సీఎం దగ్గరకు హడావిడిగా పరుగులు పెట్టిన మంత్రి కొడాలి నాని.. కారణం అదేనా..!
posted on Jan 4, 2021 @ 1:04PM
ఏపీ పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని తన అనుచరులతో కలిసి నిర్వహిస్తున్నట్లుగా చెపుతున్న పేకాట క్లబ్బులపై పోలీసులు దాడులు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ దాడుల నేపథ్యంలో మంత్రి కొడాలి నాని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. దీంతో అయన తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఉన్నపళంగా సీఎం జగన్ ను కలిసేందుకు అయన నివాసానికి హడావిడిగా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి కారణం సీఎం ఆఫీసు నుండి వచ్చిన పిలుపో.. లేక ఈ మొత్తం ఘటన పై వివరణ ఇచ్చుకునేందుకు ఆయనే వెళ్లారో తెలియలేదు కానీ ఇంత హఠాత్తుగా మంత్రి నాని సీఎం ఇంటికి వెళ్ళడం మాత్రం ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది.
ఇదిలా ఉండగా.. గత రాత్రి మంత్రి కొడాలి నాని కి చెందిన గుడివాడ నియోజకవర్గంలోని తమ్మిరిస గ్రామంలోని పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు చేసి.. 30 మంది పేకాట రాయుళ్లను పట్టుకుంది. 28 కార్లు, కోట్ల కొద్దీ నగదు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడి అధికార పార్టీ నేతలే పేకాట క్లబ్‌ను నడుపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ ఒక కీలక మంత్రి కనుసన్నల్లో.. కృష్ణా జిల్లాలో నడుపుతున్న ఈ పేకాట డెన్ గుట్టు రట్టయింది. ఈ పేకాట డెన్ లోకి ఎంట్రీ ఫీజ్ 10 వేలు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అంతేకాకుండా కొద్దిరోజుల క్రితం గుడివాడలో జరిగిన బహిరంగ సభలో పేకాట క్లబ్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. "మీరు పేకాట క్లబ్‌లు, సిమెంట్ కంపెనీలు, మీడియా సంస్థలను నడపగా లేనిది.. నేను సినిమాల్లో నటిస్తే తప్పేంటి?" అని మంత్రిని ప్రశ్నిస్తూ.. పవన్ ధ్వజమెత్తిన సంగతి తెల్సిందే. దీంతో ఏపీ వ్యాప్తంగా పవన్ ఆరోపణలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. అయితే పవన్ ఆ మాటలు అన్న కొన్ని రోజులకే ఇలా పేకాట క్లబ్ పై దాడులు జరగడంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది.