అసాంఘిక శక్తుల అడ్డాగా వైసీపీ! పోలీసులపై నమ్మకం పోయిందన్న చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డి తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో వరుస దాడులు, దౌర్జన్యాలతో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యానికి గండికొడుతున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో టీడీపీ నేతలపై జరిగిన దాడి ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి మాఫియా శక్తులు రెచ్చిపోతున్నాయని ఆ లేఖలో ఆయన ధ్వజమెత్తారు. చట్టబద్ధమైన పాలన స్థానంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని విమర్శించారు. పోలీసుల్లో ఒక వర్గం అధికార వైసీపీ నేతలతో కుమ్మక్కై వారి చెప్పుచేతుల్లో పనిచేయడం దురదృష్టకరమని చంద్రబాబు దుయ్యబట్టారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ఈ ప్రాంతంలో ప్రజలపై వేధింపులు, చిత్రహింసలు, హత్యల కేసు ఎక్కువగా నమోదయ్యాయని చంద్రబాబు విమర్శించారు. ఎస్సీలపై వరుస దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రతి సంఘటనలో నిందితులు అధికార వైసీపికి చెందినవారైతే, బాధితులంతా సామాజికంగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాలవారేనన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే అసాంఘిక శక్తుల అడ్డాగా అధికారపార్టీ మారిందని ఆక్షేపించారు. ఇలాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా మంత్రి పెద్దిరెడ్డి మాత్రం ఈ అరాచక శక్తులను ఇంకా ప్రోత్సాహిస్తూనే ఉన్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు, దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే ప్రజలకు పోలీసు వ్యవస్థపై గల నమ్మకం పూర్తిగా నశిస్తుందన్నారు. బాధితులను పోలీసులు వేధించడం కాకుండా భద్రతగా నిలబడాలని డీజీపీని టీడీపీ అధినేత కోరారు.
మరోవైపు చిత్తూరు జిల్లా అంగళ్లులో టీడీపీ నేతలపై శుక్రవారం జరిగిన దాడికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి టీడీపీ పిలుపు ఇచ్చింది. దీంతో టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. తిరుపతిలో నరసింహయాదవ్, పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, కలికిరిలో నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, తంబళ్లపల్లెలో శంకర్‌యాదవ్, చిత్తూరులో నాని, దొరబాబు, శాంతిపురంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తంబళ్లపల్లె వెళ్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కరోనా దృష్ట్యా చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి అనుమతి లేదని, తంబళ్లపల్లె నియోజకవర్గంలో 30 పోలీసు యాక్టు అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు.