ఏలూరు వింత రోగానికి కారణం ఇదే.. నిపుణుల అంచనా..!
posted on Dec 8, 2020 8:58AM
ఏలూరులో భయాందోళనకు గురిచేస్తున్న వింత రోగంపై ఏపీలో తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వింత రోగానికి సంబంధించిన కారణాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. ఈ వింత రోగంపై వివిధ సంస్థలు, అలాగే ప్రభుత్వ సంస్థలు నివేదికలు సిద్ధం చేశాయి. తాజాగా బాధితుల శరీరంలో లెడ్, నికెల్ వంటి హెవీ మెటల్ పదార్ధాలు ఉన్నట్లు ఎయిమ్స్ నిపుణుల బృందం గుర్తించింది. ఇవి తాగునీరు లేదా పాల ద్వారా శరీరంలో చేరి ఉండవచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల తాజా నివేదిక అధికారికంగా ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అయితే దీనికోసం తొమ్మిది డెయిరీల నుంచి పాల నమూనాలు తీసుకుని ల్యాబ్ కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కల్చర్ రిపోర్టు, ఈ-కోలీ పరీక్ష ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
న్యూరో టాక్సిన్స్ కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తినే ఆహారం లేదా తాగునీరు లేదా పాల ద్వారా ఈ వింత రోగం వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. రోగుల నాడీ వ్యవస్థపై న్యూరో టాక్జిన్స్ ప్రభావం చూపించడం తో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. బాధితుల్లో కంటి నల్లగుడ్డు స్పందన తగ్గిన లక్షణాన్ని వైద్యులు తాజాగా గుర్తించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సోమవారం పరిశీలించిన రోగుల్లో 70 నుంచి 80 శాతం మందికి ఈ సమస్య ఉందని గుర్తించారు. వైద్య పరిభాషలో "ప్యూపిల్ డైలటేషన్" గా దీనిని వైద్యులు పేర్కొంటున్నారు. ఇది మయో క్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చని గుంటూరు వైద్య నిపుణుల బృందం చెబుతోంది.