ఎన్నికలపై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం! గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖాస్త్రం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జగన్ సర్కార్ కు మరోసారి షాకిచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించేది లేదని  అసెంబ్లీలో  తీర్మానం చేయడంపై ఆయన సీరియస్ స్పందించారు. అసెంబ్లీ తీర్మానాన్ని తిరస్కరించాలని గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు నిమ్మగడ్డ రమేష్‌ లేఖ రాశారు. ఎన్నికల వ్యవహారంలో అవసరమైతే సుప్రీం కోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలని గవర్నర్‌ను కోరారు.  స్థానిక ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో నిమ్మగడ్డ రమేష్ చెప్పారు. రాజ్యాంగంలోని 243కే అధికరణ కింద ఎన్నికల కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి ఉందన్న నిమ్మగడ్డ.. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం కమిషన్‌ విధి అని స్పష్టం చేశారు..    ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాన అధికారాలు ఉన్నాయని గవర్నర్‌కు రాసిన లేఖలో నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని గవర్నర్ కు రాసిన  లేఖలో నిమ్మగడ్డ రమేష్ వివరించారు. ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని, అలాంటి ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించాలని గవర్నర్ ను కోరారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయనిపుణులను సంప్రదించాలని  లేఖలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.   ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై  జగన్ సర్కారుకు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మధ్య చాలా కాలంగా వివాదం జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ ప్రయత్నిస్తుండగా, జగన్ సర్కారు మాత్రం ఇప్పట్లో కుదరదని తేల్చి చెబుతోంది. స్థానిక ఎన్నికల పంచాయితీ రాష్ట్ర హైకోర్టులో కూడా నడుస్తోంది. ఇదిలా ఉండగానే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేమంటూ  శుక్రవారం అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం తీర్మానం చేయడం వివాదంలో మరింత హీట్ పెంచింది. జగన్ సర్కార్ నిర్ణయంపై వెంటనే స్పందించి గవర్నర్ కు లేఖ రాశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.  ఎస్ఈసీ లేఖపై గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

కేసీఆర్, ఒవైసీ కలిసి బిర్యానీ తిన్నారు: కిషన్ రెడ్డి

2023లో తెలంగాణలో బీజేపీదే అధికారమన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ విజయాన్ని కేసీఆర్, ఒవైసీ అడ్డుకోలేరన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి... టీఆర్ఎస్, ఎంఐఎంపై ఘాటు విమర్శలు చేశారు. పాతబస్తి ప్రజల్లో  ఎంఐఎం అధినేత ఒవైసీ పట్ల వ్యతిరేకత కనిపించిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు బీజేపీని ఆశీర్వదించి 48 సీట్లు ఇచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మినీ తెలంగాణ అని... ఇక్కడి ఫలితాలు రాష్ట్రమంతా వస్తాయని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్, ఒవైసీ ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేశారని.. ఇద్దరూ కలిసి కేసీఆర్ నివాసంలో బిర్యానీ తిన్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా

వైసీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. గత జులైలో తనకు కరోనా సోకిందని, కొన్నిరోజులకే కోలుకున్నానని అన్నారు. నిన్న అసెంబ్లీలో నిర్వహించిన కోవిడ్ టెస్టులో మరోసారి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. రీ ఇన్ఫెక్షన్‌కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. అభిమానుల ఆశీస్సులతో కరోనాను మరోసారి జయించి వస్తానని అంబటి ధీమా వ్యక్తం చేశారు.    కాగా, అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటివరకు ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధారణ అయింది. మూడ్రోజుల కిందట తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకి కరోనా అని నిర్ధారణ అవ్వగా తాజాగా అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ గా తేలింది.

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి! జాతీయ కమిటిలోకి సీనియర్లు 

దుబ్బాక అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఢీలా పడిన తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళనకు హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. ఆ పదవిని ఫైర్ బ్యాండ్ లీడర్ కు ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించిందని సమాచారం. పార్టీలోని మెజార్టీ నేతలు, కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై పీసీసీ పగ్గాలు ఇస్తారని గాంధీభవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది. రెండు రోజులుగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేయడంతో.. హైకమాండే అతన్ని పిలిపించినట్లు చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయిందని, అధికారిక ప్రకటన రావడమే మిగిలి ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.    కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పుట్టిన రోజైన ఈ నెల 9న రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తికే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పీసీసీ రేసులో ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబులకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, హనుమంతరావు, జానారెడ్డికి జాతీయ కమిటిలో పదవులు ఇస్తారని చెబుతున్నారు. తెలంగాణ నేతలకు ఇచ్చే పదవులపై హైకమాండ్ నుంచి అందరికి సమాచారం వచ్చిందని, హైకమాండ్ అదేశాలతోనే పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారని తెలుస్తోంది.    వాస్తవానికి గత నెలలోనే పిసిసి చీఫ్ పదవిని రేవంత్ రెడ్డి ఇవ్వాలని నిర్ణయించారట. తన ప్రసంగాలు, పోరాటాలతో కేడర్ లో జోష్ నింపడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనే సామర్థం రేవంత్ రెడ్డికే ఉన్నాయని పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ గతంలోనే రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇచ్చారని చెబుతున్నారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ జరిగే అవకాశం ఉండటంతో ప్రకటన ఆపివేశారని చెబుతున్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే  జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోతే మొదటలోనే అపవాదు వచ్చే అవకాశం ఉంటుందని  హైకమాండ్ భావించినట్లు సమాచారం.   రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇప్పుడు ముళ్ల కిరీటమని రాజకీయ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. వరుస ఓటములతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఢీలా పడింది. రాజకీయ భవిష్యత్ పై భరోసా లేక నేతలు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కూడా ఎవరి దారి వారి చూసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల కోసం కమల దళం గాలం వేసి కూర్చుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను మళ్లీ బలోపేతం చేయడం అంత ఈజీ కాదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా కాపాడుకుంటూ, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం నింపుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలను ఎదుర్కొవాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డికి. పీసీసీ పగ్గాలు చేపడితే త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఆయన సత్తాకు పరీక్షగా నిలవనుంది.

ఈనెల 7న బీజేపీలోకి జానారెడ్డి! నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ?  

దుబ్బాకలో కారుకు ధూంధాంగా దెబ్బేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీకి గ్రేటర్ ఝలక్ ఇచ్చింది. ఇప్పుడు నాగార్జున సాగర్ పై నజర్ పెట్టింది బీజేపీ. మూడునాలుగు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ అధికార పార్టీకి షాకిచ్చేందుకు అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టింది. కేసీఆర్ కు వరుసగా మూడోసారి ముచ్చెటమలు పట్టించేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది కమలం దళం.    తెలంగాణాలో అధికారం కోసం తహతహలాడుతున్న బీజేపీ.. దుబ్బాక బైపోల్, జిహెచ్ఎంసి ఎన్నికల విజయాలతో మరింత దూకుడు పెంచింది. వివిధ పార్టీల్లోని సీనియర్లు, బలమైన నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తూనే త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ చేసిన మంత్రాంగం ఫలించడంతో  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో ఉన్న జానారెడ్డితో బీజేపీ అగ్ర నాయకత్వం టచ్‌లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. కమలనాధులు ఇచ్చిన  ఆఫర్‌కు జానారెడ్డి కూడా సరే అన్నట్లుగా సమాచారం. ఈనెల 7 న ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనేతల సమక్షంలో జానా రెడ్డి కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది.   నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ తరుఫున జానా రెడ్డి  బరిలోకి దిగనున్నట్లుగా తెలుస్తోంది. కొంత కాలంగా రాజకీయ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జానారెడ్డి..  నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ద్వారా మళ్ళీ యాక్టివ్ కావాలని నిర్ణయించినట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. నాగార్జున సాగర్ లో బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో నిలపాలని బీజేపీ నేతలు యోచిస్తున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.  రఘువీర్‌రెడ్డితో తెలంగాణ  బీజేపీ నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, టికెట్‌ ఆఫర్‌ చేశారని వార్తలు వచ్చాయి. బీజేపీ నాయకురాలు డీకే అరుణతో రఘువీర్ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం నాగార్జున సాగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జానా రెడ్డే పోటీ చేస్తారని చెబుతున్నారు.   దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంతో పోలిస్తే నాగార్జున సాగర్ పూర్తిగా భిన్నం. ఇక్కడ బీజేపీ బలం అంతంతమాత్రమే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బీజేపీ ఇంత వరకు ఎమ్మెల్యే, ఎంపీ సీటు గెలవలేదు. నల్గొండ జిల్లాలోని మిగితా ప్రాంతాల కంటే నాగార్జున సాగర్ సెగ్మెంట్ లోనే  బీజేపీ పూర్ గా ఉందని చెబుతున్నారు. హాలియా పట్టణంతో పాటు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లోనే కొంత బీజేపీ బలంగా ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంకణాల నివేదితా రెడ్డికి కేవలం 2 వేల 675 ఓట్లు వచ్చాయి. అందుకే జానారెడ్డికి కమలం పార్టీ గాలం వేశారని చెబుతున్నారు. జానారెడ్డి పోటీ చేస్తే సాగర్ లో గెలవడం ఈజీ అవుతుందని బీజేపీ భావిస్తోంది.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంచి పట్టున్న జానారెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా అనుచర గణం ఉంది.బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడం అదనపు బలం అవుతుందని బీజేపీ అంచనా వేస్తోంది.    నాగార్జున సాగర్  నియోజకవర్ం గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. ఇక్కడి నుంచి తొమ్మిది సార్లు పోటీ చేసిన  జానారెడ్డి ఏడు సార్లు గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నాగార్జునసాగర్‌ స్థానానికి తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో జానారెడ్డి గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీపీఎం నుంచి టీఆర్‌ఎస్ లో చేరిన నోముల నర్సింహయ్య 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసినా జానారెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నోముల నర్సింహయ్య 7,771 ఓట్ల మెజారిటీతో జానారెడ్డిపై సంచలన విజయం సాధించారు.

ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ కనుమరుగే: సోము వీర్రాజు

దేశంలో బీజేపీ మినహా అన్ని పార్టీల్లో కుటుంబ పాలన ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చాక అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ ఇచ్చారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన సోము వీర్రాజు.. గత టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. 7 వేల 200 కోట్ల రూపాయలు తీసుకుని చంద్రబాబు.. 4 తాత్కాలిక బిల్డింగులు కట్టారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్‌, టీడీపీ కనుమరుగవుతాయన్న వీర్రాజు..  జనసేన- బీజేపీ, వైసీపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి  రావడం ఖాయమన్నారు సోము వీర్రాజు.

కారు కొంప ముంచిన ఎల్ఆర్ఎస్! సీఎం హిట్ లిస్టులో సీఎస్ సోమేష్?

టీఆర్ఎస్ నేతలు భయపడినట్లే జరిగిందా? ధరణి వెబ్ సైటే కారుకు బ్రేకులు వేసిందా? లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమే కమలానికి బూస్ట్ ఇచ్చిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే స్పష్టమైందని తెలుస్తోంది. గ్రేటర్ ఫలితాలపై విశ్లేషించుకున్న టీఆర్ఎస్ నేతలు కూడా ఎల్ఆర్ఎస్, ధరిణి వెబ్ సైట్ అంశాలు ఓటింగులో తీవ్ర ప్రభావం చూపాయనే అంచనాకు వచ్చారట. గులాబీ బాస్ కేసీఆర్ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారంటున్నారు. అందుకే ఆయన ధరణి వెబ్ సైట్, ఎల్ఆర్ఎస్ ప్రతిపాదన తెచ్చిన సీఎస్ సోమేష్ కుమార్ పై ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. సీనియర్లను కాదని నమ్మకంతో తెచ్చుకుంటే.. ప్రభుత్వానికి ప్రజల్లో చెడ పేరు రావడానికి కారణమయ్యారనే నిర్ణయానికి సీఎం వచ్చినట్లు తెలుస్తోంది. సీఎస్ ను మార్చే అవకాశముందని కూడా ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో కారు పార్టీ ఖాతానే తెరవలేదు. ఈ నియోజకవర్గాల పరిధిలోని 18 డివిజన్లలోనూ ఘోరంగా ఓడిపోయారు టీఆర్ఎస్ అభ్యర్థులు. ఉప్పల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓటమికి ఎల్ఆర్ఎసే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇక్కడ ఉండేవారంతా ఎల్ఆర్ఎస్ సమస్యను ఫేస్ చేసినవారేనంటున్నారు. శివారు ప్రాంతాల్లో రియల్ వ్యాపారం చేసే వారంతా  ఎల్బీనగర్ ఏరియాలోనే ఉంటారు. ధరణి వెబ్ సైట్ కోసం రెండు, మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది ప్రభుత్వం. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ఆర్ఎస్ స్కీంతో గతంలో జరిగిన ల్యాండ్ విక్రయాలు ఇబ్బందుల్లో పడ్డాయట. సర్కార్ స్పష్టించిన ఈ కొత్త సమస్యలతో వారంతా కేసీఆర్  పై కసిగా ఉన్నారంటున్నారు.  అదంతా గ్రేటర్ ఫలితాల్లో కనిపించిందని చెబుతున్నారు.    వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కామన్ ఫ్లాట్‌ఫాంగా ధరణిని రూపొందించాలని ప్రభుత్వం భావించింది. ఈ టాస్కును సీఎస్ చేపట్టారు. ఎల్ఆర్ఎస్ , ధరణి వెబ్ సైట్ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ కు సీఎస్ సోమేష్ కుమారే చెప్పినట్లు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ద్వారా ఆదాయం పెరుగుతుందని, ధరణి ద్వారా దేశంలోనే ఆదర్శనీయంగా ఉండే నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టవచ్చని సీఎస్ కల్పించిన విశ్వాసంతో సీఎం ముందడుగు వేశారని చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 20 వేల కోట్ల మేర అదనపు ఆర్థిక వనరులు సమకూరే అవకాశం ఉందని సీఎంకు సీఎస్ సోమేష్ ప్రతిపాదించారని అంటున్నారు. అంతేకాదు ధరణి వెబ్‌సైట్ రూపకల్పన మొదలు ట్రయల్ రన్ వరకు అంతా సీఎసే చూసుకున్నారు. రెవెన్యూ ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయం వచ్చినా వెనక్కు తగ్గలేదు. ఎల్ఆర్ఎస్ ప్రకటించిన తర్వాత విపక్షాల నుంచే కాక ప్రజల నుంచి కూడా ఊహించని వ్యతిరేకత వచ్చింది. అయినా ప్రభుత్వం ముందుకే పోయింది. ధరణి కోసం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా నిలిచిపోయింది. ప్రజలు కూడా వివిధ అవసరాల కోసం ఆస్తుల్ని అమ్ముకోవడం, భూమిని వదులుకోవాల్సి రావడం లాంటి పనులకు  బ్రేక్ పడింది.    ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం అని భావించిన ధరణి కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పటికి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాలేదు. ఇలా ఉండగానే ఎల్ఆర్ఎస్ తేవడంతో ప్రజలకు మరింత కష్టమైంది. కరోనా సమయంలో ఆదాయం తగ్గిపోవడంతో  పొదుపు మంత్రం పాటిస్తున్న సమయంలో ఎల్ఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం ప్రజల అసహనానికి కారణమైంది. చివరకు అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీసింది. దీంతో ధరణితో ఆశించిన ఫలితం రాకపోగా.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. దీంతో ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించిన ఎల్ఆర్ఎస్, ధరణి ప్రాజెక్టులు ఫెయిల్యూర్ అనే అభిప్రాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినట్లు తెలిసింది. నమ్మకంతో సీఎస్ గా నియమిస్తే ఆయన ఆశించిన మేరకు పని చేయలేకపోయారని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా కొత్త చట్టాలను చేసినా సంతృప్తికర ఫలితాలు రాలేదన్న అసంతృప్తిలో ఉన్న సీఎం.. సీఎస్ పై కోపంగా ఉన్నారని  సమాచారం.  ఈ విషయం ఉద్యోగ సంఘాల ప్రతినిధుల వరకూ చేరింది. దీంతో వారు తదుపరి సీఎస్ ఎవరవుతారో అని  కూడా చర్చించుకుంటున్నారయట.

ఢిల్లీ వెళ్లనున్న బండి సంజయ్.!

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు(ఆదివారం) ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల వివరాలను బీజేపీ జాతీయ నేతలకు బండి సంజయ్ వివరించనున్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రులు ప్రకాష్ జావడేకర్, స్మృతీ ఇరానీ సహా పలువురు నేతలను కలిసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది.   కాగా, 150 స్థానాలున్న గ్రేటర్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అధికార పార్టీ టీఆర్ఎస్ కి 55 స్థానాలు వస్తే, బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 48 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, 44 సీట్లతో ఎంఐఎం మరోసారి సత్తా చాటింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై జాతీయ నేతలతో బండి సంజయ్ చర్చించే అవకాశముందని తెలుస్తోంది.

వైసీపీలో చేరిన జనసేన ఎమ్మెల్యే కుమారుడు

జనసేన ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీ మద్దతుగా నిలుస్తున్న రాపాక వరప్రసాద్ మరో అడుగు ముందుకేశారు. తమ కుమారుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్ రామ్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి  జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి రాపాక వరప్రసాద్ గెలుపొందారు.  జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. అయితే  జనసేన కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అంతేకాదు  ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ జగన్‌పై  ప్రశంసల జల్లు కురిపించారు రాపాక వరప్రసాద్. వైసీపీకి పూర్తి అనుకూలంగా ఉంటున్నా ఆయన పార్టీ మాత్రం మారలేదు. సాంకేతికంగా జనసేన ఎమ్మెల్యేగా కొనసాగనున్న రాపాక వరపస్రాద్ పార్టీ మారితే చిక్కులు రాకుండా ఉండేందుకే అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోవడం లేదని చెబుతున్నారు.

రెండు పార్టీలు కలిస్తేనే మేయర్! ఎంఐఎం, బీజేపీ కలిసేనా?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితం వచ్చింది. ఎవరి అంచనాలకు అందకుండా హంగ్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. సెంచరీ ఖాయమని ప్రకటించిన టీఆర్ఎస్ అంచనాలు తలకిందులై.. 55 సీట్లకే పరిమితమైంది. టీఆర్ఎస్ లీడ్ లో ఉన్న మరో డివిజన్ ఫలితం ఇంకా ప్రకటించాల్సి ఉంది. బీజేపీ 48 డివిజన్లతో రెండో ప్లేస్లో నిలవగా.. ఎంఐఎం 44, కాంగ్రెస్ రెండు సీట్లు సాధించాయి. సింగి ల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా మేయర్ పీఠానికి అవసరమైన మేజిక్ ఫిగర్ మాత్రం క్రాస్ చేయలేకపోయింది కారు పార్టీ. మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో పార్టీ మద్దతు తప్పనిసరి. దీంతో గ్రేటర్ మేయర్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. ఎంఐఎంతో  టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందా..?  లేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది.    రూల్స్ ప్రకారం మేయర్ ఎన్నిక కోసం మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికి కంటే ఎక్కువ మంది మద్దతు కావాలి. ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉండే స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలకూ మేయర్ ఎన్నికలో ఓటేసే హక్కు ఉంటుంది. ఈ ఎక్స్ అఫీషియో మెంబర్లనూ కలిపి మొత్తం ఓట్ల సంఖ్యను నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి జీహెచ్ఎంసీలో 194 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన మేయర్ సీటు కోసం మేజిక్ ఫిగర్ 98. కానీ టీఆర్ఎస్ కు ఇప్పుడు 87 మంది ఓటర్లున్నారు. ఇందులో 56 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో మెంబర్లు. అంటే మేయర్ సీటు గెలుచుకునేందుకు టీఆర్ఎస్ కు  ఇంకా 12 ఓట్లు కావాలి. మేయర్ రేసులో  బీజేపీ అవకాశాలను పరిశీలిస్తే.. 48  స్థానాల్లో గెలిచినా ఇంకా యాభై మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఆ పార్టీకి అవసరం. కానీ బీజేపీకి ఎంపీ కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ , ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాత్రమే  ఎక్స్ అఫిషియేలుగా ఉన్నారు. మజ్లిస్ లెక్కలను చూస్తే .. ఆ పార్టీ 44 డివిజన్లు గెలిచింది. 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో ఎంఐఎం బలం 53గా ఉంది. మేయర్ కోసం  ఇంకా ఆ పార్టీకి 45 ఓట్లు కావాలి.     ఈ మూడు పార్టీల్లో ఏదైనా మరో పార్టీ మద్దతు తీసుకోవడం గ్రేటర్ మేయర్ ఎన్నికకు అనివార్యంగా మారింది. అయితే ఏ రెండు పార్టీలు కలుస్తాయన్నది సస్పెన్స్ గా మారింది. మజ్లిస్, బీజేపీ కలిసే అవకాశం దాదాపుగా ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్, బీజేపీలు మేయర్ పీఠాన్ని పంచుకునే ఛాన్సే లేదు. దీంతో మజ్లిస్, టీఆర్ఎస్ కలవడం ఒక్కటే మార్గం. మజ్లిస్ పార్టీ నేరుగా సపోర్ట్ చేయడమో, ఓటింగ్ కు హాజరుకాకుండా ఉండటమో చేస్తే…టీఆర్ఎస్ మేయర్ సీటును గెలుచుకునే చాన్స్ ఉంటుంది. మజ్లిస్ సహకారంతో టీఆర్ఎస్ మేయర్ పదవి తీసుకుని.. ఆ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్ నేరుగానే మజ్లిస్ సహకారం తీసుకుంది. నిజామాబాద్ లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. బీజేపీ 28 డివిజన్లలో గెలిచి సింగి ల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. టీఆర్ఎస్ 13, ఎంఐఎం 16, కాంగ్రెస్ 2, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. మజ్లిస్ హెల్ప్ తో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్ల  ఓట్లతో  మేయర్ పదవిని దక్కించుకుంది టీఆర్ఎస్. నిజామాబాద్ తరహాలోనే జీహెచ్ఎంసీలో  ఎంఐఎం మద్దతు తీసుకుంటుందా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.    జీహెచ్ఎంసీ మేయర్ సీటు కోసం టీఆర్ఎస్ నేరుగా మజ్లిస్ సాయం తీసుకునే చాన్స్ తక్కువగా ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా సహకారం తీసుకుంటే బీజేపీ నుంచి, ప్రజల నుంచి విమర్శలు వస్తాయని అధికార పార్టీ భయపడుతుందట. ఎంఐఎంతో తమకెలాంటి సంబంధం లేదని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పిన టీఆర్ఎస్... మేయర్ పీఠం కోసం ఆ పార్టీతో జతకడితే బీజేపీ చేతికి మరో అస్త్రం చిక్కినట్లవుతుంది అంటున్నారు. అటు ఎంఐఎం కూడా టీఆర్ఎస్‌కు ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ప్రకటిస్తుందా లేక మేయర్ సీటును చెరో రెండేళ్లు పంచుకుందామన్న ప్రతిపాదన తీసుకొస్తుందా అన్నది తేలాల్సి ఉంది. మేయర్ ఎన్నిక రోజు మజ్లిస్ ఓటర్లు కొందరు దూరంగా ఉండటమో, ఎన్నికను బాయ్ కాట్ చేయడమో జరిగేలా ఆ పార్టీతో అవగాహన కుదుర్చుకునే చాన్స్ కూడా ఉందని చెప్తున్నారు. అయితే మరో రెండు నెలల వరకు ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలికి గడువుంది. అంతవరకు వేచి చూసే దోరణిలో అధికార పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. గ్రేటర్ ఫలితాల తర్వాత మాట్లాడిన మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయం చెప్పారు.

ఆ కాంగ్రెస్ సీనియర్ నేత బీజేపీలోకి.. మరో ఎన్నికకు సిద్ధం అవుతున్న కమలదళం 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో కాషాయ జెండా ఎగరేయాలని తహతహలాడుతున్న బీజేపీ దుబ్బాక ఉపఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికలలో సాధించిన వరుస విజయాలతో మరింత దూకుడు పెంచింది. అందులో భాగంగానే వివిధ పార్టీల్లోని సీనియర్లు, ద్వితీయ శ్రేణి నేతలను తమవైపు తిప్పుకొని, అధికార పీఠానికి చేరువయ్యేలా బీజేపీ వ్యూహకర్తలు ప్లాన్ సిద్ధం చేశారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిని బీజేపీ లో చేర్చుకునే ప్రయత్నాలు షురూ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కేరళలో ఉన్న జానారెడ్డితో బీజేపీ నాయకత్వం ఇప్పటికే టచ్‌లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. బీజేపీ ఇచ్చిన ఆఫర్‌కు జానారెడ్డి కూడా సరే అన్నట్లుగా సమాచారం. దీంతో ఈనెల 7 న ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ఒక జాతీయ మీడియా కథనం. అంతేకాకుండా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ తరుఫున అయన బరిలోకి దిగనున్నట్లుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా అటు రాజకీయ పరంగా గానీ, ఇటు పార్టీ కార్యకలాపాల పరంగా కూడా ఎక్కడా కనపడని జానారెడ్డి..  నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ద్వారా మళ్ళీ తిరిగి క్రియాశీలం కావాలని నిర్ణయించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

బీజేపీకి షాకిచ్చిన అమరావతి అంశం! సెటిలర్ల ఏరియాలో కారు విజయం 

తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా చర్చగా మారిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుహ్యా ఫలితాలు సాధించింది బీజేపీ. ఒక రకంగా  జీహెచ్ఎంసీలో సాఫ్రాన్ స్ట్రైక్ జరిగిందనే చెప్పుకోవాలి. గత గ్రేటర్ ఎన్నికల్లో కేవలం నాలుగు డివిజన్లు గెలిచిన కమలం పార్టీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కారు పార్టీని కంగు తినిపిస్తూ.. ఈసారి అంతకు  పది రెట్ట కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. ఏ సర్వే సంస్థ అంచనాకు అందకుండా,  ఎవరూ  ఊహించని విధంగా గ్రేటర్ లో సంచలం చేసిన బీజేపీ.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పూర్తిగా చతికిలపడింది. ఎల్బీనగర్ జోన్ లో స్వీప్ చేసిన కమలం.. కూకట్ పల్లి, శేరి లింగం పల్లి జోన్లలో మాత్రం కారుకు పార్టీ ముందు నిలవలేకపోయింది. ఇదే ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది.    ఆంధ్రా ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి, శేరి లింగం పల్లి నియోజకవర్గాల్లో  ఏపీ రాజధాని అమరావతి అంశం ఎన్నికల్లో ప్రభావం చూపించిందంటున్నారు. అదే బీజేపీకి మైనస్ గా మారిందంటున్నారు. అమరావతిపై బీజేపీ హైకమాండ్ తీరుతో పాటు కొందరు ఏపీ బీజేపీ నేతల వ్యవహార శైలిపై సెటిలర్లు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్జి వంటి లీడర్లు చేస్తున్న పూటకో ప్రకటనలపై  ఆంధ్రా ఓటర్లు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ లీడర్లే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడం తెలంగాణ బీజేపీకి శాపంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. సోము వీర్రాజు బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడంతో.. ఆయనపై వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నవారంతా కారు పార్టీ వైపు మళ్లినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి బీజేపీకి ఓటేయాలని డిసైడైన వారు కూడా సోము వీర్రాజు ప్రచారం తర్వాత తమ మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన తెలంగాణ బీజేపీ నేతలు కూజా ఇదే అభిప్రాయానికి వచ్చారట. సోము వీర్రాజు ప్రచారంతో 10 నుంచి 15 సీట్లు కోల్పోయామని చెబుతున్నారని తెలుస్తోంది.     గ్రేటర్ ఎన్నికల్లో కూకట్ పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో మొత్తం 35  డివిజన్లు ఉన్నాయి.  కూకట్ పల్లి, శేరి లింగం పల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెర్వు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లు ఇందులో ఉన్నాయి. ఏపీ ఓటర్లే  ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేస్తుంటారు.  ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు  కూకట్ పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, హఫీజ్ పేట ప్రాంతాల్లో ప్రచారం చేశారు. గ్రేటర్ ఫలితాల్లో మాత్రం ఇక్కజ బీజేపీ పూర్తిగా చతికిలపడింది. కూకట్ పల్లి జోన్ లో 22 డివిజన్లు ఉండగా బీజేపీ ఒక్క డివిజన్ మాత్రమే గెలిచింది. శేరిలింగం పల్లి జోన్ లో 13కు  ఒక్కటే గెలిచింది.  గచ్చిబౌలి , మూసాపేట లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. ఈ రెండు డివిజన్లలోనూ తక్కువ మెజార్టీతోనే గట్టెక్కారు కమలం అభ్యర్థులు. 2016 ఎన్నికల్లో సెటిలర్స్ గంపగుత్తగా టీఆర్ఎస్​కు ఓటేశారు. కాని ఈసారి కొంత మార్పు రావచ్చని ప్రచార సమయంలో కనిపించింది. అయితే సోము వీర్రాజు బీజేపీ తరపున ప్రచారం చేయడంతో సీన్ పూర్తిగా మారిపోయిందంటున్నారు. అమరావతిపై ఆయన చేస్తున్న పూటకో ప్రకటనలే ఇందుకు కారణమంటున్నారు.    గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనూ అమరావతి కీలకంగా మారింది. కూకట్ పల్లి, శేరిలింగం పల్లి, ఏఎస్ రావు నగర్, సనత్ నగర్, దిల్ షుక్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో.. ఓట్ల కోసం తమ దగ్గరకు వచ్చిన  బీజేపీ నేతలను అమరావతి పై ప్రశ్నించారు కొందరు ఆంధ్రా ఓటర్లు. అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలనే విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని కోరారట. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే  ఉంటుందని ప్రధాని మోడీ ప్రకటన చేస్తే తామంతా గంప గుత్తగా ఓట్లు వేస్తామని కూడా కొందరు అంధ్రా ఓటర్లు బీజేపీ నేతలకు చెప్పారంటున్నారు. ఆంధ్రా ఓటర్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గ్రేటర్ బీజేపీ అభ్యర్థులు  ముఖం చాటేశారని తెలుస్తోంది. అమరావతి మద్దతుగా కేంద్రం నుంచి  ప్రకటన వస్తేనే తాము సపోర్ట్ చేస్తామని కొందరు సెటిలర్ ఓటర్లు కమలం నేతల ముఖాల మీదనే నేరుగా చెప్పేసినట్లు చెబుతున్నారు. అమరావతి విషయంలో బీజేపీ తీరుపై ఆంధ్రా ఓటర్లు ఇంత ఆగ్రహంగా ఉండగా.. వాళ్ల దగ్గరే అమరావతిపై గందరగోళ ప్రకటనలు చేసే సోము వీర్రాజు ప్రచారం చేయడం తెలంగాణ బీజేపీకి మరింత ఇబ్బంది కల్గించిందంటున్నారు. ఈ ప్రభావం గ్రేటర్ ఫలితాల్లో  స్పష్టంగా కనిపించింది.    గ్రేటర్ హైదరాబాద్ లో సోము వీర్రాజు ప్రచారం చేయకపోతే బీజేపీకి మరింతగా మంచి ఫలితం వచ్చేదనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్, హబ్సిగూడ, వనస్తలిపురంలో బీజేపీ హవా చూపి.. కూకట్ పల్లిలో ఫెయిల్ కావడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఎల్బీనగర్ జోన్ లో 11 డివిజన్లు ఉండగా.. అన్ని గెలిచి కమలం స్వీప్ చేసింది. ఆంధ్రా ఓటర్ల ప్రభావం ఉండే హబ్సిగూడ, మల్కాజ్ గిరి ప్రాంతాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. వీర్రాజు ప్రచారానికి రాకుంటే కూకట్ పల్లి ఏరియాలోనూ బీజేపీ స్వీప్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. సోము వీర్రాజు లాంటి నేతలతో పార్టీకి నష్టమనే అభిప్రాయం బీజేపీలో చాలా కాలంగా ఉంది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలతో మరోసారి తేలిపోయింది. ఏపీలో పార్టీని పాతాళానికి తొక్కుతున్న సోము వీర్రాజు.. హైదరాబాద్ వెళ్లి అక్కడ పార్టీకి నష్టం కల్గించారనే చర్చ బీజేపీ నేతల్లోనే జరుగుతోందట.

గ్రేటర్ చిత్రం.. తల్లిని ఓడించిన కొడుకు

'శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్ళ రూపంలో మన ఇంట్లోనే ఉంటారు' అని 'అఆ' సినిమాలో రావు రమేష్ అంటాడు. ఇప్పుడు ఇదే డైలాగ్ ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ టీఆర్ఎస్ అభ్యర్థి మరోలా అనుకుంటున్నారు. అదేంటంటే.. 'శత్రువులు ఎక్కడో ఉండరు.. కొడుకుల రూపంలో మన ఇంట్లోనే ఉంటారు'. పాపం ఆ టీఆర్ఎస్ అభ్యర్థి అలా ఎందుకు అనుకోవాల్సి వచ్చిందో తెలియాలంటే జరిగిన విషయం తెలుసుకోవాలి.   హయత్‌నగర్‌ సర్కిల్‌ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ముద్దగౌని లక్ష్మీప్రసన్నగౌడ్‌ బరిలోకి దిగారు. అయితే విచిత్రంగా, డమ్మీ అభ్యర్థిగా బరిలోకి దిగిన లక్షీప్రసన్నగౌడ్‌ కుమారుడు రంజిత్‌గౌడే ఆమె ఓటమికి కారణంగా నిలిచారు. అదెలా అంటే, బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లో లక్ష్మీప్రసన్నగౌడ్‌ బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డి చేతిలో 32 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు. స్వతంత్ర అభ్యర్థి రంజిత్‌గౌడ్‌ కు 39 ఓట్లు పోలయ్యాయి. రంజిత్‌  ముందే విత్‌ డ్రా చేసి ఉంటే బ్యాలెట్‌ పత్రంలో ఆయన పేరు కన్పించేది కాదు. అప్పుడు, ఆయనకు పోలైన 39 ఓట్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్నకు పడి ఉండేవని, ఆమె విజయం సాధించి ఉండేవారని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, డమ్మీ అభ్యర్థిగా బరిలోకి దిగి మమ్మీ ఓటమికి కారణమైన రంజిత్‌ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు.   

టీఆర్ఎస్ ను హైదరాబాద్ లో వచ్చిన వరదలే ముంచేశాయా..? 

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో సొంత బలంతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకున్న టీఆర్ఎస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. 2016 లో జరిగిన ఎన్నిక‌లలో ఒక్క సీటుతో సెంచ‌రీ మిస్ అయిన టీఆర్ఎస్… ఏమైనా సరే ఈసారి సెంచ‌రీ పూర్తి చేస్తామ‌ని కేసీఆర్, కేటీఆర్ చెబుతూ వచ్చినా.. హాఫ్ సెంచరీ పైన ఐదు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే టిఆర్ఎస్ తాజా పరిస్థితికి ప్రధాన కారణం హైద‌ర‌బాద్ లో వచ్చిన వ‌ర‌దలేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నగరంలో వరదలకు తీవ్రంగా ప్రభావితమైన ఎల్బీన‌గ‌ర్ జోన్ తో పాటు పాత‌బ‌స్తీకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, మ‌ల్కాజ్ గిరి లోక్ స‌భ ప‌రిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీకి తీవ్ర న‌ష్టం జరిగింది. వరద వచ్చిన సమయంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిని స్థానిక ప్ర‌జ‌లు నిల‌దీయ‌గా… హ‌య‌త్ న‌గ‌ర్ కార్పోరేట‌ర్ పై మహిళలు దాడి చేసిన ఘటనలు మనం చూసాం. తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాలలో లోనూ ఇదే విషయం స్పష్టమవుతోంది.    ఈ ఎన్నికలలో స్వ‌యంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భార్య ఓడిపోగా, వర‌ద ముంచెత్తిన ఎల్బీన‌గ‌ర్ జోన్ లోని మెజారిటీ స్థానాల్లో బీజేపీ విజ‌యం సాధించింది. అంతేకాకుండా టీఆర్ఎస్ స‌ర్కార్ వ‌ర‌ద స‌హాయం కింద కుటుంబానికి 10వేలు పంపిణి చేసినా.. కొంత మంది కింది స్థాయి టీఆర్ఎస్ నేతల చేతివాటంతో నిజమైన లబ్దిదారులకు ఆ సాయం చేరకపోవడంతో.. చాలా మంది తమకు ఎటువంటి సాయం అందలేదని ఆందోళన చేసిన సంగతి తెల్సిందే. జిహెచ్ఎంసి ఎన్నికలు ప్రకటించిన తరువాత కూడా వరద సాయం కోసం ప్రజలు మీసేవ వద్ద బారులు తీరిన విషయం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వరద సాయం కూడా ఆ పార్టీని దెబ్బ తీసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దేశమంతా తన హవా చాటుతున్న బీజేపీకి అక్కడ పెద్ద షాక్..

దేశం మొత్తం ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తున్న సంగతి తెల్సిందే. దాదాపుగా ఎన్నికలు జరిగిన ప్రతి చోటా బీజేపీ తన సత్తా చాటుతూ వస్తోంది. అయితే తాజాగా మహారాష్ట్ర శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. అక్కడ ఆరు స్థానాలలో ఒక్క సీటు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మహాకూటమి 4 స్థానాల్లో విజయం సాధించింది. మరో ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. ఈనెల ఒకటిన మహారాష్ట్రలోని మూడు గ్రాడ్యుయేట్‌, రెండు ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను శుక్రవారం ప్రకటించారు. ఔరంగాబాద్‌, పుణె గ్రాడ్యుయేట్‌ స్థానాలను ఎన్సీపీ గెలుచుకోగా.. బీజేపీకి గట్టి పట్టున్న నాగపూర్‌ గ్రాడ్యుయేట్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఇక్కడ నుండి గతంలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధర్‌ రావ్‌ ఫడ్నవీస్, అలాగే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ‌ ప్రాతినిధ్యం వహించారు. ఇక ధూలె నందుర్‌బార్‌ లోకల్‌బాడీ సీటును మాత్రమే బీజేపీ దక్కించుకోగలిగింది. తాజా ఎన్నికల ఫలితాలపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ స్పందిస్తూ... రాష్ట్రం లో రాజకీయ వాతావరణం మారిందని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ సీనియర్‌ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ‌మాట్లాడుతూ.. కౌన్సిల్‌ ఎన్నికల్లో మహాకూటమి బలాన్ని తాము తక్కువగా అంచనా వేసినట్టు చెప్పారు.

తెలుగు వన్ చెప్పినట్లే  ఫలితం! గ్రేటర్ అంచనా అంటున్న జనం  

తెలుగు వన్ ఎగ్జిట్ పోల్ అంచనా మరోసారి నిజమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారన్న దానిపై తెలుగు వన్ ఇచ్చిన అంచనా నూటికి నూరు శాతం అక్షర సత్యమైంది. గ్రేటర్ ఎన్నికలపై ఏ సర్వే ఈయనంతా కచ్చిత ఫలితాలు ఇచ్చింది తెలుగు వన్. ఆ అంచనా ప్రకారమే గ్రేటర్ ఫలితాలు వచ్చాయి. పార్టీలకు వచ్చే ఓవరాల్ సీట్లే కాదు నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ ముందు ఉంటుందనే విషయంలోనూ తెలుగు వన్ అంచనా నిజమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఇచ్చింది తెలుగు వన్. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈసారి బాగా దెబ్బ తగలనుందని, 60 సీట్ల లోపే ఆ పార్టీకి సీట్లు వస్తాయని తెలిపింది. బీజేపీకి అనూహ్య విజయం సాధించబోతుందని, ఆ పార్టీ 45 నుంచి 50 డివిజన్లు గెలుచుకుంటుందని తెలుగు వన్ అంచనా వేసింది. అంతేకాదు నియోజకవర్గాల వారీగా చూస్తే ఎల్బీ నగర్ లో కమలం.. కూకట్ పల్లి, శేరిలింగం పల్లిలో కారు స్వీప్ చేస్తాయని వెల్లడించింది. గోషామహాల్, ముషిరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ.. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మెజార్టీ సీట్లు గెలుస్తాయని తెలుగు వన్ చెప్పింది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో మాత్రమే కాంగ్రెస్ కొంత పోటీ ఇస్తుందని కూడా అంచనా వేసింది. చాలా డివిజన్లలో మెజార్టీ స్వల్పంగా ఉంటుందని కూడా తెలుగు వన్ సర్వేలో తేలింది. తెలుగు వన్ చెప్పినట్లే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.   గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తెలుగు వన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఇదే.. గతంలో ఇచ్చిన స్టోరీ ఉన్నది ఉన్నట్లుగా మళ్లీ ఇస్తున్నాం.. మీరే చూడండి..   గ్రేటర్ లో అనూహ్య ఫలితాలు! మేయర్ పీఠం ఆ పార్టీకేనా?  గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు చేంజ్ కోరుకున్నారా? అధికార పార్టీ అభివృద్ది నినాదాన్ని ఆదరించారా? పాతబస్తిలో పతంగి పార్టీ పరిస్థితి ఏంటీ?. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన  జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో  ఇప్పుడు ఇవే  హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ  జరుగుతోంది.  పోలింగ్ సరళి అధారంగా  లెక్కలు  వేసుకుంటూ ఎవరి గెలుస్తారో అంచనా వేసుకుంటున్నాయి పార్టీలు. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల్లో ఈసారి విలక్షమైన తీర్పు రాబోతుందని తెలుస్తోంది.    అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో  సైలెంట్ ఓటింగ్ భారీగా జరిగిందంటున్నారు. యువతతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులంతా కమలానికి మద్దతుగా నిలిచారని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. గతంలో నాలుగు డివిజన్లు గెలిచిన బీజేపీ ఈసారి 45 నుంచి 50 డివిజన్లు  గెలవచ్చని చెబుతున్నారు. గతంలో 99 డివిజన్లు గెలిచిన టీఆర్ఎస్ ఈసారి 60 డివిజన్లలోపే ఆగిపోతుందని తెలుస్తోంది. ఓల్ట్ సిటీలో పట్టున్న ఎంఐఎంకు కూడా షాక్ తగలనుందని, ఆ పార్టీకి గతంలో కంటే కొన్ని సీట్లు తగ్గవచ్చని.. అక్కడ జరిగిన పోలింగ్ సరళిని బట్టి అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ కు 6 నుంచి 10 సీట్లు  గెలవొచ్చంటున్న పొలిటికల్ అనలిస్టులు..  తెలుగు దేశం పార్టీ  నాలుగైదు స్థానాల్లో  గట్టి పోటీ ఇచ్చిందని చెబుతున్నారు.    ఎల్బీనగర్, ఉప్పల్ , మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరిగిందని చెబుతున్నారు.ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉండగా... 2016లో కారు పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి టీఆర్ఎస్ కు తీవ్ర వ్యతిరేకత ఎదురైందని, రెండుమూడు సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఎల్బీనగర్ జోన్ లో ముందు నుంచి కాంగ్రెస్ బలంగా కనిపించినా... పోలింగ్ రోజున కొంత వెనకబడిందని తెలుస్తోంది. దీంతో ఎల్బీనగర్ సెగ్మెంట్ లో  బీజేపీ ఆరు నుంచి 8 డివిజన్లు గెలవడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఉప్పల్ లో  అధికార పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని తెలుస్తోంది. ఉప్పల్ నియోజకవర్గంలో మూడు పార్టీలకు సమంగా సీట్లు రావచ్చంటున్నారు. మల్కాజ్ గిరి జోన్ లో తొమ్మిది డివిజన్లు ఉండగా.. అధికార పార్టీకి నాలుగు, బీజేపీకి రెండు వస్తాయని మరో మూడు చోట్ల టఫ్ పైట్ నడించిందని అంచనా వేస్తున్నారు. ఏఎస్ రావు నగర్ లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని, ఆ సీటుపై ఆ పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.   కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ సాగింది. ఇక్కడ పోలింగ్  కేంద్రాల దగ్గర  చాలా చోట్ల గొడవలు జరిగాయి. కుత్బుల్లాపూర్ పరిధిలో కూడా బీజేపీ. టీఆర్ఎస్ కు సమానంగా సీట్లు రావొచ్చని, కాంగ్రెస్ కు రెండు సీట్లు రావొచ్చంటున్నారు. సెటిలర్లంతా బీజేపీ వైపు నిలిస్తే మాత్రం ఫలితం ఏకపక్షంగా ఉండవచ్చంటున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో తొమ్మిది డివిజన్లు ఉండగా.. ఇక్కడ అధికార పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారు. నాలుగు డివిజన్లలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉండటం గులాబీ పార్టీకి కలిసి రావచ్చని లెక్కలు వేస్తున్నారు. కేపీహెచ్బీ, బాలాజీనగర్ లో మాత్రం  బీజేపీ, టీఆర్ఎస్ మధ్య టఫ్ పైట్ నడిచింది. శేరిలింగం పల్లి నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉండగా.. ఇక్కడ కూడా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ జరిగింది. ఇక్కడ సెటిలర్లే కీలకం కావడంతో ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. అయితే టీఆర్ఎస్ కు ఐదు, బీజేపీకి రెండు రావచ్చని, వివేకానంద నగర్ డివిజన్ లో టీడీపీకి అవకాశం ఉందని చెబుతున్నారు.    సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ సాగిందంటున్నారు. సికింద్రాబాద్ , అంబర్ పేట నియోజకవర్గాల్లో బీజేపీకి... సనత్ నగర్, జూబ్లీహిల్స్  నియోజకవర్గాల్లో అధికార పార్టీ మెజార్టీ డివిజన్లు  వస్తాయని చెబుతున్నారు.  ఖైరతాబాద్ , ముషిరాబాద్ లో మాత్రం హోరాహోరీ ఉంటుందని తెలుస్తోంది.  ఈ రెండు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ కు చీలకుండా ముస్లిం ఓట్లలో ఎక్కువ శాతం కారుకు పడితే అధికార పార్టీకి మెజార్టీ సీట్లు దక్కవచ్చు. హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ఎంఐఎంకే మెజార్టీ డివిజన్లు వచ్చినా... గతంలో కంటే సీట్లు తగ్గవచ్చంటున్నారు. నాంపల్లి, మలక్ పేట నియోజకవర్గాల్లో  కొన్ని సీట్లు బీజేపీకి .. గోషామహాల్ నియోజకవర్గంలో కొన్ని సీట్లు కమలానుకి రావచ్చంటున్నారు. బీజేపీలోని విభేదాలు ఇక్కడ ఆ పార్టీకి నష్టం కలిగించాయని అంచనా వేస్తున్నారు.    రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నాలుగు డివిజన్లు ఉండగా.. అసదుద్దీన్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఈసారి ఎంఐఎం రెండు గెలవచ్చని చెబుతున్నారు. మైలార్ దేవ్ పల్లిలో ఎమ్మెల్యే సొదరుడు, బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డికి హోరాహోరీ పోరు జరిగిందంటున్నారు. అత్తాపూర్ లోనూ  గట్టి పోటీనే జరిగింది. మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్లను గెలిపించుకోవడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా శ్రమించినా.. అవి గెలవడం టీఆర్ఎస్ అంత ఈజీ కాదంటున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో మూడు డివిజన్లు ఉండగా.. గ్రేటర్ వ్యాప్తంగా ఇక్కడే ఎక్కువ పోలింగ్ జరిగింది. ఇక్కడ మూడు డివిజన్లలో బీజేపీ., టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ జరిగింది. అయితే మంత్రి హరీష్ రావు సీరియస్ గా ప్రచారం చేయడం, కేంద్ర సర్వీసు ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో టీఆర్ఎస్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు.     మొత్తంగా హోరాహోరీగా సాగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గతంలో కంటే భిన్నమైన ఫలితాలు రాబోతున్నాయని చెబుతున్నారు. పోలింగ్ శాతం తక్కువగా ఉండటంతో  ఊహించని రిజల్ట్స్ కూడా రావచ్చంటున్నారు. కొన్ని డివిజన్లలో 10 వేల ఓట్లు మాత్రమే పోల్ కావడంతో 4 వేల ఓట్లు వచ్చిన వారు కూడా గెలిచే అవకాశం ఉంది. అలాంటి డివిజన్లలో షాకింగ్ ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో కంటే టీఆర్ఎస్ కు భారీగా సీట్లు తగ్గినా  ఎక్స్ అఫిషియో సభ్యులు.. అవసరమైతే  ఎంఐఎంతో కలిసి మరోసారి మేయర్ పీఠం సాధిస్తుందని మాత్రం చెబుతున్నారు.

గ్రేటర్ లో పెద్ద నేతలకు షాక్! కలిసిరాని అమిత్ షా రోడ్ షో

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఎవరూ ఊహించని అద్భుతాలు జరిగాయి. ఎల్బీనగర్ జోన్ లో కమలం ప్రభంజనం వీచింది. 2016 ఎన్నికల్లో ఇక్కడ కారు పార్టీ క్లీన్ స్వీప్ చేయగా.. ఈసారి సీన్ రివర్స్ అయింది. 11కు 11 డివిజన్లు కమలం గెలుచుకుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో విజయం సాధించారు బీజేపీ అభ్యర్థులు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి సీరియస్ గా పని చేసినా కమలం గాలి ముందు వారి పప్పులు ఉడకలేదు. మంత్రి సబితా ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్లలో బీజేపీనే గెలిచింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జి గా ఉన్న అడిక్ మెట్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న సరూర్ నగర్ లో టీఆరెస్ ఓటమి పోయింది.    ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాక్ తగిలింది. ముషిరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ ను ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ నుంచి ప్రచారం ముగిసేవరకు అంతా కవిత డైరెక్షన్ లోనే జరిగింది. దాదాపు వారం రోజుల పాటు గాంధీనగర్ డివిజన్ లో గల్లిగల్లీ తిరిగి ప్రచారం చేశారు కవిత. వివిధ కులసంఘాలు, కాలనీ అసొసియేషన్లతోనూ సమావేశాలు నిర్వహించారు. అయినా గాంధీనగర్ లో బీజేపీ విజయం సాధించడం కవితకు పెద్ద షాకే అంటున్నారు. దివంగత హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి రామ్ నగర్ లో ఓటమి పాలయ్యారు.   కేంద్ర సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి అనుకున్నంత స్థాయిలో  విజయాలు సాధించలేదు. ఎల్బీనగర్ లో స్వీప్ చేసిన కమలం.. కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అంబర్ పేటలో మాత్రం రెండు డివిజన్లు మాత్రమే గెలిచింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిష్టాత్మకమైన డివిజన్ మోండా మార్కెట్‌లో బీజేపీ విజయం సాధించింది.  గతంలో మోండా మార్కెట్ డివిజన్ నుంచి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు కార్పొరేటర్‌లుగా పోటీ చేశారు. మోండా మార్కెట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల రూపపై  బీజేపీ అభ్యర్థి  దీపిక ఘన విజయం సాధించారు.ఉప్పల్ ఎమ్మెల్యేకు ఓటర్లు షాకిచ్చారు. హబ్సిగూడ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి భార్యపై బీజేపీ అభ్యర్థి చేతన సంచలన విజయం సాధించింది.     కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రోడ్ షోలు బీజేపీకి కలిసి రాలేదు. అమిత్ షా రోడ్ షో నిర్వహించిన ప్రాంతాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. వారసిగూడ నుండి సీతాఫల్ మండి వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రోడ్ షో చేశారు. ఆ పరిధిలోని అడ్డగుట్ట నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగాన ప్రసన్న లక్మి 6 863 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు .సీతాఫల్ మండిలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సామల హేమ విజయం సాధించారు.   ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డి డివిజన్ లో మరో వింత జరిగింది. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మొదటి నుంచి టీఆరెస్ అభ్యర్థి లక్ష్మీప్రసన్న లీడ్ లో ఉండగా.. చివరికి మాత్రం 32 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలిచాడు. ఇదే డివిజన్ లో ఇండిపెండెంట్ డమ్మీ అభ్యర్థిగా టీఆరెస్ అభ్యర్థి లక్ష్మీప్రసన్న కుమారుడు ముదగౌని రంజిత్ గౌడ్ పోటీ చేశాడు. అతనికి 37 ఓట్లు పోలయ్యాయి. తల్లి 32 ఓట్లతో ఓడిపోగా.. కుమారుడికి 37 ఓట్లు పోల్ కావడం చర్చగా మారింది. కొడుకు పోటీ చేయడం వల్లే తల్లి ఓడిపోయిందనే చర్చ జరుగుతోంది.

గ్రేటర్ లో సాఫ్రాన్‌ స్ట్రైక్‌! కారుకు కోలుకోలేని షాక్ 

మొన్న దుబ్బాక... ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్. తెలంగాణలో బీజేపీ దూసుకుపోతోంది. వరుస  విజయాలతో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన గెలుపుతో కేసీఆర్ కు సవాల్ విసిరిన బండి సంజయ్ టీమ్.. గ్రేటర్ ఎన్నికల్లోను అంతకు మించిన  అద్భుతమే చేసింది. సైలెంట్ కిల్లర్ గా విరుచుకుడి కారు పార్టీకి కకావికలం చేసింది. సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ.. ఎవరూ  ఊహించని విధంగా హాఫ్ సెంచరీ క్రాస్ చేసింది కాషాయ దళం.  గ్రేటర్ లోని అన్ని ప్రాంతాల్లో  ధూంధాంగా ఓట్లు సాధించింది బీజేపీ. గ్రేటర్ లో సెంచరీ కొడతామన్న మంత్రి కేటీఆర్ కు దిమ్మతిరిగే షాకిస్తూ.. అధికార పార్టీని హాఫ్ సెంచరీ దగ్గరే నిలువరించింది.    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం జెండా రెపరెపలాండిది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో కేవలం నాలుగు డివిజన్లు గెలిచిన బీజేపీ... ఈసారి ఏకంగా  50 డివిజన్లు గెలిచింది. ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అంతటా కమలం హవా కనిపించింది. అధికార టీఆర్ఎస్ కేవలం 55 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.పాతబస్తిలో పట్టు నిలుపుకున్న ఎంఐఎం 41 డివిజన్లు గెలుచుకుంది. అయితే ఓల్డ్ సిటీలో కీలకంగా భావించే జాంబాగ్, జంగంమెట్  డివిజన్లలో కమలం వికసించి పతంగి పార్టీకి కొత్త సవాల్ విసిరింది. హైదరాబాద్ లోక్ సభ పరిధిలోని గోషామహాల్ నియోజకవర్గంలోనూ బీజేపీ మంచి విజయాలు సాధించింది. కార్వాన్ , చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల్లోనూ భారీగా ఓట్లు సాధించింది బీజేపీ. 2016 ఎన్నికల్లో ఓల్డ్ సిటీలో భారీగానే ఓట్లు సాధించిన టీఆర్ఎస్.. ఈసారి పత్తా లేకుండా పోయింది. రాష్ట్ర మంత్రులు ఇంచార్జులుగా ఉండి గల్లిగల్లి తిరిగినా బీజేపీ గాలి ముందు నిలవలేకపోయారు.    దుబ్బాక విజయం తెలంగాణ బీజేపీలో జోష్ పెంచింది. ఇప్పుడు గ్రేటర్ లోనూ అద్భుత ఫలితాలు సాధించడంతో ఇక రాష్ట్రంలో బీజేపీ దూకుడును ఎవరూ ఆపలేరనే చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం కైవసం చేసుకునే వరకు ఈ దూకుడు ఆపేది లేదంటున్నారు కమలం నేతలు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంలో త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలనాధులు.  వరుస విజయాలతో తెలంగాణలో  టీఆర్ఎస్ ధీటైన ప్రత్యర్థిగా బీజేపీ నిలిచిందని రాజకీయ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ దూకుడుతో టీఆర్ఎస్ షేక్! గ్రేటర్ లో హంగ్ ఫలితాలు 

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు గులాబీ పార్టీకి దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. సొంతంగానే రెండోసారి జీహెచ్ఎంసీపై పాగా వేయాలన్న కారు పార్టీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్ట్ అంచనాలు తలకిందులవుతూ  గ్రేటర్ లో హంగ్  ఫలితాలు వచ్చాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో  గతంలో కంటే దాదాపు 40 డివిజన్లను కోల్పోయింది అధికార టీఆర్ఎస్ పార్టీ. 2016 ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో 99  సీట్లు సాధించిన టీఆర్ఎస్.. ఈసారి మాత్రం 60 లోపే ఆగిపోయింది. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచినా.మేటర్ పీఠం కైవసం చేసుకోవడానికి కావల్సిన మేజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయింది. తమ పార్టీ కున్న ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసినా సొంతంగా టీఆర్ఎస్ కు మేయర్ పీఠం చేపట్టే అవకాశం లేదు.    2016 ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి టీఆర్ఎస్ కు చుక్కలు చూపించింది. సైలెంట్ గా దూసుకొచ్చి కారు స్పీడుకు బ్రేకులు వేసింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా  దాదాపు 50 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది కమలం పార్టీ. ఓల్ట్ సిటీలోనూ బాగా పుంజుకున్న బీజేపీ.. ఎంఐఎంకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు కొన్ని డివిజన్లు గెలిచింది. కాంగ్రెస్ మరోసారి గ్రేటర్ లో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. గతంలో రెండు సీట్లు గెలిచిన హస్తం పార్టీ.. ఈసారి కూడా రెండు డివిజన్లు గెలుచుకుంది. పాతబస్తిలో  తన పట్టు మరోసారి నిలుపుకుంది ఎంఐఎం. గతంలో గెలిచిన స్థానాలను నిలబెట్టుకుంది. కొత్తగా న్యూసిటిలోనూ పాగా వేసింది పతంగి పార్టీ. బోలక్ పూర్ లో ఎంఐఎం విజయం సాధించింది. గ్రేటర్ ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ, వామపక్షాలు ఎక్కడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాయి.    కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగం పల్లి, జూబ్లీహిల్స్ , కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో  టీఆర్ఎస్ జోరు కనిపించింది. ముఖ్యంగా కూకట్ పల్లి సర్కిల్ లో కారు స్వీప్ చేసింది. ఈ నాలుగు నియోజకవర్గాల్లోని డివిజన్లలో  దాదాపు 90 డివిజన్లను అధికార పార్టీనే గెలుచుకుంది. ఎల్బీనగర్, గోషా మహాల్, ముషిరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభంజనం వీచింది. ఎల్బీ నగర్ జోన్ లో 11కు 11  డివిజన్లు గెలిచి కమలం పార్టీ స్వీప్ చేసింది. గోషామహాల్ నియోజకవర్గంలో గతంలో ఒక్క డివిజన్ గెలిచిన బీజేపీ ఈసారి అనూహ్యంగా 4 స్థానాలు గెలుచుకుంది. ఎంఐఎం పట్టున్న ప్రాంతాల్లోనూ కమలం వికసించింది. మల్కాజ్ గిరి, ఉప్పల్ లో కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఈ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలను మిశ్రమ ఫలితాలు వచ్చాయి.   సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని డివిజన్లలో కాంగ్రెస్ కనీసం పోటీ ఇవ్వకపోగా.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ సాగింది. చాలా డివిజన్లలో లీడ్ లు మారుతూ వచ్చాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో చెరి సగం సీట్లు గెలుచుకోగా.. ముషిరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి లీడ్ వచ్చింది. అంబర్ పేటలో కారు పార్టీ తక్కువ  మెజార్టీతోనే కొన్ని సీట్లు ఎక్కువ గెలుచుకుంది. సనత్ నగర్ నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్నా.. గతంలో గెలిచిన కొన్ని డివిజన్లలను నిలుపుకోలేకపోయారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.  ఖైరతాబాద్ నియోజకవర్గంలో టఫ్ పైట్ జరిగినా.. అధికార పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. నాంపల్లి నియోజకవర్గంలో ఎంఐఎం పట్టు నిలుపుకుంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనూ సత్తా చాటింది బీజేపీ.    గ్రేటర్ ఫలితాలతో షాకైంది గులాబీ దళం. తొలి రౌండ్ ఫలితాల్లో ముందుండటంతో తెలంగాణ భవన్ లో సంబరాలు కూడా చేశారు. అయితే సాయంత్రానికి సీన్ మారడంతో టీఆర్ఎస్ కార్యాలయం బోసి పోయింది. మేజిక్ ఫిగర్ రాకపోవడంతో సంబరాలు కూడా ఆపేశారు. చివరి రౌండ్ లో బీజేపీకి అనూహ్య ఫలితాలు రావడంతో.. ఆ పార్టీ కార్యాలయం దగ్గర సందడి కనిపించింది. బండి సంజయ్, లక్ష్మణ్ లు పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. తాము అనుకున్నదాని కంటే ఎక్కువ ఫలితాలు సాధించామని బీజేపీ నేతలు చెప్పారు. గ్రేటర్ ఫలితాలపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ షాకిస్తూ.. బీజేపీకి ప్లస్ అయినా పూర్తి స్థాయిలో గెలిపించకుండా.. ఎంఐఎంకు కొంత షాకిస్తూ గ్రేటర్ ఓటర్లు గ్రేటర్ తీర్పు ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు.