మూడవ అడుగు కాంగ్రెస్‌లో వేశారు. రాహుల్‌బాబు సమక్షంలో పారీ కండువా వేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీకి ఆమెనే నాయకురాలు. ఇదీ క్లుప్తంగా విజయశాంతి గురించి అందరిటీ తెలిసిన ఇంట్రడక్షన్.   మరి ఆమె సేవ లను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వాడుకుందా అంటే లేదనే  చెప్పాలి. విజయశాంతి హీరోయిన్ అయినా.. తెరపై హీరోలకున్న ఇమేజ్ సాధించిన లేడీ హీరో. కాబట్టి సహజంగా హీరోలకుండే ఇగో, ఇతర గోరోజనాలన్నీ ఆమెకూ ఉంటాయి. తమను తాము హీరోలతోనే పోల్చుకుంటారు. సహజంగా సినిమా హీరోయిన్, సెలబ్రిటీ తమకు తాము ఎక్కువగానే ఊహించుకుంటారు. అక్కడి నుంచే అసలు సమస్య మొదలవుతుంది. కాంగ్రెస్ ఆల్రెడీ ఇలాంటి వారిని చరిత్రలో చాలామందిని చూసింది కాబట్టి, విజయశాంతిని కూడా లైట్ తీసుకుంది. అప్పటికీ అలిగిన ఆమెను ఏ ఢిల్లీ వాలాలో అప్పుడప్పుడు బుజ్జగిస్తుంటారు. ఆ రకంగా ఆమె ఇగోను చల్లబరిచి, పని అయిపోయిందనిపిస్తారు.   మరి ఇప్పుడు అలాంటి విజయశాంతి,  ‘రెండోస్సారి’ విజయవంతంగా కమల తీర్ధం పుచ్చుకున్నారు. దుబ్బాక నుంచి మొదలైన బీజేపీ విజయయాత్ర.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొనసాగినందున, ఆ ఊపును కొనసాగించేందుకు రాములమ్మ చేరిక కొంతవరకూ, ఇతర పార్టీల నేతల చేరికకు స్ఫూర్తిదాయకం కావచ్చు. కానీ.. ఇప్పుడు విజయశాంతితో బీజేపీకి వచ్చే అదనపు లాభమేమిటన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. గతంలో ఆమెను విద్యాసాగర్‌రావు పార్టీలో చేర్పించారు. బీజేవైఎంలో ఆమెకు జాతీయ హోదా పదవి కూడా ఇచ్చారు. మరెందుకో ఆమె ఎక్కువకాలం కమలంలో కొనసాగలేకపోయారు. అసలు బీజేపీ తత్వం తెలుసుకోకుండానే కండువా కప్పేసుకోవడమే ఆమె చేసిన పొరపాటన్నది ఆమె అనుచరుల ఆవేదన. ఎందుకంటే.. రేవంత్‌రెడ్డి చెప్పినట్లు... బీజేపీలో చేరికల వ్యవహారం గమ్మతుగా ఉంటుంది. తొలిరోజు వారికి నద్దా, అమిత్‌షా వంటి అగ్రనేతలే కండువా కప్పేస్తారు. అక్కడితో వారి వైభోగం ముగుస్తుంది. ఢిల్లీ నుంచి హైదరాబాదో, బెజవాడనో వచ్చిన తర్వాతనే వారికి సినిమా కష్టాలు మొదలవుతాయి. రాష్ట్ర నేతలెవరూ వారిని పట్టించుకోరు. సమాచారం ఇవ్వరు. పార్టీ ఆఫీసుకు వెళితే కనీసం కుర్చీ కూడా ఇవ్వరు. ఉత్సాహపడి ప్రెస్‌మీట్ పెడతామంటే అనుమతించరు. దానితో పార్టీలో ఎందుకు చేరామా అని తలపట్టుకోవలసి వస్తుంది. పాపం తలుపులు వేసుకుని ఏడవటం ఒక్కటే తక్కువ!   అటు వైపు ప్రముఖులకు తమ సెలబ్రిటీ హోదా గుర్తుకువస్తుంది. ఇటేమో పార్టీ ఆఫీసులోఅటెండరు కూడా పట్టించుకోని దయనీయం. నాగం జనార్దన్‌రెడ్డి అనే సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రంలో హవా సాగించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆయన చెప్పిందే శాసనం. బాబు సర్కారులో మూడు, నాలుగవ స్థానంలో ఉండేవారు. అలాంటి నేత బీజేపీలో చేరితే, పట్టించుకున్న దిక్కు లేదు. చివరకు ప్రెస్‌కాన్ఫరెన్స్‌ను ప్రెస్‌క్లబ్‌లో పెట్టుకోవాల్సిన దయనీయం. ఈ ఊపిరిరాడని, అవమానకర పరిస్థితికి తాళలేక, విధిలేక కాంగ్రెలో చేరాల్సి వచ్చింది.   ఇప్పుడు విజయశాంతి పార్టీలో చేరారు. ఆమె కంటే ముందుగానే... మరో సీనియర్ నటి కవిత బీజేపీలో చేరారు. ఆమెను పార్టీలో చేరాలని.. అప్పట్లో ఏపీ పార్టీ సంఘటనా కార్యదర్శిగా ఉన్న రవీంద్రరాజు, నేటి అధ్యక్షుడయిన సోమువీర్రాజు హైదరాబాద్ వచ్చి, ఆమెను కోరారు. రాష్ట్రంలో ఆమె పర్యటించడానికి, ఉండటానికి కావలసిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడయ్యారు. మరి తనకు ఇచ్చిన హామీ సంగతేమిటని కవిత ఇప్పటి అధ్యక్షుడికి ఫోన్లు చేస్తే ఆయన, ఆమె ఫోన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టారట. ఇప్పుడు ఆమెకు పార్టీలో ఏ హోదా లేదు. ఆమెకే కాదు. హైదరాబాద్‌లో ఉండే ఏపీ నేతలకెవరికీ పదవుల్లేవు. కానీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు. తర్వాత కవిత కు కన్నా రాష్ట్ర ఉపాధ్యక్షురాలి పదవి ఇచ్చారనుకోండి. అది వేరే విషయం.   ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనాచౌదరి, టిజి వెంకటేష్, సీఎం రమేష్‌ను రాష్ట్ర నాయకత్వం పట్టించుకునే దిక్కులేదు. వీరిలో సీఎం రమేష్ మాత్రమే, తన తెలివితో రాజ్యసభలో ఫ్లోర్ కోర్డినేషన్‌తో, ఇతర పార్టీలను సమన్వయం చేస్తూ, అమిత్‌షా గుడ్‌లుక్స్‌లో ఉన్నారు. అయినా ఆ ముగ్గురికీ రాష్ట్ర నాయకత్వం ఇసుమంత విలువ కూడా ఇవ్వడం లేదు. వారు మాత్రమే కాదు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిని అసలు పట్టించుకునే దక్కులేదు. అందులో కమ్మవారుంటే అసలు వారిని దగ్గరకే రానీయడం లేదు. పైగా.. వారిని సస్పెండ్లు చేస్తున్న వైచిత్రి.   తెలంగాణలోనూ దాదాపు అదే పరిస్థితి. తెలుగుదేశం-కాంగ్రెస్ నుంచి చేరిన వారంతా తొలిరోజు అగ్రనేతల వద్ద నవ్వుతూ కనిపిస్తారు. ఇక రెండో రోజు నుంచీ వారికి విషాదమే. టీడీపీలో ఎంపీగా ఉన్న గరికపాటి మోహన్‌రావుకు మళ్లీ ఎంపీ ఇస్తామన్న హామీతో పార్టీలో చేర్చుకున్నా, ఇప్పటికీ అతీగతీ లేదు. గ్రేటర్ ఎన్నికల ప్రచార కమిటీలో ఆయనకు కో కన్వీనర్ ఇచ్చి, ఆయన సిఫార్సు చేసిన కొంతమందికి సీట్లిచ్చారు. అది కొంతలో కొంత ఊరట. అన్ని వనరులు ఉన్నందున, ఆయనకు ఆ పాటి గౌరవమయినా దక్కింది. ఇక మిగిలిన వారి పరిస్థితి మరీ దయనీయం. మోత్కుపల్లి నర్శింహులు, పెద్దిరెడ్డి, బోడ జనార్దన్  వంటి మాజీ మంత్రులు, చాడ సురేష్‌రెడ్డి వంటి మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి అద్వానం. వారికి ఏ కమిటీలో చోటు లేదు.   ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా కొండవీటి చాంతాండత అవుతుంది. మరి వీరికే గతి లేనప్పుడు, కొత్తగా పార్టీలో చేరిన రాములమ్మ ఉద్ధరించేదేమిటన్నది ప్రశ్న. పైగా ఆమెకు ఇప్పుడు హీరోయిన్‌కున్న ఇమేజ్ లేదు. మునుపటి మాదిరిగా ఆమె ఇప్పుడు జనార్షణ నేత కూడా కాదు. స్వయంగా ఆమె పోటీ చేసిన చోటనే దారుణంగా ఓడిపోయింది కాబట్టి! ఈ మధ్య ఆమె కూడా ట్విట్టర్ రాణిగానే మారారు. ముద్ద ముద్దకు బిస్మిల్లా అన్నట్లు.. కాంగ్రెస్‌లో మాదిరిగా అలిగినా, బుజ్జగించేందుకు బీజేపీలో ఎవరూ ఉండరు. నలుగురితో పాటు నారాయణ మాదిరిగా ఉండాల్సిందే తప్ప, ఆమెకెలాంటి ప్రాధాన్యం ఉండదు.     మరి భవిష్యత్తులో విస్తరాకుల లెక్కకు ఆమెను చేర్చుకుందా?.. లేక పార్టీ విస్తరణకే రాములమ్మను పార్టీలో చేర్చుకుందా అన్నది కొద్దిరోజుల్లో తేలిపోతుంది. ఏదేమైనా.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అనే రెండు కిరాయి ఇళ్లు మారి, ఎట్టకేలకు సొంత గూటికి చేరిన రాములమ్మ సాహసాన్ని అభినందించాల్సిందే. కాకపోతే.. ఎలాగూ సొంత ఇంటికి ఎప్పుడైనా రావచ్చన్న నిజం తెలిసింది కాబట్టి, ఈ సొంత గూటిలో ఎన్నాళ్లు సర్దుకుంటారన్నదే ప్రశ్న.   -మార్తి సుబ్రహ్మణ్యం

టీపీసీసీ పదవికి తీవ్ర పోటీ! శ్రీధర్ బాబు కోసం కేసీఆర్ లాబీయింగ్!

వరుస పరాజయాలతో తెలంగాణ కాంగ్రెస్ లో నిస్తేజం అలుముకుంది. దుబ్బాక ఓటమితో ఢీలా పడిన హస్తం పార్టీ గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో మరింత కుదైలేంది. జీహెచ్ఎంసీ లో ఒకప్పుడు హవా చూపిన హస్తం పార్టీకి కేవలం ఆరు శాతం ఓట్లు రావడంతో.. ఆ పార్టీ పని అయిపోయినట్లననే చర్చ జరుగుతోంది. అయితే వరుస ఓటములతో అయోమయంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళనకు  హైకమాండ్ సిద్ధమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. ఆ పదవిలో కొత్త నేతను నియమించేందుకు రాహుల్ టీమ్ కసరత్తు చేస్తోంది. రేపో మాపో తెలంగాణకు కొత్త పీసీసీ పేరును ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.    తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి వినిపిస్తున్న నేతలపై కాంగ్రెస్ లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు పీసీసీ పదవి ఇస్తున్నారన్న వార్తలపై ఆ పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. శ్రీధర్ బాబుకు పీసీసీ పదవి దక్కేలా సీఎం కేసీఆర్ లాబీయింగ్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.  సీఎం కేసీఆర్ తో శ్రీధర్ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఇద్దరూ కలిసి చదువుకున్నారని చెబుతున్నారు. శ్రీధర్ బాబు భార్య శైలజా రామయ్యర్ తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆమె చేనేత, జాళీ శాఖ కమిషనర్ గా ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఆమెకు  అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం ఉంది. తమకు ఇబ్బంది ఉండదనే ఉద్దేశ్యంతోనే శ్రీధర్ బాబు పీసీసీ చీఫ్ గా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై శ్రీధర్ బాబు దూకుడుగా పోరాటం చేయలేరనే చర్చ కాంగ్రెస్ నేతల్లోనే జరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాలతో జోష్ మీదున్న బీజేపీని, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను.. రాజకీయాల్లో సైలెంట్ గా ఉంటారనే పేరున్న శ్రీధర్ బాబు ఎంతవరకు ఢీకొడతారన్నది అనుమానమే.    పీసీసీ చీఫ్ రేసులో తానే ముందున్నానని చెప్పుకుంటున్నారు భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అయితే కోమటిరెడ్డిపైనా కాంగ్రెస్ నేతలకు భరోసా కలగడం లేదని తెలుస్తోంది. కోమటిరెడ్డి సోదరులకు  కేసీఆర్ తో సన్నిహత సంబంధాలు ఉన్నాయంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పలు ప్రాజెక్టు పనులను కోమటిరెడ్డి సంస్థలు చేస్తున్నాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ తో సంబంధాలు ఉండటం వల్లే ఆయన సంస్థలకు కాంట్రాక్టులు వచ్చాయంటున్నారు. ప్రభుత్వ పనులు చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... కేసీఆర్ పై దూకుడుగా ముందుకు వెళ్లలేరనే చర్చ హస్తం నేతల నుంచే వస్తోంది. దీంతో పాటు కోమటిరెడ్డి సోదరులు బీజేపీ నేతలతోనూ టచ్ లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా పార్టీకి పెద్ద ప్రయోజనం ఉండదని గాంధీభవన్ లోనే గుసగుసలాడుకుంటున్నారట.    తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని పార్టీ కేడర్ నుంచి బాగా డిమాండ్లు వస్తున్నాయి. తన వాగ్దాటి, పంచ్ ప్రసంగాలతో ఆకట్టుకునే రేవంత్ రెడ్డే అయితేనే కాంగ్రెస్ బతుకుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. అయితే రేవంత్ కు పీసీసీ పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్లు పెదవి విరుస్తున్నారట. రేవంత్ రెడ్డికి ఇప్పటికి చంద్రబాబు మనిషిగానే ముద్ర ఉంది.ఆయనపై ఉన్న ఓటుకు నోటు కేసు ఇంకా విచారణలో ఉంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇస్తే..గతంలో టీడీపీలో పనిచేసిన నేతలంతా ఆయనకు మద్దతు ఇచ్చినా.. కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి ఆయనకు సహకారం లభించకపోవచ్చని భావిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి కాకుండా కొత్తగా వచ్చిన నేతలకు పీసీసీ పగ్గాలు ఇవ్వవద్దని కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వంటి నేతలు ఓపెన్ గానే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇస్తే పార్టీలో గ్రూప్ రాజకీయాలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన కొందరు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. తమకు కొరకరాని కొయ్యలా మారిన రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాకుండా గులాబీ బాస్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.    తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో పార్టీని గాడిలో పెట్టాలంటే అన్ని వర్గాలను కలుపుకుపోయే నేతకే పీసీసీ పగ్గాలు ఇవ్వాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. కొత్తగా పార్టీలో చేరిన వారు.. ప్రభుత్వంలో ఉన్న పార్టీతో లోపాయకారి ఒప్పందాలతో కాంట్రాక్టులు చేసుకునే వారు కాకుండా.. మొదటి నుంచి పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న నేతకు ఇస్తేనే బాగుంటుందనే కొందరు కొంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారట. టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాకా కొన్ని రోజులకే జరిగిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ కు మొదటి షాక్ ఇచ్చారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. అలాంటి నేతకు పీసీసీ ఇస్తే ఫర్వాలేదంటున్నారు. సుదర్శన్ రావు వంటి సీనియర్లు పీసీసీ పదవిని చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారు. సీనియర్ నేతకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తేనే గ్రూపు రాజకీయాలు లేకుండా పార్టీ ముందుకు పోయే అవకాశం ఉందని కాంగ్రెస్ అభిమానులు కోరుకుంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరీ...

అమిత్‌షా హవాను అడ్డుకున్న పద్మారావు

అమిత్ జీ ప్రచారం చేసిన రెండు చోట్లా ‘కమలవిలాపం’   మహానగరంలో మీసం మెలేసిన డిప్యూటీ స్పీకర్   తండ్రి విజయంలో భాగస్వాములైన తనయులు   చూడ్డానికి బక్క పలచగా.. నోట్లో పాన్‌తో.. మైకుల ముందు పెద్దగా మాట్లాడే అలవాటు లేని.. అసలు చూడ్డానికి నాన్ సీరియస్‌గా కనిపించే.. పబ్లిక్‌తో మజాక్ చేసే ఆ పురానా పహిల్వాన్.. తన కంటిచూపుతోనే దేశంలో అన్ని పార్టీలను వణికించే అమిత్‌షాకే ఝలక్ ఇచ్చారంటే ఎవరైనా నమ్మగలరా?.. నమ్మితీరాలి. ఎందుకంటే అంతపెద్ద దేశ్ కీ నేతా హవానే అడ్డుకుని, ఆయన ప్రచారం చేసిన రెండు డివిజన్లలో ‘కమలవిలాపానికి’ కారకులయ్యారు కాబట్టి! ఆయనే డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు!!   నిజం. దేశంలోనే అత్యంత శక్తివంతుడైన నేతగా పేరున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హవాను అడ్డుకుని, తన ఇలాకాలో కమలం వికసించకుండా, చక్రం తిప్పిన తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు, ఇప్పుడు మహానగరంలో.. టీఆర్‌ఎస్‌ను  మీసం మెలేసేంత గర్వపడే స్థాయికి తీసుకువెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నగరంలోని అన్ని నియోజకవర్గాలో కమలం ‘పువ్వు’ను నవ్వించగా, పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఒక్క సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాత్రమే కన్నీరు తెప్పించారు. మొత్తం ఐదు డివిజన్లలో ‘కారు’ను బ్రేకుల్లేకుండా నడిపి, సక్సెస్‌ఫుల్ రథసారధిగా అధిష్ఠానాన్ని మెప్పించారు.   ముఖ్యంగా..  కేంద్రమంత్రి, బీజేపీలో నెంబర్ టూ అమిత్‌షా సికింద్రాబాద్‌లో ప్రచారానికి వస్తున్నారన్న వార్త... కమలనాధుల్లో సమరోత్సాహం నింపగా, గులాబీ దళాల్లో గుండె దడపుట్టించింది. మరి అమిత్‌షాప్రచారానికి వస్తున్నారంటే మాటలా?  ఆయన ప్రచారానికి వస్తే, దాని ప్రభావం ఏ స్ధాయిలో ఉంటుంది? ఆయన ఇమేజ్ ఎంతమందిని ప్రభావితం చేస్తుంది? అది కదా అధికారపార్టీ శ్రేణుల అసలు కంగారు!   అనుకున్నట్లుగానే అమిత్‌షా ప్రచారం అదరహో అనిపించింది. మిగిలిన నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధులు, వారి అనుచరులతోపాటు.. మిగిలిన పార్టీల మాదిరిగానే ‘అనేక మార్గాల్లో’ కమలదళాలు చేసిన జనసమీకరణ.. ఫ్లెక్సీల హడావిడి. ఆ వాతావరణం చూసిన ఎవరికయినా, అమిత్‌షా ప్రచారం చేసిన ఆ రెండు చోట్ల మాత్రమే కాదు. సికింద్రాబాద్ మొత్తం కమలవికాసం ఖాయమన్న అభిప్రాయం ఏర్పడుతుంది. నిజంగా ‘ఆరోజు వరకూ’ అలాంటి వాతావరణమే కనిపించింది. ఏమాటకామాట. కమలదళాలు ఖర్చు కూడా ఆ స్థాయిలో చేశారు.   అయినా.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు అదరలేదు. బెదరలేదు. ప్రతి వ్యూహాలు పన్నలేదు. మళ్లీ అదే నాన్ సీరియస్‌గా కనిపించే ధోరణి. ఆయన  సైలెంట్ కిల్లర్ మాదిరిగా తన వ్యూహాలు అమలు చేశారు. రాత్రి వేళ పదిరెట్లకు మించి చేసే పాదరసం లాంటి వ్యూహాలకు ఊపిరిపోశారు. ఎందుకంటే పద్మారావు రాత్రి వేళలోనే ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి! ఎక్కడయితే అమిత్‌షా ప్రచారం చేశారో, అదే బౌద్ధనగర్-సీతాఫల్‌మండి డివిజన్లలో, చాపకింద నీరులా తాను అనుకున్న ప్రణాళిక అమలుచేశారు.   రెండు డివిజన్ల బాధ్యతలు తన కుమారులకే అప్పగించారు. తాను ఇంట్లో ఉండి సమన్వయం చేశారంతే! తండ్రి మార్గదర్శనం మేరకు,  తనయులు పాదరసంలా క్షేత్రస్థాయికి దూసుకుపోయారు. క్లీన్‌స్వీప్ చేసి తండ్రి పెదవులపై విజయదరహాసం పూయించారు.  ఆ రెండు డివిజన్లలోనే కాదు. సికింద్రాబాద్‌లోని అన్ని డివిజన్ల బాధ్యతలూ పద్మారావు తనయులే మోశారు.   ఫలితంగా... అమిత్‌షా ఆర్భాటంగా ప్రచారం చేసిన ఆ రెండు డివిజన్లలో బీజేపీ ఓడిపోగా, ‘కారు’ పరుగులు తీసింది. నిజానికి ఆ రెండూ ‘కారు’ కాకుండా ‘కమలం’ ఖాతాలో కలవాల్సిన డివిజన్లు! అలాంటి పరిస్థితిని తల్లకిందులు చేసి, అమిత్‌షాకు ‘చేదుగుర్తు’ మిగిల్చిన పద్మారావు..  నియోజకవర్గంపై తనకున్న పట్టు-పలుకుబడిని మరోసారి చాటుకున్నారు. దటీజ్ పద్మారావు! -మార్తి సుబ్రహ్మణ్యం