స్టార్ట్ కెమెరా యాక్షన్.. వ్యాక్సినేషన్ సినిమా చూపించారుగా!!
posted on Jan 22, 2021 @ 11:54AM
భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి దశలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు వేస్తున్నారు. అయితే వ్యాక్సిన్లపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రైల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సినేషన్ ప్రారంభించడంతో.. వ్యాక్సిన్ సురక్షితమా? కాదా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో టీకాపై సామాన్యుల్లో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేయాల్సిన వైద్యాధికారులు.. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నవ్వులపాలవడంతో పాటు.. వ్యాక్సిన్ పై నమ్మకాన్ని పోగొడుతున్నారు.
కర్నాటకలోని తుమ్మూరులో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలి రౌండ్ టీకాలను స్థానిక డీఎంవో నాగేంద్రప్ప, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్స్‌పాల్ రజనీలకు వేయాలి. అయితే వారు వ్యాక్సిన్ వేయించుకోకుండా.. వేయించుకున్నట్టు నటిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. సిబ్బంది వారికి టీకా ఇస్తున్నట్లు నటించారు. ఇక నాగేంద్రప్ప, రజనీలు కూడా అదే స్థాయిలో నటనలో లీనమయ్యారు. అయితే వీళ్లు నటించిన 'వ్యాక్సినేషన్ డ్రామా' అనే రియల్ మూవీ మేకింగ్ వీడియో లీక్ అయింది. దీంతో వీళ్ళ యాక్టింగ్ బండారం బయటపడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో వైద్యాధికారుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. వైద్యాధికారులకు కూడా వ్యాక్సిన్‌పై నమ్మకం లేదా?.. ఇలా అయితే ప్రజలకు వ్యాక్సిన్ పై నమ్మకం ఎలా కలుగుతుంది? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజల్లో ధైర్యాన్ని నింపాల్సిన అధికారులే ఇలా నటిస్తారా?.. వ్యాక్సిన్ వేయించుకోకుండా నటించిన ఆ అధికారులను వెంటనే డిస్మిస్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు వైద్యాధికారులు వ్యాక్సిన్ వేయించుకున్నట్టు నటించలేదని, అంతకుముందే వ్యాక్సిన్ తీసుకున్న వారు.. కేవలం మీడియా కోసం పోజ్ ఇచ్చారని అంటున్నారు. అయితే ఇందులో నిజనిజాలు తెలియాల్సి ఉంది.