వాలంటీర్ వ్యవస్థ ఘోర వైఫల్యం! ఏలూరు వింత వ్యాధి ఘటనే సాక్ష్యం

గ్రామ సచివాలయ వ్యవస్థను గొప్పగా ప్రచారం చేసుకుంటోంది జగన్ ప్రభుత్వం. మహాత్మ గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశామని జబ్బలు చరుచుకుంటోంది. క్షేత్రస్థాయిలో మాత్రం వాలంటీర్ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. వాలంటీర్లతో ప్రజలకు కొత్తగా జరుగుతున్న ప్రయోజనాలు ఏమి లేవని తెలుస్తోంది. ఏలూరును వణికిస్తున్న వింత వ్యాధి ఘటనతో సచివాలయ వ్యవస్థ పనితీరు ఎంత దారుణంగా ఉందో బయటపడింది. ఫిట్స్ రావడం, కళ్లుతిరగడం, నోటి నుండి నురగ, మూర్ఛ వంటి లక్షణాలతో ప్రజలు రోడ్డుపై పడిపోయి కొట్టుకుంటున్నా ఎక్కడా వాలంటీర్లు కన్పించలేదు. దీంతో చెప్పకొవడానికే తప్ప ఈ వ్యవస్థతో ఎలాంటి  ఉపయోగం లేదని తేలి పోయింది.    గత శనివారం నుంచి ఏలూరులో వింత వ్యాధి ప్రబలింది. ఒక్కొక్కరుగా మొదలై ఇప్పటివరకు దాదాపు 6 వందల మంది ఈ వ్యాధి భారీన పడ్డారు. వింత వ్యాధి కేసులు గంటల్లోనే పెరిగిపోవడంతో ఏలూరు పట్టణమంతా వణికిపోయింది. ఎవరికి ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు వణికిపోయారు. ఏం తాగాలన్నా.. తినాలన్నా  భయపడి పోయారు. ఏలూరులో ఇంత జరుగుతున్నా వాలంటీర్లు ఎక్కడా కనిపించ లేదు. వ్యాధి భయంతో అల్లాడిపోతున్న జనాలకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయారు. వింత వ్యాధి సోకిన పడిపోయిన బాధితులకు వెంటనే చికిత్స అంద లేదు. దీంతో జగన్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు ఎటు పోయారన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో గ్రామ సచివాలయం, పట్టణాల్లో వార్డు సచివాలయాలను జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడే లభిస్తాయని ప్రకటించింది. లక్షలాది మంది వాలంటీర్లను నియమించుకుంది. వైద్య సదుపాయాలు కూడా సచివాలయం నుంచే అందిస్తామని తెలిపింది. కాని ఏలూరులో వింత వ్యాధి వణికించినా ఎవరికి కనీస వైద్యం అందించలేదు సచివాలయాలు.     ఏలూరు దక్షిణపు వీధిలో తొలి వింత వ్యాధి కేసు నమోదైంది. అయితే ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగులోనికి వచ్చింది. దక్షిణపు వీధిలో 15 రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనలు జరిగియని చెబుతున్నారు. ఫిట్స్  వచ్చి పడిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోయారని  తెలుస్తోంది. సాధారణంగానే  చనిపోయారని భావించామని, వారికి కూడా వింత వ్యాధి సోకినట్లుందని మృతుల బంధువులు చెప్పిన విషయాలతో అంతా షాకవుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా పని చేస్తే 15 రోజుల క్రితమే వింత వ్యాధి గురించి తెలిసేదంటున్నారు. అప్పుడే చర్యలు తీసుకుంటే 6 వందల కేసులు వచ్చేవి కాదంటున్నారు. ప్రతి యాబై కుటుంబాలకు ఒక వాలంటీర్ ను పెట్టామని సీఎం జగన్ చెబుతున్నారని.. ఆ 50 కుటుంబాల్లో ఏం జరుగుతుందో వాలంటీర్లు గుర్తించలేకపోయారా అన్న ప్రశ్న వస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫిట్స్ సంబంధిత సమస్యతో చనిపోతే వాలంటిర్లు వైద్యాధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి   మరోవైపు వింత వ్యాధి ఘటనపై వాలంటీర్లే కాదు జగన్ సర్కార్ కూడా సరిగా స్పందించలేదని స్థానికులు అరోపిస్తున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి కేంద్ర బృందాలను పంపించారంటున్నారు. వెంకయ్య నాయుడు చొరవ వల్లే ఎయిమ్స్ బృందం ఏలూరుకు వెళ్లి రోగులను పరీక్షించింది. ఉపరాష్ట్రపతి సూచనతో కేంద్రమంత్రి ఎయిమ్స్ అత్యవసర వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్, పుణే ఎన్ఐవీ వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ దేవష్టవర్, ఎన్డీసీసీ డిప్యూటీ డైరెక్టర్, డాక్టర్ సంకేత్ కులకర్ణిలతో కూడిన ముగ్గురు వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందం ఏలూరు లోని వైద్యుల నుండి ఇక్కడి పరిస్థితిని ఇప్పటికే అడిగి తెలుసుకున్నారు. ఈ బృందం ఏలూరుకు వచ్చి, ల్యాబ్ నివేదికలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందచేశారు. ఢిల్లీలో ఉన్న వెంకయ్యనాయుడు స్పందించేవరకు రాష్ట్ర సర్కార్ నిద్రలోనే ఉందనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది. విపక్షాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి.    

కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా విశిష్టతలు ఇవే! 

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఫౌండేషన్ స్టోన్ వేశారు. 'సెంట్రల్ విస్టా' గా పిలుస్తున్న కొత్త పార్లమెంట్ నిర్మాణాన్ని ఇప్పుడున్న పార్లమెంటు భవనం పక్కనే నిర్మిస్తున్నారు. కొత్త పార్లమెంటుకు సంబంధించి చాలా ప్రత్యేకతలు, విశేషాలు ఉన్నాయి. 9 వందల 71  కోట్ల రూపాయల బడ్జెట్ తో సెంట్రల్ విస్టాను నిర్మిస్తున్నారు. 64 వేల 500 చదరపు మీటర్ల  వైశాల్యంలో కొత్త పార్లమెంట్ ఉండనుంది. ప్రస్తుత పార్లమెంట్ భవనం కంటే 17వేల చదరపు కిలోమీటర్లు పెద్దగా ఉండనుంది. 2022 ఆగస్టులో  జరిగే దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కొత్త పార్లమెంట్ భవనంలోనే నిర్వహించాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే నిర్మాణ పనులు జరిగేలా ప్రణాళికను సిద్దం చేశారు.    కొత్త పార్లమెంటు భవనం మన దేశ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా, ప్రతి అడుగులో భారతీయత ఉట్టిపడేలా నిర్మాణం ఉండనుంది. పురివిప్పి ఆడుతున్న జాతీయపక్షి నెమలి ఆకృతిలో లోక్‌సభ పైకప్పు, విరబూసిన జాతీయ పుష్పంకమలం రూపంలో రాజ్యసభ పైకప్పు, పార్లమెంట్‌లో అంతర్భాగంగా నిలువనున్న జాతీయ వృక్షం మర్రిచెట్టు రూపంలో తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ భవనాన్ని పోలి ఉండనుంది నూతన భవనం రూపు. పార్లమెంట్‌ కొత్త భవనంలో గ్రౌండ్‌, మొదటి, రెండు అంతస్థులు ప్రస్తుత భవనం ఎత్తు ఉండేలా కొత్త భవనం నిర్మాణం చేపడుతున్నారు.   ఒకే సారి 1,224 మంది ఎంపీలు కూర్చుకోవడానికి అనుగుణంగా పార్లమెంట్ నిర్మిస్తున్నారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా సీటింగ్ ఉండనుంది. భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు కార్యాలయాలు నిర్మిస్తున్నారు. విశాలమైన లాంజ్‌, గ్రంథాలయం, బహుళ కమిటీలకు గదులు, భోజనశాలలు, లోక్‌సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా, సాధారణ ప్రజల కోసం ఏర్పాట్లు సైతం ఉండనున్నాయి. మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజలకు 480 సీట్లు చొప్పున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు సభ్యుడికి 40 చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్ ను శ్రమ శక్తి భవన్ లో ఏర్పాటు చేయనున్నారు. శ్రమ శక్తి భవన్ 2024 నాటికి పూర్తవుతుంది.    ప్రస్తుత భవనంలో తొలి రెండు వరుసల్లో కూర్చున్న ఎంపీలకు మాత్రమే డెస్క్‌లు ఉన్నాయి. కొత్త భవనంలో సభ్యులందరికీ డెస్క్‌లు ఉండేలా ఏర్పాట్లున్నాయి. ప్రతి ఎంపీకి టచ్‌ స్క్రీన్‌తో కూడిన డిజిటల్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయనున్నారు. లోక్‌సభే సెంట్రల్‌ హాలుగా 1315 చదరపు మీటర్లలో విస్తరించి ఉండనుంది. లోక్‌సభను ఆనుకొని ప్రధానమంత్రి కార్యాలయం, 20 మీటర్ల ఎత్తులో కానిస్టిట్యూషనల్‌ హాల్‌, దానిపై అశోక స్థూపం నిర్మించనున్నారు. ప్రస్తుత భవనానికి ఉన్నట్లుగానే కొత్త భవనం చుట్టూ నిలువెత్తు రాతి స్తంభాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్యాలరీల్లో కూర్చునే ప్రజలకు సభా కార్యక్రమాలు కనిపించేలా తెరలు ఏర్పాటు చేయనున్నారు. వీవీఐపీల కోసం రెండు గేట్లు, ఎంపీల వాహనాలు వచ్చేందుకు మరో రెండు, సాధారణ ప్రజలు, మీడియా, సందర్శకుల కోసం మరో రెండు భవనానికి గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. నూతన భవనంలో అడుగడుగునా అధునాతన నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నూతన భవన ఆకృతిని గుజరాత్‌కు చెందిన హెచ్‌పీసీ సంస్థ రూపొందించగా.. నిర్మాణ బాధ్యతలను టాటా సంస్థ దక్కించుకుంది. నిర్మాణంలో ప్రత్యక్షంగా రెండు వేల మంది, పరోక్షంగా 9వేల మంది కార్మికులు పాల్గొననున్నారు.    ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌ భవనానికి వందేళ్ల చరిత్ర ఉంది. 1921, ఫిబ్రవరి 21న ప్రస్తుత పార్లమెంట్‌కు శంకుస్థాపన చేయగా.. ఆ సమయంలో రూ. 83లక్షలు వ్యయమైంది. ఆరేళ్లలో నిర్మాణం పూర్తి చేశారు. 1927, జనవరి 18న పార్లమెంట్‌ ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం  కొంత ఇరుకుగా కూడా ఉందనే  వాదన ఎప్పటి నుంచో ఉంది. భవనాన్ని అప్ గ్రేడ్ చేసే అవకాశం కూడా లేకపోవడంతో, కొత్త భవనాన్ని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. అత్యాధునిక టెక్నాలజీకి అనుగుణంగా కొత్త పార్లమెంటు ఉండాలని ఎక్కువ మంది సభ్యులు అభిప్రాయపడ్డారు. మారిన ప్రపంచానికి తగ్గట్టుగా కొత్త భవనం ఉండాలని చెప్పారు. దీంతో 93 సంవత్సరాల ప్రస్తుత పార్లమెంటు భవనానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా, భూకంపాలను కూడా తట్టుకునేలా కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. సెంట్రల్ విస్టా సిద్ధమయ్యాకా పాత పార్లమెంటు భవనాన్ని పురావస్తుశాఖకు అప్పగిస్తామని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.

పీసీసీ ఇవ్వండి.. ప్రగతి భవన్ పునాదులు కదిలిస్తా: కోమటిరెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త పీసీసీ ఎంపిక కోసం కసరత్తు చేస్తున్న రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్.. పార్టీలోని వివిధ వర్గాల నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ కోసం కసరత్తు సాగుతుండగానే   పీసీసీ రేసులో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనకు సీఎం, మంత్రి పదవులు అవసరం లేదని... పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే చాలని అన్నారు. పీసీసీ పగ్గాలను తనకిస్తే... రాష్ట్రంలో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  పీసీసీ పదవిని ఇవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపడతానని... ఎన్నికలకు ఏడాది ముందు నుంచి హైదరాబాదులో ఉంటానని చెప్పారు.  ఊరూరా తిరిగి ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు. ప్రజలతో కలిసి ప్రగతి భవన్ పునాదులను కదిలిస్తానంటున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.    పీసీసీ ఇవ్వాలని గతంలో  అడిగినా కానీ తనకు అవకాశం ఇవ్వలేదన్న కోమటిరెడ్డి..  ఈ సారైనా అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ ని అడిగానని చెప్పారు. తనపై భూకబ్జా కేసులు కానీ, ఇతర కేసులు కానీ లేవని... అలాంటప్పుడు పీసీసీ తనకు ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన చరిత్ర తనదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్  పరిస్థితి చివరి స్టేజ్ లో ఉందని, తనకు పీసీసీ ఇస్తే పునర్వైభవాన్ని తీసుకొస్తానని చెప్పారు. కోమటిరెడ్డి తాజా కామెంట్లు కాక రేపుతున్నాయి. భూకబ్జా కేసులు తనపై లేవంటూ పరోక్షంగా మరో పార్టీ నేతను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టార్గెట్ చేశారనే చర్చ జరుగుతోంది.    మరోవైపు పార్టీలో ఏకాభిప్రాయం ద్వారానే పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. బుధవారం పార్టీ కోర్ కమిటీతో చర్చించిన ఠాగూర్.. గురువారం ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమై పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలన్న దానిపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులతోనూ మాణిక్కం చర్చించనున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకా ఢిల్లీకి వెళ్లి రాహుల్ కు నివేదిక ఇస్తారని, తర్వాతే ఏఐసీసీ నుంచి పీసీసీ చీఫ్ పై ప్రకటన వస్దుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

తాగునీరు కలుషితం వల్లే వింత వ్యాధి! ఏలూరులో తగ్గని భయం 

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరును వణికిస్తున్న వింత వ్యాధి మూలాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వింత వ్యాధి ప్రబలడానికి తాగునీరు కలుషితం కావడమే కారణమని కేంద్ర నిపుణుల కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. తాగునీటిలో పురుగుల మందుల అవశేషాలు కలవడమే కారణమని ప్రాధమికంగా నిర్ధారించారు.  తాగునీటిలో ఆర్గానో క్లోరో, ఆర్గానో పాస్పరస్ అవశేషాలను కేంద్ర నిపుణుల కమిటి గుర్తించిందని తెలుస్తోంది. 90 శాతం నీటిలో ఈ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. తాగునీటిలో ఆర్గానో క్లోరో, ఆర్గానో పాస్పరస్ అవశేషాల ఎలా కలిశాయన్నదానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. కృష్ణా, గోదావరి కాలువల నీటిని కేంద్ర నిపుణుల కమిటీ పరిశీలించింది. రెండు కాలువల నీరు ఏయే ప్రాంతాలకు వెళ్తుందో.. ఏలూరు మ్యాప్‌ ద్వారా కేంద్ర నిపుణుల కమిటీ గుర్తించింది.   అలజడి రేపిన  అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రి పాలై కోలుకున్నారని ఇంటికి పంపిన బాధితులను ఇంకా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఫిట్స్‌ తగ్గినా పూర్తిస్థాయిలో కోలుకోవడం లేదు. షుగరు, వెన్నునొప్పి, తలనొప్పి, నీరసం, భయం, కాళ్లూ, చేతులు గుంజుకుపోవడం, నరాలు సలపడం వంటి పలురకాల సమస్యలతో బాధపడుతున్నారు. కొందరైతే ఇంకా లేచి కూర్చోలేని పరిస్థితి. పూర్తిస్థాయిలో కోలుకోకుండానే తమను ఇంటికి పంపేశారని వింత వ్యాధి బాధితులు వాపోతున్నారు. దక్షిణపువీధిలో మొదలైన వింత వ్యాధి ఇప్పుడు కాస్త తగ్గింది. గత 24 గంటల్లో  21 కొత్త కేసులు మాత్రమే వచ్చాయని వైద్యాధికారులు చెబుతున్నారు.

ఫైజర్ వ్యాక్సిన్ తో బయటపడుతున్న కొత్త సైడ్ ఎఫెక్ట్ లు.. పునరాలోచనలో అమెరికా 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి పై పోరాడేందుకు సామాన్య జనం వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయాన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ ఒక పెద్ద ఆశాకిరణముగా కనిపించింది. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కటిగా నెమ్మదిగా తెరపైకి రావడంతో జనంలో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఫైజర్ వ్యాక్సిన్ దుష్ప్రభావానికి సంబంధించి యూఎస్ ఎఫ్‌డీఏ ఒక సంచలన విషయం బయటపెట్టింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న నలుగురు వాలంటీర్లు ముఖానికి సంబంధించిన తాత్కాలిక పక్షవాతానికి గురైనట్లు వెల్లడించింది. అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం అధికారులు ఎఫ్‌డీఏను కలిసినప్పుడు ట్రయల్స్ సమయంలో తలెత్తిన ఈ అనారోగ్య సమస్యను బయటపెట్టింది. వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఇలా నలుగురు వాలంటీర్లు తాత్కాలిక ముఖ పక్షవాతానికి గురైనట్లు తెలిపింది. అయితే ఇదే ట్రయల్స్ లో పాల్గొన్న మిగతా సభ్యులలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని అధికారులు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వల్ల ఏర్పడిన ఈ సమస్యపై మరింత విస్తృతంగా పరిశోధన చేయాలనీ ఈ సందర్భంగా ఎఫ్‌డీఏ పేర్కొంది. దీంతో ఈ వ్యాక్సిన్‌పై ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న అమెరికన్లకు తీవ్ర నిరాశ ఎదురైనట్లైంది.   ప్రపంచంలో ఏదైనా ఒక వ్యాక్సిన్ ట్రయల్స్ దశలో కొన్ని స్వల్ప సైడ్ ఎఫెక్ట్ లను చూపించడం సాధారణం. అలాగే ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న మొత్తం వాలంటీర్లలో 84 శాతం మంది ఏదో ఒక రియాక్షన్‌కు గురైనట్లు సమాచారం. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా టీకా తీసుకున్న తర్వాత 63 శాతం మందికి అలసట, ఆయాసం వస్తే.. 55 శాతం మంది తలనొప్పి వచ్చినట్లు తెలియజేశారు. అలాగే ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 32 శాతం మంది చలి వేసిందని, 24 శాతం మందికి కీళ్లనొప్పులు, మరో 14 శాతం మంది జ్వరంతో బాధపడ్డారని సమాచారం. అయితే కొన్ని స్వల్ప సైడ్ ఎఫెక్ట్ లు తప్పిస్తే ఇతర సమస్యలేమీ లేకపోవడంతో ఎఫ్‌డీఏ నుంచి ఫైజర్ వ్యాక్సిన్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ, తాజాగా మూడో దశ ట్రయల్స్‌లో నలుగురు వాలంటీర్లు అస్వస్థకు (ముఖ పక్షవాతం) గురికావడంతో ఎఫ్‌డీఏ ఈ వ్యాక్సిన్ విషయమై పునరాలోచనలో పడిందని సమాచారం.   ఇక మరో ప్రక్క ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్రిటన్ లో మంగళవారం నుండి ఫైజర్ వ్యాక్సిన్ ను ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే, అక్కడ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయి. అలెర్జీ ఉన్న వ్యక్తులపై ఈ వ్యాక్సిన్ దుష్ప్రభావాన్ని చూపిస్తున్నట్లు యూకే రెగ్యులేర్స్ సంస్థ పేర్కొంది. దీంతో అలెర్జీ ఉన్న వ్యక్తులు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోవద్దని హెచ్చరించింది. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇద్దరు వ్యక్తులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యాక్సిన్ 90 శాతం సత్ఫలితాలనిచ్చినట్లు పరిశోధకులు వెల్లడించడంతో కరోనా మహమ్మారికి మందు లభించినట్లేనని అందరూ సంతోషిస్తున్న సమయంలో ఇప్పుడు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ప్రజలలో తీవ్ర  ఆందోళన రేపుతోంది.

వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణ 'కొవిడ్' యాప్! ఫ్రంట్ లైన్ వారియర్స్ కే  ఫస్ట్ 

కరోనా వ్యాక్సిన్ తయారీ తుది దశకు చేరడంతో టీకా పంపిణీకి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. జనవరి రెండో వారంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్. తొలి దశలో కరోనా వ్యాక్సిన్ ను తీసుకునేందుకు అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ యాప్ ను సిద్ధం చేస్తోంది. కోవిడ్ యాప్ ను మరో వారం, పది రోజుల్లో అందుబాటులోకి తీసుకుని వస్తామని అధికారులు తెలిపారు. అయితే ఫ్రంట్ లైన్ యోధులైన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికే వ్యాక్సిన్ మొదట ఇవ్వనున్నారు. ఏఎన్ఎంలు, ఆసరా కార్యకర్తలతో కలిసి మొత్తం 3 లక్షల మందిని ఇప్పటికే గుర్తించారు. మునిసిపల్ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టుల సమాచారాన్నికూడా తెలంగాణ వైద్యాధికారులు సేకరిస్తున్నారట.    ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు 50 ఏళ్లకు పైబడిన వయో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. మొదటి విడతలోనే 70 నుంచి 75 లక్షల మందికి టీకాలు వేయాలని నిర్ణయించామని, దాదాపు 3 కోట్ల డోస్ లను నిల్వ చేసేందుకు అవసరమైన మౌలిక వసతులన్నీ సిద్ధంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు.  వ్యాక్సిన్ పై ఎంపిక చేసిన వైద్య సిబ్బందికి ప్రత్యేక ట్రయినింగ్ క్యాంప్ కూడా మొదలైంది. వర్చ్యువల్ విధానంలో బుధవారం ప్రారంభమైన శిక్షణ రెండు రోజుల పాటు జరగనుంది.

సాగర్ తో పాటు మరో అసెంబ్లీకి ఉప ఎన్నిక? హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ 

తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యో  నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఉప ఎన్నిక జరగనుంది. నాగార్జున సాగర్ తో తెలంగాణలో మరో అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం జరుగుతోంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై అనర్హత వేటు పడబోతుందని, అక్కడ కూడా ఉప ఎన్నిక ఖాయమనే ప్రచారం కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. వేములవాడ ఎమ్మెల్యే  చెన్నమనేని రమేష్ భారతీయ పౌరసత్వం విషయంలో ఈ నెల 16న హైకోర్టులో విచారణ జరుగనుంది. చెన్నమనేని రమేష్ కు ఇంకా జర్మనీ పౌరసత్వమే ఉందని, ఆ దేశ పాస్‌పోర్టుపైనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గత నెల 18న స్వయంగా హైకోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ చెన్నమనేని రమేశ్‌  అనర్హుడని హైకోర్టు తీర్పు వస్తే వేములవాడలో ఉప ఎన్నిక జరగనుంది.    చెన్నమనేని రమేశ్ కేసు గతంలో సుప్రింకోర్టు వరకూ వెళ్లింది. కేంద్ర హోం శాఖ కూడా పూర్తిస్థాయి వివరాలను కోర్టుకు సమర్పించింది. చెన్నమనేని రమేశ్‌కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం, పాస్‌పోర్టు ఉన్నాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. గతేడాది డిసెంబరు 16వ తేదీన చెన్నయ్ విమానాశ్రయం నుంచి ఆయన జర్మన్ వెళ్లింది కూడా ఆ దేశానికి చెందిన పాస్‌పోర్టు మీదనే అని వివరించింది. భారత పౌరసత్వం కలిగి ఉన్నా అది చెల్లదని కేంద్ర హోంశాఖ అండర్ సెక్రెటరీ గతేడాది నవంబరు 20న లిఖితపూర్వకంగా నివేదించారు. అయితే తనకు జర్మన్ పౌరసత్వం, పాస్‌పోర్టు ఉందని కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని చెన్నమనేని రమేష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనవని, చట్టవిరుద్ధమైనవని అందులో పేర్కొన్నారు. 1955 నాటి సిటిజన్‌షిప్ యాక్ట్ సెక్షన్ 10(3)కు కూడా విరుద్ధమైనవని వివరించారు. దీని మీద గత నెల 18న జస్టిస్ చల్లా కోదండరెడ్డి విచారణ జరిపారు. రమేష్ కు జర్మనీ పౌరసత్వం, పాస్‌పోర్టు ఇప్పటికీ ఉన్నాయో లేదో ఆ దేశం నుంచి వివరాలను తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయం నుంచి సైతం వివరాలను సేకరించి తదుపరి విచారణ సమయానికి కోర్టుకు సమర్పించాలని సూచించారు.    చెన్నమేనేనికి జర్మని పాస్ పోర్టు ఉందని గతంలో నివేదించిన కేంద్ర హోంశాఖ.. ఇప్పుడు కూడా హైకోర్టుకు అలాంటి నివేదికే ఇస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. వేములవాడ రమేష్ కు హైకోర్టులో వ్యతిరేక తీర్పు రావడం ఖాయమని, వేములవాడలో కచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని వారు భావిస్తున్నారు. అందుకే ఉప ఎన్నిక కోసం కసరత్తు కూడా మొదలు పెట్టిందట కమలదళం. వేములవాడలో బీజేపీ కొంత బలంగానే ఉంది. దుబ్బాక బైపోల్ విజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో మరింత జోష్ వచ్చింది . దీంతో వేములవాడలో ఉప ఎన్నిక జరిగితే తమదే విజయమనే ధీమాలో ఉన్నారు కాషాయ నేతలు. చెన్నమనేని రమేష్ పౌరసత్వం విషయంలో మొదటి నుంచి పోరాడుతున్న ఆది శ్రీనివాస్ ..2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి  కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేశారు. మరోవైపు చెన్నమనేని రమేశ్‌కు భారత పౌరసత్వం, పాస్‌పోర్టు కూడా ఉన్నాయని, హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

టోల్ గేట్ సిబ్బందిపై ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి రుబాబు 

ఏపీలో వైసీపీ నాయకులు అటు అధికారులు, ఇటు సామాన్య ప్రజల పై దాడులు చేస్తున్న వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి కాజ టోల్ గేట్ల్ వద్ద రుబాబు చేశారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్తున్న రేవతి కారుకు టోల్‌గేట్ సిబ్బంది బారికేడ్లు అడ్డుపెట్టారు. టోల్ చెల్లించి ముందుకెళ్లాలని సిబ్బంది అడగడంతో ఆమె తన కారు దిగి కోపంతో ఊగిపోతూ టోల్ గేట్ వద్ద సిబ్బందిపై దాడి చేశారు. "నన్నే టోల్ చెల్లించమని అడుగుతావా? నేనెవరో తెలుసా? " అంటూ రేవతి బారికేడ్లను త్రోసివేసిన అనంతరం ఆమె విజయవాడ వైపు వెళ్లిపోయారు. రేవతి హడావిడితో టోల్‌గేట్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు.   అయితే ఈ ఘటన పై కాజ టోల్ గేట్ సిబ్బంది ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి పై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ ఘటనకి సంబంధించిన వీడియోను వారు పోలీసులకు అందచేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తదుపరి సీఎస్ గా ఆయనకే ఛాన్స్..!

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఆమె తరువాత సీఎస్‌ ఎవరన్న అంశంపై కొద్ది రోజులుగా అధికార వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న మీదట 1987వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఆదిత్యనాథ్‌ దాస్‌ వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపినట్టుగా వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ప్రస్తుత సీఎస్‌ పదవీ కాలం ముగిసే తేదీకి కొంచెం ముందు కొత్త సీఎస్‌ నియామక ఉత్తర్వులు వెలువడతాయి. తాజా సమాచారం ప్రకారం ఆదిత్యనాథ్‌ దాస్‌ సీఎస్ గా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. అయన గతంలో విజయనగరం, విజయవాడ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, కృష్ణాజిల్లా జేసీగా, వరంగల్‌ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్‌, మునిసిపల్‌ పరిపాలన కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీగా సేవలందించారు.   అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక భిన్నమైన ఒరవడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ను ముందుగా సీఎస్‌ కార్యాలయంలో ఓఎస్డీగా నియమిస్తున్నట్లు సమాచారం. దీంతో నెలాఖరు వరకూ అయన ఓఎస్డీగా ఉంటూ పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకోడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సంప్రదాయం కేంద్ర సర్వీసుల్లో ఇప్పటికే ఉంది. అదే తరహాలో ఇక్కడ ఆదిత్యనాథ్ దాస్‌ నియామకం చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా నీలం సాహ్ని తర్వాత సీనియారిటీలో ఆమె భర్త అజయ్‌ సాహ్ని, ఆ తర్వాతి స్థానాలలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్‌ త్రిపాఠి, సతీష్‌ చంద్ర, జేఎస్వీ ప్రసాద్‌, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ వరుసగా ఉన్నారు. అయితే వీరిలో అజయ్‌ సాహ్ని, సమీర్‌ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉండగా, అభయ్‌ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తున్నారు.   ఇక మరో ఐఏఎస్ అధికారి సతీష్‌ చంద్ర మాజీ సీఎం చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసారు. అప్పట్లో అయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఎబివి తో కలిసి వైసిపి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి కారణమయ్యారని భావిస్తున్న సీఎం ఆయనను సీఎస్‌ గా చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. ఇక మరో అధికారి జేఎస్వీ ప్రసాద్‌పై కూడా సీఎంకు సదభిప్రాయం లేదని తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానంలో ఉన్న నీరబ్‌ కుమార్‌ సీఎస్‌ అవుతారని, అందుకే ఆయనను సీసీఎల్‌ఏగా నియమించారని కొంతకాలంగా ప్రచారం జరిగినా.. నీరబ్‌కు 2024 జూన్‌ వరకూ పదవీకాలం ఉంది. దీంతో ఆయనను నియమిస్తే మధ్యలో కొంతమందికి సీఎస్ అయ్యే అవకాశం మిస్ అవుతుంది. అంతేకాకుండా అంత ఎక్కువ కాలం ఒకరినే సీఎస్ గా కొనసాగించడం సరికాదన్న ఉద్దేశంతో సీఎం జగన్ ఆదిత్యనాథ్‌ వైపే మొగ్గుచూపారని చెబుతున్నారు. అయితే ఆదిత్యనాథ్ దాస్‌ జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.  

ఏలూరు వింత వ్యాధికి మరో ఇద్దరు బలి.. కొంప ముంచినవి ఇవే.. 

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వింతవ్యాధికి కారణం వారి రక్తంలో సీసం, నికెల్ వంటి లోహాల అవశేషాలు పరిమితికి మించి ఉండడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే ఇది గాలి ద్వారా వ్యాపించినది కాదని, దీని గురించి ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని వారు చెపుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 600 మందికి ఈ వింత వ్యాధి సోకగా, 450 మందికి పైగా చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని భావించిన కొందరిని మాత్రం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించి చికిత్స అందిస్తున్నారు.   ఇది ఇలాఉండగా విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వింతవ్యాధి బాధితుల్లో మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వింత వ్యాధితో బాధపడుతున్న వారిలో 30 మందిని విజయవాడ ఆస్పత్రికి తరలించగా... సుబ్బరావమ్మ(56), అప్పారావు(50) ల పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. అయితే సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్టు వైద్యులు చెబుతున్నారు.

సోనూసూద్ ఆస్తులు తాకట్టు! పేదల దేవుడంటున్న అభిమానులు

సినిమాల్లో అతను విలన్. కాని నిజ జీవితంలో మాత్రమే అతనో హీరో.. రియల్ హీరో. కష్టాల్లో ఉన్నవారికి , ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే అభాగ్యులకు ఆయన చిరు దీపంలా నిలిచారు. పేదల గుండెల్లో హీరోగా నిలిచిన  అతనో బాలీవుడ్ నటుడు సోనూసూద్. కరోనా సమయంలో ప్రజలకు ఆపద్భాందవుడిగా మారిపోయాడు.  కరోనా లాక్ డౌన్ లో  వందలాది మంది వలస కార్మికులను తన సొంత ఖర్చులతో బస్సులను ఏర్పాటు చేసి ఇంటి వరకు చేర్చిన మహానుభావుడు సోనూ సూద్. ఆ తర్వాత కూడా ఎందరో నిస్సహాయులకు ఆపన్న హస్తం అందించాడు. అడిగిన వారికల్లా  సాయం అందించిన రియల్ హీరో.. ఇప్పుడు కష్టాల్లో పడ్డాడు. అవును పేదల కోసం డబ్బులు ఖర్చు పెట్టిన సోనూ సూద్.. అప్పుల పాలయ్యాడు. తన ఆస్తులను తాకట్టు పెట్టాడు.    వినడానికి బాధగా ఉన్నా సోనూసోదూ అప్పులపాలయ్యాడు అనడం నిజం. కరోనా వల్ల సినిమాలు ఆగిపోవడం, లాక్ డౌన్ వల్ల తనకున్న హోటల్స్, ఇతర వ్యాపారాలు నిలిచిపోవడంతో సోనుసూద్ ఆదాయం పడిపోయింది.  దేశ వ్యాప్తంగా ఆపన్నలు సహాయం కోసం ఆర్ధిస్తుండడంతో వారికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడు. ఈ క్రమంలో సోనుసూద్ ఆస్తులు కరిగిపోయాయని తెలుస్తోంది.  దీంతో  డబ్బుల కోసం సోనుసూద్ తన ఆస్తులను తాకట్టు పెట్టాడట.    సోనుసూద్ తన ఆస్తులను తాకట్టు పెట్టి రూ.10కోట్లు అప్పుగా తీసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముంబయిలో రూ.కోట్ల విలువైన ఆరు ప్లాట్లు, రెండు షాపులను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ఆస్తులన్నీ కూడా ఆయన భార్య సోనాలికి చెందినవిగా సమాచారం. తాకట్టు ఒప్పందం ప్రకారం నవంబర్ 24న ఆస్తుల రిజిస్టర్ చేశాడట. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్త నిజం కాకూడదని ప్రార్థనలు చేస్తున్నారు. తమ దేవుడిని కష్టం రాకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నారు.

చట్టాలు రద్దు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం.. రైతు సంఘాలు

కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తామంటున్న సవరణలను రైతు సంఘాలు నిర్ద్వందంగా తిరస్కరించాయి. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు మొత్తంగా రద్దు చేయడం అనేదే తమ ప్రధాన డిమాండ్ అని, అది పూర్తయ్యే వరకు తాము నిరసనను కొనసాగిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. 14 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులను శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదుసార్లు చర్చలు జరిపినా అవి ఫలప్రదం కాలేదు. నిన్న (మంగళవారం) రాత్రి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి రైతు సంఘాల నేతలతో చర్చించారు. కానీ, మూడు చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతులు తమ డిమాండ్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే మూడు చట్టాలు రద్దు చేయడం కాకుండా మధ్యే మార్గంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కొన్ని ప్రతిపాదనలు చేసింది. వ్యవసాయ చట్టాల్లో 7 సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే, కనీస మద్దతు ధర విషయంలో రాతపూర్వక హామీ ఇస్తామని చెప్పింది. అయితే, దాన్ని చట్టంలోనే పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చిన చట్టాల వల్ల మార్కెట్ వ్యవస్థ దెబ్బతింటుందని రైతులు తీవ్ర ఆందోళనలో ఉండడంతో మండీ వ్యవస్థకు భరోసా కల్పిస్తామని కేంద్రం చెబుతోంది.   కేంద్రం తాజాగా తయారు చేసిన ముసాయిదా ప్రతిపాదనలను 13 రైతు సంఘాలకు పంపింది. వీటికి సంబంధించి రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే తాము నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా కేంద్రం ప్రకటించింది. కానీ, చట్టాల రద్దు విషయంలో మాత్రం ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అంటే "రద్దు కుదరదు. సవరణలపై ఏమైనా ఉంటే మాట్లాడండి." అని కేంద్రం రైతులకు సందేశం పంపింది. ఈ సవరణల ప్రతిపాదనలపై రైతులు తమలో తాము చర్చించకున్నారు. అయితే తమ ప్రధాన డిమాండ్ అయిన చట్టాల రద్దు విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని.. అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు తేల్చి చెప్పారు.   "మూడు కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనేది మా ప్రధాన డిమాండ్. దానిపై వెనక్కి తగ్గేది లేదు. కేంద్రం పంపిన సవరణలను తిరస్కరిస్తున్నాం. మా డిమాండ్ నెరవేరే వరకు పోరాటం చేస్తాం. నిన్న (డిసెంబర్ 8) అమిత్ షాతో చర్చల్లో పురోగతి కనిపించలేదు. చట్ట సవరణలకు సానుకూలంగా ఉన్నామని అమిత్ షా చెప్పారు. అంతేకాకుండా రైతులకు లాభం జరుగుతుందని కేంద్రం చెబుతుంది కానీ, ఏం లాభం జరుగుతుందో మాత్రం చెప్పడం లేదు." అని రైతు సంఘాల నాయకులు అన్నారు.   మరోపక్క దేశంలోని అన్ని జిల్లాలు రాష్ట్ర రాజధానులలో నిరంతరాయంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి. కేంద్రమంత్రులను ఎక్కడికక్కడే ఘోరావ్ చేస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన దేశంలోని టోల్‌ప్లాజాల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. సోమవారం నాడు ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు.రిలయన్స్, జియో ఉత్పత్తులను బహిష్కరిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత గర్వంతో ప్రవర్తిస్తోందని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ వ్యాఖ్యానించింది.

భారత్ బంద్ లో దొంగలు పడ్డారు! టీఆర్ఎస్ పై పొన్నం విసుర్లు

తెలంగాణ రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ భారత్ బంద్ లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. భారత్ బంద్ లో దొంగలు కూడా పాల్గొన్నారని ఆయన ఎద్దేవా చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చేయకుండా, సన్నరకం వడ్లు పండించమని చెప్పి మద్దతు ధర ఇవ్వకుండా నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ రైతుల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు పొన్నం ప్రభాకర్. మొక్కజొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయం అని అహంకారంతో చెప్పిన వాళ్లు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో చట్టం చేయని వాళ్లు భారత్ బంద్ లో ఎలా పాల్గొంటారని ఆయన నిలదీశారు.    టిఆర్ఎస్ పార్టీకి రైతులపై నిజమైన  ప్రేమ ఉంటే వెంటనే సన్నరకం వడ్లను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని పొన్నం డిమాండ్ చేశారు.  అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలన్నారు.  కేంద్ర ప్రభుత్వం కూడా పంటకు బోనస్ ఇవ్వచ్చని,  నాఫెడ్ సంస్థ ద్వారా సన్న  రకపు వడ్లను కొనుగోలు చేయవచ్చని..  కాని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారని పొన్నం మండిపడ్డారు. రైతులను కమీషన్ ఏజెంట్లనిస దళారులు అని మాట్లాడిన ఎంపీ ధర్మపురి అర్వింగ్ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఢిల్లీలో దళారులే ధర్నా చేస్తుంటే.. అమిత్ షా వారితో ఎందుకు చర్చలు జరిపారే అర్వింద్ చెప్పాలని పొన్నం నిలదీశారు. ప్రభుత్వం ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు  రైతులను  దేశద్రోహులుగా చిత్రీకరించేదాకా వెళ్తున్నారంటే ఎంత కుట్ర దాగి ఉందో అర్థం చేసుకోవాలని పొన్నం చెప్పారు.

భారత్ బయోటెక్ లో విదేశీ ప్రతినిధులు! కరోనా టీకా తయారీని వివరించిన డాక్టర్ కృష్ణ ఎల్లా 

హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ ఫార్మా సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి వస్తోంది. కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తయారీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ ఫార్మాను ప్రపంచ దేశాల ప్రతినిధులు సందర్శిస్తున్నారు. భారత్‌లో కరోనా టీకాల తయారీపై అధ్యయనంలో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్న 64 దేశాల రాయబారులు జినోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ, ఇప్పటివరకు రెండు దశల ప్రయోగాల్లో వచ్చిన ఫలితాలు, దేశ అవసరాలకు సరిపోయే స్థాయిలో తయారుచేసే సామర్థ్యం తదితర అనేక అంశాలపై వీరు సమీక్షించారు. టీకా కోసం జరుగుతున్న పరిశోధనల సమాచారాన్ని ఈ సందర్భంగా విదేశీ రాయబారులతో పంచుకున్నారు  భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా.  కొవాగ్జిన్‌ టీకా వివరాలతో పాటు సంస్థ ప్రస్థానాన్ని ఆయన వివరించారు.  టీకా రంగంలో భారత్‌ ఎన్నో ప్రయోగాలు చేస్తోందని చెప్పారు డాక్టర్‌ కృష్ణ ఎల్లా. అనేక విదేశీ సంస్థలతో భారత్‌ బయోటెక్‌ ప్రయోగాలు చేస్తోందన్నారు. సానుకూల దృక్పథంతో తమ సంస్థ ముందుకు సాగుతోందని  డాక్టర్‌ కృష్ణ ఎల్లా చెప్పారు.       భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు మన దేశంలో ఉన్న వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, ఆ దేశాలకు చెందిన వైద్య నిపుణులు, వైద్యారోగ్య రంగంలో పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తున్నారు. హెడ్స్ ఆఫ్ మిషన్ అనే పేరుతో వస్తున్న 80 దేశాలకు చెందిన ప్రతినిధుల్లో అరవై మంది ఆయా దేశాల అంబాసిడర్లు (రాయబారులు) ఉన్నారు. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, డెన్మార్క్, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్… ఇలా చాలా దేశాలకు చెందినవారు ఉన్నారు. ఇందులో భాగంగా రెండు బృందాలుగా హైదరాబాద్ కు వచ్చారు విదేశీ ప్రతినిధులు. ఒక బృందం జినోమ్‌వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ను.. మరో బృందం బయోలాజికల్‌-ఇ సంస్థను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించాయి. భారత్‌ బయోటెక్‌ను గతంలో ఎందరో ప్రముఖులు సందర్శించారు. పదిరోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ కూడా వచ్చి వెళ్లారు.

రీ ట్వీట్లలో విజయ్, లైకుల్లో కోహ్లి! ఈ ఏడాది ట్విట్టర్ టాప్ లిస్ట్ ఇదే 

కరోనా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, హాథ్రస్‌ అత్యాచారం, షాహిన్‌బాగ్‌ అల్లర్లు, రైతుల నిరసన.. ఇవి ఈ ఏడాది  ట్విటర్‌లో ఎక్కువ చర్చనీయాంశమైన అంశాల జాబితాలో నిలిచాయి. రామాయణ్, మహాభారత్‌ కార్యక్రమాలను తిరిగి టీవీలో ప్రసారం చేయడంపైనా ఎక్కువ మంది ట్విటర్‌లో చర్చించుకున్నారు.  స్టూడెంట్‌ లైవ్స్‌ మ్యాటర్ కూడా ట్విట్టర్ లో ట్రెండింగులో నిలిచాయి. ఈ ఏడాది  ట్రెండింగ్‌లో నిలిచిన ట్వీట్లను ట్విటర్‌ ఇండియా సంస్థ  అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో జనవరి 1 నుంచి నవంబరు 15 మధ్య ట్రెండ్ అయిన  ట్వీట్లకు ఈ జాబితాలో స్థానం కల్పించింది.    తమిళ సూపర్ స్టార్ విజయ్‌ రీ ట్వీట్లలో టాప్ గా నిలిచారు. అభిమానులతో కలసి తీసుకున్న విజయ్ సెల్ఫీకి అత్యధికంగా 1.61 లక్షలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తన సతీమణి అనుష్కశర్మ ప్రెగ్నెన్సీ విషయాన్ని పంచుకుంటూ చేసిన ట్వీట్‌ 6.44 లక్షలకు పైగా లైకులు సాధించి తొలి స్థానంలో నిలిచింది.  కొవిడ్‌ సంక్షోభ సమయంలో భారతీయుల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఇళ్లలో దీపాలు వెలిగించాలని ఏప్రిల్‌ 3న ప్రధాని నరేంద్ర మోడీ  చేసిన ట్వీట్‌కు ట్విట్టర్  ప్రత్యేక గుర్తింపు దక్కింది. రాజకీయ రంగానికి సంబంధించి ఈ ఏడాది అత్యధిక రీట్వీట్‌లు పొందిన ట్వీట్‌గా ప్రధాని మోడీ ట్వీట్  నిలిచింది. పీఎం ట్వీట్‌ను 1.18 లక్షల మందికి పైగా రీట్వీట్‌ చేయగా, 5.13 లక్షల మంది లైక్‌ చేశారు.    భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ చేసిన ఓ ట్వీట్‌ క్రీడారంగంలో అత్యధిక రీట్వీట్లు పొందిన ట్వీట్‌గా నిలిచింది. తను క్రికెట్‌ నుంచి రిటెర్మెంట్‌ ప్రకటించినప్పుడు ప్రధాని మోడీ తనకు ప్రత్యేకంగా రాసిన లేఖను పంచుకుంటూ ధోనీ ఆ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌తో కుదేలైన వర్గాల ప్రజలను ఆదుకుంటానంటూ రతన్‌ టాటా చేసిన ట్వీట్‌ వ్యాపార రంగంలో అత్యధిక రీట్వీట్లు సాధించింది. బాలీవుడ్‌ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ తనకు కరోనా సోకిన విషయాన్ని పంచుకుంటూ చేసిన ట్వీట్‌ను ట్విటర్‌ ఇండియా గోల్డెన్‌ ట్వీట్లలో ఒకటిగా ఎంపిక చేసింది.

రైతుల ఆందోళనతో దిగొస్తున్న కేంద్రం! వ్యవసాయ చట్టాల్లో సవరణలకు సుముఖం? 

అన్నదాతల అలుపెరగని పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగొస్తున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసేందుకు మోడీ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణలు, ఏపీఎంసీల్లో ఓకే ట్యాక్స్‌‌పై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. నూతన వ్యవసాయ చట్టాల్లో ఐదు సవరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.  ఏపీఎంసీలను బంద్‌ చేయబోమని, రైతులు-వ్యాపారుల మధ్య ఒప్పంద వివాదాలను పరిష్కరించే ఎస్‌డీఎం అధికారాలను రైతుల సూచనల మేరకు సవరిస్తామని, కనీస మద్దతు ధరకు లిఖితపూర్వక హామీ ఇస్తామని, విద్యుత్తు చట్ట సవరణ బిల్లుపై రైతులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని, పంజాబ్‌లో పంట కోతల తర్వాత వెలువడే వ్యర్థాల దహనానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం రైతు సంఘాల ప్రతినిధులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.    మోడీ సర్కార్ తీసుకొచ్చిన  కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ  సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరింది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా  సింఘు, టిక్రీ రహదారులపై వేలాది మంది రైతులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు మంగళవారం నిర్వహించిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. బంద్ కు పలు రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు  మద్దతు ప్రకటించాయి. పలు రాష్ట్రాల్లో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. రైతులతో పాటు పలు పార్టీల రాజకీయ నాయకులు కూడా రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.    భారత్ బంద్ తో  కేంద్ర సర్కార్ లో కదలిక వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రైతు నేతల మధ్య బుధవారం చర్చలు జరగాల్సి ఉండగా..  ఒకరోజు ముందుగానే అమిత్ షా రైతు నాయకులతో సమావేశమయ్యారు. అయితే ఈసారి కూడా రైతులు ప్రభుత్వం ప్రతిపాదనలను అంగీకరించలేదు. దీంతో బుధవారం  జరగాల్సిన చర్చలను రద్దు చేశారు. అయితే సవరణలకు సంబంధించిన అంశాలను బుధవారం లిఖితపూర్వకంగా అందిస్తామని, వాటిపై ఇతర రైతు సంఘాలతోనూ చర్చలు జరపాలని అమిత్‌షా సూచించారు. దీనికి రైతులు అంగీకరించినట్లే కన్పించింది. సవరణల జాబితాను ప్రభుత్వం లిఖితపూర్వకంగా అందించిన తర్వాత  సింఘ సరిహద్దులో 40 రైతు సంఘాల ప్రతినిధులు సమావేశమై.. కేంద్ర సర్కార్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఆ తర్వాతే ఆందోళన కొనసాగిస్తారా లేక కేంద్రంతో చర్చలకు వెళతారా అన్నది నిర్ణయించనున్నారు.

సచివాలయం కోసమే సెంట్రల్ విస్టాకు ప్రశంసలు! కమలం నేతలు ఇక కామేనా? 

రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దిట్టగా చెప్పుకుంటారు. కొన్ని సార్లు ఆయన ఎత్తులు విఫలమైనా ఎక్కువ సార్లు ఆయన సక్సెస్ అయ్యారనే చెబుతారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన ఎప్పటికప్పుడు తన ప్లాన్స్ మారుస్తూ వస్తున్నారు. పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురైనా, ప్రజల్లో తమపై వ్యతిరేకత వచ్చినట్లు గుర్తించినా, విపక్షాలను దెబ్బకొట్టాలన్నా కొత్త కార్యాచరణ రూపొందిస్తుంటారు గులాబీ బాస్. తాజాగా  ప్రధాని నరేంద్ర మోడీకి కేసీఆర్ రాసిన లేఖ కూడా అందులో భాగమేననే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటోంది బీజేపీ. ఈ పరిస్థితుల్లో కేంద్ర సర్కార్ నిర్మించ తలపెట్టిన కొత్త పార్లమెంట్ నిర్మాణాన్ని ప్రశంసిస్తూ ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.    ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో కొత్త పార్లమెంట్ దేశ ఆత్మగౌరవానికి, జాతికే గర్వకారణమని అభివర్ణించారు కేసీఆర్. ఈ ప్రాజెక్టు దేశ సార్వభౌమత్వాన్ని ఇనుమడింపజేస్తుందని పేర్కొన్నారు.  కొత్త పార్లమెంట్ పనులకు శంకుస్థాపన చేయడం గర్వకారణమని మోడీని అభినందించారు కేసీఆర్. ఈ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని  కోరుకుంటున్నానని తెలిపారు.   ప్రధానిని ప్రశంసిస్తూ కేసీఆర్ లేఖ రాయడం వెనక బలమైన కారణం ఉందంటున్నారు. హైదరాబాద్ తో తాము నిర్మించ తలబెట్టిన కొత్త సచివాలయ నిర్మాణం  కోసమే ప్రధానిని కేసీఆర్ అభినందిస్తున్నారని చెబుతున్నారు. కొత్త సచివాలయం నిర్మాణాన్ని బీజేపీ సహా ప్రతి పక్షాలన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేశాయి. కొత్త సచివాలయ నిర్మాణంపై  విపక్షాలు, జనాల నుంచి వస్తున్న వ్యతిరేకతకు చెక్ పెట్టేందుకు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును కేసీఆర్ అస్త్రంగా మార్చుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.    హైదరాబాద్ లో  కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారు కేసీఆర్.  విపక్షాలు ఎంతగా ఆందోళనలు చేసినా వెనక్కి తగ్గలేదు. సచివాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. కొత్త నిర్మాణాల కోసం పాత సచివాలయాన్ని కరోనా సమయంలో అర్ధరాత్రి హడావుడిగా కూల్చేశారు. సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయి. అయితే కొత్త సచివాలయ నిర్మాణంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. ప్రజా ధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తోంది. కొత్త సచివాలయ నిర్మాణంపై జనాల్లో కూడా వ్యతిరేకత కనిపించింది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ఉన్న భవనాన్ని కూల్చేసి.. కొత్తది కట్టాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నలు ప్రజల నుంచి వచ్చాయి. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విపక్షాలు సచివాలయ అంశాన్ని కూడా ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి. సచివాలయం అంశం ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిందని కూడా చెబుతున్నారు.    కొత్త సచివాలయంపై విపక్షాలు, జనాల నుంచి విమర్శలతో నిర్మాణ పనులపై జాప్యం చేస్తూ వస్తోంది కేసీఆర్ సర్కార్. ఇప్పుడు ఢిల్లీలో కొత్త పార్లమెంట్ నిర్మాణానికి కేంద్ర సర్కార్ డిజైన్ ఫైనల్ చేయడం, శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయడంతో కేసీఆర్ కు ఇదో మంచి అవకాశంగా నిలిచింది. దీంతో వెంటనే యాక్షన్ లోకి దిగారు కేసీఆర్. ఢిల్లీలో కట్టబోతున్న కొత్త పార్లమెంట్ నిర్మాణాలను స్వాగతిస్తూ ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాసేశారు  పార్లమెంట్ కొత్త భవనాన్ని స్వాగతించడం ద్వారా కొత్త సచివాలయంపై విమర్శలు చేస్తున్న తెలంగాణ బీజేపీ నేతలను కట్టడి చేసే వ్యూహంలో  భాగంగానే కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారాని భావిస్తున్నారు. ఢిల్లీలో పార్లమెంట్ కు కొత్త భవనం కడుతున్నందున.. రాష్ట్రంలో నిర్మించబోతున్న సచివాలయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తే.. ఆ పార్టీ వైఖరి ప్రజలకు తెలిసిపోతుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. బీజేపీతో పాటు ఇతర విపక్షాలు కూడా ఇప్పుడు గతంలో  ఉన్నంత  దూకుడుగా సచివాలయ నిర్మాణ విషయంలో కేసీఆర్ ను టార్గెట్ చేసే అవకాశం ఉండదని రాజకీయ అనలిస్టుల అభిప్రాయం. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలకు మాత్రం ఇది చాలా ఇబ్బంకరంగా మారే అంశమని, కొత్త సచివాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా తెలంగాణ కమలం నేతలు ఇకపై మాట్లాడకపోవచ్చనే అభిప్రాయం పొలిటికల్ అనలిస్టుల నుంచి వస్తోంది.

అనంతపురంలో మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన

అనంతపురం జిల్లాలోని మూడు రిజర్వాయర్లకు ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్ల అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి భూమిపూజ చేశారు. వెంకటంపల్లి వద్ద ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ, అప్పల రాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.    ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని అన్నారు. గత ప్రభుత్వం జీవో ఇచ్చి, పనులు మాత్రం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు స్టోరేజీ కెపాసిటీని కూడా పెంచామన్నారు. ఈ పనుల వల్ల రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్లు.. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలించనున్నట్లు తెలిపారు.  దాంతో 7 మండలాలకు మేలు జరుగుతోందన్నారు. రిజర్వాయర్లు, ప్రధాన కాల్వల కోసం రూ. 800 కోట్లు విడుదల చేశామని సీఎం చెప్పారు.  

ఏపీ సీఎం జగన్ పై విష్ణుకుమార్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ 

ఏపీ సీఎం జగన్‌ పై బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌ను నియంత అయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో పోలుస్తూ విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి అని సంబోధిస్తూ.. జగన్‌కు ప్రజల కష్టాలు ఏమాత్రం తెలియడం లేదని విమర్శించారు. గతంలో రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని సీఎం జగన్ చెప్పారని.. అయితే రెండున్నరేళ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారిపోవచ్చని అయన ఎద్దేవా చేశారు. ఉపముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే.. ఏపీకి మొట్టమొదటి మహిళా సీఎంని చేసి జగన్ చరిత్ర సృష్టించాలని అయన అన్నారు. జగన్ సతీమణి భారతి రాష్ట్రానికి తదుపరి సీఎం అయితే ప్రజలు సంతోషిస్తారని.. అంతేకాకుండా ఆమె ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తెలుసుకొని న్యాయం చేస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని... మొన్న మార్చిలో అక్రమాలు జరిగినందున ఏకగ్రీవాలను రద్దు చేయాలని విష్ణుకుమార్‌ రాజు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.