మంత్రి గారి పేకాట క్లబ్బుపై దాడి చేసిన పోలీసులు.. చంపేస్తామని బెదిరించిన మంత్రి అనుచరులు
posted on Jan 4, 2021 @ 10:04AM
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఏపీలోని జగన్ సర్కార్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి ఆధ్వర్యంలో నడిపిస్తున్న పేకాట క్లబ్బులపై కొద్దిరోజుల క్రితం పోలీసులు రైడింగ్ చేయగా.. ఆ దాడిలో భారీ ఎత్తున డబ్బు, కార్లు, వ్యక్తులు పట్టుబడ్డారని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులే స్వయంగా బయట పేకాట ఆడుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. అయితే ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ నలభై మంది పోలీసు సిబ్బందితో కలిసి ఆ మంత్రి గారి పేకాట క్లబ్బుపై దాడి చేయగా.. ఆ ఆఫీసర్ ను బూతులు తిట్టారని.. అంతేకాకుండా అక్కడ్నుంచి వెళ్లకాపోతే చంపేస్తామని బెదిరించారని అయన ఆరోపించారు.
దేవినేని ఉమా వ్యాఖ్యల పూర్తి వివరాలు అయన మాటల్లోనే..
"సీఎం జగన్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న కొడాలి నాని ఆధ్వర్యంలో నడుస్తున్న పేకాట క్లబ్బుల్లో భారీ ఎత్తున డబ్బు, కార్లు, వ్యక్తులు పట్టుబడ్డారు. ఆ స్పాట్ లో సంచుల్లో రూ. 10 కోట్ల రూపాయలు డబ్బులు దొరికాయి. ఈ సొమ్ముతోపాటు సుమారు 30 కార్లతో సహా 60 మంది కూడా పట్టుబడ్డారు. సీఎం జగన్ క్యాబినెట్ లోని మంత్రులు లోపల, బయట పేకాట ఆడుతున్నారు. కొడాలి నాని 19 నెలలుగా తన ముఖ్య అనుచరులు విజయ్, మధు(మురళి) ల ఆధ్వర్యంలో ఎంట్రీ ఫీజుగా రూ. 5,000 నెట్ క్యాష్ వసూలు చేస్తూ, రూ. 2 లక్షల రూపాయలంటు పేకాట క్లబ్ నడిపిస్తున్నాడు. తాజాగా ఒక నిజాయితీపరుడయిన ఒక పోలీస్ అధికారి 40 మంది పోలీసులతో మంత్రి ఆడిస్తున్న పేకాట క్లబ్బుల పైన దాడి చేశారు. అయితే ఆ పోలీస్ అధికారిని బదిలీ చేస్తామని, బూతులు తిడుతూ ఆ డబ్బు సంచులను వదిలేసి వెళ్లకపోతే చంపేస్తామని మంత్రి దగ్గరనుంచి బెదిరింపులు వెళుతున్నాయి.." అని ఉమా అన్నారు.
ఇదే ఘటనపై ఉమా స్పందిస్తూ.. "సీఎం కు దమ్ము, ధైర్యం ఉంటే మంత్రి కొడాలి నానిని వెంటనే మంత్రిమండలి నుండి బర్తరఫ్ చేయాలి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. ఒక సిన్సియర్ పోలీస్ అధికారి వెళ్లి మంత్రి కొడాలి నానికి అడ్డుకట్ట వేశారు. నిజాయితీపరుడైన ఆ పోలీస్ అధికారి కి హ్యాట్సాఫ్. నందివాడ మండలం దొండపాడు గ్రామ పరిధిలోకి ఏ మీడియా వారైనా ఫోన్ తీసుకొని వెళితే చంపేస్తామని బెదిరిస్తున్నారంటా.. అక్కడ రాత్రి ఎనిమిదింటికి మొదలైన పేకాట క్లబ్బులు తెల్లవారు జాము దాకా జరుగుతున్నాయట.. ఇది గత 19 నెలలుగా జరుగుతోంది. కొడాలి నాని అడిస్తున్న ఈ లోనా బయట ఆటల వల్ల, కోత ముక్కల వల్ల ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో చాలామంది జీవితాలు కూడా బలి అయ్యాయి.." అని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సదరు మంత్రి నిర్వహిస్తున్న పేకాట క్లబ్బుల వల్ల ఇప్పటికే చాలా మంది జీవితాలు నాశనమవుతున్నాయని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. "నూజివీడు లో కనకం అనే ఉద్యోగి అప్పులు చేసి ఇంట్లో బంగారం, ఆస్తులు తాకట్టు పెట్టి పేకాట ఆడి అప్పులు కట్టలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల రైడ్ లో స్పాట్ లో దొరికిన ఆ పది కోట్ల రూపాయల డబ్బును, సీజ్ చేసిన 30 కారులను, ఆ 60 మంది వ్యక్తులను కోర్టులో హాజరు పరచాలి. ఈ విషయం మీద ప్రతిపక్షాలు, మీడియా వాళ్ళు మాట్లాడినా సీఎం జగన్ గారి చెవికి ఎక్కలేదు. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం, దొండపాడు గ్రామం చంద్రయ్య కాలవ గట్టున అంకమ్మగూడెం వంతెన వద్ద ఆక్వా పొలాల్లో గత 19 నెలలుగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో విజయ్, మధు(మురళి) అనే ఇద్దరు ఆధ్వర్యంలో లోన బయట ఆట ఆడిస్తున్నారు..." అంటూ ఉమా మండిపడ్డారు.