కేటీఆర్ కు జై కొట్టిన జగ్గారెడ్డి!
posted on Jan 22, 2021 @ 11:21AM
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు జై కొట్టారు. ఏంటీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు సపోర్ట్ చేశారంటే ఆయన గులాబీ గూటికి చేరబోతున్నారని అనుకుంటున్నారా... అయితే అలాంటేది లేదు. జగ్గారెడ్డి కేటీఆర్ కు జై కొట్టింది ముఖ్యమంత్రి పదవి విషయంలో. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తప్పుకుంటే తదుపరి సీఎం ఎవరూ అవుతారన్న అంశంపై మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ప్రాంతీయ పార్టీల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా తండ్రులు ముఖ్యమంత్రిగా దిగిపోతే.. కొడుకులే ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని చెప్పారు. కొడుకు ఉండగా అల్లుడిని సీఎం చేసిన నేతలెవరు ఇప్పటివరకు లేరని తెలిపారు జగ్గారెడ్డి.
కేసీఆర్ దిగిపోతే. ఆ స్థానంలో కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అంతేకాదు మొదటి నుంచి మంత్రి హరీష్ రావును వ్యతిరేకింటే జగ్గారెడ్డి.. ఈ విషయంలోనూ ఆయన్ను మరోసారి టార్గెట్ చేశారు. తెలంగాణలో జరగబోతున్న సీఎం మార్పు కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్షన్ లోనే జరగబోతోందనే అనుమానాలు కూడా ఉన్నాయన్నారు జగ్గారెడ్డి. కేటీఆర్ సీఎం కావడం వల్ల బీజేపీకే ఉపయోగమని... తెలంగాణలో బీజేపీ కొత్త ఆటను ప్రారంభిస్తుందని చెప్పారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని తెరపైకి తెచ్చారని... సాధారణ ఎన్నికల సమయానికి ఏ దేవుడిని తీసుకొస్తారో? అని సెటైర్లు వేశారు.
సీఎం కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటున్న బండి సంజయ్.. ఏ కేసులో జైలుకు పంపిస్తారో మాత్రం చెప్పడం లేదన్నారు జగ్గారెడ్డి. బండి సంజయ్ మాటలు వినీవినీ బోరు కొడుతోందని చెప్పారు. ఏ ఆధారంతో కేసీఆర్ ను జైల్లో పెడతారని టీఆర్ఎస్ నాయకులు కూడా అడగడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలది పాలోళ్ల పంచాయితీ అన్నారు జగ్గారెడ్డి. అన్నదమ్ముల పిల్లలు సాధారణంగా పగలంతా కొట్టుకుంటూ ఊరంతా పరేషాన్ చేస్తుంటారని... రాత్రి కాగానే అందరూ కల్లు దుకాణం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారని... ఈ పార్టీలది కూడా అదే తీరుగా ఉందని విమర్శించారు. ఈ మూడు పార్టీలు పగలు కొట్టుకుంటూ, రాత్రి మాట్లాడుకుంటాయని.. ప్రజల కోసం పని చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు.