మిస్టరీ డెత్స్.. క్రైమ్ కేపిటల్‌గా విశాఖ?
posted on Apr 15, 2021 @ 11:40AM
ప్రశాంత విశాఖ నగరం.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా మారాక క్రైమ్ కేపిటల్‌గా మారిపోతోంది. నేరాలు, ఘోరాలతో సాగరతీరంలో రక్త తర్పణం జరుగుతోంది. లేటెస్ట్‌గా, విశాఖ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మధురవాడ, మిథిలాపురి కాలనీ, ఆదిత్య టవర్స్‌లో నలుగురు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు సజీవ దహనమవడం సంచలనంగా మారింది. మృతులు బంగారు నాయుడు, డాక్టర్ నిర్మల, దీపక్, కశ్యప్‌గా పోలీసులు గుర్తించారు.
హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎన్నారై కుటుంబం మృతికి పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలంలో రక్తపు మరకలు ఉన్నట్టు గుర్తించారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్యలు జరిగుంటాయనే దిశగానూ పోలీసులు విచారిస్తున్నారు.
విశాఖలోని పెందుర్తి మండలం జుత్తాడలో ఆరుగురు దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది. ఒకే కటుంబానికి చెందిన ఆరుగురిని దుండగులు హత్య చేశాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వచ్చిన దుండుగుడు ఆరుగుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో 6 నెలల పాప, 2 నెలల బాబు ఉండటం కలచివేస్తోంది. ఈ హత్యలకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పలరాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
నిందితుడిగా భావిస్తున్న అప్పలరాజు కుమార్తెకు విజయ్‌కు మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని తెలుస్తోంది. 2018లో జరిగిన లవ్ మేటర్ కారణంగా విజయ్ కుటుంబంపై కక్ష పెంచుకున్న అప్పలరాజు అర్ధరాత్రి ఈ దారుణ హత్యలకు తెగించినట్టు సమాచారం. అప్పలరాజు కుమార్తెతో.. విజయ్ ఫోన్ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించిన తండ్రి.. ఆ యువకుడిపై పెందుర్తి పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్‌ను అప్పట్లో అరెస్టు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయినప్పటికీ విజయ్‌పై, అతని కుటుంబంపై పగ పెంచుకున్న అప్పలరాజు బుధవారం అర్ధరాత్రి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
ఈ రెండు ఘటనల్లో మొత్తం 10 మంది చనిపోయారు. వరుస ఘటనలతో విశాఖ హడలిపోతోంది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా మారాక.. నగరం నేర రాజధానిగా మారిపోతోందని భయాందోళన వ్యక్తం అవుతోంది. ప్రశాంత విశాఖలో ఇంతటి దారుణ నేరాలు గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు నగర వాసులు.