రేవంత్ రెడ్డికి కేటీఆర్ భయపడ్డారా? కూకట్ పల్లికి నై.. సికింద్రాబాద్ కు సై!
posted on Jan 21, 2021 @ 2:43PM
మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ భయపడుతున్నారా? ఫైర్ బ్రాండ్ లీడర్ ముందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు రావడం లేదు? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణమాలు, కేటీఆర్ పర్యటనలు చూస్తున్న వారికి ఇవే అనుమానాలు వస్తున్నాయి. భయమో లేక ఎందుకొచ్చిన గొడవ అనుకుంటున్నారో తెలియదు కాని.. ఎంపీ రేవంత్ రెడ్డి ఎదురుపడే అవకాశం ఉన్న కార్యక్రమాలకు కేటీఆర్ దూరంగా ఉంటున్నట్లు మాత్రం కనిపిస్తోంది. కూకట్ పల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో జరిగిన పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. మల్కాజ్ గిరి ఎంపీ పరిధిలోకి వచ్చే కూకట్ పల్లి సెగ్మెంట్ లో బుధవారం జీహెచ్ఎంసీ నిర్వహించిన కార్యక్రమాలకు.. ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉన్నా చివరి నిమిషంలో డుమ్మా కొట్టారు కేటీఆర్. అయితే గురువారం సికింద్రాబాద్ లో జరిగిన ప్రొగ్రామ్ కు మాత్రం హాజరయ్యారు. దీంతో రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భయపడుతున్నారని కాంగ్రెస్ కేడర్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
బుధవారం కూకట్ పల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించాల్సి ఉంది. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో కేటీఆర్ ఆ కార్యక్రమాలకు హాజరు కాలేదు. కూకట్ పల్లి నియోజకవర్గం మల్కాజ్ గిరి ఎంపీ పరిధిలోకి వస్తుంది. దీంతో కూకట్ పల్లి కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ కు ఆహ్వానం వెళ్లింది. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు మంత్రులతో కలిసి ఎక్కువగా కార్యక్రమాల్లో పాల్గొనరు. కాని రేవంత్ రెడ్డి మాత్రం అధికారులు ఇచ్చిన షెడ్యూల్ కంటే ముందే కూకట్ పల్లికి వచ్చేశారు. రేవంత్ రెడ్డి వచ్చారని పార్టీ నేతల నుంచి తెలుసుకున్న కేటీఆర్.. తాను రాకుండా ఇతర మంత్రులతో కార్యక్రమం జరిగేలా చూశారని చెబుతున్నారు. కేటీఆర్ చివరి నిమిషంలో డుమ్మా కొట్టడంతో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి కూడా వారితో కలిసి పాల్గొన్నారు. ఇద్దరు మంత్రులు ఉన్నా.. కేటీఆర్ రాకపోవడంపైనే కూకట్ పల్లి నియోజకవర్గంలో పెద్ద చర్చగా మారింది.
బుధవారం కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలకు హాజరు కాని కేటీఆర్.. గురువారం సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ డివిజనల్ ఆఫీస్‌ను ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి ఎంపీ పరిధిలోకి రాదు. సో.. రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం లేదు కాబట్టే రైల్వే ఉద్యోగుల కార్యక్రమానికి కేటీఆర్ వచ్చారన్నది కాంగ్రెస్ కార్యకర్తల వాదన. ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్థానిక సమస్యలపై రేవంత్ రెడ్డి నిలదీస్తారనే కేటీఆర్.. ఆయన ముందుకు రావడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో రేవంత్ రెడ్డికి ఎదురుపడటానికి కేటీఆర్ భయపడుతున్నారనే చర్చ సామాన్య జనాల నుంచి వస్తోంది. అయితే ఇటీవల ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గొడవ జరిగింది. లోకల్ ఎమ్మెల్యేతో పాటు బల్దియా అధికారులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అలాంటి ఘటన జరిగే అవకాశం ఉందన్న కారణంతోనూ కేటీఆర్ రాకపోయి ఉండవచ్చని కొందరు చెబుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పిలుస్తుంటారు. సీఎం కేసీఆర్ పై గత ఏడేండ్లుగా పోరాటం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీపై ఆయన చేసే ఆరోపణలు, విమర్శల వల్లే రేవంత్ రెడ్డి క్రేజీ పెరిగిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న రేవంత్ రెడ్డి.. ఇటీవల మరింత దూకుడు పెంచారు. పీసీసీ రేసులో ముందున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ టార్గెట్ గానే ముందుకు సాగుతున్నారు. రేవంత్ రెడ్డి తమపై ఎంతగా ఆరోపణలు చేస్తున్న కేసీఆర్, కేటీఆర్ ఎప్పుడు స్పందించరు. రేవంత్ రెడ్డిపై మాట్లాడితే.. తర్వాత ఆయనిచ్చే కౌంటర్లు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వల్లే కేసీఆర్ కుటుంబ సభ్యులు సైలెంట్ గా ఉంటారనే చర్చ కూడా పొలిటికల్ సర్కిళ్లలో ఉంది.