ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావుకు ఘన నివాళి
posted on Apr 16, 2021 @ 10:27AM
ప్రపంచ ప్రఖ్యాత రేడియాలజిస్ట్ ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ కాకర్ల వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా అందుకున్నారు. 1951లో హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లోనే ఉత్తీర్ణత సాధించారు. కాకర్లసుబ్బారావు ఎమ్.బి.బి.యస్., యమ్.ఎస్, ఎఫ్.ఆర్.సి.ఆర్ , ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఐ.సి.పి చేశారు. హైదరాబాదులోని ప్రసిద్ధ ఆసుపత్రి నిమ్స్ కు డైరెక్టర్ గా పని చేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మెట్టమెదటి అధ్యక్షుడు మరియు వ్యవస్థాపకులు కాకర్ల సుబ్బారావు.
కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జనవరి 25, 1925 సంవత్సరంలో జన్మించారు డాక్టర్ కాకర్ల సుబ్బారావు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో కళాశాల విద్యాభ్యాసం బందరు లోని హిందు కళాశాలలో 1937-1944 సంవత్సరాల మధ్య జరిపారు. విశాఖపట్టణం ఆంధ్ర వైద్య కళాశాలలో చేరి వైద్య పట్టా 1950లో సంపాదించారు. 1951 సంవత్సరంలో హౌస్ సర్జన్ చేసిన తరువాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్ళారు. అమెరికాలోని వివిధ నగరాల్లోని ఆసుపత్రులలో పనిచేశారు.
1986 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరపు సుబ్బారావు భారతదేశానికి తిరిగి వచ్చి హైదరాబాదులోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో చేరారు. నిమ్స్ ఆసుపత్రి సుబ్బారావు చేరక మునుపు వరకు ఎముకల ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందింది. సుబ్బారావు అక్కడ చేరాక అన్ని విభాగాలనూ అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు కార్పోరేటు ఆసుపత్రులకు దీటైన స్థాయికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు నిమ్స్ సంస్థ రాష్ట్ర మరియు దేశ వ్యాప్తంగా రోగుల చికిత్సా , వైద్య వృత్తి శిక్షణా , వైద్య పరిశోధన పరంగా ప్రముఖ వైద్య సంస్థగా నిలిచిందంటే అందుకు కారణం కాకర్ల సుబ్బరావే.
డాక్టర్ కాకర్ల సుబ్బారావు రేడియాలజిలో అనేక పుస్తకాలు మరియు జర్నల్స్ లో పరిశోధనా వ్యాసాలు వ్రాశారు. దేశ విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చారు. యాభై ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సన్మానాలు పొందారు. కాకర్ల సుబ్బారావు వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇండియా రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ వారి అనుబంధ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చార్టరు సుబ్బారావుకు మార్చి 17, 2001న జీవితకాలపు కృషి అవార్డు ప్రదానం చేశారు. రాజీవ్ చక్ర నేషనల్ అవార్డు, నేషనల్ యూనిటీ అవార్డు సహా లెక్కలేనన్ని పురస్కారాలను డాక్టర్ కాకర్ల సుబ్బరావు అందుకున్నారు.