ఒక్క లెటర్ రాస్తే సీజేలే బదిలీ అయ్యారు.. మీపై గెరిల్లా యుద్ధం సాధ్యమా.. పవన్ సంచలన కామెంట్స్
posted on Jan 7, 2021 @ 11:04AM
ఏపీలోని దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల పై స్పందించిన ఏపీ సీఎం జగన్ తమ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు గెరిల్లా వార్ ఫేర్ చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
"మీరు ఎంతటి శక్తిమంతులో దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు కేవలం ఒక్క లేఖ రాస్తే చాలు ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణాలలో బదిలీ అయిపోతారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా వార్‌ఫేర్ చేయడానికి ఎవరైనా సాహసిస్తారా?’ అని సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు.. 115 మంది ఐపీఎస్ లు... మరో 115 మంది అదనపు ఎస్‌పీలు.. వేలాది మంది పోలీసు సిబ్బందిని చేతిలో ఉంచుకొని విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని పవన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘‘నిస్సహాయుడైన దళిత డాక్టర్ సుధాకర్‌పైనా, మీపై, మీ పార్టీ వారిపైన సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టేవారిపైనా అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు...దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకుని ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు? వార్డుకో వలంటీరు చొప్పున 2.60 లక్షల మందిని నియమించారు. ఈ దుశ్చర్యలకు పాల్పడేవారి సమాచారం వారు కూడా ఇవ్వలేకపోతున్నారా? గత రెండేళ్లలో 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. రథాల దగ్ధాలు, విగ్రహాల ధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతకూ ఎక్కడ ఉంది లోపం? మీలోనా..మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా?’’ అని పవన్ ప్రశ్నించారు.
ఈ అరాచకంపై మాట్లాడితే, ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ నడిపిస్తున్నాయని సీఎం జగన్ అనడం సరికాదని, అది ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవడమే అవుతుందని అయన విమర్శించారు. గత రెండేళ్లుగా సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్డుపైకి రావలసిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందని పవన్ మండిపడ్డారు.