కేసీఆర్ కోసమా.. ఆయనతో విభేదాలా? బీజేపీలోకి రామేశ్వరరావు ఖాయమేనా?
posted on Jan 4, 2021 @ 1:49PM
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో ఊహించని ట్విస్టులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. అందులో ప్రధానంగా వినిపిస్తోంది ప్రముఖ పారిశ్రామికవేత్త, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారన్నది. రామేశ్వరరావును బీజేపీ రాజ్యసభకు పంపించబోతుందని కూడా చెబుతున్నారు. రామేశ్వరరావు బీజేపీలోకి వెళుతున్నారన్న ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. కేసీఆర్ టార్గెట్ గానే బీజేపీ జూపల్లిని లాగుతుందని కొందరు చెబుతుండగా.. కేసీఆర్ కోసమే రామేశ్వరరావు కమలం గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ తో కొంత కాలంగా జూపల్లికి విభేదాలు వచ్చాయని , అందుకే ఆయన మరో పార్టీ వైపు చూస్తున్నారన్న వాదన కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.
తెలంగాణలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా కేసీఆర్, జూపల్లికి మధ్య గ్యాప్ వచ్చిందనే సంకేతమిస్తున్నాయి. ముఖ్యంగా జూపల్లికి చెందిన మీడియాలో కాంగ్రెస్ పైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లైవ్ షో జరగడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. మీడియాలోకి జూపల్లి ఎంటరయ్యాకా... ఆయనకు సంబంధించిన ఛానెళ్లలో రేవంత్ రెడ్డి వార్తలే రావడం లేదు. సీఎం కేసీఆర్, జూపల్లి రామేశ్వరరావును రేవంత్ రెడ్డి మొదటి నుంచి తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. అందుకే అతని వార్తలను జూపల్లి మీడియాలో బ్యాన్ చేశారని భావించారు. కాని సడెన్ గా సీన్ మారిపోయింది. జూపల్లికి సంబంధించిన మీడియాలో రేవంత్ రెడ్డి గంటన్నర పాటు కనిపించడంతో చూసినవారంతా .. ఇది నిజమా కలా అంటూ విస్తుపోయారు. అది కూడా జూపల్లికి కేసీఆర్ తో ఆయనకు విభేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతున్న సమయంలోనే జరగడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. జూపల్లి మీడియాలో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి లైవ్ షో జరగడంతో .. కేసీఆర్, జూపల్లి మధ్య ఏదో జరుగుతుందన్న ప్రచారం మరింత ఊపందుకుంది.
తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలోనూ కారుకు షాకిచ్చింది కమలం పార్టీ. ఇక అధికారం చేజిక్కుంచుకోవడమే లక్ష్యంగా కొత్త ఎత్తులు వేస్తుందని, అందులో భాగంగానే కేసీఆర్ ఆర్థిక మూలాలపై బీజేపీ దెబ్బ కొడుతుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు,టీఆర్ఎస్‌కు ఆర్థిక అండ దండలు అందిస్తున్న మై హోమ్ రామేశ్వరరావును బీజేపీలోకి లాగుతున్నారన్న చర్చ జరుగుతోంది. గతంలో ఆయన సంస్థలపై ఈడీ దాడులు జరగడం కూడా బీజేపీలో వ్యూహంలో భాగమేనంటున్నారు. కేంద్రంలోని బీజేపీ నేతల నుంచి ఒత్తిడి పెరగడం, ఈడీ దాడులతో రామేశ్వరరావు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.
జూపల్లికి సంబంధించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్ అవినీతికి సంబంధించిన చిట్టా మొత్తం కేంద్రంలో చేతుల్లో ఉందని, కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా పలువురు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకునేందుకు కేసీఆరే .. తన సన్నిహితుడు జూపల్లి రామేశ్వరరావును బీజేపీలోకి పంపిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. జూపల్లికి బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉండటంతో కేసీఆర్ అటు వైపు నుంచి నరుక్కొస్తున్నారని చెబుతున్నారు. కేంద్రంపై యుద్దమే అంటూ ఒంటి కాలిపై లేచిన కేసీఆర్.. ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. గతంలో వ్యతిరేకించిన కేంద్ర పథకాలకు జై కొట్టారు. దీంతో బీజేపీ పెద్దలను గులాబీ బాస్ శరణు వేడుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడి బీజేపీకి ఆయన సరెండర్ అయ్యారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. బీజేపీతో సయోధ్య చేసుకోవాలని కేసీఆర్‌కు సలహా ఇచ్చింది కూడా మై హోమ్ రామేశ్వరరావే అన్న వాదన కూడా వుంది. అందుకే కేసీఆర్ ను కాపాడేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్న రామేశ్వరరావు.. కేసీఆర్ కోసమే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారని కొందరు చెబుతున్నారు,
టీఆర్ఎస్-బీజేపీ రెండూ ఒకటేనని చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో ఆ విషయం బహిర్గతమవుతుందని చెబుతున్నారు. అంతేకాదు కేసుల బూచి చూపిస్తూ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పాటు టీడీపీని బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని, తెలంగాణలోనూ అదే చేయబోతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏపీకి చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లినప్పుడు... చంద్రబాబే బీజేపీకి మళ్లీ దగ్గరయ్యేందుకు వాళ్లను పంపించారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా తనపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరగకుండా ఉండేందుకే.. తన సన్నిహితుడిని కేసీఆరే బీజేపీలోకి పంపిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి కారణం ఏదైనా.. మైహోం రామేశ్వరరావు బీజేపీకి వెళితే మాత్రం అది తెలంగాణలో పెద్ద రాజకీయ సంచలనమే.