2లక్షల కేసులు.. వెయ్యి మరణాలు..
posted on Apr 15, 2021 @ 11:05AM
10 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. ఒక్క రోజులో 2లక్షలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులతో రికార్డులు బద్దలయ్యాయి. మృతుల సంఖ్య వెయ్యి దాటేసింది. ప్రస్తుతం దేశంలో 14 లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇదంతా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించిన వివరాలు మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య అంతకు మించే ఉంటుందంటున్నారు.
కరోనా ఉగ్రరూపం ఇది. వైరస్ మోగిస్తున్న మరణమృదంగం అది. భారీగా ప్రాణనష్టం. లక్షల్లో కల్లోలం. గడిచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,038 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564 కి చేరింది. 1,73,123 మంది మరణించారు. రోజువారి కేసుల సంఖ్య దాదాపు 10 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 14,71,877 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు పది శాతానికి చేరువై కలవరపెడుతోంది. బుధవారం ఒక్కరోజే 93,528 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య కోటీ 24 లక్షలను దాటేసింది. ఫిబ్రవరిలో 97 శాతానికి పెరిగిన రికవరీ రేటు..ఇప్పుడు 88.92 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్ర కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అంటే, దేశంలో నమోదవుతున్న కేసుల్లో నాలుగోవంతు మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, ఢిల్లీని సైతం కొవిడ్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గుట్టలుగా శవాలు పేరుకుపోతున్నాయి. శ్మశానవాటికల్లో స్థలం ఖాళీలేదని వార్తలు వస్తున్నాయి.
జనాభాలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సైతం కరోనా కబ్జాలో కూరుకుపోతోంది. మహారాష్ట్ర తర్వాత యూపీలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. పుణ్యక్షేత్రాలు ఎక్కువగా ఉండటం, పండగల సీజన్ కావడంతో కొవిడ్ కు రాచమార్గం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో యూపీలో 20,439 కొత్త కేసులు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీని సైతం కరోనా గడగడలాడిస్తోంది. ఢిల్లీలో ఒక్కరోజులో 17,282 మందికి కరోనా సోకింది.
ఇక, ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే లక్షకు పైగా కొత్త కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్ మాత్రమే ఉన్నాయి. గతంలో అమెరికాలో ఒకే రోజు అత్యధికంగా 3 లక్షలకుపైగా రోజూవారీ కేసులు నమోదవగా.. తాజాగా భారత్‌లో ఒకే రోజు అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది.
ఒకవైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే, మరోవైపు వ్యాక్సినేషన్ సైతం అంతే జోరుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మూడు దశల్లో నడుస్తోన్న టీకా కార్యక్రమం కింద బుధవారం 33,13,848 మందికి వ్యాక్సిన్లు వేశారు. దీంతో, ఇప్పటి వరకు మొత్తం 11,44,93,238 టీకా డోసుల పంపిణీ పూర్తైంది.