అప్పుడు బేడీలు.. ఇప్పుడు ధర్నాలా! తెలంగాణ సీఎంపై నెటిజన్ల సెటైర్లు
posted on Dec 7, 2020 @ 12:00PM
నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం మరింత తీవ్రమైంది. రైతు సంఘాలు పిలుపిచ్చిన భారత్ బంద్ కు దేశంలోని పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రైతుల సమరానికి సపోర్ట్ చేశారు. భారత్ బంద్ లో టీఆర్ఎస్ కార్యకర్తలంతా భారీగా పాల్గొనాలని కేసీఆర్ పిలుపిచ్చారు. కేంద్రం తెచ్చిన కొత్త బిల్లులు, ఢిల్లీ సరిహద్దులో రైతులకు అడ్డుకోవడంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు మద్దతుగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తెలంగాణలో నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేస్తూ.. ఇప్పుడుఢిల్లీ సరిహద్దులో రైతులను అడ్డుకోవడాన్ని తప్పుపట్టడంపై నెటిజన్లు ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. ఢిల్లీ సరిహద్దుతో అన్నదాతలు చేస్తున్న పోరాటానికే మద్దతు ఇస్తూనే.. గతంలో రైతుల పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరును ఎండగడుతున్నారు.
2017 ఏప్రిలో లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర పంటను కొనుగోలు చేయాలంటూ ధర్నాకు దిగిన మిర్చి రైతులకు బేడీలు వేసి.. 12 రోజుల పాటు జైలుకు పంపిన విషయం తెలంగాణ ముఖ్యమంత్రి మర్చిపోయినట్లు ఉన్నారని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. అప్పుడు రిమాండ్‌లో ఉన్న రైతులకు బేడీలు వేసి పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. రైతులను కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లతో తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2017 ఖమ్మం ఘటనపై సీఎం కేసీఆర్ ముందు రైతులకు క్షమాపణ చెప్పాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మక్కజొన్నలు కొనాలంటూ ఉత్తర తెలంగాణ రైతులు.. సన్నాలకు మద్దతు ధర ఇవ్వాలంటూ దక్షిణ తెలంగాణ రైతులు ఆందోళనలు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదని కేసీఆర్ ను సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. రైతుల ఉద్యమాలకు తెలంగాణలో ఒక న్యాయం. ఢిల్లీలో మరో న్యాయం ఉంటుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
2017 ఏప్రిల్ 28న ఖమ్మం మార్కెట్‌కు సుమారు 2 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. ఇదే అదనుగా వ్యాపారులు, ఏజెంట్లు కుమ్మక్కై మిర్చిధరను ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులంతా ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో మార్కెట్ కార్యాలయం, చైర్మన్ చాంబర్, ఈనామ్ కార్యాలయాల్లో ఫర్నీచర్, కంప్యూటర్లను, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సండ్ర వెంకటవీరయ్యతో పాటు పదిమంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రిమాండ్‌లో ఉన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం తీవ్ర దుమారం రేపింది. దేశ వ్యాప్తంగా రచ్చగా మారడంతో పోలీసు ఉన్నతా ధికారులు స్పందించి.. రైతులకు బేడీలు వేసి తీసుకువచ్చిన ఇద్దరు ఏఆర్ ఎస్సైలను సస్పెండ్ చేశారు. 12 రోజుల తర్వాత బెయిల్ రావడంతో పది మంది రైతులు.. 2017 మే 12న విడుదలయ్యారు. 2017లో ఖమ్మంలో జరిగిన ఘటనలు ఉదహరిస్తూ .. ఇప్పుడు కేసీఆర్ ను కడిగి పారేస్తున్నారు సోషల్ మీడియా వారియర్లు .
గత యాసంగిలో నియంత్రిత సాగు విధానం అమల్లోకి తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులతో సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. నియంత్రిత సాగు విధానం ప్రకారం తాము చెప్పినట్లు సాగు చేస్తేనే... ఆ పంటను కొంటామని ప్రకటించింది. యాసంగిలో మొక్కజొన్న వేయవద్దని సూచించింది. కొందరు రైతులు మాత్రం స్థానిక పరిస్థితులు. భూమి రకం ఆధారంగా మొక్కజొన్న సాగు చేశారు. అయితే వాళ్ల పంటను కొనుగోలు చేయడానికి అధికారులు నిరాకరించారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినా మక్కలను కొనుగోలు చేయడానికి నిరాకరించింది టీఆర్ఎస్ సర్కార్. అన్నదాతలు ఎంతగా ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. అంతలోనే దుబ్బాక ఉప ఎన్నిక రావడంతో.. తమకు ఎక్కడ ఇబ్బంది అవుతుందోమోనన్న భయంతో దిగొచ్చి మక్కల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. సన్నాలకు మద్దతు ధర కోసం కొన్ని రోజులుగా రైతులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించ లేదు. దీంతో తాము పండించిన పంటతో తమకు గిట్టుబాటు కావడం లేదంటూ కొందరు రైతులు తం పంటలకు నిప్పు కూడా పెట్టుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తమ పోస్టులకు జత చేస్తూ కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు.
తెలంగాణలో కొంత కాలంగా ఎలాంటి ఆందోళనలు, నిరసనలకు అనుమతి ఇవ్వడం లేదు. హైదారాబాద్ లో దశాబ్దాలుగా ధర్నా పాయింట్ గా ఉన్న ఇందిరా చౌక్ ను ఎత్తివేసింది కేసీఆర్ ప్రభుత్వం. దీనిపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించినా కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగానే వ్యవహరించింది. ధర్నా చౌక్ తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కోరడం వల్లే ధర్నా చౌక్ ను ఎత్తివేశామని కవరింగ్ చేసుకుంది. అయితే ప్రజా సంఘాలు కోర్టుకు వెళ్లి ఇందిరా చౌక్ లో ధర్నా పాయింట్ ను పునరుద్దరించుకున్నాయి. ఇలా ఇంతగా తెలంగాణలో నిరసనలపై నిర్భంధాలు పెడుతున్న కేసీఆర్ పార్టీ.. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా హడావుడి చేయడం రాజకీయ దివాళుకోరుతనానికి నిదర్శనమని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.