మూషికం మనసు గెలిచిన విజయవాడ పోలీసులు!!
posted on Jan 4, 2021 @ 2:00PM
కరోనా మహమ్మారి మూలంగా గత కొద్దినెలలుగా ప్రజలు పండుగలు సరిగా జరుపుకోలేకపోయారు. వాటిలో వినాయక చవితి కూడా ఒకటి. ప్రతి ఏడాది ఘనంగా వినాయకుడిని పూజించి నిమజ్జనం చేసే భక్తులు ఈసారి మాత్రం మొక్కుబడిగా పూజలు చేశారు. నైవేద్యంగా పెట్టే ఉండ్రాళ్ళు కూడా బాగా తగ్గించారు. దీంతో బొజ్జ గణపయ్యకు కోపమొచ్చింది. వెంటనే తన వాహనమైన మూషికాన్ని పిలిచి.. "మూషికా.. నరులు ఈ ఏడాది నాకు ఉండ్రాళ్ళు తక్కువ చేసి.. నా కడుపులో నిన్ను పరుగెత్తేలా చేశారు. వెంటనే నువ్వు భూలోకానికి వెళ్లి నేను అలిగానని వాళ్ళకి అర్థమయ్యేలా అలజడి సృష్టించు" అని గణపయ్య ఆజ్ఞాపించారు.
గణపయ్య ఆజ్ఞతో భూలోకానికి వచ్చిన మూషికం తిరిగి తిరిగి అలసిపోయి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చేరుకుంది. అలజడి సృష్టించడానికి ఇదే సరైన ప్రదేశమని నిర్ణయించుకుంది. నగరంలోని పండిట్ నెహ్రు బస్ స్టేషన్ ఆవరణలో ఉన్న రామ మందిరంలో మూషికం స్థావరం ఏర్పరుచుకుంది. అక్కడ సీతారాముల మట్టి విగ్రహాలుంటే వాటి నీడలో ఉంటూ తాను వచ్చిన పనిని మర్చిపోయి పూజారులు, భక్తులు పెట్టిన నైవేద్యం తింటూ బాహుబలిలా బలంగా తయారైంది. అలా కొద్దిరోజులు గడిచాక గణపతి ఆజ్ఞ గుర్తుకొచ్చి, తాను భూలోకానికి వచ్చిన పనిని మరిచానని గ్రహించి.. వెంటనే అక్కడి నుండి బయటకు రాబోతుండగా.. బాహుబలిలా బలంగా తయారైన మూషికం తాకిడికి సీతమ్మ విగ్రహం కిందపడిపోయింది. 'అయ్యయ్యో ఎంత అపచారం జరిగింది.. నన్ను క్షమించు అమ్మ' అంటూ మూషికం సీతమ్మకి క్షమాపణ చెప్పి పరుగుపరుగునా వినాయకుడి వద్దకు చేరుకుంది.
భూలోకంలో తాను చేసిన పని వినాయకుడికి తెలిసి ఉంటుందని, తనని మందలిస్తాడని మూషికం అనుకుంది. కానీ తాను చేసిన పని వినాయకుడు కనిపెట్టలేకపోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. కానీ, వినాయకుడు కనిపెట్టలేకపోతేనేం.. విజయవాడ పోలీసులు కనిపెట్టేశారు. ఎలుక తోసేయడం వల్ల సీతమ్మ విగ్రహం కింద పడిపోయి ఉంటుందని కృష్ణలంక సీఐ సత్యానందం, ఏసీపీ వెంకటేశ్వర్లు ప్రాధమిక అంచనాకు వచ్చేశారు. ఇది మట్టితో తయారుచేసిన విగ్రహమని, ఎలుకల వల్ల కిందపడి ధ్వంసమై ఉంటుందని సీఐ వ్యాఖ్యానించారు. నిందితులను పట్టుకోలేక, ఇలాంటి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని సీఐపై భక్తులు, ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే వినాయకుని వాహనం మూషికం మాత్రం సీఐని ప్రశంసిస్తోంది. నేను చేసిన పనిని స్వామి గణపయ్యే కనిపెట్టలేకపోయారు.. కానీ సీఐ భలేగా కనిపెట్టారంటూ ఆయనపై మనసులోనే ప్రశంసల వర్షం కురిపిస్తోంది.