జగన్ బెయిల్ రద్దేనా? జైలు ఖాయమేనా?
posted on Apr 15, 2021 @ 10:01PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొంత కాలంగా ఓ చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు పదేపదే అదే చెబుతున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు కూడా అదే చెప్పారు. బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దేవదర్.. ఇటీవల కాలంలో ఎక్కడ మాట్లాడినా జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. త్వరలోనే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతున్నారు. జగన్ బెయిల్ రద్దు కాబోతుందంటూ టీడీపీ, బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లు ఏపీలో ఆసక్తిగా మారాయి.
కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లుగానే జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు స్వీకరించింది.
రఘురామకృష్ణరాజు ఇటీవలే ఈ పిటిషన్ దాఖలు చేయగా, పలు అంశాలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అవసరమైన పత్రాలతో మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించింది. కోర్టు నిర్దేశించిన మేరకు రఘురామకృష్ణరాజు తగిన పత్రాలు సమర్పించడంతో పిటిషన్ ను కోర్టు అధికారులు స్వీకరించారు.
తన పిటిషన్ లో రఘురామ పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం బెయిల్ పై బయటున్న సీఎం జగన్ 11 చార్జిషీట్లలో ఏ1 నిందితుడిగా ఉన్నారని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు. జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు స్వీకరించడంతో.. ఈ కేసులో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. రఘురామ చెబుతున్నట్లు జగన్ బెయిల్ రద్దు అవుతుందా... టీడీపీ, బీజేపీ నేతలు మాటలు నిజమై జగన్ జైలుకు పోతారా అన్న దానిపై జనాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జగన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయన్న విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.
జగన్ కేసులో తన పిటిషన్ పై సీబీఐ కోర్టు స్వీకరించడంపై స్పందించారు ఎంపీ రఘురామకృష్ణరాజు. జగన్ కేసుల అంశంపై ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా లేఖ రాశానని, పీఎంఓ నుంచి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నానని తెలిపారు. సీఎం జగన్ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల నివేదికలను కూడా తానే రాస్తున్నట్టు తెలిసిందని అన్నారు. మూడు రాజధానుల వంటి నిర్ణయాలతో భారతదేశంలో ఎక్కడా లేని ఆలోచనలు ముఖ్యమంత్రికి వస్తున్నాయని సెటైర్ వేశారు రఘురామ. లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రభుత్వ సలహాదారులు ఇచ్చిన సలహాలే అందుకు కారణం అయ్యుంటాయని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన అలాంటి సలహాలను ఖండించడానికి రాజ్యాంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేసిన ఓ ప్రజాప్రతినిధిగా తనకు బాధ్యత ఉందని భావిస్తున్నానని రఘురామ స్పష్టం చేశారు.