రేవంత్ రెడ్డి చెంతన.. వైఎస్ఆర్ నీడ..
posted on Feb 17, 2021 @ 10:25AM
తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో ఒక అనూహ్యకర ఘటన చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఆ వ్యక్తి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సభకు హాజరుకావడం ఇపుడు హాట్ టాఫిక్‌గా మారింది. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ఉమ్మడి ఎపీ సీఎం దివంగత రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సూరీడు. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సూరీడు ఆయనకు నీడలా వ్యవహరించేవారు. వైఎస్ ఎక్కడికి వెళ్లినా వెనుక సూరీడు తప్పకుండా ఉండాల్సిందే. అయితే రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం సూరీడు.. ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అయితే ఉన్నట్టుండి ఇపుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న రైతు భరోసా సభలో ప్రత్యక్షం అవ్వడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
ఇది ఇలా ఉండగా వైఎస్సార్ కుమార్తె షర్మిల తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ప్రయత్నాలలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయత్నంలో ఆమె వెనక ఎవరున్నారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఒక కథనం ప్రకారం ఒకప్పటి వైఎస్ఆర్ ప్రధాన అనుచరులు, సన్నిహితులు ఆమెతో కలిసి పని చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోపక్క వైఎస్ నీడగా భావించే సూరీడు ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ సభ వేదిక మీద ప్రత్యక్షం కావడంతో దీని వెనక కారణమేమిటనేది మరింత చర్చనీయాంశంగా మారింది.
ఇది ఇలా ఉండగా ఎంపీ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ సమీపంలోని రావిరాలలో రైతు రణభేరి సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభ మీద కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కొందరు అసమ్మతి వ్యక్తం చేస్తూ సమావేశానికి దూరంగా ఉన్నారు. అయితే బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, చిన్నారెడ్డి, కొండా సురేఖ, సీతక్క, మల్‌రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, విజయ రమణా రావు, దాసోజు శ్రావణ్ వంటి మరి కొంతమంది ముఖ్య నాయకులు మాత్రం ఎంపీ రేవంత్ సభకు హాజరయ్యారు.