కేసీఆర్ సర్కార్ ఎపుడైనా కూలిపోవచ్చు.. బీజేపీ నేతల సంచలనం
posted on Jan 8, 2021 @ 4:44PM
తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చని, ఈ ప్రభుత్వం ఇంకా రెండు సంవత్సరాలు ఉండటం కష్టమేనంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. దుబ్బాక, గ్రేటర్ లో ప్రయోగించిన బీజేపీ వ్యాక్సిన్ బాగా పనిచేసిందని, ఇక ఖమ్మంపైనే తమ నెక్ట్స్ ప్రయోగం అని అయన స్పష్టం చేశారు.
తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ తో కలిసి ఖమ్మంలో సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మంలో మంత్రి పువ్వాడపై నిప్పులు చెరిగారు. నాలుగు సంవత్సరాల్లో నాలుగు పార్టీలు మారిన మంత్రి అజయ్… మాకు నీతులు చెప్తున్నారని, కేవలం అక్రమ భూములను రెగ్యూలర్ చేయించుకోవటానికే టీఆర్ఎస్ లో చేరారని మండిపడ్డారు. త్వరలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని, అపుడు ఆయన అక్రమాల చరిత్ర బయటపెడుతాం అంటూ హెచ్చరించారు.
మరోపక్క హాఫీజ్ పేట భూదందా కేసు విషయంలో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో తాజాగా వెలుగులోకి వచ్చిన హాఫీజ్ పేట భూవివాదంతో పాటు నగరంలో జరుగుతున్న వివాదాల వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని అయన ఆరోపించారు. మియాపూర్, హాఫీజ్ పేట భూ కబ్జాల వెనుక టీఆర్ఎస్, ఎంఐఎం బడా నేతల హస్తముందని అయన పేర్కొన్నారు. అంతేకాకుండా ల్యాండ్, ఇసుక, డ్రగ్ మాఫీయాకు సీఎం పేషి కేంద్ర బిందువుగా మారిందని… తమ అధికారాన్ని అడ్డంపెట్టుకొని నకిలీ భూ పత్రాలతో దందా నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని, హాఫీజ్ పేట భూముల వ్యవహారంలో అఖిలప్రియతో పాటు ప్రవీణ్ రావు, టీఆర్ఎస్ నేతల ప్రమేయంపై నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.