మాస్క్ గాలికొదిలేసిన జనం.. మళ్ళీ లాక్ డౌన్ దిశగా ముంబై
posted on Feb 16, 2021 @ 4:17PM
భారత్ లో కరోనా వ్యాప్తి కొంతవరకు తగ్గినప్పటికీ.. గత మూడు రోజులుగా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో రోజుకు మళ్ళీ నాలుగు వేల కేసులు నమోదవుతున్నాయి దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అవసరమైతే మళ్లీ లాక్‌డౌన్ పెట్టబోతున్నట్లుగా అక్కడి పాలకులే సంకేతాలు ఇస్తున్నారు. నగరంలో ప్రజలు కరోనా నిబందనలు పాటించడం లేదని, ఇలా అయితే మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని ముంబై నగర మేయర్ కిషోరి పండేకర్ హెచ్చరించారు. ముంబైలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై మంగళవారం అధికారులతో చర్చలు జరిపారు. సమావేశం తరువాత మీడియాతో మాట్లాడుతూ మహమ్మారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను మరోసారి హెచ్చరించారు.
‘నగరంలోని ‘ప్రజల గురించి మాకు చాలా ఆందోళన ఉంది. రైళ్లలో ప్రయాణిస్తున్న వారిలో చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదు. అయితే మనం మరోసారి లాక్‌డౌన్‌కి వెళ్లకూడదనుకుంటే ప్రజలు అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించి, ప్రభుత్వానికి సహాకరించాలి.. ముంబైలో మళ్లీ లాక్‌డౌన్ విధించడమనేది ప్రజల చేతుల్లోనే ఉంది’’ అని మేయర్ అన్నారు. గతంలో మూడు నెలల నిర్బంధ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా మంది నష్టపోయారు.
ఇది ఇలా ఉండగా దేశం మొత్తంలో ప్రతి రోజు సుమారు 10వేల పాజిటివ్ కేసులు కొత్తగా నమోదవుతుంటే… అందులో దాదాపు సగం కేసులు కేవలం మహారాష్ట్ర, కేరళ నుండే నమోదవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోలన చెందుతున్నాయి.