హైదరాబాద్ లో ఏపీ మంత్రి దిష్టి బొమ్మ దహనం.. ఖబడ్దార్ అంటూ హెచ్చరిక
posted on Jan 4, 2021 @ 11:01AM
ఏపీలోని రామతీర్థం ఆలయంలోని పురాతన రాముడి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై సర్వత్రా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెసిందే. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఆలయ చైర్మన్ గా ఉన్న పూసపాటి రాజ వంశీకుడైన అశోక గజపతిరాజును ఆ పదవి నుండి ఏపీ ప్రభుత్వం తప్పించిన సంగతి తెల్సిందే. ఇదే సందర్భంలో టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఐన అశోక్ గజపతిరాజుపై ఏపీ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో క్షత్రియ సంఘం నేతలు నిరసనకు దిగారు. ఈ నిరసనలో భాగంగా మంత్రి వెల్లంపల్లి దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. వెంటనే మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని క్షత్రియ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా.. ఇదే విషయం పై విజయవాడలో నిన్న క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి రాష్ట్ర కన్వినర్ గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ.. ‘‘విజయనగర సంస్థానాధీశులు పూసపాటి అశోక్‌గజపతిరాజు ఇంట్లో పాలేరు స్థాయి కూడా లేని మంత్రి వెలంపల్లి ఆయనను అసభ్యపదజాలంతో దూషించడం సిగ్గుచేటు. మంత్రి తక్షణమే అశోక్ గజపతిరాజుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా క్షత్రియ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం’’ అని హెచ్చరించారు. "దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ను పనికిమాలిన, దగుల్బాజి మంత్రి, చరిత్ర హీనుడిగా అభివర్ణించాలని ఉన్నా తమకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. వేల ఆలయాల అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు తమ ఆస్తులను త్యాగం చేసిన చరిత్ర అశోక్ గజపతిరాజు కుటుంబానిదని" అయన అన్నారు.
అంతేకాకుండా "ఆలయాల ఆస్తులు విక్రయించిన చరిత్ర వెలంపల్లిదని గుర్తుంచుకోవాలన్నారు. రాజవంశీకుడైనా కూడా ఒక సామాన్యుడిగా జీవనం సాగిస్తున్న అశోక్ గజపతిరాజుపై అవగాహన లేకుండా మంత్రి మాట్లాడటం క్షత్రియల ఆగ్రహావేశాలకు కారణమైందని" ఫెడరేషన్ అధ్యక్షులు వెంకటపతిరాజు, సమితి అధ్యక్షులు నాగరాజు అన్నారు. ఈ సమావేశంలో క్షత్రియ సంఘాల నేతలు ప్రసాదరాజు, వెంకటేశ్వరరాజు, ఉద్దరాజు విజయరామరాజు, సాగి అచ్చ్యుతరామరాజు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.