ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ.. లాక్‌డౌన్ తప్పదా?
posted on Apr 6, 2021 @ 12:34PM
లాక్ డౌన్ దిశగా దేశం అడుగులేస్తోంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ఆంక్షలు విధిస్తోంది. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ విధించారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 30 వరకూ నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఢిల్లీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. అనుమతులు లేకుండా బయటకు వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
ప్రస్తుతానికి నైట్ కర్ఫ్యూ వరకే పరిమితమని.. లాక్ డౌన్ విధించే ఆలోచన ఇప్పట్లో లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. అయితే, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, అవసరానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
సెకండ్ వేవ్ లో భాగంగా దేశ రాజధానిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 3,548 మందికి కరోనా సోకగా.. 15 మంది చనిపోయారు. మొత్తంగా 6,79,962 మంది వైరస్ బారినపడ్డారు. 11,096 మంది ప్రాణాలు కోల్పోయారు.