2021 అత్యంత చెత్త సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తుంది
posted on Dec 7, 2020 9:24AM
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఎంతో భారంగా నడుస్తూ, ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ ఏడాది ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కనీసం నూతన సంవత్సరమైనా సంతోషంగా ఉంటామని భావిస్తున్నారు. అయితే వచ్చే ఏడాదిలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్పీ) హెచ్చరించింది. విపత్తులకు ప్రజలు తమను తాము సిద్ధం చేసుకోవాలని డబ్ల్యూఎఫ్సీ చీఫ్ డేవిడ్ బీస్లీ కోరారు. 2021 ఒక శతాబ్దంలో ప్రజలు చూసిన అత్యంత చెత్త సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా వేశారు. వచ్చే సంవత్సరం తీవ్రమైన ఆకలి, కరువు తాండవిస్తాయని.. ముఖ్యంగా పేద దేశాల్లో ఈ ప్రభావం చాలా అధికంగా ఉంటుందని తెలిపారు.
కరోనా మహమ్మారి, ప్రపంచంపై దాని ప్రభావాల గురించి చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో డేవిడ్ బీస్లీ ఈ హెచ్చరికలు జారీ చేశారు. డబ్ల్యూఎఫ్‌పీ ప్రకారం ప్రపంచంలోని 27 కోట్ల మంది ఆకలి వైపు పయనిస్తున్నారని, రానున్న ఏడాది తీవ్రమైన కరువు ఉండబోతుందని తెలిపారు. ప్రస్తుతం మహమ్మారి విజృంభణ వల్ల తలెత్తిన సంక్షోభం వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది అన్నారు. ఈ ఏడాది కరోనా నివారణకు 19 ట్రిలియన్ డాలర్ల వరకూ ఖర్చయిందని పేర్కొన్నారు. అయితే దీని ఫలితం వచ్చే ఏడాది దక్కే అవకాశాలు లేవని అన్నారు. ప్రపంచ వ్యవస్థ మరో మెట్టు దిగజారనుందని బీస్లీ హెచ్చరించారు.