జగన్‌కు ఓటేసినందుకు చెప్పు దెబ్బలు
posted on Apr 15, 2021 @ 11:16AM
"జగన్‌కు ఒక్క చాన్స్ ఇచ్చినందుకు అనుభవిస్తున్నాం. మేము చేసిన తప్పుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం. అంబేడ్కర్ విదేశీ విద్య పథకానికి సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నారు" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం ‘జై భీమ్’ సంస్థ జిల్లా అధ్యక్షుడు బీకేఎస్ ఆనంద్. చెప్పుతో తనను తాను కొట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరిట ఏర్పాటు చేసిన ‘అంబేడ్కర్ విదేశీ విద్య’ పథకానికి సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నారని దళిత వర్గాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు ‘జై భీమ్’ సంస్థ జిల్లా అధ్యక్షుడు బీకేఎస్ ఆనంద్ నేతృత్వంలో దళితులు భారీగా హాజరయ్యారు.
‘‘నేను ఉన్నాను.. నేను విన్నాను.. అన్నావ్! ఈ రోజు మా ఆశలను, ఆశయాలను అడియాశలు చేశావ్. ఒక్క చాన్స్ అని అడిగావ్.. ఇచ్చినందుకు ప్రతిఫలంగా మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం’’ అంటూ అక్కడే తన చెప్పుతో ఆనంద్ తలపై బాదుకుని నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విదేశీ ఉన్నత విద్య పథకంపై సీఎం జగన్ ఉక్కుపాదం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరిస్తే.. విద్యార్థుల, వారి తల్లిదండ్రుల ఆత్మహత్యలు జరుగుతాయని హెచ్చరించారు.
గత సీఎం చంద్రబాబు పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో అంబేడ్కర్ విదేశీ విద్యను ప్రవేశ పెట్టారని, జగన్ దీనిని రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆనంద్ చెప్పుతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ప్రజాప్రతినిధులుగానీ, అధికారులుగానీ స్పందించకుండా అటు నుంచి అటే వెళ్లిపోవడంతో దళిత నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.