గ్రేటర్ షాక్ తో ఉత్తమ్ రాజీనామా

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ దారుణ వైఫల్యం చెందింది. కేవలం 2 డివిజన్లను మాత్రమే గెలుచుకుంది. ఉప్పల్, ఏఎస్‌రావునగర్‌ లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని, తన స్థానంలో కొత్త అధ్యక్షుడ్ని నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు.    ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఆ సమయంలో ఉత్తమ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణుల నుండి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించాయి. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవం ఎదురవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్తమ్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

మంత్రి తలసానితో పాటు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల ఫలితాలు వస్తున్న కొద్దీ హైదరాబాద్ లోని టీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఓటర్లు ఏ రేంజ్ లో షాక్ ఇచ్చారో అర్ధమవుతోంది. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. గతంలో కంటే సీట్లు తగ్గుతున్నట్లుగా స్పష్టమౌతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో పార్టీకి కీలక నేత అయిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఆయనకు కంచుకోట లాంటి మోండా మార్కెట్లో బీజేపీ తన జెండా ఎగరేసింది. తలసాని రాజకీయ జీవితానికి పునాది మోండా మార్కెట్ అన్న సంగతి తెల్సిందే. అక్కడి నుంచే పోటీ చేసి గెలిచిన ఆయన మెల్ల మెల్లగా రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగారు. అటువంటి చోట బీజేపీ తన జెండాను ఎగరేసింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కొంతం దీపిక టీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల పుష్ప పై విజయం సాధించారు. 2016లో జరిగిన ఎన్నికలలో ఆకుల పుష్ప ఇక్కడి నుంచి గెలిచారు.   ఇక నగర ఓటర్లు హైదరాబాద్ లోని మరో టిఆర్ఎస్ ఎమ్మెల్యే కు కూడా షాక్ ఇచ్చారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్‌లో తన భార్య స్వప్నను టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టారు. అయితే ఇక్కడి ప్రజలు బీజేపీ అభ్యర్థి స్వప్నను గెలిపించి ఎమ్మెల్యేకు అయన భార్యకు కూడా పెద్ద షాక్ ఇచ్చారు. ఇదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో అనేకమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అంబర్ పెట్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే టీఆర్ఎస్ నుండి ఉన్నా..  తాజాగా ఇక్కడ బీజేపీ తన సత్తా చాటింది. 

ఎంఐఎం నేత షూలో సెల్ ఫోన్.. కౌంటింగ్ కేంద్రంలో కలకలం

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు సెల్‌ఫోన్‌ లను నిషేధించారు. అయితే ఎంఐఎం పార్టీకి చెందిన నేత కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్‌తో రావడం తీవ్ర కలకలం రేపింది. యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థి షాహినా బేగం భర్త షరీఫుద్దీన్.. అనుమతి లేకుండా సెల్‌ఫోన్‌తో ప్రవేశించారు. ఆ సెల్‌ఫోన్‌ ను ఎవరూ గుర్తించకుండా షూస్‌లో పెట్టుకుని మరీ కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. ఇది గమనించిన కొందరు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే షరీఫుద్దీన్‌ ను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు లాక్కొచ్చారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ కి ఆయన్ను తరలించారు. ఇక, ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఇప్పటివరకు టీఆర్ఎస్ 15 డివిజన్లలో నెగ్గి, 51 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం 21 డివిజన్లలో విజయం సాధించి, మరో 19 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 5 డివిజన్లలో నెగ్గి, 36 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2 డివిజన్లలో నెగ్గి, ఒక డివిజన్ లో ఆధిక్యంలో ఉంది. 

కొద్ది వారాల్లో వ్యాక్సిన్ రెడీ.. వారికే తొలి ప్రాధాన్యం

కొద్ది వారాల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధం అవుతుందని నిపుణులు గట్టి నమ్మకంతో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలోని కరోనా వైరస్ పరిస్థితులపై శుక్రవారంనాడు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. శాస్త్రవేత్తల నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే భారత్ లో వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని చెప్పారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ ‌లైన్ వర్కర్లు, వయోవృద్ధులకు వ్యాక్సినేషన్‌ లో తొలి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.   వ్యాక్సిన్ ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చలు జరుపుతుందని అన్నారు. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ టీకా ధర నిర్ణయిస్తామని వెల్లడించారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ బృందాలు వ్యాక్సిన్ పంపిణీపై ప్రణాళికలు రూపొందిస్తున్నాయని తెలిపారు. కరోనాపై అన్ని రాజకీయ పక్షాలు తమ సలహాలు, సూచనలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. పార్టీల నుంచి వచ్చే సలహాలు, సూచనలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. అత్యంత చవకగా, భద్రమైన టీకా భారత్ నుంచి వస్తుందని తక్కిన ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. 

ఫోర్బ్స్ జాబితాలో పాతికేళ్ల నల్గొండ కుర్రాడు

ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో నల్గొండ పట్టణానికి చెందిన కోణం సందీప్(25) స్థానం దక్కించుకున్నాడు. హెల్త్‌కేర్‌ సెక్టార్‌ కు సంబంధించి వినూత్న రీతిలో వైద్య, ఆరోగ్య సేవలందిస్తున్నందుకు గాను అతడికి ఈ గుర్తింపు లభించింది. ఈ విభాగంలో ఫోర్బ్స్ రూపొందించిన ‘30 అండర్ 30’ జాబితాలో సందీప్ కు స్థానం దక్కింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్‌ను రూపొందించినందుకు గాను సందీప్‌కు ఈ అరుదైన గుర్తింపు లభించింది. ఇతర దేశాల్లోని వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలను ఈ యాప్ రోగుల మాతృభాషలోకి అనువదిస్తుంది.   కోణం సందీప్‌ 2018లో డాక్టర్‌ శివ్‌రావ్‌తో కలసి అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో అబ్రిడ్జ్‌ పేరుతో యాప్‌ సృష్టించి హెల్త్‌కేర్‌ రంగంలో రాణిస్తున్నాడు. హెల్త్‌కేర్ టెక్నాలజీకి సంబంధించి పలు యాప్‌లు రూపొందించాడు. సందీప్ కోణం పేరుతో ఓ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. కాగా, పాతికేళ్ల వయసులోనే అమెరికా ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం దక్కించుకున్న సందీప్ ను పలువురు అభినందిస్తున్నారు.

స్కూలు టీచర్‌కు మిలియన్ డాలర్ల ప్రైజ్‌ మనీ

మహారాష్ట్రలో సోలాపూర్ జిల్లాలోని పరితేవాడి గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌ సిన్హ్ డిసేల్ (32) ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్‌ మనీ గెలుచుకున్నారు. మన దేశంలో క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ విప్లవానికి పునాదివేయడంతోపాటు, బాలికా విద్య ప్రోత్సాహానికి ఆయన చేసిన విశేష కృషికి గాను గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 కు విజేతగా ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 10మంది ఫైనలిస్టులతో పోటీపడి డిసేల్ ఈ ఘనత సాదించారు. అంతేకాదు, తన ప్రైజ్‌ మనీలో 50 శాతం నగదును టాప్-10 ఫైనలిస్టులతో పంచుకుంటానని ప్రకటించారు. వృత్తిపరంగా వారు చేసిన అసాధారణమైన కృషికి మద్దతుగా ఒక్కొక్కరికి 55 వేల డాలర్లు చొప్పున ఇస్తానని తెలిపారు.    2009 లో పరితేవాడిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు డిసేల్ వచ్చినప్పుడు.. ఆ పాఠశాల దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేది. ఈ పరిస్థితిని ఛాలెంజింగ్‌ గా తీసుకున్న డిసేల్ పాఠశాల రూపురేఖలు మార్చారు. దీంతో పాటు గ్రామంలోని 100శాతం బాలికలను పాఠశాలకు హాజరయ్యేలా కృషి చేశారు. అలాగే గ్రామంలో బాల్య వివాహాలను పూర్తిగా నిలువరించగలిగారు. విద్యార్థులకు స్థానిక భాషలో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, ఆడియో పాఠాలను అందించేందుకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌లను తీసుకొచ్చారు. దీంతో మహారాష్ట్రలో క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టిన తొలి పాఠశాలగా డిసేల్ ఆధ్వర్యంలోని స్కూలు నిలిచింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాలను ప్రవేశ పెడతామని రాష్ట్ర ప్రభుత్వం 2017 లో ప్రకటించింది.

ఉద్యోగులకు ఓటేయడం రాదా! 40 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చిత్తు! 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలైన మొత్తం 1,926 పోస్టల్ బ్యాలట్ ఓట్లలో దాదాపు 40 శాతం చెల్లకుండా పోయాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిలో కొంతమంది, 80 ఏళ్ళు దాటిన వృద్ధులు, వికలాంగులు పోస్టల్ బ్యాలట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసిన వారిలో మెజార్టీ ఉద్యోగులే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు వారి ఓట్లే చెల్లకుండా పోవడం విస్మయ పరుస్తోంది.  పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఓటు ఎలా వేయాలో అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాళ్లే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ప్రజల చేత ఓట్లు ఎలా వేయిస్తారనే ప్రశ్న సామాన్యుల నుంచి వస్తోంది. అయితే ఓటేయం రాదని చెప్పడం సరికాదని, అభ్యర్థులు నచ్చక కొందరు ఉద్యోగులు కావాలనే చిత్తు చేస్తారని చెబుతున్నారు. దీనిపైనా విమర్శలు వస్తున్నాయి. అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేసే ఆప్షన్ ఉందని అలా  కాకుండా చిత్తు చేయడంతో ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుందని మరికొందరు చెబుతున్నారు.   గ్రేటర్ పరిధిలో చెల్లిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మెజార్టీ బీజేపీకే పడ్డాయి.దీంతో ఉద్యోగులు కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ లాంటిదంటూ టీఆర్ఎస్ నేతలు చెబుతుంచారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో ఆ రెండు కళ్లు అధికార పార్టీకి వ్యతిరేకంగానే నిలిచినట్లు కౌంటింగ్ లో తేలింది. ప్రభుత్వం నుంచి వివిధ రకాల సంక్షేమ పథకాలను అందుకున్న వృద్ధులు కూడా ఈసారి అధికార పార్టీకి ఓటు వేయకుండా బీజేపీ వైపు మళ్ళారు. ప్రభుత్వ సేవకులుగా ఉండే ఉద్యోగులు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగానే నిలిచారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సిత్రాలు.. అంతా ఉల్టా పల్టా

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో అనేక చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒక చోట పోలైన ఓట్ల కంటే బాక్సులో తక్కువ ఓట్లు ఉండగా.. మరో డివిజన్‌లో పోలైన ఓట్ల కంటే బాక్సులో ఎక్కువగా ఓట్లు ఉండటంతో గందరగోళం నెలకొంది. తాజాగా వివేకానందనగర్‌ కౌంటింగ్‌ కేంద్రంలో ఈ గందరగోళం బయటపడింది. ఈ డివిజన్‌లో మొత్తం 355 ఓట్లు పోల్ కాగా బ్యాలెట్ బాక్స్ లో 574 ఓట్లు ఉన్నాయని అధికారులు చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క గోషామహల్ నియోజకవర్గంలో కూడా ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. జాంబాగ్ డివిజన్‌లోని బూత్ నెంబర్ 8లో మొత్తం పోలైన ఓట్లు 471 కాగా.. బాక్స్‌లో కేవలం 257 ఓట్లు ఉన్నాయి. దీంతో మిగిలిన ఓట్ల గల్లంతుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. అయితే పోలింగ్ శాతం తప్పుగా వెల్లడించామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇవిఎం ల ట్యాపరింగ్ పై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా పేపర్ బ్యాలెట్ విధానాన్ని కూడా భ్రష్టు పట్టించే ఇటువంటి ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణం అవుతున్నాయి.   ఇది ఇలా ఉండగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ ఎన్నికల సంఘం గురువారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టి వేసిన సంగతి తెలిసిందే. కేవలం స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఎన్నికల సంఘం వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై లంచ్ మోషన్ దాఖలు చేయనున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తిరిగి పరిశీలించాలని ఎన్నికల సంఘం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తోంది. ఈ రివ్యూ పిటిషన్‌ను స్వీకరించాలంటూ న్యాయస్థానానికి ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేయనుంది.

బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది! గ్రేటర్ ఫలితాలపై కంగనా ట్వీట్

జీహెచ్ఎంసీ ఎన్నికల తొలి ఫలితాలపై హీరోయిన్ కంగన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోందని ఆమె ట్వీట్ చేసింది. జీహెచ్ఎంసీ ఫలితాలపై ఒకరు చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఆమె పలు వ్యాఖ్యలు చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపులో మొదటి కౌంటింగ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉండడం పట్ల హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించింది.    ‘ప్రియమైన కాంగ్రెస్ పార్టీ... మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి.. రోజంతా కంగనా కంగనా అంటూ నా నామ జపం చేస్తున్నాయి.. ఇలాగైతే మీకు ఏ లాభం ఉండదు. క్లిష్టమైన నగరాల్లో బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంది’ అని కంగనా రనౌత్ ట్వీట్ లో పేర్కొన్నారు.

టీడీపీకే కాదు వైసీపీకి కూడా ఉన్నాయి ఇలాంటి ఆణిముత్యాలు.. సీఎం సార్

అధికారంలో ఎవరు ఉన్నా వారిని కాకాపట్టే వారు ఎపుడూ ఉంటూనే ఉంటారు. అయితే ఇటువంటి కాకా రాయుళ్ల తో జాగ్రత్తగా ఉన్న నాయకులు ప్రజల ఇబ్బందుల గురించిన నిజాలు తెలుసుకుంటూ తమ పాలనను సజావుగా సాగేలా చూసుకుంటారు. అయితే ఈ కాకా రాయుళ్ల మాయలో పడి అంతా సవ్యంగానే ఉంది అని మురిసిపోతే ఏపీలో చంద్రబాబు లాంటి పరిస్థితే ఎవరికైనా తప్పదు. పాపం అయిదేళ్ల అయన పాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ బాగున్నారని.. ప్రజలలో 70 నుండి 80 శాతం మంది ప్రభుత్వ కార్యక్రమాల పట్ల సంతృప్తిగా ఉన్నారని అయన చుట్టూ ఉన్న నాయకులు, అధికారులు కూడా ఊదర గొట్టారు. దీంతో అసలు రాష్ట్రంలో ప్రజల మనసులో ఏం ఉందొ తెలుసుకోకుండా బాబు గారు ఎన్నికలలో చతికిల పడ్డారు.   తాజాగా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు విపరీతంగా సర్క్యులేట్ ఐన "జయము జయము చంద్రన్న" అనే వీడియోను ఎపి సీఎం జగన్ అసెంబ్లీలో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్లే చేస్తున్నపుడు ఇటు సీఎం జగన్ అటు స్పీకర్ తమ్మినేని తమ నవ్వును అదుపు చేసుకోవడానికి ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు ఆయనను పొగుడుతూ కొంత మంది టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో పోలవరం డ్యామ్ దగ్గర ఈ వీడియోను షూట్ చేసారు.   అయితే టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఇప్పటికే అందరూ చూసేసిన వీడియోను అసెంబ్లీలో ప్లే చేసి సీఎం జగన్ పొరపాటు చేసారని వైసిపి వర్గాలు కూడా భావిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వీడియో ను ప్రదర్శించడం ద్వారా ఇప్పటికే ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న బాబును అవమానించారని ప్రజలు భావించే అవకాశం కూడా ఉందని.. దీంతో అనవసరంగా చంద్రబాబుకు సానుభూతి పెరిగే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. గత ఏడాదిన్నర కాలంలో కేసులు, అరెస్టులతో జనంలో సానుభూతి కోసం టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో అసెంబ్లీలో ఇలా రచ్చ చేసి నవ్వుకోవడం టీడీపీకి ఉపయోగపడే అంశమే అని వారి ఆందోళన.   అయితే ఇదే సమయంలో ఇటువంటి భజన ఆణిముత్యాలు వైసిపికి కూడా ఉన్నాయని అవి బయట పడితే వైసిపికి కూడా డ్యామేజ్ తప్పదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తాజాగా శ్రీకాళహస్తిలో వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ర్యాలీలో దండలు వేసిన పల్లకిలో సీఎం జగన్ ఫోటోను పెట్టి ఊరేగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో వీడియోలో జగన్ ఫోటోని పల్లకిపైన పెట్టి ముందు వాయిద్యాలు పెట్టి మరీ ఊరేగించారు. వీటన్నిటిని గమనించినట్లయితే అధికారంలో ఎవరు ఉన్నా.. భజన బ్యాచ్ వారిని మోసేస్తుందని వారితో జర భద్రంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ దూకుడు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటగా లెక్కిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ దూసుకుపోయింది. మెజార్టీ డివిజన్లలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ అభ్యర్థులకు లీడ్ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లోని మొత్తం 150 డివిజన్ల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తైంది.  82 డివిజన్లలో కమలానికే ఎక్కువ వచ్చాయి. 31 డివిజన్లలో టీఆర్ఎస్, 16 డివిజన్లలో ఎంఐఎం, నాలుగు డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కువ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. 17 డివిజన్లలో ఏ పార్టీ అభ్యర్థికి పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ రాలేదు. అయితే పోల్టల్ బ్యాలెట్ లీడ్లు మెజార్టీ డివిజన్లలో ఒకటి, రెండు ఓట్ల వరకే ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో చెల్లని ఓట్లు  భారీగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

స్వస్తిక్ మార్క్ ఉంటేనే వాలిడ్! ఎస్ఈసీ సర్క్యులర్‌ కొట్టేసిన హైకోర్టు

జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపు జరుగుతున్న సమయంలో  రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ఎస్ఈసీ జారీ చేసిన సర్క్యులర్‌ను తోసిపుచ్చింది. బ్యాలెట్ పేపర్ల పై స్వస్తిక్ మార్క్ తప్ప మిగతా ఏదైనా పెన్ను మార్కు, ఇంకు మార్కు ఉంటే వాటిని వాలిడ్ ఓట్లుగా పరిగణించరాదని ఎన్నికల సంఘానికి తేల్చిచెప్పింది. కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి గ్రేటర్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించింది. బ్యాలెట్ పేపర్‌లో పెన్ను మార్క్‌ను కూడా ఓటుగా పరిగణిస్తామని ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ పై బీజేపీ పార్టీ శనివారం ఉదయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.  గ్రేటర్‌ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లో స్వస్తిక్‌ గుర్తు ఉన్నవాటినే కాకుండా సంబంధిత పోలింగ్‌ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.  ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు ఓటింగ్‌ సమయంలో ఓటర్లకు స్వస్తిక్‌ ముద్రకు బదులు పొరపాటున పోలింగ్‌ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని ఈసీ దృష్టికి తీసుకురావడంతో.. దానికి పరిష్కారంగా అలాంటి ఓట్లనూ లెక్కించాలంటూ ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ముద్ర మారినా ఓటర్ల ఎంపిక మారదంటూ అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  ఎస్ఈసీ ఇచ్చిన ఆ సర్క్యూలర్ హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది.

జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్: ఎయిమ్స్ గుడ్ న్యూస్ 

మనదేశంలో కరోనా టీకా కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఆలిండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. డిసెంబర్ చివరికి లేదా జనవరిలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ తెలిపారు. కరోనా టీకా పరీక్షలు తుది దశకు చేరుకున్నాయని, అత్యవసర వినియోగానికి అనుమతులు లభించిన వెంటనే పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని భద్రపరిచేందుకు అవసరమైన ఉష్ణోగ్రతలు, స్థలం, వ్యాక్సిన్ ఇచ్చే వారికి శిక్షణ, సిరంజిల లభ్యత వంటి వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏర్పాట్లు చేస్తున్నాయని డాక్టర్ రణ్‌దీప్ వెల్లడించారు.   కరోనా టీకా సేఫ్టీ, రియాక్షన్స్  పైనా ఎయిమ్స్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. కరోనాటీకాకు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నప్పుడు అపశ్రుతులు సహజమేనని చెప్పారు.  చెన్నైలో వ్యాక్సిన్ పరీక్షలో పాల్గొన్న ఓ వలంటీర్ అనారోగ్యానికి గురైనట్టు వచ్చిన వార్తలపైనా డాక్టర్ రణదీప్ స్పందించారు. అతడికి ఇతరత్రా కారణాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తి ఉండొచ్చని, టీకా వల్ల అయి ఉండదని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 80 వేల మంది వలంటీర్లకు టీకా ఇచ్చినా ఎవరిలోనూ ఎటువంటి సమస్యలు ఎదురు కాలేదన్నారు. అయితే ఏదైనా వ్యాక్సిన్‌ను సుదీర్ఘకాలంపాటు తీసుకుంటే మాత్రం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. మన దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు చెప్పిన డాక్టర్ గులేరియా.. మరో మూడు నెలల్లో పెద్ద మార్పు కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రేటర్ పీఠం మళ్లీ గులాబీదే!  ఎగ్జిట్ పోల్స్ లో కారు హవా  

గ్రేటర్‌ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. ఇప‍్పటివరకూ వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌లో అధికారి పార్టీదే హవా. గతంలో కంటే సీట్లు తగ్గుతున్నా.. టీఆర్‌ఎస్‌ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఓట్ల శాతం మెరుగ్గా ఉన్నా సీట్లలో బీజేపీ వెనకబడే ఛాన్స్‌ ఉంది. పాతబస్తిలో పట్టు నిలుపుకుని మజ్లిస్‌ పార్టీ 40 కంటే ఎక్కువ సీట్లలో గెలవనుందని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది.    ‘పీపుల్స్‌ పల్స్‌’ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే లో టీఆర్‌ఎస్‌కు 68-78 స్థానాలు, బీజేపీకి 25-35, ఎంఐఎంకు 38-42 స్థానాలు, కాంగ్రెస్‌కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌, బీజేపీకి మధ్య 6 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సైలెంట్‌ వేవ్‌ కన్పిస్తోందని..ఈ వేవ్‌ పనిచేస్తే బీజేపీ మరింత లాభపడే అవకాశం ఉందని ‘పీపుల్స్‌ పల్స్ వెల్లడించింది.    టీఆర్‌ఎస్‌కు 71 నుంచి 85 వరకు సీట్లు వస్తాయని ఆరా సర్వేలో వచ్చింది. ఆరా అంచనా ప్రకారం బీజేపీకి 23 నుంచి 33 సీట్లు రానున్నాయి. ఎంఐఎంకు 36 నుంచి 46, కాంగ్రెస్ కు సున్నా నుంచి 4 సీట్లు వస్తాయని ఆరా సర్వే తెలిపింది. సీపీఎస్‌సర్వేలో టీఆర్‌ఎస్‌కు 82 నుంచి 96 సీట్లు రానుండగా.. బీజేపీకి 12-20  సీట్లు, ఎంఐఎంకు 32 నుంచి 38 సీట్లు వస్తాయని అంచనా వేసింది.  ఏకంగా 95 నుంచి 101 డివిజన్లులో కారు గెలుస్తుందని నాగన్న సర్వే వెల్లడించింది. నాగన్న సర్వేలో బీజేపీకి 5 నుంచి 12, ఎంఐఎంకు 35 నుంచి 38 డివిజన్లు రానున్నాయని తెలిపింది. ఎన్ఎఫ్వో సంస్థ టీఆర్ఎస్ 85-95, బీజేపీ 15-25 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆత్మసాక్షి సర్వేలో టీఆర్‌ఎస్‌కు భారీ సీట్లు 82 నుంచి 88 సీట్లు వస్తాయని తేలింది.   గ్రేటర్ ఎన్నికలపై ఇప్పటివరకు వెల్లడైన అన్ని సర్వేల్లోనూ టాప్‌గా కనిపిస్తోంది టీఆర్‌ఎస్‌. అధికార పార్టీకి కనిష్టంగా 68, గరిష్టంగా 101 సీట్లు వచ్చాయి. బీజేపీకి గరిష్టంగా 35, కనిష్టంగా ఐదు డివిజన్లు రానున్నాయి.ఎంఐఎంకి కనిష్టంగా 32, గరిష్టంగా46 సీట్లు వస్తాయని తేలింది. శాంతి భద్రతల అంశంలో టీఆర్‌ఎస్‌కు మార్కులు వచ్చాయని సర్వే సంస్థలు వెల్లడించాయి. మహిళలు, వృద్ధులు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. అయితే వరద సాయంలో విషయంలో మాత్రం  51% మంది టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీకి అనుకూలంగా యువత, నిరుద్యోగులు నిలిచారు. పాతబస్తీలో పట్టు కొనసాగించింది మజ్లిస్‌ పార్టీ. 12 నుంచి 14 సీట్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ ఉందని అంచనా వేశారు.

పెన్ను మార్క్ కూడా ఒకే.. ఎలక్షన్ కమిషన్ అర్ధరాత్రి సర్క్యులర్ పై హైకోర్టుకు బీజేపీ 

జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ మరి కొద్దీ సేపట్లో ప్రారంభం అవుతుందనగా నిన్న అర్ధరాత్రి తెలంగాణ ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. బ్యాలెట్ పేప‌ర్ల‌పై కేవలం స్వ‌స్తిక్ గుర్తు ఉన్న‌వే కాకుండా…పోలింగ్ కేంద్రాల సంఖ్య‌ను సూచించే ముద్ర‌లు వేసినా లేక మార్కర్‌ పెన్నుతో టిక్కు పెట్టినా ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవాలంటూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.   ఎన్నికల సంఘం తాజా ఆదేశాల పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ఆదేశాల పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ అధికారులకు మాత్రమే జారీ చేసిన ఆ సర్క్యులర్‌ వెనుక ఆంతర్యం ఏంటని అయన ఎస్‌ఈసీని నిలదీశారు. ప్రగతిభవన్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఎన్నికల కమిషనర్‌ ఈ సర్క్యులర్‌ జారీ చేశారని అయన ఆరోపించారు. తక్షణం ఈ సర్క్యులర్‌ను రద్దుచేయాలని, ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులైన అధికారులను సర్వీసు నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అవసరమైతే దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని అయన ప్రకటించారు. అయితే తాము కౌంటింగ్‌ను మాత్రం అడ్డుకోబోమన్నారు. ఈ సర్క్యులర్ విషయంలో ముఖ్యమంత్రికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు గుణపాఠం తప్పదన్నారు. అంతేకాకుండా ఎస్‌ఈసీని గ్యాంబ్లర్‌గా అభివర్ణించిన సంజయ్‌.. ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారని మండిపడ్డారు.   తెలంగాణ ఎన్నికల సంఘం తాజా ఆదేశాలపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నిక‌ల సంఘం నిర్ణయం పై విచారణ చేపట్టాలని కోరుతూ బీజేపీ నేత‌లు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మ‌రి కొద్దిసేప‌ట్లో ఈ అంశంపై కోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఎటు వెళుతుందో చూడాలి.

ఇద్దరు ముఖ్య నేతలపై నిఘా! జగన్ కు తిరుగుబాటు భయమా?  

రాజకీయాల్లో నమ్మకానికి చోటు ఉండదంటారు. పదవుల కోసం నాయకులు ఎంతకైనా తెగిస్తారు.. తమ అధినేతలనే ఎదురిస్తారు.. అవసరమైతే  దిగజారిపోతారు.  తమకు ఎప్పుడు సమయం దొరుకుంతుందా అన్నట్లుగా ఎదురు చూస్తుంటారు నేతలు. ఏ చిన్న అవకాశం వచ్చినా తిరుగుబాటుకు కూడా వెనుకాడరు.  గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అందుకే రాజకీయ నేతలు పూర్తిగా ఎవరిని నమ్మరని చెబుతారు.  ముఖ్య నేతలైతే తమ వెంట ఉండేవారిపైనా నిఘా పెడుతుంటారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో  కనిపిస్తోంది. వైసీపీలో కీలక నేతలుగా ఉన్న ఓ కుటుంబంపై ఇప్పుడు.. ఆ పార్టీ పెద్దల్లో అనుమాన బీజం మొదలైందని చెబుతున్నారు. ఆ కారణంగానే నేతలను  పక్కన పెడుతున్నారనే చర్చ జరుగుతోంది.     ఆ తండ్రి కొడుకులు ప్రస్తుతం ఏపీకి సంబంధించి కీలక పదవుల్లో ఉన్నారు. సీఎం వైఎస్‍ జగన్‍ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆ తండ్రి కొడుకులపై  జగన్‍రెడ్డి గతంలో ఎంతో నమ్మకం చూపించేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు,  అధికారంలోకి వచ్చాక  కూడా ఆ ఇద్దరికి  అత్యంత విలువ ఇచ్చేవారు. కాని ఇప్పుడు మాత్రం సీన్ మారిందంటున్నారు.  ఆ తండ్రి కొడుకులపై సిఎం జగన్‍ రెడ్డికి అనుమానాలు వచ్చాయంటున్నారు. మీడియాతో పాటు సోషల్‍ మీడియాలో వస్తున్న కథనాలతో అవి మరింత బలపడ్డాయని చెబుతున్నారు. దీంతో గతంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ఆ ఇద్దరు నేతలను ఇప్పుడు జగన్ ఎక్కువగా పట్టించుకోవడం లేదనే చర్చ వైసీపీ నేతల్లో జరుగుతోంది. ఆ మంత్రి కుమారుడు  తాడేపల్లి నివాసానికి ఎప్పుడు వచ్చినా రెడ్‍ కార్పెట్‍ పరిచేవారు. ఆ ఎంపీ మాత్రమే  జగన్‍ రెడ్డిని ఏ సమయంలోనైనా కలిసే వ్యక్తిగా పేరుంది. అలాంటి నేత ఇప్పుడు అనుమానపు చూపులతో తాడేపల్లి రావడమే మానేశారని తెలుస్తోంది.    వైసీపీ పెద్దలకు అనుమానం వచ్చిన ఆ ఇద్దరు నేతలు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. మిధున్‍ రెడ్డి. తండ్రి పెద్ది రాంచంద్రారెడ్డి జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉండగా.. ఆయన తనయుడు మిథున్ రెడ్డి వైసీపీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. వారిద్దరిపై జగన్ కు అనుమానం రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి పదవే. ఇటీవల సీఎం జగన్ పై ఓ చర్చ జరుగుతోంది. కోర్టు తీర్పుల వలన జగన్  జైలుకు వెళ్లవచ్చని.. జగన్ జైలుకు పోతే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్నది ఆ చర్చ సారాంశం. జగన్ భార్య భారతిని కానీ.. తల్లి విజయలక్ష్మీని కానీ ముఖ్యమంత్రిని అవుతారని కొందరు చెబుతున్నారు. ఇక్కడే అసలు  ట్విస్ట్ మొదలైంది. ముఖ్యమంత్రి రేసులో మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జగన్ జైలుకు పోతే  ముఖ్యమంత్రి కావాలని పెద్దిరెడ్డి ఆశ పడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఆయనకు 70 నుండి 80 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని.. అవసరమైతే ఆయన తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని కొన్ని మీడియా సంస్థలు కధనాలు ప్రచురించాయి. ఒకటి రెండు టివి ఛానెళ్లు ఆ మంత్రిని ఇంటర్యూ  కూడా చేశాయి.    ఇదే ఇప్పుడు ఆ తండ్రి కొడుకులకు సమస్యగా మారిందంటున్నారు. తనకు అలాంటి ఆలోచన లేదని, సిఎం జగన్‍ రెడ్డి జైలుకు వెళ్లే ప్రసక్తే లేదని పెద్దిరెడ్డి చెబుతున్నారు. ఒకవేళ  ఏదైనా జరిగితే .. సిఎంగా జగన్‍  ఎవరిని సూచిస్తే వారినే అంగీకరిస్తామే తప్ప సిఎం పోస్టు కోరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయినా పెద్దిరెడ్డిపై జరుగుతున్న ప్రచారం ఆగడం లేదు.  దీంతో సీఎం జగన్ కూడా వారిని నమ్మడం లేదని చెబుతున్నారు.  మంత్రి రామచంద్రారెడ్డితో పాటు ఎంపీ మిధున్‍ రెడ్డి కదలికలపై  ముఖ్యమంత్రి నిఘా వేయించారని ప్రచారం జరుగుతోంది. ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం తమపై ఎలాంటి నిఘా లేదంటున్నారు. తాము జగన్‍  వీర విధేయులమని, తమపై కావాలనే లేనిపోని అనుమానాలను కొందరు సృష్టిస్తున్నారని వాపోతున్నారు. అయితే  మంత్రి రామచంద్రారెడ్డి తిరుగుబాటు చేస్తారని జరుగుతున్న ప్రచారం వెనుక వైసీపీ నేతలే ఉన్నారనే అనుమానాలు కూడా  వస్తున్నాయి. అయితే ఆ సూత్రదారులు, పాత్రదారులు ఎవరో బయట పడటం లేదు.. మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై జరుగుతున్న చర్చ మాత్రం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

నీకు సబ్జెక్ట్ తెలియదు.. అసెంబ్లీ ఏమన్నా మీ తాత జాగీరా?

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ ముమ్మాటికీ ఫేక్‌ ముఖ్యమంత్రేనని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే పెన్షన్లను భారీగా తొలగించారని ఆరోపించారు. సభల్లో జగన్ చెప్పేది ఓ లెక్క అయితే.. ప్రభుత్వ డేటాలో ఉండేది మరో లెక్కని అన్నారు. టీడీపీకి చెందిన వారికి పెన్షన్‌, రేషన్‌ కట్‌ చేశారని చెప్పారు. టీడీపీ హయాంలో 44.32 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం అబద్దం చెప్పిందన్నారు. టీడీపీ హయాంలో 50.29 లక్షల మందికి పెన్షన్‌ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. పెన్షన్ల విషయంలో వైసీపీ తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు.    అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదని విమర్శించారు. అసెంబ్లీని వైసీపీ నేతలు తప్పుదారి పట్టించారని ధ్వజమెత్తారు. టీడీపీ వాళ్లు అసెంబ్లీకి రాకూడదని అంటున్నారు.. అసెంబ్లీ ఏమన్నా మీ తాత జాగీరా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.     జగన్‌ ఒక జీరో సీఎం.. అవగాహన లేని ముఖ్యమంత్రి అని విమర్శించారు. దిశ చట్టం తెస్తున్నామని, అసెంబ్లీలో ప్రకటించిన నాడే జగన్ కు హితవు పలికానని అన్నారు. కొంచెం ఓపిక పట్టు, నీకు పెద్దగా విషయ పరిజ్ఞానం లేదు అని నచ్చచెప్పేందుకు యత్నించానని తెలిపారు. సబ్జెక్టు గురించి ఏం తెలుసు నీకు? కనీసం బిజినెస్ రూల్స్ అంటే తెలుసా? హెచ్ఓడీ రూల్స్ తెలుసా? సచివాలయ రూల్స్ తెలుసా? ఏమీ తెలియవు నీకు అని విమర్శించారు. చట్టం తెచ్చిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. ఇవేమీ చెయ్యకుండా చట్టాన్ని ఢిల్లీకి పంపించి ఇక్కడ పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు. బుద్ధి ఉన్నవాడెవడూ ఇలా చేయడు. మేం కట్టిన పోలీస్ స్టేషన్లకు రంగులేసుకుని రిబ్బన్ కట్ చేశారు. ఇలాంటి వాళ్లతో రాష్ట్రం పరువేం కావాలి! అతను అమాయకుడో, మనం అమాయకులమో అర్థం కావడంలేదు అని విరుచుకుపడ్డారు.

కరోనా టీకా ప్రభావాన్ని పరీక్షిస్తాం! ముగ్గురు అగ్రనేతల సాహసం 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో అమెరికాకు చెందిన ముగ్గురు మాజీ అగ్రనేతలు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు తామే ముందుగా కరోనా టీకాను తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్‌ లు దీనికి సంబంధించిన ప్రకటనలు చేశారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి పొందిన తర్వాత కరోనా వ్యాక్సిన్లను తీసుకునే వాలంటీర్లుగా ఉండేందుకు సిద్ధమని ముగ్గురు అగ్రనేతలు ప్రకటించారు.    అమెరికాలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది. వైరస్ ప్రభావం మొదలైన తొలినాళ్లలో యూఎస్ లో భారీ సంఖ్యలో కేసులు వచ్చాయి. మధ్యలో కొంచెం తగ్గాయి. గత కొన్ని రోజులుగా మళ్లీ వైరస్ కేసులు  పెరుగుతున్నాయి. అమెరికాలో కరోనా మరణాలు కూడా ప్రమాదకరంగానే ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే యూఎస్‌కు చెందిన ఫైజర్, మోడెర్నా ఔషధ కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్స్ ప్రభావంతంగా పని చేస్తున్నట్లు తేలింది. దీంతో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందిన వెంటనే ప్రజలకు ఈ వ్యాక్సిన్లను ఇచ్చేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. కాని అక్కడి ప్రజల్లో ఈ వ్యాక్సిన్ల భద్రత, ప్రభావంపై అనుమానం నెలకొంది. సుమారు 42 శాతం మంది ఈ టీకాలను తీసుకోవడానికి సుముఖంగా లేరని తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ తరుణంలో ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకు తాము స్వచ్ఛందంగా టీకా తీసుకుంటామని ప్రకటించారు.    ప్రజల్లో టీకా భద్రత, ప్రభావంపై విశ్వాసాన్ని పెంపొందిచేందుకు తాను కెమెరా సాక్షిగా వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధమని ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో  ఒబామా ప్రకటించారు. మరో మాజీ అధ్యక్షుడు జార్జీ బుష్ కూడా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫ్రెడ్డీ ఫోర్డ్  చెప్పారు. అలాగే వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించి, ప్రోత్సహించడానికి బహిరంగంగా టీకాను తీసుకోవడానికి బిల్ క్లింటన్‌ కూడా రెడీగా ఉన్నారని ఆయన ప్రెస్ సెక్రటరీ ఏంజెల్ యురేనా వెల్లడించారు.