బీజేపీది మత రాజకీయమన్న పవన్! తెగతెంపులు ఖాయమేనా?
posted on Jan 22, 2021 @ 1:27PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. త్వరలో తిరుపతి లోక్ సభకు జరగనున్న ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. తిరుపతిలో పోటీ చేయాలని జనసేన భావిస్తుండగా.. తామే పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు ఏపీ కమలం నేతలు. దీంతో ఇరు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు మాట తప్పుతుందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల తీరుపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కుడా అసహనంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.
బీజేపీ, జనసేన పొత్తుపై అనుమానాలు వస్తున్న సమయంలో ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీని ఇరుకున పెట్టేలా ఆయన కామెంట్లు చేశారు. ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించిన పవన్ కల్యాణ్.. మతం పేరిట రాజకీయాలు చేయడం ఇష్టం లేకే తాను రామతీర్థం వెళ్లలేదని చెప్పారు. మత సామరస్యం కోసం రాజకీయ లబ్ధిని వదులుకుంటానని స్పష్టం చేశారు. మత ప్రస్తావన లేని రాజకీయాలే జనసేన సిద్ధాంతమన్నారు. రామతీర్థం ఘటనకు సంబంధించి పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రాముడి విగ్రహం ధ్వంసమైన రామతీర్థానికి టీడీపీ నేతలతో పాటు బీజేపీ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు కూడా తలెత్తాయి.
రామతీర్థం ఘటనలపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లతో.. బీజేపీ చేస్తున్నది కూడా మత రాజకీయమేనని ఆయన చెప్పినట్టేననే చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాలపై ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలంటూ సంజయ్ చేసిన కామెంట్లు జనసేనకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. పవన్ కల్యాణ్ భార్య క్రిస్టియన్. ప్రస్తుతం ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో... క్రిస్టియన్ భార్యగా ఉన్న పవన్ కల్యాణ్ పార్టీతో బీజేపీ పొత్తు ఎలా పెట్టుకుందనే వాదనలు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. ఆ ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేకపోయాయి బీజేపీ, జనసేన. బండి ప్రకటన తర్వాత నుంచి బీజేపీపై పవన్ కల్యాణ్ కొంత అసంతృప్తిగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మత రాజకీయాలంటూ బీజేపీని ఇరుకున పెట్టేలా పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తిరుపతి ఉప ఎన్నికపైనా హాట్ కామెంట్లు చేశారు పవన్ కల్యాణ్. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో కనుక జనసేన నిలిస్తే ఏడు నియోజకవర్గాల్లోనూ తానే ప్రచారం చేస్తానని చెప్పారు. అభ్యర్థిపై మరో వారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం మరోమారు సమావేశం కానున్నట్టు చెప్పారు. ఒకవేళ జనసేన కాకుండా బీజేపీ నిలిస్తే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసినట్టు బలంగా పోటీ చేయాలని కోరారు పవన్ కల్యాణ్. పార్టీ నేతలకూ కూడా ఈ విషయం స్పష్టం చేశారు. జనసేన అభ్యర్థి పోటీలో ఉంటనే పవన్ ప్రచారం చేస్తారా.. బీజేపీ బరిలో ఉండే ఆయన ప్రచారానికి రారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా జనసేన నేతలు , పవన్ కల్యాణ్ తాజా కదలికలను బట్టి తిరుపతిలో బీజేపీ, జనసేన పొత్తు కొనసాగడం కష్టమేనన్న అభిప్రాయమే రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.