ప్రజాస్వామ్య ప్రభుత్వమా ? ఆటవిక పాలనా?
posted on Jan 21, 2021 @ 10:14AM
ప్రజాస్వామ్య ప్రభుత్వమా ? ఆటవిక పాలనా? ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో సగటు ఆంధ్రుడికి వస్తున్న సందేహమిది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎక్కడైనా ప్రజా సంక్షేమంపై ఫోకస్ చేస్తాయి. కాని ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితే కనిపించడం లేదు. ప్రజల బాగోగుల కంటే .. తన ప్రత్యర్థులను ఎలా టార్గెట్ చేయాలన్న దానిపైనే జగన్ రెడ్డి సర్కార్ ఫోకస్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ కాగా.. తాజాగా జరిగిన సీనియర్ రాజకీయ నేత కళా వెంకట్రావు అరెస్టుతో జగన్ రెడ్డి సర్కార్ లక్ష్యమేంటో మరోసారి స్పష్టమైంది. టీడీపీ నేతల అరెస్టుల పరంపరంలో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కిమిడి కళావెంకటరావును బుధవారం రాత్రి విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడిగా , వివాదరహితుడిగా పేరున్న కళాను అరెస్ట్ చేయడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కళాను అరెస్ట్ చేయడమే కాదు అత్యంత సీనియర్ నేతగా ఉన్న ఆయనపై పోలీసులు ప్రవర్తించిన తీరు మరీ దారుణంగా ఉంది. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలకు కళాను బాధ్యుడిని చేస్తూ నెల్లిమర్ల పొలీస్‌స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కళా వెంకటరావు ఇంటిని, కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. సీఐ శ్రీధర్‌తో పాటు మరికొంత మంది పొలీసులు నేరుగా కళా వెంకటరావు గృహంలోకి ప్రవేశించారు. కళా వెంకటరావుతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకులు, ఇతర సిబ్బంది చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయనను ఇంటి బయటకు తీసుకువచ్చారు. ఆయనను మాత్రలు కూడా వేసుకోనివ్వలేదని కళా కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫోన్ చేసుకునేందుకు రెండు నిమిషాల పాటు సెల్‌ఫోన్‌ను అందజేశారు. కళా వెంకటరావు ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి బయటకు వస్తుండగా... చేతిలోని సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనను వాహనం వద్దకు తీసుకువచ్చారు. మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా... ఆయనను బలవంతంగా వాహనంలోనికి తోసివేశారు.
కళా వెంకటరావు తనతో పాటు తీసుకువెళ్లాల్సిన లగేజీ బ్యాగు కింద పడిపోయింది. బ్యాగును ఇచ్చేందుకు వ్యక్తిగత సిబ్బంది చేసిన ప్రయత్నాన్ని సైతం పొలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన్ని తరలిస్తున్న వాహనం వెనుకడోర్ సైతం వేయకుండానే అక్కడి నుంచి కదిలిపోయారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి పొలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రి 10 గంటలు దాటాక కూడా కళాను చీపురుపల్లి స్టేషన్‌లోనే ఉంచారు. రాత్రి 11గంటల సమయంలో 41 నోటీసుపై విడుదల చేశారు. పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తానన్న పూచీకత్తుపై ఆయన్ను విడిచిపెట్టారు. కళా వెంకట్రావును అరెస్ట్ చేయడం.. అది కూడా అర్ధరాత్రి వేళ... హడావుడిగా తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. సుదీర్ఘ రాజకీయ నేతగా ఉన్న కళాపై పోలీసుల తీరును పార్టీలకతీతంగా అంతా ఖండిస్తున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా.. మచ్చలేని నాయకుడిగా, సాధుస్వభావుడిగా పేరొందిన కళావెంకటరావును అరెస్ట్ చేయడంతో అభిమానులు, పార్టీశ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారిగా కళావెంకటరావు అరెస్టయ్యారని చెబుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించిన నాటి నుంచి నేటివరకూ కళా వెంకటరావు అనేక పదవులు పొందారు. ఎన్టీ రామారావు హయాంలో వాణిజ్యపన్నులు, పురపాలక, హోం శాఖామంత్రిగా పనిచేశారు. ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. చంద్రబాబునాయుడు కూడా ఆయనకు ప్రాధాన్యం కల్పించారు. ఏపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా కళా కొనసాగుతున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. ఏనాడూ ఆయనపై ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు. అటువంటి నాయకుడిపై తొలిసారిగా కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై అభిమానులు మండిపడుతున్నారు.
జగన్ రెడ్డి పాలనను ఆటవిక పాలనగా కళావెంకటరావు అభివర్ణించారు. ఏపీలో చీకటి రాజ్యం కొనసాగుతోందని ఆరోపించారు. రామతీర్థంలో జరిగిన సంఘటనను అడ్డం పెట్టుకుని తనను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కళా వెంకట్రావు అరెస్టుపై భగ్గుమంటున్నారు టీడీపీ నేతలు. ఉగ్రవాదుల్లా రాత్రిపూట కళా వెంకట్రావు అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. తిరుపతి ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం వైసీపీకి పట్టుకుందని, కళా అరెస్ట్‌కు వైసీపీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. అరెస్ట్‌లతో తెలుగుదేశం పార్టీని, నాయకులను భయపెట్టలేరని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. రామతీర్థం సంఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. కనీసం మాత్రలు కూడా వేసుకోనివ్వకుండా బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి ఖండించారు.