అఖిలప్రియను ఉగ్రవాది కన్నా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు!
posted on Jan 8, 2021 @ 5:01PM
హఫీజ్ పేట భూ వివాదం, భూమా అఖిలప్రియ అరెస్టుపై సంచలన విషయాలు చెప్పారు భూమా మౌనికారెడ్డి. కేసుకు సంబంధించి ఆమె పలు తీవ్ర ఆరోపణలు చేశారు. అఖిలప్రియను జైల్లో ఉగ్రవాది కన్నా దారుణంగా చూస్తున్నారని, అఖిలప్రియకు వైద్యం అందించడం లేదని మౌనికారెడ్డి ఆరోపించారు. ఫిట్స్ వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తన సోదరికి ప్రాణహాని ఉందని చెప్పారు. తమ ఎక్కడా రక్షణ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి నుంచి అఖిలప్రియను తీసుకెళ్లే విధానం అదేనా? అని మౌనిక ప్రశ్నించారు. ఆమె రహస్యంగా ఎందుకు తీసుకెళ్లారని నిలదీశారు. అఖిలప్రియ సరిగా భోజనం చేయడం లేదని, ఆమె ఆరోగ్యం బాగా లేదని మౌనికి తెలిపారు. అఖిలప్రియ అనారోగ్యంతో బాధపడుతున్నా వేధిస్తున్నారని తప్పుబట్టారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే అఖిలప్రియను అలా ట్రీట్ చేస్తున్నారని ఆరోపించారు.
భూవివాదం తమ నాన్న బతికి ఉన్నప్పటి నుంచి ఉందని చెప్పారు మౌనిక. తమ అమ్మానాన్న ఆళ్లగడ్డకో.. కర్నూలుకో పరిమితమైన నేతలు కాదన్నారు. శోభా నాగిరెడ్డి ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. పోలీసులే కేసును నిర్ధారిస్తే కోర్టులు ఎందుకని ప్రశ్నించారు భూమా మౌనిక. ఏ ఆధారాలతో అఖిలప్రియను అరెస్ట్ చేశారని పోలీసులను నిలదీశారు. భూవివాదంపై చర్చించడానికి తాము సిద్ధమని భూమా మౌనిక స్పష్టం చేశారు. ఆస్తుల కోసమే తమను టార్గెట్ చేస్తున్నారని మౌనిక ఆరోపించారు. ఆళ్లగడ్డ నుంచి వచ్చామని ఫ్యాక్షనిస్టుగా ముద్ర వేస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో పెరిగిన తాము సెటిలర్లం కాదన్నారు. సెటిలర్ల ఓట్లతోనే కేసీఆర్ గెలిచారని మౌనిక చెప్పారు.
హఫీజ్ పేటలో ఉన్న 25 ఎకరాల భూమి తమదేనని తమ ఆస్తులు కొట్టేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఆరోపించారు. తమ కుటుంబాన్ని రాజకీయంగా వేధిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో కేసులు నమోదైతే ఆళ్లగడ్డలో ఉన్న తమ అనుచరులను వేధిస్తున్నారని వెల్లడించారు. తన సోదరిపై తప్పుడు సెక్షన్ల కింద కేసులు పెట్టారని ఆరోపించారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని ఇంతలా భయపెట్టి ఏంసాధించాలనుకుంటున్నారు? అని జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రవీణ్, సునీల్ అనే వ్యక్తుల తండ్రి తమ తండ్రి భూమా నాగిరెడ్డికి లాయర్ గా ఉండేవారని, తమ తండ్రి చనిపోయిన తర్వాత వారు ఏవీ సుబ్బారెడ్డితో కుమ్మక్కయ్యారని, తమ ఆస్తులను కాజేసేందుకు పన్నాగం వేశారని జగత్ విఖ్యాత్ రెడ్డి వివరించారు. తన సోదరి అఖిలప్రియ అరెస్ట్ వెనుక ఓ ఎంపీ, మరో బడా బిజినెస్ మేన్ ఉన్నారని తెలిపారు. ఈ కేసులో చంద్రహాస్ అనే వ్యక్తి పేరు మీడియాలో వస్తోందని, కానీ అతనికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధంలేదని జగత్ విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేశారు. వారం కిందటే పెళ్లయిన అతడిని పార్టీ మారేలా బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.