జగన్ చెప్పినట్లే బీజేపీ చేస్తోందా? పవన్ కల్యాణ్ మాటలకు అర్దమేంటీ?
posted on Jan 7, 2021 @ 2:03PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ఆరోపణలు హాట్ హాట్ గా మారాయి. ఒక్క లెటర్ రాస్తే సీజేలే బదిలీ అయ్యారు.. మీపై గెరిల్లా యుద్ధం సాధ్యమా అంటూ జగన్ పై పవన్ సంచలన కామెంట్స్ చేశారు. ఇవే ఇప్పుడు చర్చనీయాంంశంగా మారాయి. న్యాయస్థానాలకు సంబంధించిన విషయాలన్ని కేంద్రం పరిధిలోనే ఉంటాయి. సీజేల బదిలీ, నియామకాలన్ని కొలిజీయం సిఫారసుల మేరకే కేంద్రం చేపడుతుంది. అయితే ఒక్క లేఖ రాస్తే చాలు ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణాలలో బదిలీ అయిపోతారు అంటూ జగన్ ను ఉద్దేశించి పవన్ కామెంట్ చేయడంతో.. జగన్ లేఖ వల్లే ఏపీ హైకోర్టు సీజే బదిలీ అయ్యారా అన్న చర్చ జరుగుతోంది. అంటే బీజేపీ పెద్దలు జగన్ చెప్పినట్లే చేస్తున్నారనే అర్ధంతో పవన్ మాట్లాడారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత అక్టోబర్ లో సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు లేఖ రాశారు. ఏపీ హైకోర్టు ను సుప్రీంకోర్టు జడ్జి ఎన్ వి రమణ ప్రభావితం చేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని ఆ లేఖలో ఆరోపించారు జగన్. మొత్తం 8 పేజీలున్న లేఖలో తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా ఎన్వీ రమణ ప్రయత్నిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సీజేకు జగన్ రాసిన లేఖ అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే అయింది. జగన్ లేఖ రాసిన కొన్ని నెలల్లోనే ఏపీ హైకోర్టు సీజే బదిలీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ వ్యాప్తంగా పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీ జరిగినప్పటికి .. ఏపీ హైకోర్టు సీజే బదిలీ మాత్రం చర్చగా మారింది. తాజాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో జగన్ కోరిక మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందా అన్న అనుమానాలు కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ అధినేత జగన్ మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు. కేంద్రం తీసుకువచ్చిన దాదాపు అన్ని బిల్లులకు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు సపోర్ట్ చేశారు. గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు వ్యతిరేకిస్తున్న కొత్త వ్యవసాయ బిల్లులకు కూడా వైసీపీ మద్దతు తెలిపింది. ఏపీకి కేంద్రం నుంచి నిధులు సరిగా రాకపోయినా మోడీ సర్కార్ పై పల్లెత్తు మాటలు మాట్లాడటం లేదు ఫ్యాన్ పార్టీ నేతలు. పోలవరం విషయంలో తేడా జరిగినా జగన్ కనీసం స్పందించలేదు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు ఏపీ సీఎం జగన్. ఈ సమావేశంలో న్యాయ సంబంధ విషయాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ హైకోర్టు సీజే బదిలీకి ఇది కూడా కారణం కావొచ్చనే వాదనలు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ, వైసీపీ మధ్య పెద్ద డీల్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలకు సంబంధించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఏపీలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల విషయంలో కేంద్రం స్పందన తాను అశించినంతగా లేదనే అసంతృప్తిలో పవన్ కల్యాణ్ ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ.. ఆలయాలపై ఇంత దారుణంగా దాడులు జరుగుతున్నా సీరియస్ గా తీసుకోకపోవడమేంటో తనకు అర్ధం కావడం లేదని పవన్ భావిస్తున్నారట. వైసీపీ, బీజేపీ కలిసే ఓట్ల కోసం కుట్ర రాజకీయం చేస్తున్నాయా అన్న అనుమానం కూడా జనసేన నేతల్లో ఉందంటున్నారు. అందుకే నేరుగా ఆరోపణలు చేయకుండా జగన్ ను విమర్శిస్తూ.. పరోక్షంగా కేంద్రాన్ని పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీజేల బదిలీపై కామెంట్ చేశారంటే పరోక్షంగా కేంద్ర సర్కార్ ను ప్రశ్నించినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక లోపు ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరగవచ్చంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీతో కలిసి జనసేన వెళ్లినా అశ్చర్యం లేదంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. తిరుపతిలో కూడా అలాంటిదేమైనా జరుగుతుందేమో చూడాలి మరీ..