కోటి బాణాల వెనుక.. కోటి మర్మాలు!
posted on Feb 17, 2021 @ 3:58PM
ముందుగా షర్మిల, తర్వాత జగన్. ఆ తర్వాత చంద్రబాబు. ఆంధ్రా నేతలంతా వస్తారు. తెలంగాణను దోచుకుంటారు. ఇక్కడి నీళ్లు, కరెంట్ ఎత్తుకెళ్తారు. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ కష్టాలు తప్పవు. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవు. కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇవీ తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలంటూ సోషల్ మీడియాలో ఈ టాపిక్ తెగ వైరల్ అవుతోంది. అదేంటి? సడెన్ గా ఈ విధ్వేషపూరిత మాటలేంటి? రెండు రాష్ట్రాల ప్రజలూ ఒకటిగా కలిసుంటుంటే మళ్లీ ఎందుకు ఇలాంటి కామెంట్లు? అని తెలంగాణ వాదులే తప్పుబడుతున్నారు. అయితే, కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరున్న అధికార పార్టీ నేత నోటి నుంచి ఇలాంటి స్టేట్ మెంట్స్ రావడం వ్యూహాత్మకమే అంటున్నారు కొందరు. కావాలనే సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని చెబుతున్నారు.
ఇటు షర్మిల పార్టీ, అటు గంగుల కామెంట్స్.. ఇలా అన్నీ కేసీఆర్ డైరెక్షన్ లోనే జరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. మంగళవారం వావిరాల రణభేరీతో రేవంత్ రెడ్డి రైతు సభ గ్రాండ్ సక్సెస్. తెలంగాణ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్. ఆ వెంటనే.. షర్మిల, జగన్, చంద్రబాబు, ఆంధ్ర పెత్తనం, దోపిడీ, కొట్లాటలంటూ కలకలం రేపే కామెంట్లు. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రెండు అంశాలకు లింకున్నట్టు తెలుస్తోందని అంటున్నారు. రణభేరి సభతో రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరగడంతో కంగారు పడిన కారు పార్టీ.. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు.. మళ్లీ ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్ రాజేసేందుకు.. ప్రయత్నిస్తోందా అనే అనుమానం కలుగుతోంది. షర్మిలతో కేసీఆరే పార్టీ పెట్టించారని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. షర్మిలను ముందుంచి.. అటు ప్రతిపక్ష ఓట్లు చీల్చడంతో పాటు కావలసినప్పుడల్లా సెంటిమెంట్ మంట రాజేసేందుకూ పనికొస్తుందనేది గులాబీ బాస్ స్కెచ్ అంటున్నారు. రహస్య స్నేహితులు కేసీఆర్, జగన్ లు కలిసి.. ఉభయ ప్రయోజనాల కోసం షర్మిల పార్టీతో రాజకీయ పావులు కదుపుతున్నారని అనుమానిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇదే స్ట్రాటజీ ప్లే చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకోవడం.. రాహుల్, చంద్రబాబులు కలిసి ప్రచారం నిర్వహించడంతో కారు పార్టీ ఖంగుతింది. ఆ వెంటనే.. చంద్రబాబు టార్గెట్ గా ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజలను రెచ్చగొట్టి ఎలక్షన్లలో దండిగా ఓట్లు దండుకున్నారు గులాబీ దళపతి. ఈ సారీ అదే ఎత్తుగడ అమలు చేయడానికి.. షర్మిలతో కేసీఆరే పార్టీ పెట్టిస్తున్నారనేది ఓ వాదన. ఆ ప్లాన్ లో భాగంగానే.. అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడారు మంత్రి గంగుల కమలాకర్. జగనన్న తెలంగాణలోకి ఒక బాణం వేస్తే, తాము కోటి బాణాలు వేస్తామని.. అన్న, చెల్లెల్లకు గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి. మాపై ఎందుకు రుద్దడం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రాయలసీమ వాసులు ఏపీలో పోరాడుతున్నారు. కావాలంటే షర్మిల అక్కడికి వెళ్లి పార్టీ పెట్టుకోవాలంటూ ప్రాంతీయ జ్వాల రగిలించారు. ఇవన్నీ అనుకోకుండా చేసిన ఆరోపణలు కావని.. పక్కా ప్లాన్డ్ గానే, కావాలనే గంగుల అలా అన్నారని కొందరు అంటున్నారు.
దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ వేగంగా బలపడుతోంది. అటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కాక మీదున్నారు. ప్రతిపక్షాలు ఈ రేంజ్ లో బలం పుంజుకోవడంతో కేసీఆర్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితి. అందుకే.. విభజించు, పాలించు సిద్ధాంతం ప్రకారం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకో, రేవంత్ రెడ్డి వైపో మరళ కుండా.. మధ్యలో షర్మిలను రాజకీయ రంగంలో నిలిపి ఓట్లు చీల్చాలనే ఎత్తుగడతో ఉన్నారని తెలుస్తోంది. ఆలూ-సూలు లేని పార్టీకి అప్పుడే నేతల తాకిడీ పెరుగుతోంది. పలువురు వెటరన్ లీడర్లతో పాటు తటస్థులూ అటు వైపు చూస్తున్నారు. షర్మిల పెట్టబోయే పార్టీలో పని చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని ప్రముఖ మోటివేషనిస్ట్ 'బ్రదర్ షఫీ' ప్రకటించారు. ఇక, మాల, మాదిగ సంఘాల నేతలూ లోటస్ పాండ్ కు క్యూ కడుతున్నారు. ఎమ్మార్పీఎస్ నేత ఇటికే రాజు, మాల మహానాడు నేత చెన్నయ్య.. షర్మిల పార్టీ పెట్టాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు, షర్మిలపై ఉన్న 'ఆంధ్రా' ముద్ర తొలిగేలా.. ఆమె తెలంగాణ కోడలంటూ ప్రచారం మొదలుపెట్టేశారు. షర్మిల భర్త అనిల్ కుమార్ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం, షర్మిల సైతం హైదరాబాద్ లోనే చదువుకుందంటూ షర్మిల పార్టీకి 'బ్రాండ్ తెలంగాణ' క్రియేట్ చేస్తున్నారు. ఇలా.. అనేక ప్రయోగాలతో షర్మిలకు బలమైన గుర్తింపు వచ్చేలా చేసి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ, కాంగ్రెస్ వైపు వెళ్లకుండా మూడు ముక్కలయ్యేలా చేయాలనేది కేసీఆర్ పొలిటికల్ ప్లాన్ అంటున్నారు. అప్పటికీ వర్కవుట్ కాకపోతే.. ఎన్నికల నాటికి షర్మిలను బూచీగా చూపించి ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రాజేసి మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై సెటిల్ అవ్వాలనే స్కెచ్ కావొచ్చనేది మరికొందరి విశ్లేషణ. అందుకు శాంపిల్ గా.. మంత్రి గంగుల కమలాకర్ కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్ చేసుంటారని చెబుతున్నారు. గంగుల వేస్తామన్న.. కోటి బాణాల వెనుక కోటి మర్మాలు దాగున్నాయని.. ఇదంతా కేసీఆర్ డైరెక్షన్ లో జరుగుతున్న రాజకీయ దోబూచులాటని అంటున్నారు.