వరద సాయం కోసం ఆందోళనలు! గ్రేటర్ లో పోలీసులకు తిప్పలు
posted on Dec 7, 2020 @ 12:00PM
గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయం పంపిణి అంశం మళ్లీ ఉద్రిక్తతలు స్పష్టిస్తోంది. వరద సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వరద బాధితులు మీ సేవా సెంటర్ల దగ్గర ఉదయం నుంచే క్యూలు కట్టారు. జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకునే ఆప్షన్ తీసివేశారని మీ సేవా నిర్వాహకులు చెబుతున్నా జనాలు పట్టించుకోవడం లేదు. పలు కేంద్రాల దగ్గర తోపులాటలు జరుగుతున్నాయి. జనాలను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
వరద సహాయం కోసం కొందరు బాధితులు సీఎం క్యాంప్ ఆఫీస్‌కు సమీపంలోని మీ సేవ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. లాక్‌డౌన్‌లో ఏ విధంగా అయితే పరిహారం ఇచ్చారో అదే విధంగా 10 వేలు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. సెకెండ్ ఫ్లోర్ ఉన్న వారికి వరద సహాయం చేశారు కానీ నిజమైన బాధితులకు అన్యాయం చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ స్టేట్‌మెంట్‌కు వ్యతిరేకంగా క్యాంపు ఆఫీస్ వద్ద నినాదాలు చేశారు.
ఎన్నికలకు ముందు వరద బాధితులకు కుటుంబానికి పది వేల ఆర్థిక సాయం చేసింది ప్రభుత్వం. గ్రేటర్ ఎన్నికల కోడ్ తో అది ఆగిపోయింది. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే.. డిసెంబర్ 7 నుంచి సాయం అందని వరద బాధితులకు 10 వేల రూపాయలు ఇస్తామని గ్రేటర్ ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో సోమవారం తెల్లవారు జామున మూడు గంటల నుంచి మీసేవ సెంటర్లకు వచ్చారు వరద బాధితులు.