వెంచర్ లో వాటా కోసం మంత్రి వార్నింగ్
posted on Apr 6, 2021 @ 3:32PM
అయనో మంత్రి. గౌరవప్రదమైన పదవిలో ఉన్నా బరి తెగించారు. కాసుల కోసం కక్కుర్తి పడ్డారు. ఓ వెంచర్ లో విషయంలో వాటా కావాలంటూ స్వయంగా ఆయనే బెదిరింపులకు దిగారు. సర్పంచ్‌లకు వాటాలు ఇస్తే.. ఎమ్మెల్యే, మంత్రులకు ఇవ్వారా అంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు చెప్పి పొట్టు పొట్టు చేయిస్తాం.. ఏమైనా బిచ్చమెత్తుకోవాల్నా.. వాటా ఇచ్చే వరకు వెంచర్‌ను ఆపేయండి అంటూ సదరు మంత్రి హుకుం జారీ చేశారు.
ఓ వెంచర్ విషయంలో వాటా కావాలంటూ తెలంగాణ మంత్రి బెదిరింపులకు సంబంధించిన ఆడియో టేపు సంచలనం రేపుతోంది. హైదరాబాద్ నగర శివారు శామీర్‌పేట మండలం బొమ్మరాజుపేటలో 67 ఎకరాల్లో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ పడింది. దాంట్లో వాటా ఇవ్వాల్సిందే అంటూ మంత్రి మల్లారెడ్డి మాట్లాడినట్టు ఆడియో టేపు మీడియాలో వైరల్‌గా మారింది. వాటా ఇచ్చే వరకు వెంచర్‌ను ఆపాల్సిందే అంటూ మంత్రి హుకూం జారీ చేసినట్టు ఆడియోలో వినిపిస్తోంది. మంత్రి మల్లారెడ్డి ఆడియో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రచ్చగా మారింది. మంత్రి మల్లారెడ్డి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
వెంచర్ విషయంలో వాటా కోసం బెదిరించినట్లుగా వైరల్ గా అవుతున్న ఆడియోపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆ ఆడియో టేప్‌లో ఉన్న వాయిస్ తనది కాదన్నారు మంత్రి మల్లారెడ్డి. ఎవరో మిమిక్రీ చేశారని అన్నారు. ప్రస్తుతం నగరంలో మిమిక్రీ చేసేవాళ్లు ఎక్కువయ్యారని, నాకు ఎవరినీ బెదిరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాయిస్ రికార్డుపై దేనికైనా సిద్ధమన్నారు మల్లారెడ్డి. తనకే వందల ఎకరాలు ఉన్నాయని, వేరేవాళ్ల భూములు నాకు అవసరం లేదని మంత్రి తేల్చిచెప్పారు.