అప్పు కోసం ప్రజలపై పన్నుల భారం! తెలుగు ముఖ్యమంత్రుల ఇష్టారాజ్యం
posted on Jan 8, 2021 @ 9:57AM
అంధ్రప్రదేశ్ కు 2 వేల ఐదు వందల కోట్లు.. తెలంగాణకు 2 వేల 508 కోట్ల రూపాయల అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దేశంలో మధ్యప్రదేశ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకే కేంద్రం ఈ అవకాశం ఇచ్చింది. అయితే ఇది తెలుగు రాష్ట్రాలపై ప్రేమతో కేంద్రం ఇవ్వలేదు. కరోనాతో ఎదురైన ఆర్థి ఇబ్బందులు తీర్చేందుకు కూడా కాదు. కరోనా కష్టకాలంలోనూ ప్రజలపై పన్నుల మోత మోపినందుకు మెచ్చి .. జగన్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ సర్కార్ ఇచ్చిన వరమిది. ప్రజలకు మరిన్ని పాట్లు కల్పిస్తూ పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలు చేసినందుకే.. ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా రుణం తీసుకునేందుకు కేంద్రం ఓకే చెప్పింది. పట్టణ సంస్కరణలు అమలు చేయడానికి ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించడం వల్లే అదనపు రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చామని కేంద్రమే స్వయంగా ప్రకటించింది.
కేంద్రం ఇచ్చే ఈ అదనపు రుణం తీసుకునే అనుమతి కోసమే జగన్ సర్కార్ పట్టణాల్లో పన్నుల మోత మోగించింది. ఆస్తి పన్నును రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పెంచి మార్చి నెల నుంచి అమలు చేయబోతోంది. ఇకపై ఆ పన్నును ఏటేటా పెంచుకుంటూ పోనుంది. కేంద్ర ఆర్థిక శాఖ అనేక సంస్కరణలను నిర్ణయించింది. అందులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ఒకటి. తాగునీరు, డ్రైనేజీ, ఆస్తులపై ప్రతి ఏటా పన్నులు పెంచాల్సి ఉంటుంది. సంస్కరణలు తెస్తేనేఅప్పులిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో అప్పుల కోసం.. దేనికైనా రెడీ అన్నట్లుగా ఉన్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అన్నింటినీ అమలు చేయడానికి సిద్ధమయింది. పట్టణ, స్థానిక సంస్థల సంస్కరణలకు అంగీకరించాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొదట ఇందుకు వ్యతిరేకించినా.. తాజాగా తెలంగాణ సర్కార్ కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతోంది.
కేంద్రం చెప్పినట్లు సంస్కరణలు అమలు చేస్తుండటంతో ఏపీలోని పట్టణాల్లో ఇకపై పన్నుల మోత మోగబోతుంది. 15 శాతం మాత్రమే పెంచామని ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతున్నా.. ఐదేళ్లలో ఇది ఐదు సార్లు పెరిగేలా జీవోలో పొందుపరిచారు. సొంతింటి యజమానికి పన్ను పెరిగితే ఆ భారం అద్దెకు ఉండే వారిపై కూడా పడుతుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పౌర సమాజం అంతా ఆ భారాలను ప్రతి ఏడాదీ కొంత చొప్పున మోయక తప్పదు. పట్టాలు లేకుండా ప్రభుత్వ భూముల్లో ఉండేవారు, ప్లాన్ లేకుండా ఇల్లు కట్టుకున్న వారు వందకు వందశాతం పెరిగిన పన్ను చెల్లించాల్సిందే. నిజానికి ఏపీలో విజయవాడ, విశాఖపట్టణం మాత్రమే ఓ మాదిరి నగరాలుగా ఉన్నాయి. మిగతావన్నీ పేరుకు పట్టణాలే కానీ ఎక్కువగా గ్రామాల లక్షణాలతోనే ఉంటాయి. వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ పన్నులు బాదేయడం కోసం వాటిని మున్సిపాల్టీలుగా ప్రకటించేస్తున్నాయి. తెలంగాణలోనూ కేసీఆర్ సర్కార్ ఇదే చేసింది. 10 వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాల్టిగా మార్చేసింది.
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కూడా ఇటీవల ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం తీసుకొచ్చింది. ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ చేపట్టింది. కాని విపక్షాల ఆరోపణలు, ఎన్నికల్లో ఓటమితో మళ్లీ వెనక్కి తగ్గింది. అయితే కేంద్ర సంస్కరణల్లో భాగంగానే మరిన్ని అప్పులు తీసుకోవడం కోసమే కేసీఆర్ సర్కార్ ఈ పథకాల అమలుకు ప్లాన్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. గత ఆరేండ్లలో కోట్లాది రూపాయల అప్పులు చేసింది కేసీఆర్ సర్కార్. రుణ పరిమితి మించడంతో చేసేది లేక కేంద్రం చెప్పినట్లు చేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు రుణభారంలో కూరుకుపోయాయి. ఏపీ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఏపీ అప్పులు గత నవంబర్ నాటికే రూ. 3.74 లక్షల కోట్లకు చేరిందని కాగ్ ఇటీవలే నివేదిక ఇచ్చింది. ఒక్క నవంబర్ నెలలోనే ఏకంగా 17 వేల కోట్ల రుణం తీసుకుంది. ఏపీలో ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్న అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ అప్పులు కూడా రూ. 3 లక్షల కోట్ల దాటాయి.
కేంద్రం ఇచ్చే అప్పుల కోసం ఆస్తి పన్నుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వాలు చీకటి చట్టాలను తీసుకొచ్చాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ చట్టాల అమల్లో భాగంగానే ఆస్తి విలువ ఆధారంగా పట్టణాల్లో పన్నులు విధించిందని మండిపడుతున్నాయి. అడ్డగోలుగా అప్పులు చేసి .. ఇప్పుడు ప్రజలపై భారం మోపడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అప్పు కావాలంటే ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచాలని కేంద్రం ఆదేశిస్తే ఇక్కడున్న ప్రభుత్వాలు అమలు చేసేందుకు అసెంబ్లీలో చట్టాలు చేయడం దుర్మార్గమంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఏ నగరంలో, ఏ పట్టణంలో ఎంత పన్ను ఉండాలో ఢిల్లీలో ఉన్న మోడీ, అమరావతిలో ఉన్న జగన్ నిర్ణయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటున్నారు ఏపీ టీడీపీ నేతలు.