మండుటెండల్లో గోదారి పరవళ్లు... కాళేశ్వరంలో మరో అద్బుతం
posted on Apr 6, 2021 @ 2:21PM
తెలంగాణ ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టు కాళేశ్వరం పథకంలో మరో అద్భుతం ఆవిష్క్రతమైంది. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్ కు చేరుకున్నవి. కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్ కు తరలించే కార్యక్రమం చేపట్టారు సీఎం కెసిఆర్. తర్వాత కొండపొచమ్మసాగర్ జలాలను గజ్వేల్ కెనాల్ నుంచి సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపేందుకు వదిలారు. దీంతో కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.
మంగళవారం ఉదయం ప్రత్యేక బస్సులో, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లి కి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి జలాలను విడుదల చేశారు. ఈ జలాలు సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ కు చేరుకుంటాయి. ఆ తర్వాత, మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చేరుకున్న సీఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు చేసి, కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేశారు. ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని ... పాముల పర్తి చెరువు, పాతురు చెరువు, చే బర్తి చెరువు, ప్రజ్ఞా పుర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను నింపుతాయి.