తెలంగాణ గవర్నర్ గా కిరణ్ బేడీ? పుదుచ్చేరికి తమిళిసై..!
posted on Feb 17, 2021 @ 5:47PM
కిరణ్ బేడీ. ది బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. అడ్మినిష్ట్రేషన్ లో వెరీ స్ట్రిక్ట్. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణలో వెరీ వెరీ పర్ ఫెక్ట్. టఫెస్ట్ గవర్నర్. పుదుచ్చేరికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఉండి.. ఐదేళ్లు అక్కడి ముఖ్యమంత్రి నారాయణ స్వామికి చుక్కలు చూపించిన పవర్ ఫుల్ పర్సనాలిటీ. అలాంటి డైనమిక్ అండ్ టెరిఫిక్ కేండిడేట్ ని తెలంగాణకు గవర్నర్ గా నియమించబోతున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా, పుదుచ్చేరి ఎల్జీ పదవి నుంచి కిరణ్ బేడీని తప్పించటానికి అసలు కారణం ఇదేనని అంటున్నారు.
పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి ఏరికోరి మరీ కిరణ్ బేడీని అక్కడికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా పంపించింది కేంద్ర ప్రభుత్వం. రూల్స్ బుక్ ను పర్ ఫెక్ట్ గా ఫాలో అయ్యే బేడీ వ్యవహార శైలితో అడుగడుగునా కాంగ్రెస్ సీఎంకు ఆటంకాలే. ప్రభుత్వ విధానాలు, రోజు వారీ పాలనా వ్యవహారాల్లో గవర్నర్ అధికంగా జోక్యం చేసుకుంటున్నారంటూ సీఎం నారాయణ స్వామి పలుమార్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కిరణ్ బేడీ తీరుతో విసుగు చెంది.. స్వయంగా ముఖ్యమంత్రి నారాయణ స్వామినే నిరసన ప్రదర్శన చేశారు, ఆమె శైలిపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు. పుదుచ్చేరిలో కిరణ్ బేడీ తీరు కేంద్ర పెద్దలను విశేషంగా ఆకర్షించిందని చెబుతున్నారు. అయితే.. ఆ ఫైర్ బ్రాండ్ ఆఫీసర్ దూకుడును పుదుచ్చేరి లాంటి కేంద్ర పాలిత ప్రాంతంలో కాకుండా... రాజకీయంగా కీలకంగా మారిన తెలంగాణలో వినియోగించుకోవాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ పోలీసుల వ్యవహార శైలిపై కేంద్రం అసంత్రుప్తితో ఉన్నట్టు సమాచారం. దుబ్బాక ఎన్నికల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు టార్గెట్ గా పోలీసులు చేసిన హడావుడి ఏకపక్షంగా ఉందని.. ఆ సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం ఖాకీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నాయకులే లక్ష్యంగా పోలీసుల దాడులు పెరగడానికి జనగాం, ఖమ్మం ఘటనలను సాక్షంగా చూపిస్తున్నారు. తెలంగాణ పోలీసులు సర్కారు కనుసన్నల్లో పని చేయడాన్ని సరి చేయడానికే.. మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని తెలంగాణ గవర్నర్ గా తీసుకురానున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లేడీ సింగంలా లా అండ్ ఆర్డర్ ను సెట్ రైట్ చేయడానికైనా.. పాలనలో ఒంటెద్దు పోకడలు పోతున్న కేసీఆర్ ను కట్టడి చేయడానికైనా.. కిరణ్ బేడీనే కరెక్ట్ కేండిడేట్ అని భావనలో కేంద్రం ఉన్నట్టు చెబుతున్నారు.
తెలంగాణకు కిరణ్ బేడీ గవర్నర్ గా రావొచ్చనే ప్రచారానికి మద్దతుగా... ఇక్కడి తమిళిసైకి పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. త్వరలో ఎన్నికలు జరగబోవు పుదుచ్చేరికి కిరణ్ బేడీ ప్లేస్ లో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తమిళిసై అయితేనే కరెక్ట్ అనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారట. మామూలుగా అయితే.. ఓ గవర్నర్ పోస్ట్ ఖాళీ అయితే ఆ పక్కనే ఉన్న రాష్ట్ర గవర్నర్ కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీ. కానీ, పుదుచ్చేరి విషయంలో ఏపీ, తమిళనాడు గవర్నర్ లను కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించడం అందుకే అంటున్నారు. తమిళిసైని పుదుచ్చేరికి పూర్తి స్థాయి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా చేసి.. తెలంగాణకు కిరణ్ బేడీని గవర్నర్ గా తీసుకొచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.