జగన్ కు జైలు ఖాయమా? ఢిల్లీ నుంచి సిగ్నల్స్ వచ్చాయా?
posted on Apr 6, 2021 @ 1:30PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గండం ముంచుకొస్తుందా? ఆరు నెలల్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమా? ఏపీకి కొత్త సీఎం రాబోతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత కాలంగా దీనిపై చర్చ జరుగుతోంది. తనపై ఉన్న అక్రమాస్తుల కేసులో గతంలో జైలుకు వెళ్లారు జగన్. ఇప్పుడు కూడా ప్రతి శుక్రవారం జగన్ కేసుల విచారణ సీబీఐ , ఈడీ కోర్టుల్లో జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం విచారణకు హాజరుకావడం లేదు. జగన్ కేసుల్లో ఉన్న ఇతర నిందితులంతా వారం వారం విచారణకు హాజరవుతున్నారు. అయితే కేంద్రం పెద్దలకు మోకరిల్లడం వల్లే జగన్ కేసుల్లో విచారణ స్లోగా సాగుతుందని.. త్వరలోనే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల తర్వాత సీఎం జగన్ అధికారంలో ఉండరని తెలిపారు. ఆరు నెలల్లోనే జగన్ జైలుకు వెళతారని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తిరుపతి లోక్ సభ సభ్యుడిగా నాలుగు సార్లు గెలిచారు చింతా మోహన్. కేంద్ర మంత్రిగానూ పని చేశారు. సుదీర్ఘ కాలం ఎంపీగా పని చేసిన చింతా మెహన్ కు ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలున్నాయి. రాజకీయాల్లో నిజాయితిపరుడిగా పేరున్న చింతా మోహన్ కు కాంగ్రెస్ తో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ సీనియర్ నేతలతోనూ సంబంధాలున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల విషయంలోనూ ఆయనకు మంచి పట్టు ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారమే చింతా మోహన్.. ఆరు నెలల్లో జగన్ సీఎం పదవి పోతుందని చెప్పారంటున్నారు.
2019లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాకా కేంద్ర సర్కార్ తో సఖ్యతగా ఉంటున్నారు సీఎం జగన్. తరచూ ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలతో సమావేశమవుతున్నారు. జగన్ కేసుల్లో ఏ2గా ఉన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి... బీజేపీ పెద్దల చుట్టే తిరుగుతుంటారనే ఆరోపణలు ఉన్నాయి. తమపై ఉన్న కేసుల్లో రాజీ కోసం జగన్ కోసం విజయసాయి కేంద్రంలోని కీలక నేతలతో మంతనాలు చేస్తుంటారని విపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ఇటీవల వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేక హోదాను మరిచిపోయిన కేంద్రం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిధులకు కొర్రీలు వేస్తోంది. ఇంత జరుగుతున్నా కేంద్రాన్ని జగన్ ప్రశ్నించడం లేదనే విమర్శలు ఉన్నాయి. తన కేసుల కోసం కేంద్రానికి రాష్ట్రాన్ని జగన్ రెడ్డి తాకట్టు పెట్టారనే ఆరోపణలు కూడా కొందరు చేస్తున్నారు.
అయితే కొన్ని రోజులుగా వైసీపీ పట్ల బీజేపీ స్టాండ్ మారినట్లుగా కనిపిస్తోంది. తిరుపతి లోకసభ ప్రచారంలో జగన్ సర్కార్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు కమలనాధులు. ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ తో పాటు జగన్ కు అనుకూలమనే ఆరోపణలు ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా జగన్ త్వరలో జైలుకు వెళతారని కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. జగన్ టార్గెట్ గా పావులు కదుపుతుందనే ప్రచారం జరుగుతోంది. తిరుపతి లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ మరింత స్పీడ్ పెంచే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉండగానే చింతా మోహన్ లాంటి సీనియర్ నాయకుడు కూడా జగన్ ముఖ్యమంత్రి పదవి ఆరు నెలల్లో పోతుందని ప్రచారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని రోజుల్లో ఏపీలో కీలక పరిణామాలు జరగబోతున్నాయని, సీఎం జగన్ కష్టాల్లో పడపోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.