ఎన్నిక ముగిసింది.. సాయం ఆగింది! కేసీఆర్ సర్కార్ పై బాధితుల పైర్
posted on Dec 7, 2020 @ 9:53AM
రాజకీయ పార్టీల నైజం మరోసారి బయటపడింది. ఓట్ల కోసమే పార్టీలు ఎంత చిల్లర వేషాలు వేస్తాయో మరోసారి అర్ధమైంది. ప్రభుత్వాల ఓట్ల నాటకాలు ప్రజలకు తెలిసొచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అత్యంత కీలంగా మారిన వరద సాయం పంపిణిపై అధికార పార్టీ యూ టర్న్ తీసుకుంది. డిసెంబర్ 7 నుంచి వరద బాధితులకు సాయం అందిస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు మాట మార్చింది. వరద బాధితులు సాయం కోసం మీ సేవా సెంటర్లలో అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ అన్నారు. అర్హులను తామే గుర్తించి వరద సాయం అందిస్తామని చెప్పారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాయని తెలిపారు. వరద సాయం అందని వారి వివరాలు సేకరించి బాధితుల అకౌంట్లలోకి వరద సాయం జమ చేస్తామని తెలిపారు బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్.
కేసీఆర్ సర్కార్ యూ టర్న్ తో గ్రేటర్ హైదరాబాద్ లో వరద బాధితులకు సాయం అందడం ఇక కష్టమేనన్న చర్చ జరుగుతోంది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.10వేలు వరద సాయం గతంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయింది. వరద సాయాన్ని డిసెంబర్ 7 నుంచి పున: ప్రారంభిస్తామని కేసీఆర్ ఎల్బీ స్టేడియం ఎన్నికల సభలో ప్రకటించారు. దీంతో ప్రజలు నగరంలోని మీ సేవా కేంద్రాల వద్ద ఉదయం నుంచి బారులు తీరారు. జనాల రద్దీ పెరగడం, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో మీ సెంటర్ నిర్వహకులు తమ కార్యాలయాలు తెరవలేదు. అయినా జనాల రద్దీ గంట గంటకు పెరగడంతో పలు సెంటర్ల దగ్గర తోపులాటలు జరుగుతున్నాయి. జనాల క్యూలపై మీడియాలో వార్తలు రావడంతో స్పందించిన.. జీహెచ్ఎంసీ కమిషనర్ వరద బాధితులుకు మీ సేవా సెంటర్లకు రావొద్దని సూచించారు.
గత అక్డోబర్ లో కురిసిన కుండపోత వర్షాలకు హైదరాబాద్ లో వరదలు వచ్చాయి. వందలాది కాలనీలు నీట మునిగాయి. వేలాది ఇండ్లు రెండు,మూడు రోజుల పాటు నీళ్లలోనే ఉండిపోయాయి. వరద ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద బాధిత కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. కొన్ని ప్రాంతాల్లో సాయం పంపిణి చేశారు. ఆరున్నర లక్షల కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు పంపిణి చేశామని సర్కార్ ప్రకటించుకుంది. అయితే అందులో ఎక్కువ మొత్తం డబ్బంతా అధికార టీఆర్ఎస్ నేతలే కాజేశారనే ఆరోపణలు వచ్చాయి. తమకు సాయం అందలేదని నిజమైన వరద బాధితులు ఆందోళనలు చేయడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో మీ సేవా సెంటర్ల ద్వారా దరఖాస్తులు తీసుకుంది ప్రభుత్వం. అప్పుడు కూడా నాలుగు రోజుల పాటు మీ సేవా సెంటర్లన్ని జనాలతో నిండిపోయాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వరద సాయాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకున్నాయి పార్టీలు. తమను గెలిపిస్తే ప్రతి కుటుంబానికి 25 వేల రూపాయల సాయం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అయితే తాము కుటుంబానికి 50 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కాని నిధులు ఎక్కడి నుంచి తెస్తారో మాత్రం చెప్పలేదు. విపక్షాల హామీలతో తామేని తక్కువ కాదన్నట్లుగా.. ఎన్నిక ముగియగానే మిగిలిన వరద బాధితులకు 10 వేల సాయం పంపిణి చేస్తామని అధికార ప్రకటించింది. సీఎం కేసీఆరే స్వయంగా హామీ ఇచ్చారు. దీంతో వరద బాధితులు కూడా గ్రేటర్ ఎన్నిక ముగియగానే సాయం అందుతుందని ఆశించారు. కాని ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ మాట మార్చడంతో వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల ముందు ప్రకటించి ఇప్పుడు మాట మార్చడమేంటనీ మండిపడుతున్నారు.