త్వరలో టీఆర్ఎస్ లోకి వీహెచ్! కేసీఆర్ ను పొగడటంతో లైన్ క్లియరా?
posted on Jan 4, 2021 @ 11:03AM
తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా అనూహ్యా మార్పులు జరుగుతున్నాయి. నాయకుల వలసలతో ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ తరహా వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక విజయం, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటడంతో తెలంగాణలో బీజేపీ దూకుడు పెరిగింది. ఆ పార్టీలోకి రోజూ చేరికలు కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో మాత్రం పీసీసీ చీఫ్ పీటముడి వీడటం లేదు. ఇదిగో అదిగో ప్రకటన అంటూనే నెల రోజులు కాలాయపన చేసింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో హస్తం నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ కు మొదటి నుంచి వీర విధేయుడిగా ఉన్న సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు పార్టీ మారతారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసే వీహెచ్.. పార్టీ మారాల్సి వస్తే బీజేపీలోకి వెళ్లవచ్చని భావించారు.
అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆయన గులాబీ గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడే వీహెచ్.. తాజాగా ఆయనను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడంతో హనుమంతరావు కారు పార్టీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు. మున్నూరు కాపు మహాసభలో మాట్లాడిన వీహెచ్.. కేసీఆర్‌పై గతంలో ఎప్పుడు లేనంతగా ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ అన్ని కులసంఘాల భవనాలకు స్థలం, నిధులు ఇస్తున్నారని చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కుల సంఘాలకు ఇంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు హనుమంతరావు. వీహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నందు వల్లే కేసీఆర్ ను పొగుడుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో వివాదం రేపుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వొద్దని కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అందులో వీహెచ్ ప్రధానంగా ఉన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించవద్దని ఆయన చాలా సార్లు చెప్పారు. హైకమాండ్ కు వివరించారు. ఎక్కడ మాట్లాడినా పీసీసీ విషయంలో రేవంత్ ను వ్యతిరేకిస్తున్నారు వీహెచ్. దీంతో రేవంత్ రెడ్డి అనుచరులు వీహెచ్ ను టార్గెట్ చేశారు. రేవంత్ అభిమానితో వీహెచ్ కు ఫోన్ లో జరిగిన గొడవకు సంబంధించిన ఆడియో కాల్ లీకై తీవ్ర కలకలం రేపింది. రేవంత్ రెడ్డి అనుచరుడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు వీహెచ్. తర్వాత కూడా రేవంత్ ను ఆయన వదలడం లేదు. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇస్తే తాను కాంగ్రెస్ నుంచి బయటికి వస్తానని కూడా చెప్పారు వీహెచ్.
రేవంత్ రెడ్డికే పీసీసీ చీఫ్ పోస్టు దాదాపుగా ఖాయమని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం రావడంతో .. తాను చెప్పినట్లే కాంగ్రెస్ పార్టీని వీడేందుకు హనుమంతరావు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. బీజేపీలోకి వెళితే పదవులు వచ్చే అవకాశం లేదని, కేసీఆర్ అయితే ఏదో ఒక పోస్టు కట్టబెడుతారని వీహెచ్ భావిస్తున్నారట. అందుకే టీఆర్ఎస్ లో చేరాలని దాదాపుగా నిర్ణయించుకున్న వీహెచ్.. సీఎం కేసీఆర్ ను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారంటున్నారు. రేవంత్ రెడ్డికే పీసీసీ చీఫ్ అన్న ప్రకటన వచ్చిన వెంటనే వీహెచ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేస్తారని ఆయన అనచురులు కూడా చెబుతున్నారు. మొత్తానికి వీహెచ్ టీఆర్ఎస్ లో చేరితే మాత్రం అది సంచలనమే. విశ్లేషకులు మాత్రం రాజకీయాల్లో శాశ్వాత మిత్రులు, శత్రువులు ఉండరని.. ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. వీహెచ్ టీఆర్ఎస్ లో చేరినా పెద్దగా అశ్చర్యపడాల్సింది ఏమీ లేదంటున్నారు.