బీజేపీకి వ్యవసాయ చట్టాల షాక్... అక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్
posted on Feb 17, 2021 @ 4:42PM
కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పంజాబ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. హోషియార్‌పూర్, కపూర్తలా, అబోహర్, పఠాన్‌కోట్, బాటలా, బటిండా, మోగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ సొంతం చేసుకోగా,.. దాదాపు 53 ఏళ్ల తర్వాత బటిండా మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కు దక్కడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. బీజేపీకి ఇక్కడ సాగు చట్టాల దెబ్బ బాగా తగిలినట్టు వచ్చిన ఫలితాలు సూచిస్తున్నాయి. పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికలు రైతుల ఆందోలనల నేపథ్యంలో జరగడంతో కేంద్రం తెచ్చిన సాగుచట్టాలపై ఇది రిఫరెండమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇది ఇలా ఉండగా భటిండా మున్సిపల్ కార్పొరేషన్ పై 53 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ తన జెండాను ఎగరేయడం విశేషం.భటిండా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ నేతృత్వం వహిస్తుండగా ..కొన్నినెలల క్రితం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాలీ దళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ లోక్ సభ నియోజకవర్గానికి నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ దే పైచేయి అయింది.