ఒక్క బాణం వేస్తే.. కోటి బాణాలు...
posted on Feb 17, 2021 @ 12:07PM
ఇటు షర్మిలను అటు జగన్ ను వదిలిపెట్టడం లేదు టీఆర్ఎస్ నేతలు. ఏ ముహూర్తాన షర్మిల మీటింగ్ పెట్టారో కానీ అప్పటి నుంచీ ఆమెపై తెలంగాణ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మా ప్రాంతం మేం చూసుకుంటాం.. ఇక్కడ మీకేం పని అన్నట్టు మాట్లాడుతున్నారు. షర్మిలతో పార్టీ పెట్టించింది కేసీఆరేనని కాంగ్రెస్, బీజేపీ నేతలంతా ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. సైలెంట్ గా ఉంటే అదే నిజమనే మెసేజ్ జనాల్లోకి వెళ్లిపోతుందనుకున్నారో ఏమో గులాబీ నేతలు సైతం తెగ ఆవేశపడుతున్నారు. షర్మిల వెనుకున్నది కేసీఆరా? బీజేపీనా? అనే విషయం పక్కనపెట్టి.. తెలంగాణ పార్టీలన్నీ కలిసి షర్మిల, జగన్ లపై విమర్శల డోసు పెంచుతున్నారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్నారు షర్మిల. రాజన్న రాజ్యం రావాలంటే ఇప్పుడున్న దొర పాలన పోవాలన్నట్టేగా? అనే చర్చ జరుగుతోంది. ఇది అధికార టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. అందుకే, కారు పార్టీ నేతలు షర్మిలపై పంచ్ డైలాగులు వేస్తూ మరింత కాక రేపుతున్నారు. కొందరు షర్మిలను జగనన్న వదిలిన బాణంగా చెబుతుంటే.. ఆ అన్నాచెల్లెల్ల మధ్య గొడవలున్నాయనే వారు ఇంకొందరు. వారి ఫ్యామిలీ మేటర్ పై ఇంకా క్లారిటీ రాకున్నా.. లేటెస్ట్ గా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ సైతం అన్నా, చెల్లెళ్లకు గొడవలు ఉంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలని.. తెలంగాణ విషయంలో జోక్యం ఏంటంటూ ప్రశ్నించారు. జగన్ ఒక్క బాణం వేస్తే.. తాము కోటి బాణాలు వేస్తామంటూ బాహుబలి రేంజ్ లో డైలాగ్ వదిలారు.
తెలంగాణలో షర్మిల ఎంట్రీకి కౌంటర్ గా.. మరోసారి రాయలసీమ ఎపిసోడ్ ను తెరమీదకు తీసుకొచ్చారు మంత్రి గంగుల. ప్రత్యేక రాష్ట్రం కోసం సీమ వాసులు ఎప్పటి నుంచో పోరాడుతున్నారని.. కావాలంటే షర్మిల రాయలసీమలో పార్టీ పెట్టాలని సలహా కూడా ఇచ్చేశారు. తెలంగాణలో ఆంధ్రా పెత్తనం వస్తే మళ్లీ కష్టాలు తప్పవని హెచ్చరించారు గంగుల కమలాకర్.
రావిరాలలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ సూపర్ హిట్ అయిన మర్నాడే.. మంత్రి నోటి నుంచి షర్మిల పార్టీపై విమర్శలు రావడం వ్యూహాత్మకమే అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి నిలవకుండా.. షర్మిల పేరును నిత్యం వార్తల్లో ఉండేలా.. ఇలా కామెంట్లు చేస్తున్నారనే వారూ ఉన్నారు. ఇదంతా గులాబీ గేమ్ ప్లాన్ అంటున్నారు ఇంకొందరు.