అమెరికాలో కల్లోలం... పండగ చేసుకుంటున్న చైనా
posted on Jan 7, 2021 @ 12:08PM
అమెరికా చరిత్రలో ఎపుడూ జరగని విధంగా క్యాపిటల్ భవనంపై దాడి జరగడం.. దానికి ట్రంప్ మద్దతు పలకడం, ఆ తరువాత జరిగిన పోలీసుల కాల్పులలో నలుగురు మృతి చెందిన సంగతి తెల్సిందే. ఒకపక్క సెనేట్ తో పాటు ప్రతినిధుల సభ సమావేశమైన సమయంలో.. నిరసనకారులు దారుణమైన విధ్వంసానికి దిగిన సమయంలో జరిగిన పరిణామాలు ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఇది ఇలాఉండగా అమెరికా లోని క్యాపిటల్ బిల్డింగ్‌లో చోటుచేసుకున్న దృశ్యాలకు చైనా సామాజిక మీడియాలో ప్రతిస్పందనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలపై "అద్భుత దృశ్యం" అనే కామెంట్ తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా చైనా ప్రజలు అమెరికాలోని దృశ్యాలను ఒకప్పుడు హాంగ్‌కాంగ్‌లో జరిగిన నిరసనలతో పోల్చుతున్నారు. చైనా మీడియా కూడా హాంగ్‌కాంగ్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ప్రస్తావిస్తూ.. నాటి నిరసనలను నేటి అమెరికాలోని దృశ్యాలను కలిపి ఓ చిత్రాన్ని అక్కడి గ్లోబల్ టైమ్స్ పోస్ట్ చేసింది. "అమెరికా దిగువ సభ స్పీకర్ నాన్సీ పలోసీ.. అప్పట్లో హాంగ్‌కాంగ్ నిరసనలను సుందర దృశ్యం అని కొనియాడారు. మరి ప్రస్తుతం క్యాపిటల్ బిల్డింగ్‌లోని దృశ్యాలపై ఆమె ఏ వ్యాఖ్య చేస్తారో" అంటూ సెటైర్ వేసింది.
అమెరికాలో అధికార మార్పిడి సమయంలో తాజాగా జరుగుతున్న ఘటనలపై చైనా కమ్యునిస్టు పార్టీ యూత్ లీగ్ కూడా నాన్సీ పెలోసీ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంది. సుందర దృశ్యం పేరిట అక్కడి యువత అమెరికాకు వ్యతిరేకంగా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడి పేరుతో ఉన్న హ్యష్ ట్యాగ్ చైనా సోషల్ మీడియా వియబోలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అప్పట్లో హాంగ్‌కాంగ్ నిరసనకారులకు మద్దతు తెలిపిన ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరి దీంతో స్పష్టమైందనే వ్యాఖ్యలు చైనా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.