తన ఇంటి దగ్గర పవన్ కల్యాణ్ దీక్ష! రైతులను ఆదుకోవాలని డిమాండ్
posted on Dec 7, 2020 @ 11:42AM
నివర్ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. అమరావతిలోని తన నివాసం దగ్గరే ఆయన దీక్షలో కూర్చున్నారు. వరద బాధితులకు నష్ట పరిహారంగా రూ. 35 వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ. 10,000 ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన నివర్ తుపానుతో ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు ప్రాంతాల్లో పర్యటించి, రైతులను పరామర్శించారు. వారికి జరిగిన నష్ట వివరాలను పవన్ తెలుసుకున్నారు. ప్రజలను ఆదుకునే విషయంలో వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే దీక్ష చేపడతానని ఇప్పటికే ప్రకటించారు.చెప్పినట్లే తన నివాసం దగ్గర దీక్షకు దిగారు జనసేనాని.
పవన్ కల్యాణ్ పిలుపుతో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లా కేంద్రాల్లో జనసేన నేతలు, కార్యకర్యలు నిరనసలకు దిగారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తున్నారు. వరద బాధితులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.