టీపీసీసీ పదవికి తీవ్ర పోటీ! శ్రీధర్ బాబు కోసం కేసీఆర్ లాబీయింగ్!
posted on Dec 6, 2020 @ 4:43PM
వరుస పరాజయాలతో తెలంగాణ కాంగ్రెస్ లో నిస్తేజం అలుముకుంది. దుబ్బాక ఓటమితో ఢీలా పడిన హస్తం పార్టీ గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో మరింత కుదైలేంది. జీహెచ్ఎంసీ లో ఒకప్పుడు హవా చూపిన హస్తం పార్టీకి కేవలం ఆరు శాతం ఓట్లు రావడంతో.. ఆ పార్టీ పని అయిపోయినట్లననే చర్చ జరుగుతోంది. అయితే వరుస ఓటములతో అయోమయంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళనకు హైకమాండ్ సిద్ధమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. ఆ పదవిలో కొత్త నేతను నియమించేందుకు రాహుల్ టీమ్ కసరత్తు చేస్తోంది. రేపో మాపో తెలంగాణకు కొత్త పీసీసీ పేరును ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి వినిపిస్తున్న నేతలపై కాంగ్రెస్ లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు పీసీసీ పదవి ఇస్తున్నారన్న వార్తలపై ఆ పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. శ్రీధర్ బాబుకు పీసీసీ పదవి దక్కేలా సీఎం కేసీఆర్ లాబీయింగ్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ తో శ్రీధర్ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఇద్దరూ కలిసి చదువుకున్నారని చెబుతున్నారు. శ్రీధర్ బాబు భార్య శైలజా రామయ్యర్ తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆమె చేనేత, జాళీ శాఖ కమిషనర్ గా ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఆమెకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం ఉంది. తమకు ఇబ్బంది ఉండదనే ఉద్దేశ్యంతోనే శ్రీధర్ బాబు పీసీసీ చీఫ్ గా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై శ్రీధర్ బాబు దూకుడుగా పోరాటం చేయలేరనే చర్చ కాంగ్రెస్ నేతల్లోనే జరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాలతో జోష్ మీదున్న బీజేపీని, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను.. రాజకీయాల్లో సైలెంట్ గా ఉంటారనే పేరున్న శ్రీధర్ బాబు ఎంతవరకు ఢీకొడతారన్నది అనుమానమే.
పీసీసీ చీఫ్ రేసులో తానే ముందున్నానని చెప్పుకుంటున్నారు భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అయితే కోమటిరెడ్డిపైనా కాంగ్రెస్ నేతలకు భరోసా కలగడం లేదని తెలుస్తోంది. కోమటిరెడ్డి సోదరులకు కేసీఆర్ తో సన్నిహత సంబంధాలు ఉన్నాయంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పలు ప్రాజెక్టు పనులను కోమటిరెడ్డి సంస్థలు చేస్తున్నాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ తో సంబంధాలు ఉండటం వల్లే ఆయన సంస్థలకు కాంట్రాక్టులు వచ్చాయంటున్నారు. ప్రభుత్వ పనులు చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... కేసీఆర్ పై దూకుడుగా ముందుకు వెళ్లలేరనే చర్చ హస్తం నేతల నుంచే వస్తోంది. దీంతో పాటు కోమటిరెడ్డి సోదరులు బీజేపీ నేతలతోనూ టచ్ లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా పార్టీకి పెద్ద ప్రయోజనం ఉండదని గాంధీభవన్ లోనే గుసగుసలాడుకుంటున్నారట.
తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని పార్టీ కేడర్ నుంచి బాగా డిమాండ్లు వస్తున్నాయి. తన వాగ్దాటి, పంచ్ ప్రసంగాలతో ఆకట్టుకునే రేవంత్ రెడ్డే అయితేనే కాంగ్రెస్ బతుకుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. అయితే రేవంత్ కు పీసీసీ పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్లు పెదవి విరుస్తున్నారట. రేవంత్ రెడ్డికి ఇప్పటికి చంద్రబాబు మనిషిగానే ముద్ర ఉంది.ఆయనపై ఉన్న ఓటుకు నోటు కేసు ఇంకా విచారణలో ఉంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇస్తే..గతంలో టీడీపీలో పనిచేసిన నేతలంతా ఆయనకు మద్దతు ఇచ్చినా.. కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి ఆయనకు సహకారం లభించకపోవచ్చని భావిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి కాకుండా కొత్తగా వచ్చిన నేతలకు పీసీసీ పగ్గాలు ఇవ్వవద్దని కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వంటి నేతలు ఓపెన్ గానే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇస్తే పార్టీలో గ్రూప్ రాజకీయాలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన కొందరు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. తమకు కొరకరాని కొయ్యలా మారిన రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాకుండా గులాబీ బాస్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో పార్టీని గాడిలో పెట్టాలంటే అన్ని వర్గాలను కలుపుకుపోయే నేతకే పీసీసీ పగ్గాలు ఇవ్వాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. కొత్తగా పార్టీలో చేరిన వారు.. ప్రభుత్వంలో ఉన్న పార్టీతో లోపాయకారి ఒప్పందాలతో కాంట్రాక్టులు చేసుకునే వారు కాకుండా.. మొదటి నుంచి పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న నేతకు ఇస్తేనే బాగుంటుందనే కొందరు కొంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారట. టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాకా కొన్ని రోజులకే జరిగిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ కు మొదటి షాక్ ఇచ్చారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. అలాంటి నేతకు పీసీసీ ఇస్తే ఫర్వాలేదంటున్నారు. సుదర్శన్ రావు వంటి సీనియర్లు పీసీసీ పదవిని చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారు. సీనియర్ నేతకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తేనే గ్రూపు రాజకీయాలు లేకుండా పార్టీ ముందుకు పోయే అవకాశం ఉందని కాంగ్రెస్ అభిమానులు కోరుకుంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరీ...